
తెల్లవారుజామున ఒక కల. ఎవరికో ఒక కవిత చదివి వివరిస్తున్నాను. ఆ కవి పరిచయం గురించి చూడబోతే, ఒక వాక్యం కనిపించింది. ‘నన్ను కవి అనడం చిన్నమాట, నేను మనిషికీ, భగవంతుడికీ మధ్య ఒక సంకేత భాష నిర్మిస్తున్నవాణ్ణి ‘ అన్న వాక్యం కనిపించింది. అది కూడా ఇంగ్లిషులో. Architect of a sign language అని!
Sign అనే ఇంగ్లిషు పదానికి సంకేతం అని మాత్రమే కాక, బైబిలు భాషలో చెప్పాలంటే సూచక కృత్యం అనే అర్థం కూడా ఉంది. అంటే ఒక నిదర్శనం. భగవంతుడి ఉనికిని నువ్వు గ్రహిస్తున్నావనడానికి ఒక నిదర్శనం. ఒక దృష్టాంతం. ఒక గుర్తు. నాకు మెలకువ వచ్చేసింది. ఆ వాక్యమే నా మనసులో మెదులుతూ ఉంది. కొంతసేపటికి, నెమ్మదిగా సంతోషం ఆవరించింది. అంతరంగం ఏదో ఒక మేరకు శుద్ధపడితే తప్ప అటువంటి కలలు రావని కూడా గుర్తొచ్చింది.
ఎందుకు నా అంతరంగం తేటపడి ఉంటుంది? నిన్న రాత్రి బౌద్ధ వాజ్మయానికి చెందిన ‘ఉదాన పాలి’ చదువుతూ పడుకుని పోయాను. బహుశా, బుద్ధ వాక్యాలు రాత్రంతా నా మనోకల్మషాన్ని శుభ్రపరుస్తున్నట్లున్నాయి.
‘ ఉదాన’ అంటే పంచప్రాణాల్లో ఒకటి. మనం శ్వాసించేటప్పుడు గాలి గట్టిగా లోపలకి పీల్చుకోవడం కూడా ఉదానమే. కాని బౌద్ధ పరిభాషలో అదొక ఆశ్చర్యార్థకం. ఒక భావోద్వేగ పూరిత వాక్యం. పట్టరాని సంతోషంలోనో, దుఃఖంలోనో పలకకుండా ఉండలేని ఒక పద్యం. ఆ రచనని ఇంగ్లిషులోకి అనువదించినవాళ్ళు inspired utterance అన్నారు.
ఉదాన పాలి బుద్ధుణ్ణి ఒక కవిగా పరిచయం చేసే పుస్తకం కూడా. అందులో మొత్తం ఎనిమిది వర్గాలకు చెందిన ఎనభై సుత్తాలు ఉన్నాయి. ప్రతి సుత్తానికీ చివర ఒక పద్యం, కొన్నిసార్లు గద్యోక్తి కూడా ఉంటుంది. పద్యాలు గాయత్రి, బృహతి, త్రిష్టుప్, అనుష్టుప్ లాంటి ఛందస్సుల్లో ఉన్నాయి. ప్రతి పద్యానికీ ముందు ఆ పద్యం ఏ సందర్భంలో బుద్ధుడు చెప్పాడో ఆ సన్నివేశాన్ని వివరించే పరిచయవాక్యాలుంటాయి. ఆ పరిచయాల్లో బుద్ధుడి వ్యక్తిత్వం, ఆనాటి సమకాలిక రాజకీయ, సాంఘిక పరిస్థితులు కూడా మనకి పరోక్షంగా తెలుస్తూనే ఉంటాయి.
బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత, తాను అనుభవంలోకి తెచ్చుకున్న సత్యాన్ని నలుగురితో పంచుకోవడం కోసం శ్రావస్తిలో, రాజగృహంలో, కుండికలో, కోశాంబిలో, ఉరువేలలో విహరిస్తూ ఉన్నప్పుడు తన శిష్యులతో మాట్లాడిన మాటలు, వారితో తన భావోద్వేగాల్ని పంచుకోవడానికి చెప్పిన పద్యాలు అవి. ఆయన్ను అటువంటి భావోద్వేగానికి లోను చేసిన సన్నివేశాలు కొన్నిసార్లు చాలా సాధారణమైనవి, కొన్నిసార్లు చాలా ప్రత్యేకమైనవి, కొన్నిసార్లు ఆయనతో మాట్లాడించడం కోసమే ఆయన శిష్యులు ఏర్పాటుచేసుకున్నవి. అయితే చాలా సార్లు ఆ పద్యాలు ఆ సంఘటనలు చెప్తున్నవాటికన్నా లోతైన భావాన్నేదో మనకి వినిపించడానికి ప్రయత్నిస్తున్నటుగా మనకి అర్థమవుతుంది. నిజానికి అవి చదువుకుంటూ పోయేవి కావు, లోతుగా, పదే పదే మననం చేయదగ్గవి.
బుద్ధుడు చెప్పినట్టుగా తరువాతి రోజుల్లో సంకలనకర్తలు గుర్తు చేసుకున్న ఆ ఎనభై సూత్రాల్లో, కొన్ని మనకు ఉపనిషత్తుల్లో కూడా కనిపిస్తాయి. కొన్ని జైన గ్రంథాల్లో కూడా కనిపిస్తాయని పండితులు చెప్పారు. చాలావరకూ దమ్మపదంలోనూ, తక్కిన బౌద్ధ గ్రంథాల్లోనూ కూడా కనిపిస్తాయని బౌద్ధ పండితులు గుర్తుపట్టారు. కొన్ని దేశ, కాల పరిమితుల్ని దాటి అత్యున్నత రూపకాలంకారాలుగా ప్రపంచమంతా వ్యాపించినవి. ఉదాహరణకి, నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగుని తడిమి చూసి, ఏనుగు ఒక స్తంభంలాగా ఉంటుందనీ, ఒక చేటలాగా ఉంటుందనీ, ఏనుగు రోలులాగా ఉంటుందనీ, ఏనుగు రోకలిలాగా ఉంటుందనీ చెప్పిన కథ ఈ ఉదానపాలిలోనిదే (6:4). (భారతీయ తత్త్వశాస్త్రం పైన ఒక పుస్తకం రాయాలని నేను చాలా కాలంగా అనుకుంటూ ఉన్నాను. ఆ పుస్తకమంటూ రాస్తే దానిమీద ముఖచిత్రంగా ఈ బొమ్మ గియ్యాలని అనిపిస్తూంటుంది నాకు.)
కొన్ని ఉదాన గాథలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఉదాహరణకి, ఒకరోజు భిక్షువులంతా భిక్ష గ్రహించి, ఆరగించి, తోటలో కూచున్నప్పుడు వారి మధ్య ఏ విద్య గొప్పది అనే చర్చ వచ్చిందట (3:9). కొందరు హస్తివిద్య గొప్పది అనీ, కొందరు కత్తివిద్య గొప్పది అనీ, కొందరు లోకవిద్య గొప్పది అనీ, కొందరు లోకాయతన విద్య గొప్పది అనీ, మరికొందరు పాలనావిద్య గొప్పది అనీ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో బుద్ధుడు వచ్చి వారు దేనిగురించి మాట్లాడుకుంటున్నారని అడిగాడు. వాళ్ళు తాము చర్చించుకుంటున్నది చెప్పారు. బుద్ధుడు వారి మాటలు విని, ‘మీరిక్కడికి వచ్చింది ఇటువంటి నిరర్థక చర్చలకోసమా, మీరు చెయ్యవలసింది ధర్మాన్ని పాటించడమెలా అన్నదాని గురించి మాట్లాడుకోవడం, లేకపోతే మౌనంగా ఉండటం’ అని చెప్పాడట.
మరొక సారి, ఒక శిష్యుడొకడు మాటిమాటికి అడవిలోనో, చెట్టుమొదటనో లేదా శూన్యగృహంలోనో నిల్చుని ‘అహో సుఖం అహో సుఖం’ అని పాటపాడుకునేవాడట. కొంతమంది శిష్యులు అతడి ప్రవర్తనను కనిపెట్టి, పోయి బుద్ధుడికి ఫిర్యాదు చేసారట. ఇతగాడు సన్న్యాసాన్ని, బ్రహ్మచర్యాన్ని స్వీకరించినా సంతోషపడుతున్నట్టులేదు, ఎంతసేపూ తన గతసుఖాల్నే తలుచుకుంటూ ఒక్కడూ ఉన్నప్పుడు అహో సుఖం, అహో సుఖం అంటున్నాడు అని. బుద్ధుడు అతడికి కబురు చేసి విషయమేమిటి అని అడిగాడట. అప్పుడు ఆ శిష్యుడిట్లా చెప్పాడట:
‘భన్తే, నేనింతకుముందు, ఇంటిలో ఉండి రాజ్యం చేస్తూ ఉన్నప్పుడు అంతఃపురం లోపలా, బయటా తగినంత రక్షణ ఉండేది, నగరంలోపల కూడా కావలసినంత రక్షణ ఉండేది. నగరంలోనూ, జనపదంలోనూ రక్షణ ఉండేది. జనపదానికి బయట కూడా రక్షణ ఉండేది. నేను భన్తే, అలా రక్షణలో ఉన్నా, దాచబడినా, భీతుడను, ఉద్విగ్నుడను, శంకితుడను అయి విహరించేవాడను. కాని ఇప్పుడు భన్తే, అరణ్యంలో ఉన్నా, వృక్షమూలంలో ఉన్నా, శూన్యాగారంలో ఉన్నా, ఏ భయం లేకుండా, శంకలేకుండా, ఉత్సుకత లేకుండా, లోపాలను వదిలి, అరణ్యంలో లేడిలా స్వేచ్ఛగా విహరిస్తున్నాను. ఇందువల్లనే భన్తే, నేను అరణ్యంలో ఉన్నా, వృక్షమూలంలో ఉన్నా, శూన్యాగారంలో ఉన్నా ఎల్లప్పుడూ ‘అహో సుఖం, అహో సుఖం’ అంటూ ఉదానాన్ని పాడుతున్నాను.’
బహుశా ఈ మాటలు నిన్నటిదాకా రాజోద్యోగిగా ఉండి నేడు విముక్తుణ్ణయిన నాలాంటివాడికి ఎంత సత్యంగా గోచరిస్తాయో వేరే చెప్పనక్కర్లేదు కదా.
మరొక సూక్తం (6:8) చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒకప్పుడు రాజగృహంలో రెండు వర్తకవర్గాలు ఒక గణిక కోసం రక్తాలు కారేటట్టు కొట్టుకున్నారట. ఆ సంగతి విన్నప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడట:
‘ మార్గంలో ఉన్నవారికి, నేర్చుకునేవారికీ పొందినవీ, పొందవలసినవీ రెండూ దుమ్ముగలవే. ఒకరు శీలవ్రతం, బ్రహ్మచర్యం, ఇవే సారం అనుకుంటారు. ఇది ఒక చివర. మరికొందరు కామాలలో దోషం లేదు అంటారు. ఇంకొక చివర. ఈ రెండూ స్మశానాల్ని పెంచేవే. స్మశాన దృష్టిని పెంపొందించేవే. ఈ రెండు అంతాల గురించి తెలియనివారిలో కొందరు వెనుకబడిపోతారు. కొందరు అతిగా పరుగెత్తుతారు. వాటి గురించి తెలిసినవారు అక్కడ ఉండరు. వాటిని గౌరవించరు. వాటి గురించి తెలిసినవారికి సంసార చక్రం లేదు.’
ఒకసారి భగవానుడు శ్రావస్తిలో అనాథపిండకుడి జేతవనంలో చీకటిరాత్రి ఆరుబయట నూనెదీపపు వెలుగులో కూర్చున్నప్పుడు అనేక మిడతలు, దీపం పురుగులు ఆ నూనెదీపాల పైకి చుట్టూ ఎగురుతూ దురదృష్టం పాలయ్యాయట. బుద్ధుడు ఆ దృశ్యాన్ని చూసి, ఈ పద్యం చెప్పాడట (6:9):
చూసినవాటిని విన్నవాటిని పట్టుకున్నవారు
ఎంత పరుగెత్తినా సారం పొందలేరు.
కొత్త కొత్త బంధనాలు పొందుతారు
దీపం మంటలో పడే మిడతల్లా దుఃఖం పొందుతారు.
మరొక ఆశ్చర్యకరమైన సన్నివేశం యసోజ సూత్రం (3:3) లో కనిపిస్తుంది. ఒకరోజు బుద్ధుడు వగ్గుముదా నదీతీరంలో ఉండి ప్రార్థనలు చేసుకుంటున్న అయిదువందల మంది భిక్షువుల్ని తన దగ్గరకు ఆహ్వానించేడు. వారికి ఆ రాత్రి బుద్ధుడు గొప్ప బోధ ఏదో వినిపించబోతున్నాడని అనుకున్నారందరూ. ఆ రాత్రి బుద్ధుడు నిర్మల సమాధిలో కూచున్నాడు. ఆ భిక్షుసంఘం కూడా ఆయనతో పాటే అక్కడ కూచున్నారు. ఆ రాత్రి మొదటి జాము గడిచిన తరువాత ఆనందుడు బుద్ధుడితో ‘భన్తే, రాత్రి మొదటి జాము గడిచింది, ఆగంతుక భిక్షువులు చాలాసేపటినుండి కూర్చున్నారు. భన్తే, ఆగంతుక భిక్షువుల్ని పలకరించండి’ అన్నాడు. కాని బుద్ధుడు మౌనంగా ఉన్నాడు. అలా ఆనందుడు రెండవ, మూడవ, నాలుగవ జాము గడిచిపోయినప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉన్నాడు. చివరికి, తూరుపు ఎర్రబడ్డాక, భగవానుడు ఆ సమాధి నుండి లేచి, ఆయుష్మంతుడు ఆనందుణ్ణి పలకరిస్తూ ‘అలా అయితే ఆనందా, నేనూ ఈ అయిదువందల మంది భిక్షువులూ నిర్మలసమాధిలో కూర్చున్నట్లుగా నీకు అర్థం కాలేదా’ అన్నాడు.
2500 ఏళ్ళ కిందటి ఆ రాత్రీ, ఆ నిర్మల సమాధీ నాక్కూడా కొద్దికొద్దిగా అనుభవంలోకి వస్తున్నట్లు ఉన్నాయి.
18-5-2022