
మొన్న గంగారెడ్డి మా ఇంటికి వచ్చినప్పుడు In the Blink of an Eye: A Perspective on Film Editing (2001) అనే పుస్తకం కానుకగా తెచ్చాడు. ఆ పుస్తకం రాసిన Walter Murch ఫిల్మ్ ఎడిటింగ్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాంకేతిక నిపుణుడనీ, English Patient (1996) అనే సినిమాకిగాను ఎడిటింగ్ లోనూ, సౌండ్ రికార్డింగులోనూ ఆస్కార్ అవార్డు పొందాడనీ ఆ పుస్తకం చూసాకే తెలిసింది.
సినిమా పట్ల నాకు ఉన్న ఆసక్తి ప్రధానంగా కథకుడి ఆసక్తి. మానవచరిత్రలో ఒకప్పుడు ఇతిహాసాలూ, పురాణాలూ, నాటకాలూ,ఆధునికయుగారంభంలో నవల వంటి ప్రక్రియలూ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఎంత తోడ్పడ్డాయో, సినిమా కూడా అంతగానూ తోడ్పడుతుందని నా అభిప్రాయం. దానికి కారణం సినిమా విజువల్ మీడియం కావడం లేదా ఒక కాంపొజిట్ ఆర్ట్ కావడం కన్నా కూడా, కథ చెప్పే తీరులో సినిమా సాహిత్యం కన్నా భిన్నంగానూ, అద్వితీయంగానూ ఉండటమే ఎక్కువ కారణం అనుకుంటాను. అలాగని సాహిత్యాన్ని విడిచి సినిమా కథనం మనజాలదు. చాలామంది ప్రయోగాత్మక దర్శకులు, కథని వదిలిపెట్టి తీసిన సినిమాలు ప్రజలని చేరలేకపోవడం మనకు తెలుసు. అలాగని సాహిత్యధోరణి కథనాన్నే సెల్యులాయిడ్ మీద చూపించుకుంటూ పోవడం సినిమా అనిపించుకోదని కూడా మనకు తెలుసు. కాబట్టి సినిమాను సినిమాగా మార్చే కీలక, అద్వితీయ లక్షణాలేమిటో తెలుసుకోవాలన్న కోరిక నాలో సినిమా పట్ల కొత్త కుతూహలాన్ని రేకెత్తిస్తూనే ఉంటుంది.
వాల్టర్ మర్చ్ రాసిన ఈ పుస్తకం నా ఆశని నిరాశ పర్చలేదు.
ఇందులో రెండు భాగాలున్నాయి. మొదటిది, పుస్తకంలో ప్రధాన భాగం. అది పట్టుమని డెబ్భై పేజీలు కూడా లేదు. దాన్ని ఆయన 1995 లో రాసాడు. అప్పటికి డిజిటల్ ఎడిటింగ్ ఇంకా సినిమాల్లో పూర్తిగా నిలదొక్కుకోలేదు. కాని మరొక ఆరేళ్ళకు పరిస్థితి పూర్తిగా మారింది. సినిమాల్ని డిజిటల్ గా ఎడిట్ చేయడం ప్రధాన ప్రక్రియగా మారింది. ఆ సంధి యుగంలో, డిజిటల్ ఫిల్మ్ ఎడిటింగ్ భూతభవిష్యత్తుల మీద ఆయన రాసిన మరొక సుదీర్ఘ వ్యాసం పుస్తకంలో రెండవ భాగం. అలాగని రెండూ విడి విడి అంశాలని అనుకోనక్కర్లేదు. నిజానికి మొదటి భాగం చదివితేనే రెండవభాగాన్ని మనం మరింత బాగా అర్థం చేసుకోగలుగుతాం.
పడమటి దేశాలకు చెందిన రచయితలు, ముఖ్యంగా ఏదైనా ఒక అంశంలో గొప్ప నైపుణ్యం సాధించినవాళ్ళ రచనలు చదివినప్పుడు నన్ను మూడు అంశాలు ఆకర్షిస్తుంటాయి. మొదటిది, వాళ్ళు తాము ఏ రంగంలో కృషి చేస్తూ ఉన్నారో, ఆ రంగానికి సంబంధించిన మౌలికమైన ప్రశ్నల్ని తరచి చూస్తారు. రెండవది, ఆ రంగాల్లో అంచులు పట్టుకోడానికి వారు చేసే నిరుపమానమైన కృషి. హార్డ్ వర్క్. ఇక మూడవది, మరింత ఆసక్తి కరమైంది, వాళ్ళకి తమ రంగంలోనే కాక, సాహిత్యమో, సంగీతమో, చిత్రలేఖనమో, క్రీడారంగమో, మరికొన్ని రంగాల్లో కూడా, వట్టి ప్రవేశం కాదు, వైదుష్యం.
ఈ రచయిత కూడా ఈ మూడు అంశాల్లోనూ నన్ను నిరాశపర్చలేదు.
మొదటిది, అతడు అసలు ఎడిటింగ్ అంటే ఏమిటనే మౌలిక ప్రశ్నతో పాటు, అసలు ఎడిటింగ్ మానవసహజ కథనపద్ధతేనా అని ప్రశ్నించుకోడంతో తన రచన మొదలుపెట్టాడు. ‘కట్’ చెయ్యడం, అంటే అమెరికన్ పరిభాషలో, రెండు ఫిల్మ్ దృశ్యాల్ని ఒకదానితో ఒకటి జతపరచడం అసహజం కాదా అనే ప్రశ్న ముందు తనతలకెత్తుకుని, తానొక పక్క ఎడిటింగ్ చేస్తున్నప్పటికీ, ఆ ప్రశ్న తననెట్లా వేధించిందో చెప్పుకొస్తాడు. పుస్తకం తడిమి చూసిన ప్రధానమైన ప్రశ్నల్లో అదొకటి. చివరికి అతడు చెప్పేదేమంటే, ఎడిటింగ్ మూలాలు, మనం కనురెప్పలు ఆర్పే క్షణంలో ఉన్నాయంటాడు. మనిషి ఏదో ఒక ఆలోచనలో ఉన్నప్పుడో, లేదా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు తన ఆలోచనలు ఒక విషయం మీంచి మరొక విషయానికి మళ్ళినప్పుడో, లేదా ఒక ఆలోచన తెగిపోయినప్పుడో రెప్పలార్పుతాడనీ, అలా రెప్పలార్పి మళ్ళా కళ్ళు తెరిచే మరు క్షణం మొదటి దృశ్యాన్ని ‘కట్’ చేసి రెండవ దృశ్యాన్ని తన మనసులో ఆవిష్కరించుకుంటాడనీ, నిపుణుడైన సినిమా ఎడిటర్ ఆ క్షణాల్నే పట్టుకుంటాడనీ చెప్తాడు.
ఒక మనిషి ఆలోచనలు తెగినప్పుడు మాత్రమే కాదు, ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు, వక్త తాను చెప్పే అంశానికి ఒక ఉపోద్ఘాత క్షణాన్నీ, ఒక ఉపసంహార క్షణాన్నీ కూడా జోడిస్తాడనీ, వక్త తాను చెప్పే ముఖ్యాంశాన్ని చెప్పేసాడని శ్రోత వక్త తాలూకు కనురెప్పల ఆధారంగా గుర్తుపడతాడనీ, అప్పుడు ఒక శ్రోతగా తాను కూడా కనురెప్పలు క్షణం పాటు మూసి తెరుస్తాడనీ కూడా చెప్తాడు. తాను ఫిల్మ్ ఎడిటింగ్ చేసేటప్పుడు, వక్త, శ్రోతల కనురెప్పల కదలికల్ని బట్టి, ఎక్కడ దృశ్యాన్ని కట్ చేసి రెండవ దృశ్యానికి అతకాలో తనకి స్ఫురిస్తూ ఉంటుందని, ఇప్పటిదాకా, తన స్ఫురణలు ఎప్పుడూ తనని మోసం చెయ్యలేదనీ కూడా అంటాడు. ఇక తక్కిన పుస్తకంలో ఎడిటింగ్ గురించి అతడు వివరించిన సాంకేతిక పరిజ్ఞానమంతా, ఈ కనురెప్పపాటు చుట్టూతానే నడుస్తుంది.
రెండవ అంశం, అతడు తన రంగంలో చేపట్టిన కృషి. ఈ అంశంలో మనం, అంటే, మనలాంటి రచయితలం, విషయనిపుణులం, కార్యకర్తలం నేర్చుకోవలసింది చాలా ఉంది. ఉదాహరణకి కొప్పోలా తీసిన Apocalypse Now (1979) అనే రెండు గంటల ఇరవై అయిదు నిమిషాల సినిమాని థియేటర్ లోనో, టివి లోనో చూసిన ప్రేక్షకుడు దర్శకుడి ప్రతిభకు ఆశ్చర్యపోతాడు. కాని యథార్థానికి, ఆ దర్శకుడు తీసిన మొత్తం ఫిల్మ్ ఫుటేజి పన్నెండున్నర లక్షల పొడవు అనీ, ఆ మొత్తం ఫుటేజిని మనం పూర్తిగా చూడాలనుకుంటే 230 గంటల పడుతుందనీ, దాన్ని రెండు గంటల ముప్పై నిమిషాలకు కుదించిన ప్రతిభ ఎడిటర్ ది అనీ మనకి ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. అంటే దర్శకుడు చిత్రించిన దృశ్యాల్ని ఎడిటర్ 95:1 నిష్పత్తిలో కట్ చేసాడన్నమాట!
ఇది నిజంగా కనువిప్పు కలిగించే అంశం. మనం రాసింది రాసినట్టుగా, మరోసారి కూడా చదువుకోకుండా, నేరుగా పత్రికలకు పంపుతున్నప్పుడో, ఆన్ లైన్లో ఎక్కిస్తున్నప్పుడో, మనం విస్మరిస్తున్న అంశం ఇదే. మనది కఠోర శ్రమ కాదు. మహారచయితల రచనలు నాలుగు కాలాలపాటు నిలబడటం వెనక ప్రధానంగా ఉన్నది ఈ కఠోర శ్రమనే. టాల్ స్టాయి తన చివరి నవల హాజీ మురాద్ రాసినప్పుడు, చివరి ప్రతికి ముందు పది వెర్షన్లు రాసాడనీ, కథ ఎత్తుగడకే 23 రకాల వెర్షన్లు రాసుకున్నాడనీ, కథలో జార్ చక్రవర్తి ఒకటవ నికొలస్ ఉన్న అధ్యాయాన్ని 25 సార్లు తిరిగి రాసాడనీ, మొత్తం 2515 పేజీలు రాసి, దాన్ని 250 పేజీల చేతిరాతకి కుదించాడనీ విన్నప్పుడు నాకు అనిపించింది ఇదే.
ఇక మూడవ అంశం నన్ను చాలా బాగా ఆకట్టుకున్న అంశం, రచయిత, సినిమా కళ గురించి, ఎడిటింగ్ గురించి వివరించేటప్పుడు, సాహిత్యం నుంచీ, చిత్రలేఖనం నుంచీ తెచ్చుకున్న ఉదాహరణలు. వాటన్నిటిద్వారా అతడు చెప్పాలనుకున్నది, ఏ కళ అయినా సమష్టికృషి అయినప్పుడు ఎక్కువ కాలం నిలబడుతుందని. ఇందుకు ఆయన రినైజాన్సు చిత్రకారుల్ని ముఖ్యంగా మైకెలాంజిలోని ఉదాహరణగా చెప్తాడు.
మైకెలాంజిలో తైలవర్ణ చిత్రకారుడు కాడు. కుడ్యచిత్రకారుడు. చిత్రకళ మొదటిరోజుల్లో కుడ్యచిత్రకళగా ఉండేది. అంటే గోడకి సున్నం వేసి, ఆ తడి సున్నం ఆరేలోపల చిత్రలేఖనం గీసుకుని రంగులు పుయ్యవలసి ఉంటుంది. ఆ రంగులు సున్నంతో కలిసి రంగులు మారుతుండేవి. కాబట్టి చిత్రకారుడు ఆ సున్నం ఎంతసేపట్లో ఆరుతుందో అంచనావేసుకుని, ఏ రంగులు వేస్తే, అవి సున్నంతో కలిసి మరే రంగుల్లోకి మారతాయో పసిగట్టి వర్ణలేపనం చెయ్యవలసి వచ్చేది. అది ఒక్క మనిషికి సాధ్యమయ్యే పనికాదు. అందుకు పెద్ద బృందం కావలసి వచ్చేది. చిత్రకారుడు అటువంటి కళాబృందానికి నాయకుడిగా బొమ్మలు వేసినంతకాలం అతడు తాను ఆరోగ్యంగా ఉంటూ, తన కళని కూడా ఆరోగ్యంగా ఉంచుకోగలిగాడనీ, అదే చిత్రకళ వాన్ గో దగ్గరికి వచ్చేటప్పటికి, ఏకాంత చిత్రకారుడు తలెత్తి, అది ఆ చిత్రకారుడి శారీరిక, మానసిక, భావోద్వేగాల్ని భంగపరిచిందనీ అంటాడు.
ఏ కళా సృజన అయినా సమష్టి కృషిగా ఉన్నప్పుడు తోటి బృంద సభ్యులనుంచి వచ్చే ఫీడ్ బాక్ చేయగల మేలు అంతా ఇంతా కాదు. ఇప్పటి సినిమా కథకులు ( తెలుగు సినిమా కథకులు కాదు) సినిమా కథనాన్ని శక్తిమంతంగా చెప్పడం వెనక ఉన్న ప్రధాన బలం ఇదే. ఈ మధ్య ఒక యువకథకుల కథాసంకలనం ఆవిష్కరణ సభలో నన్ను మాట్లాడమన్నపుడు ఇదే చెప్పాను. తోటి రచయితలనుంచీ, కళాకారులనుంచీ ఫీడ్ బాక్ తీసుకోవడం మన సృజనని కుంటుబరుస్తుందని చెప్తారుగానీ, అది నిజంకాదు, ప్రతి రచయితకీ, కళాకారుడికీ, సహరచయితల, కళాకారుల బృందం తోడు ఉండటం ఆ రచనకీ, ఆ కళకీ ఇవ్వగల మద్దతు సామాన్యమైంది కాదని చెప్పాను.
డిజిటల్ ఎడిటింగ్ లోని సాంకేతిక సామర్థ్యాన్ని, అవకాశాల్ని ఎంతో సవివరంగా మనముందుంచిన రచయిత, కేవలం సాంకేతిక సామర్థ్యమే ఉత్తమ కళాకృతుల్ని తీసుకురాగలదన్న హామీ లేదని కూడా చెప్తాడు. ఉదాహరణకి సుప్రసిద్ధ ఫ్రెంచి రచయిత బాల్జా (1799-1850) క్విల్ పెన్ను తో ఇరవై ఏళ్ళ కాలవ్యవధిలో ఎనభై నవలలు రాయగలిగాడనీ, ఇప్పుడు మనం పదివేళ్ళతోటీ కంప్యూటర్ మీద టైపు చెయ్యగలిగి కూడా అంత ప్రొలిఫిక్ గా ఎందుకు రాయలేకపోతున్నామో ఆలోచించమంటాడు. రచయితకి లేదా కళాకారుడికి అన్నిటికన్నా ముందు ఉండవలసింది creative urge అనీ, అది లేకుండా కేవలం సాంకేతిక సాధనాలతో కళని సృష్టించలేమని నిస్సంకోచంగా చెప్తాడు.
గంగారెడ్డీ, చాల విలువైన పుస్తకం ఇచ్చావు నువ్వు. ఇప్పుడు ఒక ఎడిటర్ లాగా కథలు రాయడమెట్లానో ప్రాక్టీసు చెయ్యాలని ఉంది నాకు.
20-5-2022