
ఇరవయ్యేళ్ళ కిందటి మాట. నేను అప్పుడే శ్రీశైలం నుండి హైదరాబాదు వచ్చాను. చాలా ఏళ్ళు సాహిత్యానికీ, సాహిత్యబృందాలకీ దూరంగా ఉద్యోగజీవితంలో తలమున్కలుగా గడిపినవాణ్ణి. రాగానే తెలుగు సాహిత్యం గురించి నన్ను నేను అప్ డేట్ చేసుకునే పనిలో పడ్డాను. అందులో ఒక పని వందేళ్ళ తెలుగు కథా ప్రస్థానం నుంచి కొన్ని ప్రతినిథి కథల్ని ఎంపిక చేసి ఒక సంకలనంగా తీసుకురావడం. అందులో పూర్వదశాబ్దాల్లోని కథల గురించీ, కథకుల గురించీ నాకు సమస్య ఎదురుకాలేదుగాని, మరీ ఇటీవలి దశాబ్దాలు, ముఖ్యంగా 1990-2000 మధ్యకాలంలో కథల్ని ఎంపిక చెయ్యడం ఒక సవాలుగా తోచింది. పదేళ్ళు తెలుగు కథాప్రపంచంలో ఏమి జరుగుతున్నదో తెలియకుండా అడవుల్లో గడిపాను కాబట్టి కొత్తగా ఎవరు కథలు రాయడం మొదలుపెట్టారో, వాటిలో మైలురాళ్ళుగా నిలబడగల కథలేవో ఎంచడం ఏమంత సులభ సాధ్యం కాదు. అటువంటి కఠిన పరీక్ష దాటి 1995-99 కాలానికి ఇద్దరు కథకుల్ని ఎంపిక చేసాను. ఒకరు ఖదీర్ బాబు, మరొకరు గోపిని కరుణాకర్. రెండు దశాబ్దాల తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే కాలం నా పక్షాన నిలిచిందని అర్థమయింది.
మహమ్మద్ ఖదీర్ బాబు అప్పటికి, అంటే, 2000 నాటికి ఇంకా ప్రసిద్ధిలోకి రాలేదు. కాని అతడి ‘దర్గామిట్ట కథలు’ పాఠకుల్ని మొదటి చూపులోనే ఆకట్టుకున్నాయి. అప్పటికే నామిని సుబ్రహ్మణ్యం నాయుడు అట్లాంటి ఒక ఒరవడి సృష్ఠించి ఉన్నాడు. నెల్లూరు-చిత్తూరు మాండలికాన్ని కావ్యభాషగా మార్చేసి ఉన్నాడు. కాని పెద్ద చెట్టునీడనుంచి పక్కకు తప్పుకుని వెలుతురు వైపు ఆకులు విప్పారిన గుమ్మడితీగెలాగా దర్గామిట్ట కథలు తమ ప్రత్యేకతతో నా కంటబడ్డాయి. మరీ ముఖ్యంగా ‘మా నాయిన ట్రిక్కు నేర్వని కథ’అనే కథ. ఆ కథ గురించి ఆ సంకలనంలో ఇలా రాసాను:
‘మహమ్మద్ ఖదీర్ బాబు ‘మా నాయిన ట్రిక్కు నేర్వని కథ’ (1998) అదే వరసలో వచ్చిన తక్కిన ‘దర్గామిట్ట కథలు’ (1999) తెలుగు ముస్లింల జీవితం గురించిన ఒక ముస్లిం యువకుడు చెప్పిన కథలు, ఏ విధంగా ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు కథ పరిణతి వెనక పందొమ్మిదో శతాబ్ది కథలు-గాథలు ఉన్నాయో, ఆ విధంగానే ఇటువంటి కథనంలోనే ఇరవయి ఒకటవ శతాబ్దపు తెలుగు కథ రానుందు. చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రిగారి ‘కథలు-గాథలు’, మునిమాణిక్యం ‘కాంతం కథలు’, భమిడిపాటి కామేశ్వరరావుగారి రచనలు మొదలుకుని ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారి ‘గౌతమి గాథలు’, శంకరమంచి సత్యం ‘అమరావతి కథలు’ , కొడవటిగంటి కుటుంబరావుగారి గల్పికలు, టివి శంకరం కథలు, శ్రీ శ్రీ ‘కోనేటిరావుకథలు’ ఇటువంటి సారవంతమైన పృష్టభూమి. ఇందులో పరిణత కథాశిల్పంకన్నా జీవితంలోని వివిధ, ప్రత్యేక పార్శ్వాల్ని స్వీయానుభవం నుంచి హృదయానికి హత్తుకునేలా చెప్పటం ముఖ్యం. కాని మెయిన్ స్ట్రీమ్ కథ తన దారిని మళ్ళించుకోడానికి కావలసిన మలుపులు ఇక్కణ్ణుంచే దొరుకుతాయి. ఇదే వరసలో నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, కె.ఎన్.వై.పతంజలి, ఎండ్లూరి సుధాకర్ చేసిన రచనలు ఎనభయి, తొంభయి ల తెలుగు కథని స్పష్టంగా ప్రభావితం చేసాయి. ఇటువంటి ఆవిష్కృత పార్శ్వాలతో తృప్తి చెందక ఇంకా తమలో బయటపడని జీవితకోణాల గురించి అన్వేషణలో శతాబ్ది చివరి సంవత్సరంలో వాచిన మరొక కాన్క ‘దర్గామిట్ట కథలు.’ గురజాడ ‘పెద్దమసీదు’ (1910) కథనుండి దర్గామిట్ట వరకూ ఒక శతాబ్ది పాటు మతానికి అతీతమయిన మానవత్వం గురించి తెలుగు కథకుడు చేసిన అన్వేషణ మనని పులకింపచేస్తుంది. ‘మా నాయిన ట్రిక్కు నేర్వని కథ’ శిల్పంలో, సందేశంలో ఒక మహత్తరమైన ప్రేమ్ చంద్ కథలా వుండటమే కాక, చట్టం చేయలేని పని సంస్కారం చేయడమంటే ఏమిటో రుజువు చేస్తుంది’.( వందేళ్ళ తెలుగు కథ, ఎమెస్కో, 2001, పే.299-300)
ఆ తర్వాత ఖదీర్ బాబు శక్తిమంతుడైన రచయితగానూ, ప్రభావశీలుడైన సాహిత్యకార్యకర్తగానూ వికసిస్తూండటం నా కళ్ళారా చూస్తున్నాను. గత ఇరవయ్యేళ్ళల్లో అతడు ఎంతో రాసాడు. కథలు రాసాడు, వ్యాసాలు రాసాడు, కాలమ్ లు రాసాడు. కథా పరిచయాలు రాసాడు. రైటర్స్ మీట్ పేరిట గత పదేళ్ళకు పైగా వర్క్ షాప్ లు నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ కథాశిబిరాల ప్రేరణతో రచనలు చేసిన కథకుల కథసంకలనాలు తెస్తూ ఉన్నాడు. ఇవాళ ఖదీర్ బాబు తెలుగు సాహిత్యప్రపంచంలో మనం విస్మరించలేని ఒక ఉనికి.
నన్ను చాలా సార్లు నివ్వెరపరిచేది అతడి వాక్యవిన్యాసం. అది సూటిగా కమ్మెచ్చు తీసినట్టు ఉంటే ప్రౌఢ వాక్యం కాదు. గొప్ప సంగీతకారుడు తాదాత్మ్యంలో రాగానికి పలికించే గమకం. అన్ని వంకీలు తిరిగి, అన్ని నెరవులు కురిపించే ఆ వాక్యం తెలుగులో అతి కొద్ది మంది రచయితలకు మాత్రమే సాధ్యపడింది. వాక్యం మొదలయి, పూర్తయ్యేలోగా, ఆ రచయిత భావనాశక్తి ఎన్ని భువనాలు చుట్టి వస్తుందో ఊహించలేమనిపిస్తుంది. ఉదాహరణకి గీతారాయ్ గురించిన పరిచయ వ్యాసంలో ఈ ఎత్తుగడ చూడండి:
‘వగలమారి గాలి ఉన్నట్టుంద్డి వాటం మార్చుకుంటుంది. నీళ్ళ గుప్పిళ్ళను దాచుకున్న తెమ్మెరలు జివ్వున ముఖాలను తాకి ఆటగా నవ్వుతుంటాయి. తుమ్మెదలన్నీ ఎగిరి సంతోషకరమైన కబురేదో పంచుకోవడాని కన్నట్టు దగ్గరగా కూడుతాయి. ఆకాశాన ఒక నల్లటి మేఘం రూపుగట్టి ఆశీస్సులై కురవడానికి నేలకు దగ్గరగా జరుగుతుంది. జగత్తంతా పరవశించే ఆ క్షణాన ప్రకృతి మురిపెంగా ఒక పాటను ప్రసవిస్తుంది.
ఠండి హవా కాలి ఘటా ఆహి గయీ ఝూమ్ కే
ప్యార్ లియే డోలె హసీ నాచ్ జియా ఘూమ్ కే
హిందీ సినిమా సంగీతంలోకి గీతారాయ్ ఠండీ హవాలాగా, కాలీ ఘటాలాగా ప్రవేశించింది. పలుచటి ముఖం, దయగా నవ్వే పెదాలు, కరుణ కురిపించే పెద్ద పెద్ద కళ్ళు, పాట తన దగ్గర ఉన్నందుకు కృతజ్ఞతాపూర్వకంగా వచ్చిన వినయం…’
(మన్ చాహే గీత్, పే.19)
ఈ మధ్య ఒక దినపత్రికలో కొన్ని సంపాదకీయాలు అతడు రాస్తున్నవేనని ఆ అక్షరాల మీంచి వీచే గాలి చెప్తున్నది. ఉదాహరణకి ‘స్వాతి కిరణం సిండ్రోం ‘ అని వచ్చిన ఒక సంపాదకీయంలో చివరి వాక్యాలు చూడండి:
‘ఈర్ష్యతో ఒకరి చెడుకు చేసే అసత్య వాదన మహాపాపం అన్నది వేదం. గీబత్ ( చాడీలు) , తొహమత్ ( లేనివి కల్పించడం) చేసేవారికి నిష్కృతి లేదు అంది ఇస్లాం. ఈర్ష్యపడువాని ఎముకలు కుళ్ళును అన్నది బైబిల్.
ప్రేమించేంత ఐశ్వర్యం లేనప్పుడు హాని చేయలేనంత పేదరికంలో ఉందాం. లోకం అదే బతుకుతుంది.’
(25-4-2022)
ఒక వ్యక్తి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి కుశలుడైన రచయిత కూడా అయినప్పుడు, ముందు ఆ రచయిత గురించి, ఆ రచనా కౌశల్యం గురించి మాట్లాడటం సమంజసం. అయినా ఆ వ్యక్తి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే వినండి.
ఖదీర్ నాకు పరిచయమైన కొత్తలో అంటే 2000-2001 మధ్యకాలంలో నిహార్ ఆన్ లైన్.కామ్ అనే ఒక ఆన్ లైన్ పత్రికలో పని చేసేవాడు. వసంతలక్ష్మి గారు ఆ పత్రిక చూసేవారు. అతడు ఆ పత్రికకోసం నన్ను ఇంటర్వ్యూ చేసాడు. నాతో పుస్తకాలు సమీక్ష చేయించి అందులో ప్రచురించేవాడు. ఒకరోజు నా దగ్గరికొచ్చి ‘అత్యవసరమైన పని ఒకటి పడింది. నాకు కొంత డబ్బు సర్దగలరా ‘ అనడిగాడు. నా పరిస్థితీ అంతంతమాత్రమే. కాని అప్పుడు నా దగ్గర అయిదువేలున్నాయి. ఆ డబ్బు అతడి చేతుల్లో పెట్టాను. గమనించండి. అతడు అడిగింది ఆర్థిక సహాయం. అప్పుకాదు. పదేళ్ళు గడిచాయి. అతడొక సాహిత్యసమావేశానికి నన్ను పిలిచాడు. మీటింగ్ అయిన తరువాత నా జేబులో ఒక కవరు కుక్కాడు. తీసి చూసాను. అయిదు వేలు. ఇదేమిటి అనడిగాను. ‘మరేం లేదు. ఇప్పుడు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాను. అంతే’ అన్నాడు. గమనించండి. అతడు అప్పు తీరుస్తున్నాను అనలేదు. ఒక రచయితని సమావేశానికి పిలిచినందుకు, అయిదు వేలు చేతుల్లో పెట్టగలిగాను అని దాని అర్థం.
లెక్క ప్రకారం ఖదీర్ కి మరొక యాభై ఏళ్ళ ఆయుర్దాయం ఉంది. కాని నూరేళ్ళు చల్లగా జీవించాలని ఆశీర్వదిస్తున్నాను.