యాభై తొమ్మిది సెకండ్ల సుదీర్ఘ కాలవ్యవధి

Reading Time: 3 minutes
మనిషి సత్యాన్ని తొందరగా చేరుకోగల దారి ఏదన్నా ఉంటే అది కథలు చెప్పుకోవడమే అంటాడు ఆంథోని డి మెల్లో. చాలా ఏళ్ళ కిందట, అరకులోయలో రోమన్ కాథలిక్ మిషన్ స్కూలు లైబ్రరీలో ఆయన రాసిన One Minute Wisdom (1985) చదివిన వెంటనే, తక్షణమే, నేను ఆయనకు అభిమానిగా మారిపోయాను. ఆ తరువాత ఆయన రచనలు మరికొన్ని చదివానుగాని, ఆ మొదటి పుస్తకంలో నేను రుచి చూసిన తీపిదనాన్ని తక్కిన రచనలు మరిపించ లేకపోయాయి.
 
ఆంథోని డి మెల్లో (1931-87) ముంబైకి చెందిన ఒక జెసూట్ సాధువు. ఆయన కాథలిక్ సంప్రదాయ పద్ధతిలోనే తన ఆధ్యాత్మిక సాధన చేసినప్పటికీ, తూర్పుదేశాలు, ముఖ్యంగా, భారతీయ, హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రభావాల్ని కూడా స్వీకరించి రెంటినీ సమన్వయం చేసుకోగలిగాడు. నిజానికి ఆయన మొదటి రచన Sadhana: A Way to God (1984) లో ఆయన తూర్పు దేశాల ప్రద్ధతిలో క్రైస్తవ సాధన చేయడమెలా అన్నదాన్నే చర్చించాడు. సత్యాన్ని తరచి చూడటానికి ఉపనిషత్తులు వాడుకున్న పరికరం ‘నేతి నేతి ‘ అన్నది ఎంత శక్తిమంతమైందో, ఆయన క్రైస్తవ పరిభాషలో వివరిస్తుంటే, వినడానికి ఎంతో ఆసక్తి కరంగా ఉంటుంది. జెన్, సూఫీ వంటి మిస్టిక్ సంప్రదాయాలతో పాటు క్రైస్తవ మిస్టిక్కుల్ని ఆయన అర్థం చేసుకున్న తీరులోనే గొప్ప సాధికారికత కనిపిస్తుంది. అదంతా ఆయన రాసిన One Minute Wisdom కథల్లో ఎంతో సరళంగా, సూటిగా మనకు వినిపిస్తుంది.
 
ఇన్నాళ్ళకు మళ్ళా మాడర్న్ స్పిరిచ్యువల్ మాస్టర్స్ సిరీస్ లో William Dych S J ఆంథొని డి మెల్లో రచనలనుంచి ఎంపికచేసిన భాగాలతో పాటు ఆయన ఆధ్యాత్మిక సాధన గురించి రాసిన సమగ్ర పరిచయవ్యాసం చదువుతుంటే, పరిశుభ్రమైన నదీజలాల్లో పొద్దున్నే స్నానం చేసినట్టు ఉంది. ఆ స్వచ్ఛత ఎలా ఉంటుందో చూపడానికి, One Minute Wisdom నుండి రెండు, మూడు కథలు, మీ కోసం.
 
~
 
1
 
ఒక్క నిమిషంలో పొందగలిగే జ్ఞానం ఉంటుందా?
 
‘తప్పకుండా ఉంటుంది ‘ అన్నాడు గురువు.
 
‘కాని ఒక్క నిమిషమంటే మరీ తక్కువ టైమ్ కదా.’
 
‘అది యాభై తొమ్మిది సెకండ్ల సుదీర్ఘ కాలవ్యవధి’ అన్నాడు గురువు.
 
2
 
తాను చెప్పాలనుకున్న సత్యాల్ని గురువు ఎప్పుడూ పిట్టకథలరూపంలో, దృష్టాంతాల రూపంలో చెప్ఫేవాడు. ఆయన శిష్యులు వాటిని ఎంతో సంతోషంగా వినేవారు. కాని అప్పుడప్పుడు వారినేదో అసంతృప్తి పట్టి పీడించేది. ఆ పిట్టకథలకన్నా మరింత లోతుగా, మరింత గంభీరంగా గురువు మాట్లాడితే బాగుణ్ణనుకునేవారు.
 
కాని గురువు అదేమీ పట్టనట్టు ఉండేవాడు. వాళ్ళేదైనా అసంతృప్తి ప్రకటించినప్పుడు ఆయన అనేవాడు కదా: మీకింకా అర్థం కావడం లేదు. మనిషి సత్యాన్ని చేరుకోడానికి అతి దగ్గరి దారి కథలు చెప్పుకోవడమే’ అనేవాడు.
 
మరో సందర్భంలో చెప్పాడు కదా: ‘కథల్ని తక్కువగా చూడకండి. మీరో బంగారు కాసు పోగొట్టుకున్నారనుకోండి. దాన్ని వెతకడానికి రూపాయి ఖరీదు లేని కొవ్వొత్తి సరిపోతుంది. అత్యంత ప్రగాఢమైన రహస్యాల్ని మామూలు కథల ద్వారానే పట్టుకోగలుగుతాం.’
 
3
 
గురువు గారి ఖ్యాతి విని ఆయన ఎటువంటివాడో తనే స్వయంగా తేల్చుకుందామని ఒకాయన ఎంతో దూరం నుంచీ వచ్చాడు.
 
‘మీ గురువుగారు ఎట్లాంటి మహత్యాలు చూపిస్తాడు?’ అనడిగాడు అతడు ఆ గురువుగారి శిష్యుడొకణ్ణి.
‘మా గురువుగారు చూపించే మహత్యాలకు లెక్కలేదు. కాని ఒక్క సంగతి. మీ ఉద్దేశంలో మనం కోరుకున్నది దేవుడు తీరిస్తే అది మహత్యం. కాని మా గురువుగారి లెక్కప్రకారం దేవుడు కోరింది మనం పాటిస్తే, అది మహత్యం.’
 
4
 
తన పట్ల మరీ గుడ్డి ఆరాధన చూపిస్తున్న శిష్యుణ్ణి గురువు ఇట్లా మందలించాడు: ‘నువ్వు చూస్తున్నది గోడ మీద పడుతున్న కాంతి. ఆ గోడకెందుకు పూజచేస్తావు? ఆ కాంతిని చూడు.’
 
5
 
అప్పుడే పెళ్ళి చేసుకున్న కొత్త దంపతులు గురువుగారిని కలిసి ‘మా ప్రేమ కలకాలం కొనసాగాలంటే మేమేం చెయ్యాలి?’ అనడిగారు.
 
‘మీరిద్దరూ కలిసి తక్కినవాటిని ప్రేమించడం మొదలుపెట్టండి’ అన్నాడు గురువు.
 
6
 
ఒకరోజు గురువు గారు ఒక బిషప్పుతో మాట్లాడుతూ ఏ మతానుయాయులైనా సహజంగానే క్రూరస్వభావం కలిగినవారని చెప్పాడు. ఆయన శిష్యులు ఆ మాటలు విన్ని ఖిన్నులైపోయారు.
 
ఆ బిషప్పు సెలవు తీసుకున్నాక, ‘మీరెందుకట్లా అన్నారు?’ అనడిగారు గురువుగారిని.
 
‘ఏముంది అందులో? ఏ మతానుయాయులైనా వాళ్ళు నమ్మిన ధర్మంకోసం మనిషిని బలిపెట్టడానికి ఎంతమాత్రం సందేహించరు కదా!’ అన్నాడు గురువు.
 
7
 
తన చుట్టూ ఉన్న మనుషుల మీద రోజూ ఏదో ఒక ఫిర్యాదు చేసే ఒక శిష్యుడితో గురువు చెప్పాడు కదా: ‘ ‘నీకు మనశ్శాంతి కావాలంటే, నీ చుట్టూ ఉన్నవాళ్ళని కాదు, ముందు నిన్ను నువ్వు మార్చుకో. లోకాన్నంతా తోలుతో కప్పే బదులు, నీ కాళ్ళకి చెప్పులు తొడుక్కోడం సులువు కదా!’
 
8
 
గురువుగారికి ఎవరికి ఎన్ని విద్యార్హతలున్నాయి, ఎన్ని డిగ్రీలు, డిప్లొమాలు ఉన్నాయన్నదాని మీద పట్టింపు ఉండేది కాదు. ఆయన మనుషుల్ని చూసేవాడు గాని, సర్టిఫికెట్లు కాదు.
 
ఆయనొకసారి శిష్యుల్తో ఇలా చెప్పగా విన్నాం: ‘ ఆ పిట్ట పాడే పాట మీరు వినగలిగితే చాలు, దాని విద్యార్హతల్తో మీకేం పని?’
 
9
 
ఒక వాణిజ్యవేత్త గురువుగారిని అడిగాడు కదా:
 
‘నాలాంటి ప్రాపంచికమానవుడికి ఆధ్యాత్మికత ఏమేరకు పనికొస్తుంది?’
 
‘మీరు మరింత పొందటానికి.’
 
‘అదెలా?’
 
‘మీరు మరింత తక్కువ కోరుకోడం ద్వారా.’
 
10
 
ఒక సందర్శకుడు గురువుగారిని కలిసినప్పుడు తనని తాను సత్యాన్వేషకుడిగా పరిచయం చేసుకున్నాడు. ‘నువ్వు సత్యాన్ని వెతుకుతున్నావంటే అన్నిటికన్నా ముందు నీకో లక్షణం ఉండాలి అన్నారు గురువుగారు అతడితో.
 
‘అవును, సత్యం తెలుసుకోవడం కోసం పట్టలేనంత తపన ఉండాలి’ అన్నాడు ఆ సందర్శకుడు.
 
‘కాదు. నువ్వు పొరపడ్డావని తెలిసిన తక్షణమే నీ పొరపాటుని ఒప్పుకోగలగాలి ‘ అన్నాడు గురువు.
 
22-5-2022

One Reply to “యాభై తొమ్మిది సెకండ్ల సుదీర్ఘ కాలవ్యవధి”

Leave a Reply

%d bloggers like this: