
హైదరాబాదు వచ్చి నెలరోజులు దాటింది. ఎప్పుడేనా బయటికి వెళ్తే, ఒకప్పుడు నగరంలో గడిపిన కాలమంతా డైరీలో రాసిపెట్టినట్టుగా మనసులో మెదులుతూ ఉంది. కాని ఆ డైరీలు తెరవాలని లేదు. ఆ పేజీల్లో ఎందరో మిత్రులు, మిత్రురాళ్ళు. ఒకప్పుడు వాళ్ళు లేకుండా ఒక్కరోజేనా గడుస్తుందా అనుకున్న వాళ్ళు. కాని వాళ్ళంతా చాలా దూరంగా జరిగిపోయారు. కొందరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కూడా.
కాని ఆ డైరీలు తెరవకుండానే నన్ను ప్రతి రోజూ పలకరిస్తున్న వాళ్ళల్లో అందరికన్నా ముందు కవితాప్రసాద్ ఉంటాడు. పొద్దుణ్ణుంచి సాయంకాలందాకా విరామం లేకుండా కూస్తూనే ఉన్న కోయిల గొంతు అతణ్ణి పదే పదే జ్ఞాపకం చేస్తూనే ఉంది. ఆఫీసులో కూచుని ఉండగా, పదిమంది మనుషులు ఛాంబరులోకి చొరబడ్డట్టుగా, అడుగుపెట్టే ఆ మనిషి నా తలపుల్లోకి కూడా అంతే ఉత్సాహంతో జొరబడుతూనే ఉన్నాడు.
కొత్త కవిత్వం పుస్తకమేదన్నా ఫ్లిప్ కార్ట్ నుంచి ఆఫీసుకి రాగానే, ఓపిగ్గా దానికి అట్టవేసునేదాకా ఆగి, ఆ కవిత్వం తనకి చదవాలని ఉందని చెప్పి పట్టుకుపోయేవాడు. మళ్ళా వెంటనే ఇచ్చేసేవాడు. కాని మళ్ళా రెండుమూడు వారాలో, నాలుగైదు వారాలో గడవగానే ‘ ఆ మచాడో ఒకసారి చదవాలని ఉంది’, ‘హాఫ్ ఫినిషెడ్ హెవెన్ రేపొకసారి తీసుకొస్తారా?,’ ‘రిల్కే ని మళ్ళా చదవాలని ఉంది’అనేవాడు. పాశ్చాత్య కవిత్వాన్ని తాను ఎక్కడ మిస్ అవుతానో అనే ఒక యాంగ్జయిటి ఉండేది అతడి మాటల్లో. కాని నాకు అతడి పొట్టలో ఉన్న పదివేల తెలుగు పద్యాల్నీ మళ్ళీ మళ్ళీ వినాలని ఉండేది. తెలుగు ఛందస్సు గురించి మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవాలని ఉండేది.
‘ఏమండి భద్రుడుగారు, భోజనం చేసార మీరు ‘ అంటో రూములో అడుగుపెడుతూ, ‘మీకు తెలుసా, ఈ వాక్యం మధ్యాక్కర ఛందస్సులో ఉంది. మనం మాట్లాడుకునే తెలుగు వాక్యాలన్నీ చిన్న చిన్న మార్పుల్తో మధ్యాక్కర పద్యాలయిపోతాయి’ అనేవాడు. (చూడండి, అయిదో గణం మొదటి అక్షరం మీద యతి, అచ్చం నన్నయగారు వేసినట్టే). ‘భోజనం అంటే గుర్తొచ్చింది. శ్రీనాథుడు భోజనం చేసారా అనడు. భుజక్రియ చేసారా అంటాడు’ అనేవాడు.
నాలో ఒక సాహిత్యాభిమానితో పాటు, ఒక కొలీగ్ ని కూడా చూసేవాడనుకుంటాను. నన్ను కలిసిన ప్రతిసారీ ‘మనం కొంతసేపు ఆత్మస్తుతి పరనింద చేసుకుందామా’ అనేవాడు. ఆ ఆత్మస్తుతి తనలోని సాహిత్యారాధకుణ్ణి ఉద్దేశించి ఉండేది. ఆ పరనింద మా డిపార్ట్ మెంట్ల గురించి, సాహిత్యవాసన బొత్తిగా లేని మా పై అధికారుల గురించీ ఉండేది. ఆ పరనిందలో పాలుపంచుకోవడం ఎంతో ఆసక్తిగా ఉండేది.
ఆయన కృష్ణా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటి డైరక్టరుగా ఉన్నప్పుడు వాళ్ళ డైరక్టరు ఒకసారి విజయవాడ ప్రోగ్రాం పెట్టుకున్నాడట. అది కూడా ఒక ఆదివారం. ఎందుకంటే అప్పట్లో వాళ్ళ డైరక్టరు కూతురో, కొడుకో అక్కడ చదువుకునేవారనుకుంటాను. అందుకని విజయవాడ వస్తూ, ఆ ప్రోగ్రాం ని అఫీషియలైజ్ చేసుకోడానికి, ఆ డైరక్టరు మనవాడితో, ఒక మీటింగ్ పెట్టమని చెప్పాడట. కాని పాపం మనవాడు ఆ రోజు ఆదివారం కదా అని ఎవరికో ఒక అష్టావధానం ఒప్పుకున్నాడు. తీరా డైరక్టరు వస్తున్నాడంటే ఏమి చెయ్యాలో తెలియలేదు. ఎలాగోలా ధైర్యం చేసి డైరక్టరుకి ఫోన్ చేసి ‘సార్, రేపు నాకొక లిటరరీ మీటింగు ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే..’అంటూ ఉండగానే, ఆ డైరక్టరు గారు ‘నథింగ్ దూయింగ్, మీ జిల్లాల్లో హాస్టళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని చాలా కంప్లెయింట్లు వస్తున్నాయి. ఐ వాంత్ తు గివ్ ఎ బిగ్ బేంగింగ్ తు ఆల్ ఆఫ్ యూ ‘ అన్నాడట. కాని మనవాడు పట్టువదల్లేదు. వాళ్ళ హెడ్ ఆఫీసులో ఒక జాయింట్ డైరెక్టరు ఉండేవాడు. ఆయన తెలుగు సాహిత్యం ఆప్షనల్ గా రాసి గ్రూప్ 1 లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఉద్యోగంలో పడ్డాక సాహిత్యానికి దూరమైపోయినా, తనకి అన్నం పెట్టింది కదా అని సాహిత్యమంటే గౌరవం ఉండేది అతడికి. అందుకని అతణ్ణి వేడుకున్నాడు, ఎలాగేనా డైరక్టరుకి చెప్పి ఆదివారం ప్రోగ్రాం కాన్సిలు చేయించు అని. ఆ జాయింట్ డైరక్టరు ఏమి చెప్పాడో గాని, ఆ డైరక్టరు ప్రోగ్రాం కాన్సిలు చేసుకుని మనవాడికి ఫోన్ చేసాడు. ‘యువర్ జెడి తోల్ద్ మీ. ఇట్ సీమ్స్ యు ఆర్ గోయింగ్ తు దు సమ్ ఫీట్ తుమారో. ఐ’మ్ తోల్డ్ దత్ ద ఫీట్ విల్ బి విత్ సమ్ యెయిత్ పీపుల్. ఈజ్ ఇంత్ ఇత్? ‘ అన్నాడట. ‘మస్త్ బి వెరీ ఇంతరెస్తింగ్’ అని కూడా అన్నాడట.
అట్లాంటి మనుషుల మధ్య బతికాడు ఆయన. నేనూ అలానే బతికాను గాని, నా సాహిత్య ప్రపంచాన్ని నా ఉద్యోగజీవితం నుంచీ, సాహిత్యబృందాల నుంచీ దూరంగా పెట్టుకోడంతో నాకు ఆట్టే అశాంతి ఉండేది కాదు. కాని ఆయన తన కొలీగ్స్, తన పై అధికారులు, చివరికి మంత్రులూ, ఎమ్మెల్యేలూ కూడా తన సాహిత్యాన్నీ, పద్యాల్నీ, అవధానాల్నీ చూసి విని ఆనందించాలని కోరుకునేవాడు. వాన పడ్డప్పుడు రాళ్ళమీదా, ముళ్ళమీదా కూడా కురిసినట్టే, ఆయన సాహిత్యవర్షం హెచ్చుతగ్గులు చూసేది కాదు.
మిత్రమా ఏమై పోయావు నువ్వు? ఇప్పుడు కూడా అవే ప్రభుత్వాలు, అవే సాహిత్య చర్చలు. లేనిదల్లా నువ్వు మాత్రమే.
21-5-2022