ఆయన వెంట నడుస్తూనే ఉన్నాను

ఈ రోజు చలంగారి పుట్టినరోజు. ఆయన గురించి తలుచుకోడానికి విస్తృతమైన ఆయన సాహిత్యం ఉంది. ఆ పుస్తకాల్లో ఏ పుట తెరిచిచూసినా మనల్ని నిలననివ్వనంత గాఢభావోద్వేగంతో ఆయన అనుభవాలూ, భావాలూ మనల్ని చలింపచేయడానికి సిద్ధంగా ఉంటాయి.
 
చలంగారిని తలుచుకుంటూ ఈ పొద్దున్నే ఆయన పుస్తకాలు తెరిస్తే, నేను కూడా ఒక జీవితకాలం పాటు ఆయన వెంట నడుస్తూనే ఉన్నానని అర్థమయింది. ఒకప్పుడు యవ్వనంలోకి అడుగుపెడుతున్న రోజుల్లో, ఈ ప్రపంచం ఇలా ఎందుకు ఉందో అర్థం కాక, ఆ అగమ్య మనఃస్థితి కోపంగానో, ద్వేషంగానో, లేదా ఇప్పటి భాషలో చెప్పాలంటే ట్రోలింగ్ గానో మారనున్న కాలంలో చదివాను ‘శశాంక ‘ నాటకం. పదిహేడేళ్ళ వయసులో.
 
ఆ నాటకం, ఆ కథ, ఆయన శైలి అలా ఉంచి, ఈ సంభాషణ నా యవ్వనకాలపు అజ్ఞానం మీద ఒక ఉరుములాగా విరుచుకుపడింది. ఆ సంభాషణలో బృహస్పతి మాట్లాడిన ప్రతి ఒక్కమాటా నా రక్తంలోకి చొచ్చుకుపోయింది. నలభయ్యేళ్ళకు పైగా గడిచిపోయిన తర్వాత, మళ్ళా ఇన్నాళ్ళకు ఆ నాటకం తెరిచి, ఈ పొద్దున్నే ఆ సంభాషణ మరోసారి చదువుతుంటే, ఏ ఒక్క వాక్యం కూడా నేను మర్చిపోలేదనీ, ఆ వాక్యాలే ఇన్నేళ్ళుగా నా తత్త్వ శాస్త్రంగా నన్ను నడిపిస్తూ ఉన్నాయనీ అర్థమయింది.
 
ఆ సంభాషణ చూడండి. తార తప్పుచేసిందనీ, కాబట్టి ఆమెని ఉపేక్షించకూడదనీ తక్కిన ఋషులూ, మునులూ దేవేంద్రుడూ చెప్తూన్నప్పుడు బృహస్పతి చెప్తున్న మాటలు:
 
గౌతముడు: ఇంక నీతీ, దుర్నీతి విచక్షణ లేదూ?
 
బృహస్పతి: ఇతరుల జీవితంలో నీతి, దుర్నీతుల్ని నిర్నయించే న్యాయాధికార పీఠానికి నిన్ను అభిషిక్తుణ్ణి చేసిందెవరు? ఆ విచక్షణ నీ జీవితాన్ని దిద్దుకునేందుకు వుపయోగపడాలి. లోకాన్ని దిద్దేందుకు కాదు.
…..
గౌతముడు: ఆత్మాభివృద్ధికోసం, ధర్మబోధనకై-
 
బృహస్పతి: (చాలా emotion తో) గౌతమా, అజ్ఞానంతో, దుర్బలత్వంతో, మూర్ఖంతో సమస్త రోగ యీతిబాధలూ లోనై కర్మవశాన జరామరణాదులనించి విముక్తిగానక, అంధకారంలో మూల్గే ఈ ప్రాణికోటికంతా ధర్మబోధన చేస్తావా? గౌతమా, వారి ఆత్మాభివృద్ధి చెయ్యాలనే సంకల్పం వాస్తవంగా నీకుందా? వుంటే ప్రేమించు. సమస్తజీవుల్నీ ప్రేమించి, నీ కన్న, నీ తపస్సుకన్న, నీ భార్యకన్న, నీ యీశ్వరుడి కన్న, అధికంగా దుర్గతిలో పెనుగులాడే యీ లోకాన్నంతా ప్రేమించు. కల్మషమంతటితోనూ, యీ ప్రపంచాన్ని నీ హృదయానికద్దుకో. పాపంలో మునిగినకొద్దీ, అంధకారంలో జారినకొద్దీ, నీ చేతుల్ని యింకా కిందికి చాచి, హృదయానికింకా దగ్గరగా హత్తుకో, ఖండించకు, శిక్షించకు-
 
గౌతముడు: వారి కర్మానుసరణంగా జీవులు అనుభవిస్తారు. మనమేం చెయ్యగలం?
బృహస్పతి: నిజం, యేమీ చెయ్యలేము. ఈశ్వరుడికే లేదు ఆ శక్తి. నిస్సహాయులము. ప్రేమిచగలము. అంతే!
 
గౌతముడు: ప్రేమించి-ఏమిటి లాభం?
 
బృహస్పతి: వారి పారిశుద్ధ్యం కోసం కాదు- నీ ఆత్మపారిశుద్ధ్యం కోసమోయీ!
 
 
1937 లో రాసాడు ఆయన ఈ నాటకం. విజయవాడ వదిలిపెట్టి పూర్తిగా అరుణాచలం వెళ్ళిపోడానికి కనీసం ఇరవయ్యేళ్ళ ముందు. ఈ సంభాషణలోని గౌతముడూ, బృహస్పతీ ఇద్దరూ చలంగారే. ఈ లోకాన్ని సంస్కరించాలనే ఒక ఉద్యమకారుడు, సంఘమాలిన్యాన్ని ఎత్తి చూపడం, విమర్శించడం, ఆగ్రహించడం కాదు, వీలైతే కల్మషమంతటితోనూ, ఈ ప్రపంచాన్ని హృదయానికి హత్తుకోమనే నిష్కారణ ప్రేమికుడూ ఇద్దరూ చలంగారే. ఈ ద్వైదీభావం, ఈ రెండు ప్రవృత్తులమధ్యా ఒక సంఘర్షణ ఆయనలో చివరిదాకా కనిపిస్తుంది. కాని రానురాను ఆ విమర్శకుడు బలహీనపడిపోతూ, ఆ ప్రేమికుడు బలపడుతూ రావడం మనకి కనిపిస్తుంది. విమర్శ సరే, దాన్ని వదిలిపెట్టగలిగాడు,
కాని బాధ్యత? ఈ లోకం మంచి చెడులు నేను పట్టించుకోకపోతే మరెవరు పట్టించుకుంటారనే ఒక ఆవేదన, బాధ్యత రూపంలో ఆయన్ని వదల్లేదు. కాని ఆ బాధ్యత కూడా సూక్ష్మస్థాయిలో తన అహంకారం కల్పిస్తున్న భ్రమనే అని గుర్తుపట్టాకనే ఆయన ‘మార్తా’ నవల రాసాడు.
 
 
ఓరీ మూర్ఖా, నిన్ను నువ్వు
నీ భుజాల పైన మొయ్యాలనుకుంటున్నావా?
 
ఓరీ భిక్షుకా, నీ వాకిట్లో నువ్వే బిచ్చమెత్తుతావా?
 
భారాలన్నీ మోయ సమర్థుడైన ప్రభువు హస్తాల్లో
సమస్తమూ వొదులు
పశ్చాత్తాపంతో వెనక్కి చూడకు.
 
తన శ్వాసతో తాకిన దివ్వెనుంచి
వెలుగుని ఆర్పేస్తుంది నీ కాంక్ష.
 
అపవిత్రమైన దాని హస్తాలతో
ఏ కాన్కనీ అంగీకరించకు.
 
నిర్మలమైన ప్రేమ నీకు ఏది ఉపాదానమిస్తే
దానినే స్వీకరించు.
 
 
గీతాంజలి లోని ఈ కవితని టాగోర్ రాయకపోయి ఉంటే, 1950ల్లో చలంగారే రాసి ఉండేవాడు.
ఈ రోజు అధికసంఖ్యాకులైన హిందువులు ఈ దేశంలో అల్పసంఖ్యాకులు ఏమి తినాలో, ఏది ధరించాలో, ఏమి మాట్లాడాలో చెప్తూండటానికీ , గత నలభయి, యాభై ఏళ్ళుగా అన్ని రకాల ప్రగతిశీల వాదులూ, అభ్యుదయ వాదులూ ప్రజలు ఏమి ఆలోచించాలో, ఏది రాయాలో, దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మకూడదో శాసిస్తున్నట్టుగా చెప్తూండటానికీ మధ్య తేడా ఏముంది? ఇప్పటికీ ఈ జాడ్యం మన సాహిత్యంలోనూ, మన ప్రగతిశీల ప్రసంగాల్లోనూ కొట్టొచ్చి కనబడటం లేదా? చుట్టూ ఉన్న సమాజం అజ్ఞానంలో కూరుకుపోయి ఉందనీ, దాన్ని ఎలాగేనా ఉద్ధరించే బాధ్యత తమ మీదనే ఉందనుకునే ఈ brown man’s burden ని ఈ సమాజమింకా ఎంత కాలం మొయ్యాలి? మతమౌఢ్యం మధ్యయుగాల జాడ్యమైతే సిద్ధాంత మౌఢ్యం ఆధునిక యుగజాడ్యం.
 
ప్రేమించడానికీ, ద్వేషించడానికీ మధ్య తేడా మనం, అంటే, అక్షరాస్యులం ఇంకా తెలుసుకోలేకపోతున్నాం. మనకన్నా భిన్నమైన ఆలోచనా సరళి ఉన్నవాణ్ణి ఎంత ద్వేషిస్తే, మనం ప్రేమిస్తున్నామనుకునేవాళ్ళకు అంతదగ్గరగా జరుగుతున్నాం అనుకుంటున్నాం. నిజానికి ముందు మనం నేర్వవలసింది, భిన్నాభిప్రాయాలుంటాయని ఒప్పుకోవడం. భిన్నాభిప్రాయాలుంటాయని ఒప్పుకోవడం భిన్నాభిప్రాయాల్ని ఒప్పుకోవడం కాదు. ముందు నువ్వు నమ్మేదానికన్నా భిన్నంగా మరొకడు నమ్ముతున్నాడనీ, అలా నమ్మే హక్కు అతడికుందని నువ్వు అంగీకరించగలిగితే, ఆ తర్వాత చరిత్ర గతి ఎలా నడవాలో, మీ ఇద్దరి అభిప్రాయాలూ తేల్చుకుంటాయి.
 
దురదృష్టవశాత్తూ మనం సాధన చేస్తున్నది రాజీపడకుండా మన అభిప్రాయాల్ని నిలబెట్టుకోవడమెలా అన్నది. కాని నిజంగా కావలసింది, రాజీ పడినా సరే, ప్రేమించడమెట్లా అన్నది. చలంగారు జీవితకాలం చేసింది అదే. అందుకనే, ఈ కవిత ( ఉత్తరణ: 59) కూడా టాగోర్ రాయకపోయి ఉంటే, ఆయనే రాసి ఉండేవాడు:
 
 
నీకు చోటు చెయ్యడానికి, ఎవరినీ పక్కకి
వొత్తిగించనక్కర్లేదు. ప్రేమ నీ కోసం ఆసనాన్ని
సిద్ధం చేసిందంటే, అందరికీ చోటు చేసిందన్నమాట.
 
ప్రపంచ ప్రభువులు వొచ్చినప్పుడు భటులు,
గుంపుని తోసేస్తారు, నా ప్రభో! నువ్వు వొచ్చినప్పుడు
ప్రపంచాన్నంతా నీ వెంట పెట్టుకొస్తావు.
 
19-5-2022

Leave a Reply

%d bloggers like this: