యుగయుగాల చీనా కవిత-23

ఇప్పుడు మనం చీనా కవిత్వ చరిత్రలో స్వర్ణయుగం అని చెప్పదగ్గ తాంగ్ యుగంలోకి ప్రవేశిద్దాం. ఏ అతీత కాలంలోనో గీత సముచ్చయం గీతాలు ప్రభవించిన కాలం నుండి సుయి రాజవంశం దాకా కొనసాగిన ముఖ్యమైన దశల్నీ, ఆ కాలాల్లో కవిత్వం చెప్పిన ప్రసిద్ధ కవుల్నీ ఇంతదాకా పరిశీలించాం. మామూలుగా ప్రాచీన చీనా కవిత్వాన్ని పరిచయం చేసే ఇంగ్లిషు అనువాదాలు గీత సముచ్చయం తరువాత, తావో కియాన్ కవితలు కొన్ని పరిచయం చేసి, నేరుగా తాంగ్ యుగానికి చెందిన కవిత్వానికి వెళ్లిపోతాయి. కాని తాంగ్ యుగానికి చెందిన కవులు హాన్ యుగానికి చెందిన కవిత్వానికీ, ఆరు వంశాల కాలం నాటి కవిత్వానికి ఎంతో ఋణపడి ఉన్నారు. ఆ కవిత్వాలు, ఆ కవుల్ని నడిపించిన భావోద్వేగాలు పరిచయం కాకుండా తాంగ్ యుగానికి చెందిన కవిత్వాన్ని మనం పూర్తిగా ఆస్వాదించలేం. అందుకనే హాన్, వెయి, కిన్, ఆరురాజవంశాల కాలం నాటి కవుల్ని కొంత విపులంగానే పరిచయం చేసాను ఇన్నాళ్ళూ.
 
తాంగ్ యుగం (618-906) చీనా చరిత్రలో స్వర్ణయుగం, భారతదేశ చరిత్రలో గుప్తుల కాలంలాగా. అది కవిత్వానికి కూడా అత్యుచ్చ యుగం. ఏ భాషా సారస్వతంలో అయినా అటువంటి యుగం ఒక్కసారే సంభవిస్తుంది. ఆ భాష, ఆ జాతి, ఆ సంస్కృతి సర్వోచ్చ దశకు చేరుకున్నదానికి గుర్తుగా ఆ కవిత్వం చరిత్రలో నిలబడి పోతుంది. గ్రీకునాటకయుగంలాగా, తమిళంలో సంగం సాహిత్య యుగంలాగా, తెలుగులో ప్రబంధ యుగంలాగా, ఇంగ్లిషులో రొమాంటిసిస్టు యుగంలాగా, ఫ్రెంచిలో సింబలిస్టు కాలంలాగా, రష్యన్ లో సిల్వర్ ఏజ్ లాగా, చీనా కవిత్వంలో తాంగ్ యుగం తన పూర్వకాలాల సౌనిశిత్యాల్ని పొదివిపుచ్చుకుని, తన అనంతరకాలాలకు ఉన్నత సాంస్కృతిక ప్రమాణాల్ని వారసత్వంగా వదిలిపెట్టింది. అప్పటిదాకా కవిత్వ ప్రయోజనం విషయంలో, ఛందస్సు , వస్తువు, శిల్పం విషయంలో పూర్వయుగాల కవులు చేస్తూ వచ్చిన ప్రయోగాలు తాంగ్ యుగంనాటికి నిర్దిష్టకావ్యశిల్పంగా ఒక సర్వాంగీణతని సంతరించుకున్నాయి.
 
తాంగ్ యుగాన్ని తొలి తాంగ్ కాలం అనీ, పతాక యుగమనీ, మధ్య తాంగ్ కాలం అనీ, మలి తాంగ్ కాలమనీ నాలుగు యుగాలుగా విభజించడం పరిపాటి. ఆ నాలుగు యుగాల్లోనూ, సుమారు 300 ఏళ్ళ కాలంలో, వచ్చిన కవిత్వంలోంచి పేరెన్నికగన్న కవితల్ని ఏరి 18 వ శతాబ్దిలో ఒక సంకలనంగా ప్రచురిస్తే, అందులో మొత్తం 2200 మంది కవులు రాసిన 48,900 కవితలు ఉన్నాయి! ఇది కాక, కింగ్ రాజవంశ కాలంలో, పద్ధెనిమిదో శతాబ్దిలోనే ‘మూడు వందల తాంగ్ కవితలు ‘ అనే మరో సంకలనం కూడా వెలువడింది. మన ‘వైతాళికులు’ సంకలనంలాగా ప్రరి చీనా కవిత్వ విద్యార్థికి ఈ సంకలనం ఒక పారాయణ గ్రంథం.
 
తాంగ్ యుగ మహాకవుల్ని ఒక్కొక్కర్నే పరిచయం చేసుకునే ముందు, అసలు ఆ యుగకవిత్వం తాలూకు కొన్ని ముఖ్యలక్షణాల్ని పరిచయం చేసుకోవడం అవసరం. తాంగ్ యుగాన్ని ఇంగ్లిషు పాఠకులకి సవివరంగా అందించిన చీనా పండితుడు, అనువాదకుడు స్టీఫెన్ తొలితాంగ్ యుగం మీద, పతాక యుగం మీద, మలి తాంగ్ యుగం మీదా మూడు సమగ్రమైన రచనలు వెలువరించాడు. ఇవి కాక, An Anthology of Chinese Literature, Beginnings to 1911 (1996) లో ఆయన తాంగ్ యుగానికి కూడా కొన్ని అధ్యాయాలు కేటాయించాడు. అందులో ఒక అధ్యాయంలో తాంగ్ యుగ కవిత్వ లక్షణాల్ని స్థూలంగా పరిచయం చేసాడు. దాదాపుగా ఆ పరిచయవ్యాసంలోని ముఖ్యాంశాల్నే నేను ఇక్కడ మీతో పంచుకోబోతున్నాను.
 
స్టీఫెన్ ఓవెన్ చెప్పినదాన్ని బట్టి, తాంగ్ యుగంలో, కవిత్వ రచన అన్నిటికన్నా ముందు ఒక సామాజిక సంతోషం. అలాగని కవుల వైయక్తిక విషాదానికి, భావోద్వేగాలకూ కవిత్వం వాహిక కాలేదా అంటే, అయ్యింది, తాంగ్ యుగంలో కూడా కవులు, చూ-చి పద్ధతిలో, పందొమ్మిది హాన్ గీతాల ధోరణిలో, చావో జి తరహాలో, షీ తియావో పద్ధతిలో కవిత్వం చెప్పకపోలేదు. కాని అది కవులు తమ కోసం మాత్రమే రాసుకున్న కవిత్వంగా మిగిలిపోలేదు. గీత సముచ్చయంలో కవిత్వం ఎలా సామాజిక సుఖదుఃఖాల వ్యక్తీకరణకు సాధనంగా ఉపయోగపడిందో, తిరిగి, కవిత్వం తాంగ్ యుగం నాటికి, ఆ కేంద్రానికి చేరుకుంది.
 
సామాజిక సంతోషం అంటే మనుషులు తమ దైనందిన జీవితంలో తమకి సంభవిస్తున్న ప్రతి ప్రగాఢమైన అనుభవాన్నీ తమ మిత్రులతో, బంధువులతో, సహోద్యోగులతో, కుటుంబసభ్యులతో పంచుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఒక కవితగా రాసి పంచుకోవడం అన్నమాట. జీవితం ప్రతి సందర్భంలోనూ వారు కవితామయమైంది ఏదైనా ఉందా అని వెతుక్కునేవారు. తమని స్పందింపచేసిన ఆ క్షణాల్ని ఒక కవితగా కూర్చగలిగితే ఆ మనిషి, విద్యావంతుడనీ, సాంస్కృతికంగా పరిణతి చెందినవాడనీ గుర్తు. తన అభిరుచి ఉన్నతమైందని తెలుపుకోడానికీ, తాను జీవించిన క్షణాలు చిరస్మరణీయాలూ, సామాజికంగా ప్రభావశీలాలూ అని చెప్పుకోడానికి ప్రతి మనిషీ ఉవ్విళ్ళూరేవాడు. ఆ ఉద్వేగంలో కవిగా మారేవాడు. అలా ఒకరికొకరు పంచుకున్న ఆ కవితలు అనతికాలంలో సాహిత్యంగా మారిపోయేవి.
 
అటువంటి కవిత్వానికి స్టీఫెన్ ఓవెన్ ఇచ్చిన ఉదాహరణనే ప్రస్తావిస్తాను. ఒకప్పుడు ఎనిమిదో శతాబ్ది మధ్యకాలంలో ఒక ‘సు’ అనే వాడు తన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తూ, తాంగ్ యుగ మహాకవుల్లో ఒకరైన వాంగ్ వెయి ఇంటిదగ్గర ఆగాడు. అప్పుడు వాంగ్ వెయి ఇంటిదగ్గర లేడు. అప్పుడు ఆ ‘సు’ బహుశా ఒకక్షణం పాటు ఆగి ఆ చుట్టూ పరికించి ఉంటాడు. చుట్టూ ఉన్న తోట, నిర్జన పరిసరాలు, ఆకాశంలో మేఘాలు, సూర్యకాంతి, ఏవో చూసి ఉంటాడు. ఆ క్షణం అతడిలో ఒక స్పందన కలిగింది. దాంతో ఆ సు అనేవాడు తాను వచ్చివెళ్ళినట్టుగా చెప్తో ఒక కవిత రాసి అక్కడ పెట్టి వెళ్ళాడు. వాంగ్ వెయి తిరిగి రాగానే ఆ కవిత చదివాడు. అతడికి వెంటనే జవాబు ఇవ్వడం మర్యాద కదా. కానీ ఆ జవాబు కూడా కవితరూపంలోనే రాసాడు. కొన్ని కోట్ల మంది చీనాజనాభాలో ఒకప్పుడు సు అనేవాడొకడు వాంగ్ వెయి ఇంటికి వెళ్ళడం అత్యంత క్షణికం, అప్రధానం. అతడు రాసిపెట్టి వెళ్ళిన కవిత ఏమిటో కూడా మనకి తెలియదు. కాని అందుకు ప్రతిస్పందనగా వాంగ్ వెయి రాసిన కవిత మాత్రం ఆ సంఘటనని అజరామరం చేస్తూ సాహిత్యంగా నిలిచి పోయింది. ఆ కవిత చూడండి:
 

లన్-తియాన్ లో నా ఇంటిదగ్గర అటవీ శాఖకు చెందిన నా మిత్రుడు సు వదిలిపెట్టివెళ్ళిన కవితకు జవాబుగా-

 
లోయముఖద్వారం దగ్గర నా పేదకుటీరం
దూరంగా కుగ్రామం చుట్టూ ఎత్తైన వృక్షాలు.
 
ఎంత దయగా వచ్చావు ఆ రాళ్ళదారిన నా కోసం
ఆ కొండల్లో నా ఇంటిదగ్గర నిన్నెవరూ పలకరించలేదు.
 
దూరంగా గడ్డకట్టిన తీరం దగ్గర చేపలు పట్టే పడవ,
చలికి వణుకుతున్న గడ్డిభూముల్లో వేటగాళ్ళ నెగళ్ళు.
 
అక్కడ ఉన్నదంతా ఆ తెల్లమబ్బులకి ఆవలనే.
రాత్రంతా కోతుల కేకలమధ్య ఆగీఆగీ గణగణ.
 
స్టీఫెన్ ఓవెన్ ఏమంటాడంటే, వాంగ్ వెయి ఈ కవిత రాయడానికి ఆయన ముందు వెయి యెంగ్ వూ (737-792) అనే కవి ఇటువంటి సందర్భంలోనే రాసిన ఒక కవితగా నమూనాగా ఉండిఉంటుందని. వెయి యెంగ్ వూ తన మిత్రుణ్ణి చూడటానికి వెళ్ళి, అతడు ఇంటిదగ్గర లేకపోవడంతో ఈ కవిత రాసిపెట్టి వచ్చాడట:
 
తొమ్మిదిరోజుల పనిభారం తర్వాత
ఒక రోజు విశ్రాంతి.
 
నీ కోసం వెతుక్కున్నాను, నువ్వు
లేకపోవడంతో వెనక్కి వచ్చాను.
 
చలిగాలుల్లో నీ ఇంటిగుమ్మం,
కొండలమీద రాలుతున్న మంచు.
 
కవిత్వం నీ ఎముకల్లోకీ
ఎట్లా చొచ్చుకుపోయిందో, ఆశ్చర్యం.
 
 
ఇలా ఒక సంఘటన ఒక కవితగా, ఆ కవిత మరొక కవితకు స్ఫూర్తిగా, ఈ రెండు కవితల స్ఫురణల్తో మరొక కవిత- ఇలా మనుషులు తాము బతికిన క్షణాల్ని కవిత్వంగా మార్చేసారు ఆ కాలమంతా.
కేవలం కలయికలు మాత్రమే కాదు, విడిపోడాలు కూడా కవితలుగా మారాయి. వీడ్కోళ్ళు, దీర్ఘమైన ఎడబాట్లు, తిరిగి కలయికకు ఆస్కారం లేని చిరనిరీక్షణలు చిరస్మరణీయమైన కవితలుగా మారేయి.
 
అలాగే, వ్యక్తిగత భావోద్వేగాలు, ఏకాంత మానసతరంగాలు, విశుద్ధ రాగానుభూతి కూడా కవిత్వంగా మారింది. అటువంటి కవితల్ని పాతపద్ధతి కవితలు ( గు-ఫెంగ్) గా వ్యవహరించారు. లేదా జర్మన్, ఇంగ్లిషు రొమాంటిక్ కవితల్లాగా ఏదైనా ఒక చారిత్రిక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఆ గతస్మృతులు తమలో రేకెత్తించే స్పందనల్ని కూడా వాళ్ళు కవితలుగా మలిచారు. కొన్నిసారు వస్తువులు, అంటే, వస్తువులు, పక్షులు, జంతువులు, సంగీత పరికరాలు మొదలైనవి కూడా కవితావస్తువులయ్యాయి.
 
అంతేకాక, అటువంటి వస్తువుల మీద అప్పటికే ఎంతో విస్తారంగా వచ్చిన పూర్వకవిత్వ ప్రస్తావనలు వాటికవే ఒక విజ్ఞాన సర్వస్వంగా మారిపోయేయి. కాబట్టి ప్రతి కవీ, తాను ఒక వస్తువు మీద కొత్తగా కవిత రాస్తున్నప్పటికీ, అందులో పూర్వకవిత్వ ప్రస్తావనల్ని సూచించడమో, ఆ స్ఫురణల్ని శ్రోతలో మేల్కొల్పడమో చేసేవాడన్నమాట. ఇక తాంగ్ యుగం ప్రధానంగా డావోయిస్టు కాబట్టి డావోయిజానికి చెందిన ఇతివృత్తాలు కూడా కవిత్వవస్తువులే. వీటితో పాటు కొన్ని సామాజిక, వైయక్తిక మానవ అవస్థలు కూడా నిర్దిష్ట పాత్రలుగా కవిత్వ వస్తువులయ్యాయి. ఉదాహరణకి సరిహద్దుల్లో పోరాడే సైనికుడు, తన భర్త యుద్ధానికి వెళ్ళగా ఇంటిదగ్గర ఎడబాటుతో కృశిస్తున్న అతడి భార్య, చక్రవర్తి ఆదరణ కోల్పోయిన రాజాస్థాన వనిత వంటి నిర్దిష్ట అవస్థలన్నమాట.
 
నేమనుకుంటానంటే తాంగ్ యుగ కవిత్వ వైశిష్ట్యం అది కేవలం సామాజిక సంతోషానికి వ్యకీకరణ కావడంలో లేదు. అది వ్యక్తీ, సమాజమూ కలుసుకునే బిందువు దగ్గర వికసించడంలో ఉంది. పూర్వకాలాల కవిత్వాన్ని హృదయస్థం చేసుకుని, ఆ కవిత్వ స్ఫూర్తితో, తమ దైనందిన జీవితాన్ని కవిత్వమయం చేసుకోవడంలో ఉంది. తనకీ, లోకానికీ మధ్య ఒక అనురాగసేతువు నిర్మించుకోవడంలో ఉంది.
 
31-5-2022

Leave a Reply

%d bloggers like this: