
ఇక్కడ బాల్కనీలో నాలుగు చదరపుటడుగుల చోటులో నాలుగు మల్లె మొక్కలు పెంచడం మొదలుపెట్టాను. ఒక విరజాజితీగ ని ఆకాశంవైపు తిప్పాను. ఆ మల్లెమొక్కలూ, ఆ విరజాజిమొగ్గలూ సూర్యుడితో మాట్లాడటం మొదలుపెట్టాయి. రోజంతా కోకిల విరామం లేకుండా కూస్తూనే ఉంది. వెళ్ళిపోతున్న వసంతం వెళ్ళిపోతున్నదని తెలుస్తున్నది కాని, వీడ్కోలు మాటలేవీ స్ఫురించడం లేదు. ఏదో జరగాలి నాలో. ఎక్కడో ఏదో తెగిపోవాలి, లేదా, ఎక్కడో ఏదో అందుకోవాలి.
జపనీయ తొలి కవితాసంకలనాల్లో ‘మన్యోషూ’ తర్వాత చెప్పదగ్గది ‘కొకిన్ వకాషూ’. మన్యోషూ అంటే పదివేల పత్రాలు. కొకింషు అంటే కొత్త కవితలూ, పాతకవితలూ అని. 10 వ శతాబ్దంలో నలుగురు కవులు దాదాపు నూరేళ్ళ కవిత్వం నుంచి ఎంచి కూర్చిన వెయ్యి కవితల సంకలనం అది. ఆ ఎంపికలో ప్రధాన పాత్ర వహించిన కి నొ త్సురయుకి దానికొక చక్కటి ముందుమాట కూడా రాసాడు. అందులో ఆయన జపాన్ జీవితంలోకి కవిత్వం ప్రవేశించిన తొలికాలాన్ని తలుచుకుంటూ, ఒక చిన్న కథ చెప్పాడు.
ఒకప్పుడు ఒక జపాన్ రాజకుమారుడు తన రాజ్యంలో ఉండే ఒక ప్రాంతానికి సందర్శనకి వెళ్ళాడు. అక్కడి స్థానిక పాలకుడు అతణ్ణి ఎంతో ఆదరంగా, మర్యాదగా చూసుకున్నాడు. కాని ఆ రాకుమారుడికి తృప్తి కలగలేదు. అక్కడున్నంతసేపూ ఏదో లోపిస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉన్నదతడికి. ఆ పాలకుడికి ఏమి చెయ్యాలో తెలియలేదు. అప్పుడు అతడి పరిచారకుల్లో ఒకామె ఒక కవిత రాసుకుని తీసుకువెళ్ళి ఆ రాజకుమారుడికి వినిపించింది. దాంతో ఆ రాకుమారుడి హృదయావేదన ఉపశమించింది.
నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఒకటి రెండు రోజులే ఉంటావా, ఒకటి రెండేళ్ళ పాటు ఉండిపోతావా అన్నదేమంత ముఖ్యం కాదు. కాని నువ్వక్కడున్న క్షణాల్లోనో, దినాల్లోనో, ఏదో ఒక కవిత నీ ఇంటి తలుపు తట్టకపోతే, అక్కడి నీ నివాసానికి అర్థమే లేదు.
ఇదిగో ఇక్కడకి వచ్చి ఆరువారాలు కావొస్తోంది. నా ఎదట చెట్టుమీద రోజూ ఎన్ని పక్షులు వచ్చి వాలుతున్నాయో. చూస్తూ ఉండగానే వసంతం సెలవు తీసుకోడానికి సామాను సర్దుకుంటున్నది. ఇంతదాకా గడిచిన జీవితాన్ని చొక్కా విప్పి హేంగర్ కి తగిలించినంత సులభం కాదు, దాని హేంగోవర్ మనసులోంచి తొలగించడం. నీ చిన్న ఇంట్లో ఎవరెవరో వాళ్ళ సామాన్లు తెచ్చిపెట్టుకున్నట్టుగా, వాటికి నువ్వు ఇన్నాళ్ళూ కాపలా కాసినట్టుగా నీ మనసు నీవి కాని వాటితో నిండిపోయింది. ఇప్పుడు ఎవరి బరువులు వాళ్ళు పట్టుకుపోయారు. అక్కడున్నది శూన్యమేగాని, ఆ శూన్యం నుంచి ఇంకా నీడలు పూర్తిగా తప్పుకోలేదు.
పొద్దున్నే లేవగానే ఇన్ని చన్నీళ్ళతో మొహం కడుక్కున్నట్టు ఇన్ని పద్యాలతో నిన్ను నువ్వు కొత్త ప్రభాతానికి సమాయత్త పరుచుకోవాలి కదా. ఈ రహస్యం వైదిక ఋషులకి తెలుసు. కాలం మనిషికి ప్రాణం పోస్తే, కవి కాలానికి ప్రాణం పోస్తాడని వారు కనిపెట్టారు.
ప్రతి నిశాంతావేళా కవి పుట్టే సమయం. సూర్యుడికన్నా ముందు కవి పుడతాడు. అతడు పుట్టి ఎలుగెత్తి పిలిచాకనే సూర్యుడు ఆకాశంలో అడుగుపెడతాడు.
వెలుగునీటను కుంకె చుక్కలు
చదల చీకటి కదలబారెను
ఎక్కడనొ ఒక చెట్టుమాటున
ఒక్క కోకిల పలుకసాగెను.
ఆ కోకిల ఏమైనా పలకవచ్చు. కోకిలని వాల్మీకి హృదయగ్రాహి అని అన్నాడని మా మాష్టారు చెప్పారు. హృదయగ్రాహి అంటే హృదయాన్ని గ్రహించేవాడు, అంటే, నీ హృదయాన్ని అర్థం చేసుకునేవాడు అని చెప్పడం సామాన్యార్థం. కాని హృదయగ్రాహి అంటే గుండెని గొంతులోకి లాక్కోడం. నీ గుండె గొంతుకలో కొట్లాడనంతవరకూ, నువ్వు కోకిలవి కానట్టే.
ఇంతకీ ఆ పరిచారిక ఆ రాకుమారుడికి వినిపించిన కవిత ఇది:
అసక పర్వతం.
కొండ మీది పలచటి ఊటలో
మెరుస్తున్న మిలమిల.
నువ్వు ప్రతిఫలిస్తున్న
నా హృదయం మరింత లోతు.
అయిదు వాక్యాల ఈ కవితలో సముద్రమంత అనుభూతి ఉంది. ‘అసక’ అనే పదానికి జపనీస్ భాషలో లోతులేనిది అని అర్థం. ఆ కొండమీది ఊట పలచనిది. అందులో ఆకాశమూ, సూర్యకాంతి మెరుస్తున్నప్పటికీ, ఒక మిలమిల ఉన్నప్పటికీ, అది పలచటి మిలమిల మాత్రమే. ఆ ఊట లోతులేనిది. ఇటు పక్క ఆమె హృదయంలో అతడి ప్రతిబింబం ప్రతిఫలిస్తున్నది. కాని ఇది కడు లోతు. అగాధం. అసక పర్వతం లాంటి కొండ, ఆ కొండమీద ఊట, ఆ ఊటలో ప్రతిఫలించే సూర్యకాంతి ఏవీ కూడా ఆమె లోతైన హృదయంలో అతడి ప్రతిబింబానికి సాటిరావు.
కవిత లేనంతకాలం ఒక లాండ్ స్కేప్ వట్టి లాండ్ స్కేప్ మాత్రమే. అక్కడ రంగులుంటాయి కాని రాగాలుండవు. కవిత ఆ ప్రకృతిమధ్యకి ఒక మూడ్ ని పట్టుకొస్తుంది. ఆ మూడ్ సుఖకరమా, దుఃఖభరమా అన్నదేమంత ముఖ్యం కాదు. అది ఒక లోతుని పట్టుకొస్తుంది. ఆ లోతు నీ అనుభవానికొక profundity ని సమకూరుస్తుంది. నువ్వు సంతోషంగా బతికావా, శోకిస్తూ బతికావా కాదు, బతికిన ప్రతి క్షణం లోతుగా బతికావా లేదా?
నీ అనుభవం లోతు ఎంతో నీ కవిత్వం చెప్తుంది.
నా హృదయం కూడా లోతైనదే. కాని ప్రతిఫలించవలసిన ఆ ప్రతిబింబం ఏదీ? ఆ పూర్వకాలపు రాకుమారుడిలాగా, నాకు కూడా ఒక కవిత దొరికితే తప్ప, ఇక్కడి నా బస నివాసంగా మారదు.
27-5-2022