రాయరత్న మంజూష

గార రంగనాథం గారు రాజాం కి చెందిన సాహిత్యవేత్త. ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీవిరమణ తర్వాత కూడా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో చాలా చురుగ్గా పనిచేస్తున్న వ్యక్తి. ఆయన 2016 నుండి 2020 మధ్యకాలంలో ఆముక్తమాల్యద పైన 30 వ్యాసాలు రాసారు. అవి వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ఇప్పుడు వాటిని, గుంటూరు కు చెందిన బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వారు ‘రాయరత్న మంజూష ‘పేరిట పుస్తకరూపంగా తీసుకువచ్చారు. మొన్న ఆదివారం సాయంకాలం, గుంటూరులో, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి వైశ్య హాస్టల్లో ఆ గ్రంథావిష్కరణ జరిగింది.
 
మోదుగుల రవికృష్ణగారు అధ్యక్షత వహించిన ఆ సభలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, గారరంగనాథంగార్ల సమక్షంలో ఆ పుస్తకం ఆవిష్కరించే భాగ్యం కలిగింది. దాంతోపాటు, గుంటూరు సాహిత్యాభిమానులు, కవిపండితులు హాజరైన సదస్సులో ఆముక్తమాల్యద గురించి మాట్లాడే అవకాశం కూడా లభించింది.
 
రంగనాథం గారి రచనలో ప్రధానంగా ఆముక్తమాల్యద కావ్యవిశేషాలు, సాహిత్య సౌరభం గురించిన తలపోతతో పాటు, ఇంతదాకా రసజ్ఞులు గమనించని కొత్త అంశాల మీద కొంత చర్చ కూడా ఉంది. కాని, అసలు అన్నిటికన్నా ముందు, ఆముక్తమాల్యద పైన ఒక రసజ్ఞుడు దాదాపు నాలుగేళ్ళ పాటు ఇంత చక్కటి అధ్యయనం చేసి, ఆ సంతోషాన్ని మనతో పంచుకోవడమే నాకెంతో సంతోషాన్నిచ్చింది.
 
ఎందుకంటే, వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ఆముక్తమాల్యద వంటి కావ్యం మరొకటి లేదు. అటువంటి రాజకవి, కవిరాజు ప్రపంచసాహిత్యంలోనే మరొకరు లేరు. కాని పాఠకులకి సులభ గ్రాహ్యం కాలేదన్న ఒకే ఒక్క కారణం వల్ల తెలుగు సాహిత్యంలో అగ్రాసనం మనుచరిత్రకి దక్కింది. పెద్దన ఆంధ్రకవితాపితమాహుడిగా కీర్తింపబడ్డాడు. కాని లోతుగా చదివినవారికి, ఆముక్తమాల్యద లోని గాఢత, సాంద్రత అనుభవంలోకి వచ్చేకొద్దీ, ఆ కావ్యానికి దక్కవలసిన గౌరవం పూర్తిగా దక్కలేదేమో అనే భావం కలగక మానదు.
 
ఈసారి రంగనాథం గారి పుస్తకం చదివిన తరువాత నాకు రెండు భావాలు కలిగాయి. మొదటిది, ఆముక్తమాల్యదలోని విశిష్టాద్వైత దృక్కోణాన్ని మనం ఇంతదాకా పూర్తిగా పరిశీలించలేదేమో అనే భావం. రెండవది, అసలు ఉత్ప్రేక్ష అనే అలంకారానికి కవి ఎందుకంత ప్రాధాన్యాన్నిచ్చి ఉంటాడనేది.
 
విశిష్టాద్వైతం ప్రధానంగా శ్రీవైష్ణవం. బౌద్ధులు సంవృతిగానూ, అద్వైతులు మాయగానూ భావించినదాని స్థానంలో విశిష్టాద్వైతులు శ్రీని దర్శించారు. శ్రీ ఈశ్వరుడు కాదు, జీవుడు కాదు. ఈశ్వరుడు లేక శ్రీ లేదు. కాని శ్రీ కృప లేక జీవుడికి ఈశ్వరుడు లభించడు. కృష్ణరాయలు జీవితంలో తనకి లభించిన శ్రీ ద్వారా ఈశ్వరసాన్నిధ్యాన్ని పొందడానికి ప్రయత్నించాడా అనిపిస్తుంది. ఎందుకంటే, మనుచరిత్రలోలానే, ఆముక్తమాల్యదలో కూడా, అవతారికలోని మొదటి పద్యమే ఆ కావ్యానికి తాళం చెవి.
 
శ్రీ కమనీయ హారమణి జెన్నుగఁ తానును, గౌస్తుభంబునం
దాకమలావధూటియు నుదారత దోఁప, పరస్పరాత్మలం
దాకలితంబులైన తమ ఆకృతులచ్ఛత పైకి దోఁప న
స్తోకత నందు దోఁచెనన శోభిలు వేంకట భర్త గొల్చెదన్
 
( శ్రీలక్ష్మి ధరించిన మనోహరమైన హారమణిలో తన వదనమూ, తాను ధరించిన కౌస్తుభమణిలో లక్ష్మీవదనం చక్కగా కనిపిస్తూ ఉండగా, తమ మనసుల్లో పెల్లుబికిన ప్రేమవల్ల తమ ఆకృతుల స్వచ్ఛత బైటికి ప్రకాశిస్తూ ఆ మణుల్లో కనిపిస్తున్నదా అన్నట్లున్న ఆ వేంకటపతిని సేవిస్తాను.)
 
ఇక్కడ ఇద్దరి గురించి మొదలు పెట్టి, పద్యాన్ని వేంకటేశ్వరుడు ఒక్కడితోటే ఎందుకు ముగించాడన్నది రంగనాథంగారి ప్రశ్న. ఇద్దరికీ అభేదం లేదుకాబట్టి సరిపోతుందని సమాధానం. నేనేమంటానంటే, ఆ శ్రీ, వేంకటేశ్వరుణ్ణి ప్రతిఫలిస్తున్న ఆ లక్ష్మి కృష్ణరాయల రాజ్యలక్ష్మి, ధీలక్ష్మి, సంతోషలక్ష్మి సమస్తం. తనకు లభించిన లక్ష్మి శ్రీవేంకటేశ్వరుడే అని ఆయన భావించాడు. తనకు లభించిన రాజ్యాధికారం తాను దేవుడిదాసుడిగా పరిపాలించడమే అని నమ్మాడు. ఆ విశ్వాసానికి ఆముక్తమాల్యద ఎలా అద్దం పట్టిందో నా సుదీర్ఘ ప్రసంగంలో వివరించడానికి ప్రయత్నించేను.
 
షేక్ స్పియర్ మీద ప్రతి ఏడాదీ కొత్త అధ్యయనాలు వచ్చినట్టే ఆముక్తమాల్యద మీద కూడా ప్రతి ఏడూ ఒక కొత్త పుస్తకం రావాలి. తెలుగునాట ప్రతి పట్టణంలోనూ కనీసం ఒకసారేనా రసజ్ఞులు నలుగురూ కూచుని ఆ కావ్యాన్ని కలిసి చదువుకోవాలి. అందులోని ఋతువర్ణనలకి ఎప్పటికప్పుడు ఇంగ్లిషులో, హిందీలో ఇతరభాషల్లో ఎప్పటికప్పుడు కొత్త అనువాదాలు రావాలి.
 
ఇప్పటికయితే, కృష్ణరాయలు చేసిన నాలుగు ఋతువర్ణలనుంచీ నాలుగు పద్యాలు ఈ పొద్దున్నే మీ కోసం:
 

గ్రీష్మం

 

ఎర్రచీమలు

 
తోఁట బగలుండి మల్లెలు తురిమి కావు
లమర మా పైన నిక్షుయంత్రముల కొయ్యఁ
జేరు ప్రజవొల్చె భావివృష్టికిని గ్రుడ్డు
తో మధురిమేచ్ఛ డిగు నెర్ర చీమలనగ (2: 71)
 
( పగలంతా ఎండవేడికి తట్టుకోలేక తోటల్లో గడిపి సాయంకాలం కాగానే మల్లెపూలు తురుముకుని, కావి రంగులు దుస్తులు ధరించి, చెరకు గానుగలదగ్గరికి చేరుతున్న జనాలు , వానరాబోతున్న సూచనగా, నెత్తిమీద గుడ్లు పెట్టుకుని తీపిదనమ్మీద ఆశతో బారులు కట్టిన ఎర్రచీమల్లాగా ఉన్నారు.)
 

వర్షం

 

నీటిపాములు

 
వరుజు బడి రొంపిఁ ద్రొక్కం
జరణంబుల జుట్టి పసిండి కడుపులం
బొరి నీరుకట్టెలమరెను
బిరుదులు హాలికులు దున్నఁబెట్టిరొ యనగన్ (4:125)
 
(రైతులు మళ్ళల్లో బురద తొక్కుతూ ఉంటే వాళ్ళ పాదాల్ని చుట్టుకుంటున్న నీటిపాముల పసిడిరంగుపొట్టల వల్ల ఆ హాలికులు తమకెవ్వరూ సాటిరారన్నట్టుగా బంగారు గండపెడేరాలు ధరిస్తున్నారా అన్నట్లు కనిపిస్తున్నది)
 

శరత్తు

 

నుసిపురుగులు

 
ఘుణగణవిహరణఁ జివికిన
మణిధనువున దొరఁగు నుసి సమానములై ద
ర్పణనిభనభమునఁ బరిణత
శణకణహరిణములు జలద శకములొలసెన్ ( 4:141)
 
(బాగా పండిన జనపనార పీచులాగా తెల్లబడి, చీకిపోయిన ఇంద్రధనుస్సు నుండి పొడిలాగా రాలుతున్న నుసిలాగా కనిపిస్తున్న మేఘశకలాలు అద్దంలాంటి ఆకాశంలో మెరుస్తున్నాయి)
 

వసంతం

 

తుమ్మెదలు

 
ఊఁడుకొన బడుమధూళిక
యోడికలకుఁ గ్రిందఁ గ్రమ్మియుండెడు తేంట్లన్
నీడలు దిరిగియుఁ దిరుగని
జాడఁ దరుల్వొలిచె నవ్వసంతపు వేళన్ ( 5:137)
 
(ఆ వసంతవేళ కాలువలుగట్టినట్టు ప్రవహిస్తున్న మకరందం మీద ముసురుకున్న తుమ్మెదలు నీడల్లాగా కనిపిస్తున్నాయి. దాంతో రోజంతా చెట్లనీడలు తిరుగుతున్నా తిరగనట్టే ఉన్నాయి)
 
7-6-2022

Leave a Reply

%d bloggers like this: