చారిత్రిక అనివార్యతకి అద్దం.

పది, పదిహేనేళ్ళకిందట, మాజికల్ రియలిజం గురించి తెలుసుకుందామని ఏ పుస్తకాలు చదవాలి అని అడిగితే ఎవరో అలేహో కార్పెంటియర్ పేరు చెప్పారు. ఆయన మేజికల్ రియలిజం కి ఆద్యుడని చెప్పవచ్చని, ఆయనతో మొదలుపెట్టమనీ చెప్పారు. అప్పుడు ఆయన రాసిన నవల The Kingdom of This World (2006) (ఇహలోక రాజ్యం) కొనుక్కున్నాను. కాని ఇన్నాళ్ళకు చదవగలిగాను.

అలేహో కారెపెంటియర్ (1904-1980) క్యూబాకి చెందిన రచయిత, సంగీతవేత్త. ఆయన ఈ నవల 1949 లో రాసాడు. ఇది ఇది మధ్య అమెరికా కు చెందిన కరీబియన్ దీవుల్లో భాగమైన హైతీ అనే ఒక దేశానికి సంబంధించిన చరిత్ర చుట్టూ అల్లిన కథ. పద్ధెమినిదో శతాబ్దిలో హైతీలో బానిసల తిరుగుబాటు మొదలుకుని సంభవించిన చారిత్రిక పరిణామాల్ని టిన్ నోయెల్ అనే ఒక కల్పిత పాత్ర దృక్కోణం నుంచి ఈ నెలల్లో చెప్పుకొస్తాడు. తన కథనాన్ని ఆయన lo real maravilloso లేదా the marvelous real అని పిలిచాడు.. తర్వాతి రోజుల్లో అది బోర్హెస్, మార్క్వెజ్ వంటి దక్షిణమెరికా రచయితల చేతుల్లో మాజికల్ రియలిజంగా రూపుదిద్దుకుంది.

ఇంత ఆలస్యంగా ఈ పుస్తకం చదివినందువల్ల ఇందులో మాజికల్ పార్శ్వం నన్ను ఎక్కువగా ఆకట్టుకోలేక పోయిందిగాని, అంతకన్న్నా విశేషమైన ప్రమాణాలు ఈ రచన సాధించిందని చెప్పాలి. వాటిల్లో మొట్టమొదట చెప్పవలసింది రచన నిడివి. దాదాపు రెండు వందల సంవత్సరాల చారిత్రిక పరిణామాన్ని రెండువందల పేజీలకు కుదించి చెప్పడం, కాని ఆ క్రమంలో, మనకి రచయిత ఏదో చెప్పకుండా వదిలిపెట్టేసాడని అనిపించకపోవడం మామూలు విషయం కాదు. తాను ఏ ఘట్టాల్ని చిత్రిస్తున్నాడో అక్కడ అతి సూక్ష్మ వివరాల్ని కూడా మనకి చెప్తూనే నిడివిమీద నియంత్రణ సాధించడం మామూలు విషయం కాదు.

రెండవ విశేషం రచయిత బహుభాషా పాండిత్యం. అతడు రాస్తున్నది ఒక ఫ్రెంచి కాలనీ గురించి. రాసింది స్పానిష్ లో. ఇతివృత్తం ఆఫ్రికానుంచి బానిసలుగా తీసుకువచ్చిన మనుషుల జీవితం, చరిత్ర. మూడు ఖండాలు, యూరోప్, ఆఫ్రికా, మధ్య అమెరికా ల గురించి ఎంతో తెలిసి ఉంటే తప్ప ఇంత సాధికారికంగా కథనం చెప్పడం సాధ్యం కాదు.

ఇక మూడవ విశిష్టత, కవితాత్మకత. తిరిగి తిరిగి, సన్నివేశాలు మారుతున్నప్పటికీ, చరిత్ర స్వభావం మారలేదనే స్ఫురణ కలిగేటట్టుగా ఒక సంగీత రూపకంలాగా, సున్నితంగా, అందులో వివిధ చారిత్రిక దశల్ని ఒక గీతంలో చరణాల్లాగా చెప్పిన కథనం.

‘పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను ‘ అన్నాడు మహాకవి. కాని దురదృష్టమేమిటంటే, చరిత్ర ఏదో ఒక నాటికి ఆగిపోయే కాలం, తావు ఏవీ ఉండవు. నిన్నటి బానిస నేడు ప్రభువు కాగానే తోటిమనిషిని బానిసగా మారుస్తూనే ఉంటాడు. ఆ బానిస మళ్ళా ప్రభువు మీద తిరగబడుతుంటాడు. తిరిగి మళ్ళా అతడు ప్రభువు కాగానే మరింత క్రూరుడిగా మారుతుంటాడు. ఈ నవల ఆ చారిత్రిక అనివార్యతకి అద్దం.

అయితే, ఒకవైపు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాలతో ప్రపంచానికి కొత్త ద్వారాలు తెరిచిన ఫ్రెంచి సమాజమే మరొకవైపు ఒక మారుమూల ద్వీపంలో మనుషుల్ని ఎలా అణచి ఉంచిందో తెలియడంలో గొప్ప విషాదం ఉంది. ఇక మనుషుల్ని బానిసలుగా మార్చి వాళ్ళని జంతువులకన్నా హీనంగా చూస్తూన్న వలసపాలకులు మరొకవైపు రూసోని, వాల్టేర్ ని ప్రస్తావిస్తూండటం అత్యంత విషాదకరమైన హాస్యం.

నవల ముగింపుకి వచ్చేటప్పటికి, కథకుడు, సూత్రపాత్ర టిన్ నోయెల్ కి ఇలా గ్రహింపుకి వచ్చిందని రాస్తున్నాడు:

‘.. . ఇప్పుడతడికి అర్థమయింది, మనిషి తాను ఎవరి కోసం వేదన అనుభవిస్తున్నాడో, ఎవరికోసం కలలు గంటున్నాడో ఎప్పటికీ తెలుసుకోలేడని. అతడు తానెవరికోసం వేదన పడుతున్నాడో, ఎవరి మీద ఆశలు పెట్టుకుంటున్నాడో, ఎవరికోసం చెమటోడుస్తున్నాడో ఎప్పటికీ తెలుసుకోలేడు. ఆ వాళ్ళెవరో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని చెప్పలేం. ఎందుకంటే మనిషి ఎప్పటికీ తనకు లభ్యమవుతున్న దానికన్నా మించినదేదో దానికోసమే పాకులాడుతుంటాడు. తానున్నదానికన్నా మరింత మెరుగైన స్థితికోసం వెంపర్లాడతాడనే యథార్థంలోనే మనిషి గొప్పదనం ఆధారపడి ఉంది. పరలోక రాజ్యంలో ఇంక గెలుచుకోవలసిన గొప్ప వైభవమేదీ ఇంక అతడికి మిగల్లేదు. పైగా ఆ పరలోక రాజ్యంలో పాలనాయంత్రాంగం, ఆ నిచ్చెనమెట్ల వ్యవస్థ ఎంత కట్టుదిట్టంగా ఉంటాయో అతడికి క్షుణ్ణంగా తెలుసు. ఇంతవరకూ అజ్ఞాతంగా ఉన్నది అతడికిక వెల్లడైపోయింది. ఆ పరలోకరాజ్యంలో మనుగడ అనంతకాలం పాటు కొనసాగుతుందనీ, అక్కడికి చేరుకున్నాక ఇక బలులూ, నైవేద్యాలతో పనిలేదనీ, అక్కడ ఉన్నదంతా సంతోషమూ, విశ్రాంతి మాత్రమేననీ తెలిసిపోయింది. కాబట్టే, దుఃఖాలూ బాధ్యతలూ కిందకి దిగలాగుతుంటే, అపారమైన నలుగులాటమధ్య కూడా బహుసుందరంగా వెలిగిపోతూ, అగ్నిగుండాల మధ్య, కఠినపరీక్షల ఎదట కూడా ప్రేమించడానికి ప్రయత్నిస్తూ, మనిషి తన సంపూర్ణ మహిమని ఇదిగో, ఇక్కడే, ఈ ఇహలోక రాజ్యంలోనే కనుగొంటున్నాడు.’ (పే.178-79)

బహుశా ఈ వాక్యమొక్కటే ఈ రచనలోని అత్యంత ఆశావహమైన వాక్యం. కాని ఈ వాక్యం దగ్గరకు చేరడానికి ముందు మనం వరసగా ఒకదానివెనక మరొక నరకం దాటుకుంటూ రావాలి. అప్పుడు కూడా, ఈ వాక్యం ఇచ్చే ఆసరాతో, మళ్ళా మరొక కొత్త నరకంలో అడుగుపెట్టడానికి సిద్ధపడాలి.

16-6-2022

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%