యుగయుగాల చీనా కవిత-24

తొలితాంగ్ కాలంలో అంటే ఏడవ శతాబ్దంలో వచ్చిన కవిత్వం సహజంగానే తాంగ్ పూర్వయుగాల కవిత్వానికీ, అత్యుచ్చ స్థాయి తాంగ్ యుగానికీ మధ్య పరివర్తనను ప్రతిబింబించే కవిత్వం. ఏ భాషా సాహిత్యాలలోనైనా, ఆ స్వర్ణయుగాల సాహిత్యం చదవడంలో ఒక సంతోషం ఉంటుంది. కాని ఆ స్వర్ణయుగాల్ని ముందే సంభావిస్తూ, రాబోయే యుగలక్షణాల్ని ముందే సంకేతపరుస్తూ ఉండే కవిత్వం ఉంటుందే అది, నన్నెప్పుడూ, ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. గుడ్డు చీల్చుకుని పిల్ల బయటపడేటప్పటి అద్భుతాన్ని, కోశస్థదశనుంచి సీతాకోక చిలుక తొలి రెక్కలు మీద రంగులు దిద్దుకుని, రెక్కలు చాపుకుని బయటకు రావడంలోని మహాసుందరసంఘర్షణని పోల్చుకోవడంలో గొప్ప ఆశ్చర్యం, మాటల్లో చెప్పలేని రసజిజ్ఞాస ఉన్నాయి.
 
పదహారో శతాబ్దంలో పూర్తిగా రెక్కలు విప్పుకున్న ప్రబంధ కవిత్వపు తొలి రంగుల్ని, ఇంకా పూర్తిగా వన్నెచిన్నెలు రూపుదిద్దుకోకముందే నాచనసోముడిలో చూడటంలాగా, పదిహేనో శతాబ్దిలో తెలుగు సీమని చిత్రించడానికి కవులు తమ కుంచెలు విదిలించడానికి ముందే ఎర్రాప్రగడ కవిత్వంలో కనవచ్చే పాకనాటిసీమ పల్లెటూళ్ళని పోల్చుకోవడంలాగా, తాంగ్ యుగ కవిత్వ వికాసాన్ని తొలి తాంగ్ కవుల్లో చూడటం కూడా మనలో ఒక రసోత్సాహాన్ని రేకెత్తించే వ్యాపకం.
 
ఏ కవిత్వమైనా, అన్నిటికన్నా ముందు, నననవోన్మేషంగా ఉండాలి. కాలంలో వస్తున్న మార్పుని అందరికన్నా ముందు చిత్రకారుడు, ఆ తర్వాత సంగీతకారుడూ, ఆ తర్వాత కవీ పట్టుకుంటారు. తాత్వికుడూ, సోషియాలజిస్టూ, కాలమిస్టూ ఆ తర్వాతే దాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ ఆ కవి శబ్దవర్ణచ్ఛాయలతో కవిత్వం పలికేవాడూ, ఆ కవితలో ఆ భాషకే సొంతమైన స్వరాల్నీ, ధ్వనుల్నీ పట్టుకోగలిగేవాడూ అయితే, ఇంక చెప్పవలసిందేముంది!
 
తాంగ్ యుగకాలంలో కవిత్వం ప్రధానంగా మూడు ఛందస్సుల్లో ఒదిగిపోయింది. ఒకటి, ఇంకా పాతపద్ధతి ఛందస్సు (గు-షి) లో అయిదు, ఏడు పదాల కవిత్వ పంక్తుల్తో, ఎన్ని పాదాలుండాలన్న నియతి ఏమీ లేకుండా చెప్పే తరహా. ఛందోపరంగా ఎంతో కొంత స్వాతంత్య్రానికి వీలున్న ఆ ఛందస్సులో కావ్యవస్తువు మాత్రం దాదాపుగా పాతకాలానికి చెందిన రాజాస్థాన విషయాలూ, వస్తువులూ, తలపోతలే ఉండేవి. రెండవ తరహా, తాంగ్ యుగం కాలానికే చెందిన, కొత్త తరహా (లు-షి) ఛందస్సు. ప్రతి ఒక్క కవితా ఎనిమిది పంక్తులు మించకుండా, ప్రతి ఒక్క పాదంలోనూ అయిదు పదాలు మించకుండా రాసే కవిత. ఛందోపరంగా కఠిన నియమాలకు కట్టుబడి ఉండే ఈ కొత్త కవితలో కావ్యవస్తువు మాత్రం పూర్తిగా కవి ఇష్టం. ఒకవైపు ఛందోపరంగా కఠిననియమాలు, మరొకవైపు వస్తుపరంగా పూర్తి స్వాతంత్య్రం- ఇదే తాంగ్ యుగ కవిత్వపు అత్యంత ముఖ్యలక్షణమని చెప్పవచ్చు. మూడవది, నాలుగు పాదాలు మాత్రమే ఉండే చిన్నపద్యం. ఇది కూడా పూర్వయుగాలనుండి వచ్చిన ఛందస్సే అయినప్పటికీ, ఉత్సాహంగా తీసిన ఊపిరిలాగా, నిరుత్సాహంతో వదిలిపెట్టిన నిట్టూర్పులాగా, జీవితానుభూతిని ఒక్క గుక్కలో ప్రకటించడానికి తాంగ్ కవులకి ఈ ఛందస్సు ఎంతగానో అక్కరకి వచ్చింది.
 
తాంగ్ కవులకి శిల్పపరంగానూ, వస్తుపరంగానూ ఈ స్పష్టత రావడానికి దాదాపు ఒక శతాబ్దకాలం పట్టింది. తమ పూర్వకవుల కవిత్వంలో ఏది గ్రాహ్యమో, ఏది త్యాజ్యమో ఎంచుకుని దాన్ని తమ తదనంతర కవులకి అందించిన కొందరు కవుల్ని చూద్దాం. వారు ఆరు దాజవంశాల కాలం నాటి కవిత్వస్రవంతిని తాంగ్ యుగంలోకి ప్రవహింపచేసారు అని ఒక సాహిత్యచరిత్రకారుడన్నాడు.
వారిలో మొదట ప్రస్తావించలవసింది వాంగ్-జి (585-644). ఆయన తన కాలం నాటి రాజాస్థాన శైలి కవిత్వాన్ని ఏవగించుకున్నాడు. శబ్దాడంబరంతో, కృత్రిమ అలంకారాలతో రాస్తున్న ఆ కవిత్వాన్ని వదిలిపెట్టి, తావో యువాన్ మింగ్ లాగా, రువాన్ జి లాగా నిరలంకారంగా, సరళంగా, సూటిగా కవిత్వం చెప్పడానికి ప్రయత్నించేడు.
 
అతడి దారిలో నలుగురు ప్రతిభావంతులు నడిచారు. వారిలో మొదటివాడు లు ఝావోలిన్ (634-684). ఆయన రాజాస్థాన గ్రంథాలయాధికారిగా ఉండేవాడు. దాంతో ప్రసిద్ధ అర్జెంటీనియన్ రచయిత బోర్హెస్ లాగా ఆ గ్రంథాలయాన్ని పుక్కిట పట్టేసాడు. అందుకని అతడి కవిత్వంలో పూర్వకవిత్వాల స్ఫురణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. చివరిరోజుల్లో వ్యాధిగ్రస్తుడు కావడంతో ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
 
నలుగురు ప్రతిభావంతుల్లో రెండవ కవి, లువొ బిన్ వాంగ్ (640-684). అతడు కూడా పూర్వయుగాల ఆడంబర శైలి వదిలిపెట్టాడుగాని, సరళంగానూ, సూటిగానూ కవిత్వం చెప్పలేదు. అందుకుబదులు ఒక సంక్లిష్టశైలిని నిర్మించుకున్నాడు. ఒక విధంగా అతణ్ణి ఇంటలెక్చువల్ కవి అని కూడా చెప్పవచ్చు. చివరిరోజుల్లో చక్రవర్తి ఆగ్రహానికి గురయి ప్రవాసానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ ప్రవాస కాలంలోనే చక్రవర్తిమీద తలెత్తిన తిరుగుబాటులో తాను కూడా పాల్గొని అనామకంగా మరణించాడు.
మూడవ కవి వాంగ్-బో (649-676). అత్యంత ప్రతిభాశాలి. తన పదకొండవ ఏటనే గొప్ప విమర్శ రాసాడని చెప్పుకుంటారు. కాని అల్పాయుష్కుడు.
 
నాలుగవ కవి యాంగ్ జియోంగ్ (650-695). అతడివి ముప్పై కవితల కన్నా ఎక్కువ లభ్యం కాలేదు.
వీరితో పాటు, స్టీఫెన్ ఓవెన్ మరికొందరు దీపధారుల్ని పేర్కొన్నాడు. చియెన్ జియాంగ్ (661-702) తన సమకాలిక కవిత్వంలోని వాగాడంబరం, శిల్పప్రదర్శనల మీద తన అసంతృప్తిని బాహాటంగా చాటినవాడు. హాన్-వెయి కాలాలనాటి సారళ్యాన్ని కవిత్వంలోకి తీసుకురావాలని తపించాడు. దాంతో అతడు తర్వాతి కవుల దృష్టిలో కొత్తపుంతలు తొక్కిన కవిగా గుర్తుండిపోయాడు. అతడి జీవితం మాత్రం చాలాకాలం కైదులోనే గడిచి, కైదులోనే ముగిసిపోయింది. దు షెన్ యెన్ (మ.705) చైనా కవితా పితామహుడైన దు-ఫుకి తాత. సోంగ్ ఝివెన్ (మర్.712), షెన్ కువాన్ కి (650-713), ఝాంగ్ యూయె (667-731) తొలితాంగ్ కాలం నుంచి అత్యుచ్చ తాంగ్ యుగానికి పరివర్తనని పూర్తిచేసిన కవులు.
 
ఇప్పుడు తొలితాంగ్ యుగం నాటి కొన్ని కవితలు చూద్దాం. ఇందులో తాగుడు గురించిన ప్రస్తావనల గురించి ఒక మాట. చీనా కవులు తాగడం కన్నా, తాగిపడున్నట్టు తమని తాము ఊహించుకోడంలో ఎక్కువ సంతోషం పొందేవారని స్టీఫెన్ ఓవెన్ అన్నాడు. ఈ తాగుడు సంతోషం బహుశా ఇక్కణ్ణుంచే, సమర్ ఖండ్ సిల్కు దారిమీదుగా, పారశీకకవుల్ని పట్టుకుని ఉండవచ్చునని శేషేంద్ర రాసుకున్నాడు.
 
 

వాంగ్ జి

 

రైతులు

 
తన జీవితమంతా రువాన్ జి సోమరి
జి కాంగ్ దిమ్మరి.
 
వాళ్ళిద్దరూ కలుసుకున్నారా,
పీకలదాగా తాగేవాళ్ళు.
 
కలుసుకోకుండా ఒక్కళ్ళే ఉన్నప్పుడు
కూచుని నాలుగు కవితలు రాసేవారు.
 
చెరువు దగ్గర కొంగల్ని పెంచేవారు
లేదా పందులకి మేతపెట్టేవారు.
 
తావో యువాన్ మింగ్ దారిలో గడ్డిమొలిచేది
యాంగ్ జియోంగ్ కుటీరాన్ని చెట్లు కప్పేసేవి.
 
ఇంట్లో నులకమంచం మీద పడుకో
పక్కన నీ ఆడమనిషి రాట్నం తిప్పుతుంటుంది,
కొండమీద నీ పిల్లవాడు సేద్యం చేస్తుంటాడు.
 
ఇక ప్రశాంతంగా తల తిప్పి చూడు,
స్వర్గం ఒట్టిమాట అనిపిస్తుంది.
 

పానశాల గోడ మీద రాసిన పద్యం

 
నిన్న రాత్రి ఒక కూజా ఖాళీ చేసేసాను,
పొద్దున్నే మళ్ళా మరొక కూజా తెరిచిపెట్టాను.
 
నిన్న రాత్రి కలలో కల ముగిసిందని కలగన్నాను,
అందుకని తెల్లారకుండానే ఇక్కడొకొచ్చిపడ్డాను.
 

లువొ బిన్ వాంగ్

 

కైదులో ఉండగా చిమ్మెట మీద రాసిన పద్యం

 
శీతాకాలం చిమ్మెటలొకటే గీపెడుతున్నాయి.
ఈ బందీని తమ పాటల్తో ముంచేస్తున్నాయి.
 
ముంగురుల్ని తలపించే వాటి నల్లటిరెక్కలు
నా తెల్లజుత్తుని చూసి నవ్వుతున్నట్టున్నాయి.
 
మంచు మరీ కురిసాక అవి లేవలేవు, ఎగరలేవు
గట్టిగా గాలివీస్తే, ఆ పాటలు కొట్టుకుపోతాయి.
 
నిర్మలమైన ప్రాణులుంటాయని ఎవరికి నమ్మిక?
నా హృదయంలో ఘటిస్తున్నదేమిటో ఎవరికి ఎరుక?
 

వాంగ్ బో

 

వెన్నెల్లో విడిపోయినప్పుడు

 
మరకతశిలల్లాంటి మేడమెట్లమీద మంచు,
దక్షిణదిగంతానికి పయనిస్తున్న చంద్రుడు.
 
మనం సెలవుతీసుకున్న రేవు మూగబోయింది,
ఈ రాత్రి నదులూ, కొండలూ గడ్డకట్టాయి.
 

చెన్ జియాంగ్

 

యూ ఝౌ మేడ మీద రాసిన కవిత

 
వెనక్కి తిరిగి చూస్తే- పూర్వీకులెవరూ లేరు
ముందుకు చూద్దునా- భవిష్య తరాలూ లేరు.
 
అపార భూమ్యాకాశాల గురించి తలపోసాను
కన్నీళ్ళు కాలువ గట్టాయి-ఒక్కణ్ణే మిగిలిపోయాను.
 

ఝాంగ్ యుయె

 

తాగినప్పుడు రాసిన కవిత

 
తాగిపడున్నాను- నా సంతోషానికి అంతులేదు.
ఏమి చెప్పు, తాగనివాళ్ళకీ సంతోషం తెలీదు.
 
ఇప్పుడు నేనెటు చేతులు చాపితే అది నాట్యం
ఇప్పుడు నేనే మాటలు చెప్తే అది పద్యం.
 
4-6-2022

Leave a Reply

%d bloggers like this: