ఎవరు రాయబోతున్నారు ఆ కథ?

రెండు వందల పేజీలకన్నా నిడివి మించని నవలల్లో ఉత్తమ నవలలుగా పరిగణించబడే వాటి జాబితా ఒకటి, ఆ మధ్య, చేర్చి పెట్టుకున్నాను. అందులో The Prime of Miss Jean Brodie (1961) (మిస్ బ్రోడీ వయసులో ఉన్నప్పుడు) కూడా ఒకటి. స్కాట్లాండుకి చెందిన మురియెల్ స్పార్క్ (1918-2006) రాసిన రచనల్లో ఈ నవల చాలా ప్రశస్తి సంపాదించింది. తర్వాత రోజుల్లో నాటకంగానూ, సినిమా గానూ కూడా మలిచారని విన్నాను. నవల కొనుక్కుని చాలా రోజులే అయినప్పటికీ ఎప్పుడూ మొదటి పేజీ దగ్గరే ఆగిపోయేవాణ్ణి. ఇన్నాళ్లకు పూర్తిగా చదవగలిగాను.

ఇటువంటి రచనల్ని అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు గాని, వీటికి లభించిన అంతర్జాతీయ ప్రకాస్తికి గల కారణాలు అర్థం చేసుకోవడానికి నిజంగానే కొంత ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఈ నవల ఒక స్కాటిష్ రచయిత కాకుండా బ్రిటిష్ రచయిత్రినో లేదా అమెరికన్ రచయితనో రాసి ఉంటే ఈ పుస్తకానికి అంత ప్రశస్తి వచ్చిఉండేదా అన్నది అనుమానమే. అయితే ఈ పుస్తకం ప్రశస్తిని, ప్రాసంగికతని అర్థం చేసుకోవటానికి స్కాటిష్ సాహిత్యం గురించి కూడా ఎంతోకొంత తెలుసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకి జేమ్స్ హాగ్ అనే రచయిత రాసిన The Private Memoirs and Confessions of a Justified Sinner అనే నవల చదివి ఉంటే ఈ నవల వంశ వృక్షం మన కొంత బోధపడుతుంది. ( ఆ నవల కూడా చదవబోతున్నాను). అలానే ప్రసిద్ధ స్కాటిష్ రచయిత రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ రాసిన Dr Jekyl and Mr Hyde నవల కూడా.

ఈ నవల ఇతివృత్తం పైకి చూడడానికి చాలా సరళం. స్కాట్లాండ్ లో ఎడింబరోలో మార్షియా బ్లెయిన్ స్కూల్ అనే ఒక మిడిల్ స్కూల్లో మిస్ జీన్ బ్రోడీ ఒక ఉపాధ్యాయిని. ఆమె ఆమె సరి కొత్త పద్ధతుల్లో పిల్లలకి విద్య నేర్పాలనే ప్రయోగాలు చేస్తున్నానని, ఆ ప్రయోగాలు కూడా తాను వయసులో ఉన్నప్పుడే చేయాలని అనుకుంటున్నానని అని చెప్తుంటుంది. తన పాఠశాలలో చదువుతున్న బాలికల్లో నుంచి ఐదుగురు బాలికల్ని ఆమె ప్రత్యేకంగా ఎంపిక చేసి వాళ్లని ఒక బృందంగా గా రూపొందిస్తుంది. మోనికా డగ్లస్ (లెక్కల్లో బెస్ట్), యూనిస్ గార్డినర్ (ఆటల్లో నంబర్ వన్), సాండీ స్ట్రేంజెర్ (చిన్ని కళ్ళు), రోజ్ స్టాన్లీ ( ఆమె పేరు చెప్పగానే అందరికీ సెక్స్ గుర్తొస్తుంది) లతో పాటు మెక్ గ్రెగర్ (అభాగ్యురాలు)అనే ఆ అయిదుగురు బాలికలూ బ్రాడీ సెట్ గా తయారవుతారు.

ఆ పిల్లలు తమ కౌమార జీవితంలో మిస్ బ్రాడీ సన్నిధిలో తమ వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవడం మొదలు పెడతారు. ఆ ఉపాధ్యాయిని లో వారికి గొప్ప ఆకర్షణ కనిపిస్తుంది. ఆమె ప్రత్యేకంగా ఎంచుకున్న ఆ చిన్న బృందంలో తాము కూడాఉండటం వారికి ఎంతో గర్వంగానూ, ఉత్సాహంగానూ వుంటుంది. ఇది నవలలోని ఆకర్షణీయమైన ఉల్లాసకరమైన పార్శ్వం. ఇక ఈ నవల్లో దారుణమైన చీకటి పార్శ్వం కూడా ఉంది. మిస్ బ్రాడీకీ అదే పాఠశాలలో పనిచేస్తున్న ఆర్ట్ మాస్టారికీ, సంగీతం మాస్టారికీ మధ్య ఏర్పడ్డ ఆసక్తి నెమ్మదిగా రహస్య ఆకర్షణ గా మారుతూండగా ఆ రహస్యలొకంలోకి ఆ పిల్లలు కూడా ప్రవేశిస్తారు. నవయవ్వనం లో ప్రవేశిస్తున్న ఆ పిల్లల జీవితాల్లో, మనసుల్లో, వాళ్ళ మధ్య ఉన్న పరస్పర సంబంధాల్లో, ఆ ఉపాధ్యాయుల మధ్య తలెత్తిన రహస్య ఆకర్షణ ఎటువంటి కలకలం సృష్టించిందీ కథలో రెండో పార్శ్వం.

మనుషుల జీవితాల్లో, అది కూడా చిన్న చిన్న గ్రామాల్లోనో, పాఠశాలల్లోనో, కార్యాలయాల్లోనో, నాటకబృందాల్లోనో, ఆకర్షణీయమైన కోణాల తో పాటు అగాధమైన పార్శ్వాలు కూడా ఉండటం సహజం. మనుషులు చిన్న చిన్న బృందాలుగా మసిలే తావుల్లో ఆ ఆకర్షణలూ, వికర్షణలూ, కుతూహలాలూ, అసూయలూ వాళ్ళ మనసుమీదా, దైనందిన జీవితం మీదా కలిగించే ఒత్తిడి సామాన్యంగా ఉండదు. దాన్ని రచయిత్రి ఎంతో నేర్పుతో, గొప్ప శైలితో, అరుదైన కథా శిల్పం తో చిత్రించడంతో ఈ నవల ఉత్తమ సాహిత్య కృతిగా ప్రసిద్ధిచెందింది అనుకుంటాను.

ఈ నవల కథాకాలం రెండవ ప్రపంచ యుద్ధం మొదలు అయ్యే సమయం. రచయిత్రి ఈ నవలను 60 ల మొదట్లో రాసింది అందులో పాత్రలు పదిహేనేళ్ల తర్వాత, ఇరవై ఏళ్ల తర్వాత, పాతికేళ్ల తర్వాత కూడా తమ పాఠశాల రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాయి. అంటే దాదాపుగా 1930 నుంచి 1960 దాకా స్కాట్లాండ్ జీవితం ఈ నవల్లో మనకు కనబడుతుంది. ఆ రోజుల్లో ప్రపంచం తలకిందులు అవుతున్నది. కానీ స్కాట్లాండ్ లో ఆ పాఠశాల, ఆ ఉపాధ్యాయులు, ఆ పిల్లలు మాత్రం ఆ ఆటుపోట్లకు అతీతంగా తమదైన లోకంలో జీవిస్తూ ఉండటంలో ఏదో ఒక అమాయకమైన ఆకర్షణ ఉంది. అయితే ఆ ఉపాధ్యాయిని మాత్రం తన తరగతి గదిలో హిట్లర్ గురించి, ముస్సోలినీ గురించి, ఫాసిజం గురించి మాట్లాడుతూ ఉంటుంది, కానీ ఆ మాటలు ఆ పిల్లల జీవితాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయకపోగా చివరికి ఆ ఉపాధ్యాయిని ఫాసిజానికి మద్దతు ఇస్తోందనే ఆరోపణ మీద తన ఉద్యోగం పోగొట్టుకుంటుంది.

ఈ పుస్తకం మీద కొన్ని సమీక్షలు కూడా చదివాను. వారంతా రచయిత్రి శిల్ప నైపుణ్యాన్ని బాగా మెచ్చుకున్నారు. బహుశా ఇంత బాగా పకడ్బందీగా కథ చెప్పడంలో ఈమెని మన చాసో తో పోల్చవచ్చు. ఇద్దరూ సమకాలికులు కూడా. అయితే ఈ పోలిక కేవలం శిల్పం వరకు మాత్రమే. కథా వస్తువులో, కథా సందేశంలో ఇద్దరూ భిన్న ధ్రువాలు.

అయితే ఈ కథనీ, కథలో చర్చించిన చిత్రించిన వెలుగునీడల్నీ పక్కనబెడితే ఈ నవల చదువుతున్నంత సేపూ నాకు మన ప్రాంతాల్లో, మన పల్లెటూళ్ళలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలూ, ఆ ఉపాధ్యాయులూ, అక్కడ చదువుకున్న పిల్లలూ గుర్తొస్తున్నారు.

ఉదాహరణకి మా రాజవొమ్మంగి లో అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తీసుకుంటే, నేను ఆ స్కూల్లో చదువుకోలేదుగాని, మా ఇద్దరు అన్నయ్యలూ, మరెందరో మిత్రులు ఆ పాఠశాలలో చదువుకున్నవారే. 60 ల్లో, 70 ల్లో ఆ పాఠశాల మా గ్రామాల్లో, మా కుటుంబాల్లో ఎంతో ముఖ్యస్థానం ఆక్రమించింది. ఆ పాఠశాలలో చదువుకున్న ఎందరో విద్యార్థులు వారి హైస్కూల్ జీవితంలో లోనైన అనుభవాల్లో ఎంతో ఉత్కంఠ, నవ్యత, ఉల్లాసం, విస్మయం, కొన్ని షాకులు కూడా ఉన్నాయి. ఆ పాఠశాలనే వాళ్ళకి విస్తృత ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఆ రోజుల్లో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అసిస్టెంటు హెడ్ మాస్టారు, డ్రిల్లు మాష్టారు, తెలుగు మాష్టారు, హిందీ మాష్టారు, చివరికి గంటలు కొట్టే అటెండర్ తో సహా ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని ఎంతో వెలిగించిన వారే. ఆ రోజు తమతో చదువుకున్నవాళ్ళు తర్వాత జీవితంలో ఏమైనారో తెలుసుకోవడంలో ఒక నోస్టాల్జియాతో పాటు, గొప్ప స్థానిక చరిత్ర కూడా ఉంటుంది. అటువంటి అనుభవాల్ని ఎవరైనా ఒక కథగా రాస్తే ఆ కథ కూడా ఇంత ఆసక్తికరంగానూ ఉంటుందని చెప్పగలను.

మన రచయితలు చాలామంది రాజవొమ్మంగి జిల్లా పరిషత్ హైస్కూల్లాంటి స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళే. వారెవవరైనా సరే వారి బాల్యం నుంచి నవ యవ్వనానికి చేసిన ప్రయాణంలో ఆ హైస్కూళ్ళు మరవలేని మజిలీలు. మరి ఎవరు రాయబోతున్నారు ఆ కథ?

19-6-2022

Leave a Reply

%d bloggers like this: