తెగిన బంధనాలు

టాగోర్ రాసిన ‘చతురంగ ‘(1916) నవల ఇంగ్లిషు అనువాదం Quartet ( 2019) చదివాను. అనువాదకుడు నిర్మల కాంతి భటాచార్య నేషనల్ బుక్ ట్రస్ట్ డైరక్టరుగానూ, సాహిత్య అకాడెమీ పత్రిక ఇండియన్ లిటరేచర్ సంపాదకుడిగానూ పనిచేసినవాడు. ప్రసిద్ధ అనువాదకుడు.

టాగోర్ రచనల్లో ఈ నవల తెలుగులోకి వచ్చినట్టు గుర్తులేదు. తొంభై పేజీలు కూడా లేని ఈ నవల లేదా నవలిక రాయడానికి టాగోర్ కి దాదాపు రెండేళ్ళ పైనే పట్టింది. ఆ నవల రాయడానికి తనకు అనుకూలమైన వాతావరణం దొరకండంలేదనీ, అందుకని శాతినికేతనం నుండి దూరంగా వెళ్ళిపోయి రాస్తున్నాననీ రాసాడు ఆయన ఒక ఉత్తరంలో.

ఆ నవల రాసిన సమయం కూడా ఆశ్చర్యకరమైందే. సరిగ్గా నోబెల్ పురస్కారం (1913) పొందిన మరుసటి ఎడాది ఆ కథ రాయడం మొదలుపెట్టాడు. తన సుప్రసిద్ధ నవల గోరా (1910) రాసి అప్పటికే నాలుగేళ్ళు. ఈ నవల రాయడం పూర్తికాగానే మరొక సుప్రసిద్ధ రచన ‘ఘరే-బైరే’ (1916) రాసాడు. కాని గోరాకి, ఘరే బైరే కి వచ్చిన ప్రశస్తి ఈ చిన్నిపుస్తకానికి రాలేదు. కాని ఇది టాగోర్ సృజనాత్మక వచన రచనల్లో చాలా ప్రత్యేకమైనదనీ, దీన్ని టాగోర్ తన కాలం కన్నా ఎంతో ముందుకు వెళ్ళి రాసినందువల్ల ఈ రచన పాఠకుల స్థాయిని దాటిపోయిందనీ అందుకే జనాదరణకు నోచుకోలేదనీ విమర్శకులు తమకి తాము సర్దిచెప్పుకున్నారు.

ఇది ఒక ప్రయోగాత్మక నవల. ఒక రచయిత తన యాభయ్యల్లో ఇటువంటి ప్రయోగానికి పూనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇది నాలుగు అధ్యాయాల్లో నడిచే రచన. నలుగురు ప్రధాన పాత్రధారుల మీద నాలుగు కథనాలు. అలాగని ఆ కథనం ఆ పాత్ర తన గురించి చెప్పుకునే కథ కాదు. ప్రతి పాత్రా మరొక పాత్రని దృష్టిలో పెట్టుకుని కథ చెప్తుంది. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారని మనకి అర్థమవుతుంది. కాని ఆ క్రమంలో ఎవరూ ఎవరినీ సరిగా అర్థం చేసుకోలేదనే ధ్వని కూడా ఉందేమో, చెప్పలేను.

హరిమోహన్, జగమోహన్ అన్నదమ్ములు. హరిమోహన్ సనాతనుడు. మతాన్నీ, మత క్రతువుల్నీ నమ్ముకున్నవాడు. జగ మోహన్ పందొమ్మిదో శతాబ్ది మహాసంస్కర్తల దారిలో, బ్రిటిష్ పాజిటివిస్టుల స్ఫూర్తితో అన్ని సంప్రదాయాల్నీ, దేవుణ్ణీ, మతాన్నీ పూచికపుల్లగా ఎంచి పక్కన పారేసినవాడు. కనబడని దేవుడికి అన్నం పెట్టి సేవచేసేకన్నా కంటికి కనిపించే బీద ముస్లిములకీ, దళితులకీ సేవచేయడం జీవితానొక సార్థకత చేకూరుస్తుందని నమ్మినవాడు. ఆ అన్నదమ్ములిద్దరికీ పిత్రార్జితం కొంత ఆస్తి, ఇల్లు ఉన్నాయి. తన అన్నకి దేవుడిలోనూ, మతంలోనూ నమ్మకం లేదుకాబట్టి, తమ ఆస్తి దైవకార్యాలకోసమే కర్చుచేయాలని వీలునామా ఉంది కాబట్టి, తన అన్నవాటా కూడా తనకే దక్కాలంటూ తమ్ముడు హరిమోహన్ కోర్టులో కేసు వేసాడు. అన్న ఆ కేసులో వాదించకపోగా, తాను నమ్మని దేవుడి పేరుమీద తనకు చిల్లిగవ్వ కూడా అవసరం లేదని చెప్పేస్తాడు. ఆ పాతకాలపు ఇల్లు రెండుముక్కలవుతుంది.

హరిమోహన్ కి ఇద్దరు పిల్లలు. పురందర్, శచి. శచి జగ్ మోహన్ జీవితాన్నీ, ఆదర్శాల్నీ, సంస్కర్తహృదయాన్నీ చూసి గాఢంగా ప్రభావితుడవుతాడు. కాని అతడి తండ్రికి అది ఇష్టం ఉండదు. తన చిన్న కొడుకుని ఎలాగేనా తన తండ్రి ప్రభావం నుంచి బయటపడెయ్యాలని చూస్తాడు. ఈ లోగా శచి ఒకరోజు నానిబాల అనే ఒక బాలవితంతువుని తన పెద్దనాన్న దగ్గరకు తీసుకొస్తాడు. ఆమెని ఎవరో మోసం చేసి గర్భవతిని చేసారని చెప్తాడు. ఆమెకి జగ్ మోహన్ ఆశ్రయమిస్తాడు. దేవుణ్ణి నమ్మని ఆ సంస్కర్త ఆమెలో తన తల్లిని చూస్తాడు. కాని లోకాపవాదం అతడిమీద విరుచుకుపడుతుంది. అయినా చలించడు. కొన్నాళ్ళకు రహస్యం తెలుస్తుంది. తన తమ్ముడి పెద్దకొడుకు పురందర్ ఆమెని మోసం చేసాడని తెలుస్తుంది. ఆమెని ఆ సమాజం నుంచి ఎలా కాపాడాలో జగ్ మోహన్ కి అర్థం కాదు. ఆయన వేదన, ఆ బాలవితంతువు దైన్యం చూసి శచి ఆమెని తాను పెళ్ళాడతానని ముందుకు వస్తాడు. జగ్ మోహన్ ఆనందానికి హద్దు ఉండదు. తన ఆశయాలకూ, ఆదర్శాలకూ శచి తగిన వారసుడయ్యాడని సంతోషిస్తాడు. ఆ విషయం ఆ అమ్మాయితో చెప్పి ఆమెకొక పట్టుచీర ఇచ్చి ఆ రాత్రి శచితో మాట్లాడమని చెప్పి బయటకు వెళ్తాడు. కాని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది మొదటి కథ. జగ్ మోహన్ పేరు మీద ‘పెదనాన్న’ అంటో నడిచే అధ్యాయం.

కలకత్తాలో ప్లేగు వ్యాపిస్తుంది. బీద ముస్లిం రోగులకి సపర్య చేస్తూ జగ్ మోహన్ ప్లేగుబారి పడి మరణిస్తాడు. శచి అక్కణ్ణుంచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకు అతడు లీలానందస్వామి అనే ఆయన ఆశ్రమంలో ఆయనకు పరిచర్యలు చేస్తూ కనబడతాడు. లీలానందస్వామి జగ్ మోహన్ కి విరుద్ధ ధ్రువం. ఈయన నిరంతరం నామసంకీర్తనంలో, దైవసేవలో, ప్రవచనాల్లో కాలం గడుపుతుంటాడు. ఆయన ప్రభావం అపారం. ఆయన్ని విమర్శించాలనుకున్నవాళ్ళు కూడా ఆయన దగ్గర కొన్నాళ్ళు ఉంటే ఆయన ప్రభావంలో పడిపోతారు. ఆయన శిష్యుడొకాయన అకాలమరణం చెందినప్పుడు తన యావదాస్తినీ ఆశ్రమానికి రాసిచ్చేస్తాడు. తన భార్య, ఇప్పుడు వితంతువు, ఆమెని కూడా ఆ స్వామి సంరక్షణలో పెట్టి చనిపోతాడు. ఆ యవ్వన వితంతువు దామిని ఆకర్షణీయమైన వ్యక్తి. ఆమె మొదట్లో స్వామిపట్ల, ఆశ్రమం పట్ల ఎటువంటి గౌరవం చూపించదు. కాని శచి వచ్చిన తరువాత ఆమెకి ఆ ఆశ్రమం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆమె తన పట్ల ఆకర్షితురాలవుతున్నదని గ్రహించడం శచికి కష్టమేమీ కాదు. కాని ఆమెనుంచి ఎలా పారిపోవాలన్నదే అతడి సమస్యగా మారిపోతుంది. ఇది రెండవ అధ్యాయం. శచి పేరిట నడిచిన కథ.

శ్రీవిలాస్ శచి స్నేహితుడు. గొప్ప వక్త, విద్యాధికుడు. అతడు శచిని వెతుక్కుంటూ ఆశ్రమానికి వెళ్ళి అక్కడి వాతావరణంలో శచిని చూసి ఆశ్చర్యపోతాడు. చివరికి తన మిత్రుడికోసం అక్కడే ఉండిపోతాడు. శచి తన ఆకర్షణ నుంచి పక్కకు తప్పుకుంటున్నాడని గ్రహించిన దామిని శ్రీవిలాస్ కు దగ్గరగా జరుగుతుంది. ఆశ్రమానికి సంబంధించిన పనుల్లో అతడి సాయం తీసుకుంటూ ఉంటుంది. అతణ్ణేవేనా ఆధునిక బెంగాలీ రచనలు తెచ్చిపెట్టమని, చదివి వినిపించమని అడుగుతుంది. దామిని శ్రీవిలాస్ పట్ల చూపిస్తున్న ఆసక్తి శచిని, స్వామీజీనీ కూడా కలవరపరుస్తుంది. చివరకు వారిద్దరూ కూడా ఆమెని ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే ఎక్కడేనా ఉండమంటారు, ఆమె పోషణ బాధ్యత మాత్రం తాము వహిస్తామని చెప్తారు. ఆమె బయటకి వెళ్ళదు. దాంతో శ్రీవిలాస్ ఆమెని కలకత్తాలో ఆమె బంధువుల దగ్గర చేరుద్దామనుకుంటాడు. కాని బంధువులెవరూ ఆమెకి ఆశ్రయమివ్వరు. చివరకి శ్రీవిలాస్, దామిని ఊరవతల ఒక నిర్జన గృహంలో ఉండటానికి నిశ్చయించుకుంటారు. తమతో పాటు ఉండమని శచిని కూడా అడుగుతారు. శచి ఒప్పుకుంటాడు. ఇది మూడో అధ్యాయం, దామిని పేరు మీద జరిగిన కథ.

ఇక చివరి అధ్యాయం శ్రీ విలాస్ పేరు మీద జరిగిన కథ. ఆ ఊరి బయట బంగళాలో శచి, దామిని, శ్రీ విలాస్ ఉండగా, దామిని శచి మీద తన ఇష్టాన్ని ప్రకటిస్తూనే ఉంటుంది. చివరికి ఒక తుపాను రాత్రి శచి ఆ ఇల్లు వదిలి బయటకు పారిపోతాడు. దామిని కూడా ఆ తుపానులో అతణ్ణి వెతుక్కుంటూపోతుంది. చివరికి ఆమె శచి ముందు ఓడిపోయి ఇంటికి వస్తుంది. శ్రీవిలాస్ దామిని పెళ్ళి చేసుకుంటారు. కాని రెండేళ్ళు తిరక్కుండానే దామిని మరణిస్తుంది. మరణించేముందు శ్రీ విలాస్ తో ‘నీ పట్ల నా తృష్ణ ఈ జన్మలో పరిపూర్తి కాలేదు. నీ కోసం మళ్ళీ పుట్టాలని ఉంది ‘ అని చెప్తుంది.

స్థూలంగా ఇదీ కథ. అప్పటికింకా మనస్తత్వ శాస్త్ర పరిశోధనలేవీ భారతదేశానికి చేరలేదు. ఆ తర్వాత పదేళ్ళకుగానీ టాగోర్ ఫ్రాయిడ్ ని కలుసుకోలేదు. కాని ఈ రచనలో మనస్తత్వ పరిశీలన ప్రగాఢంగా కనిపించడంతో పాటు, మానవ అంతరంగాన్ని అర్థం చేసుకోవడంలో ఉండే నలుగులాట మొత్తం కనిపిస్తుంది.

కాని ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం శచి-దామినిల మధ్య నడిచే ఆకర్షణ-వికర్షణ కాదు. నవల చదువుతుండగానే ఇది టాగోర్ సమస్య అని అనిపించింది నాకు. ఇందులో ఆయన తనకీ, భగవంతుడికీ మధ్య నడుస్తున్న సంవాదాన్ని చిత్రించడానికి ప్రయత్నించాడు. అప్పటికి ఆయన భగవంతుడి వాగ్గేయకారుడిగా గీతాలు రాస్తూ ఉన్నాడు. అటువంటి ఒక గీతసంపుటికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. మరొకవైపు సాంఘికసేవలో భాగంగా శాంతినికేతన్ ప్రారంభించాడు. కాని దేవుణ్ణి చేరుకోడానికి ఏది సరైన మార్గం? మానవుణ్ణి మించిన మాధవుడులేడని సంఘసేవ చెయ్యడమా( కథలో శచి పెదనాన్న జగ్ మోహన్ లాగా ) లేదా భగవల్లీలా స్మరణలో, నామసంకీర్తనలో, జీవితం ప్రతిరోజూ ఒక ఉత్సవంగా గడపడమా ( కథలో లీలానంద స్వామిలాగా). (ఈ కథలో మూడవ ఆదర్శం అంటే జాతీయోద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళడం అన్న ప్రశ్న టాగోర్ ఎత్తుకోలేదు. అది ఘరే-బైరే కి వదిలిపెట్టాడు.)

మనుషుల్ని సేవించడం లేదా భగవంతుణ్ణి ఆరాధించడం వాటికవే గొప్ప ఆదర్శాలు అయిఉండవచ్చునేమోగాని, వాటిని తన ప్రకృతినుంచి తప్పించుకోడానికో లేదా మానవప్రకృతిని పక్కన పెట్టడానికో చెయ్యకూడదనేది టాగోర్ నమ్మిక. ఒక బాలవితంతువుని శచి పెళ్ళి చేసుకుంటానని ముందుకు వచ్చినప్పుడు, పందొమ్మిదో శతాబ్ది మహాసంస్కర్తల కోవలో, జగ్ మోహన్ సంతోషించడంలో, ఎంతలేదన్నా ఒక అమానుషత్వపు అపస్వరం ఉంది. ఆమెని ఉద్ధరిస్తున్నామన్న ఊహలేకపోలేదందులో. అంతకన్నా కూడా బుచ్చమ్మ విషయంలో సౌజన్యారావు పంతులు అనుకున్నట్టుగా, ఆమెని చదివించడానికి సిద్ధపడి ఉంటే ఆ కథ మరోలా ఉండేది. ఇక లీలానందస్వామి శిష్యుడొకడు తన ఇంటికొచ్చిన అనాథమరదలితో ప్రేమలో పడటంతో ఆ శిష్యుడి భార్య ఆమెకీ, తన భర్తకీ పెళ్ళి చేసి తాను మరణిస్తుంది. తన కళ్ళ ఎదట, తన శిష్యుడి ఇంట్లోనే ఇంత ఘాతుకం జరుగుతుండగా, దాన్ని పట్టించుకోకుండా దేవుణ్ణి కీర్తించడంలో ఉన్న క్రూరత్వాన్ని విమర్శించడం ఎలానూ సులభమే.

మరేది దారి? మనిషికి అన్నిటికన్నా కష్టమైనవి తోటిమనుషుల్తో తనకి ఏర్పడే మహకార, మోహ బంధాలు. వాటిని బలవంతంగా తెంచుకుని ఉపయోగం లేదు. అలాగని కూరుకుపోవడమూ శ్రేయస్కరం కాదు. Broken Ties అని పేరుపెట్టాడుట, టాగోర్ ఈ పుస్తకానికి’, ఇంగ్లిషులో. తెగిన బంధనాలు. బంధనాలు తెగడమే ప్రతి మనిషీ కోరుకునేది. కాని వాటంతట అవి తెగడమే కాదు, ఒకసారి ఒకరితో తెగిపోయాక, మళ్ళా మరొకరితో అతుక్కోకూడదు. అదెలా సాధ్యం?

ఈ నవలికలో టాగోర్ ఒక పరిష్కారం కోసం వెతికాడనుకోను. మనల్ని ఆలోచింపచేయడమే ఆయన ఉద్దేశంలాగా కనిపిస్తుంది. కథలో ఒకచోట, శంకరాచార్యుల ‘మోహముద్గరం’ ప్రస్తావన కూడా వస్తుంది. శంకరాచార్యుడు భార్యాబిడ్డలు మాయ అని అనడమయితే అన్నాడుగానీ, ఆయన సన్యాసి. వివాహితుడు కాడు, ఆ సంబంధాలు ఎటువంటివో ఆయనకేమి తెలుసు అంటాడొక పాత్ర. భార్య, బిడ్డలు మాయ అంటే వాళ్ళు లేరనీ, వాళ్ళ బాధ్యత నీకు లేదనీ కాదు. అటువంటి మూసల్లో వాళ్ళు లేరనీ, ఉండరనీ, ఉండాలని అనుకోకూడదనీ దాని అర్థం అని చెప్పకనే చెప్తాడు టాగోర్, నవల పూర్తయ్యేటప్పటికి.

ఏమైనప్పటికీ, టాగోర్ ని చదవడంలో గొప్ప ఆనందం ఉంది. అది మాటల్లో చెప్పగలిగేది కాదు. నాలుగు అధ్యాయాల ఈ నవల కూడా ఒకగీతం లాంటిదే. టాగోర్ గీతాల్లో సాధారణంగా నాలుగు చరణాలుంటాయి. స్థాయి, అంతర, సంచార, ఆభోగ్ అని. ఈ నవల్లో నాలుగు అధ్యాయాలూ కూడా ఒక గీతంలోని నాలుగు దశలు. నవల పూర్తయ్యేటప్పటికి, ఒక గీతాలాపన పూర్తయిన తర్వాత నిశ్శబ్దమే మనలోనూ మిగుల్తుంది.

30-6-2022

Leave a Reply

%d bloggers like this: