వ్యథార్థ దృశ్యం

పశ్చిమ గోదావరి జిల్లా అంటే నా చిన్నప్పడు కొంత వినీ, కొంత చూసీ ఊహించుకున్న మనోహర దృశ్యమొకటి నిన్నమొన్నటిదాకా నా కళ్ళముందు కదలాడుతూ ఉండేది. కాని అది నాకు తెలీకుండానే నెమ్మదిగా కరిగిపోతూ, చివరికి, మూడేళ్ళ కిందట కొల్లేరు వెళ్ళినప్పుడు పూర్తిగా అదృశ్యమైపోయింది. నామిత్రుడు, ప్రభుత్వంలో ఒక ఉన్నతాధికారి, ఆకివీడు మండలంలో ఒక పాఠశాల దత్తత తీసుకుని దాని రూపురేఖలు మార్చేసాడు. ఆ పాఠశాల చూడటానికి రెండేళ్ళ కిందట నన్ను తీసుకువెళ్ళినప్పుడు, పశ్చిమగోదావరి తీరప్రాంతం మొత్తం ఒక రొయ్యలచెరువుగా మారిపోయిందని అర్థమయింది. తెలుగునేలకి ధాన్యాగారమనీ, పాడిపంటల భాగ్యరాశి అనీ నేను భావించుకుంటూ ఉన్న పశ్చిమగోదావరి ఇంకెంతమాత్రం లేదనీ, ఇప్పుడక్కడున్నది ఒక వ్యాపారదేశమనీ తెలియడానికి నాకు ఆట్టేసేపు పట్టలేదు.

ఇప్పుడు కుమార్ కూనపరాజు రాసిన ‘ప్రేమ రాగం వింటావా , మరికొన్ని కథలు’ చదివినప్పుడు ఆ యథార్థ జీవిత వ్యథార్థ దృశ్యం నన్ను చాలా నిష్టురంగా తాకింది. రాజు భీమవరానికి చెందిన సంపన్న జీవితం నుంచి వచ్చినప్పటికీ, తన మండువా, తన లోగిలి దాటి, బీదజనుల జీవితాల్లో అడుగుపెట్టి, మారుతున్న వర్తమానంలో marginalized జీవితాలు ఎటువంటి ఆటుపోట్లకు గురవుతున్నాయో ఎంతో ఆసక్తితో, శ్రద్ధతో, ఆదరంతో పట్టుకున్నాడు.

నిన్న ఆ పుస్తకం ఆవిష్కరణ సభలో దాదాపు వక్తలంతా ఈ అంశాన్నే వివరంగా చెప్పుకొచ్చారు. ఆ సభని నిర్వహించిన తాడి ప్రకాశ్, పుస్తక పరిచయం చేసిన పెద్దింటి అశోక్ కుమార్, మానస ఎండ్లూరి, ఉణుదుర్తి సుధాకర్ లు కూనపరాజు కుమార్ చూసిన, చూపించిన పశ్చిమగోదావరి బడుగు జీవితాలు ప్రపంచమంతటా నిరుపేదల జీవితాలు ఒక్కలానే ఉంటాయనే స్తయాన్ని మరోమారు ధ్రువపరుస్తున్నాయని చెప్పారు.

ఆ కథాసంపుటికి ముందుమాట రాసిన మధురాంతకం నరేంద్ర పశ్చిమగోదావరినుంచి గతంలో పద్మరాజు, బుచ్చిబాబు, తిలక్ వంటి గొప్ప కథకులు వచ్చినప్పటికీ, ఆ కథల్లో పశ్చిమ స్థానికతా ముద్ర కనిపించదనీ, కుమార్ కూనపరాజు మొదటిసారిగా పశ్చిమగోదావరిని మనకళ్ళముందు ప్రత్యక్షపరుస్తున్నాడనీ అన్నాడు. నేనీ పరిశీలనతో ఏకీభవించలేకపోతున్నానని చెప్పాను. పద్మరాజుగారు పశ్చిమగోదావరినుండి రాకపోయుంటే ‘పడవప్రయాణం’, ‘కూలిజనం’ లాంటి కథలు వచ్చి ఉండేవి కావు. నేను కిందటేడాది పెరవలి వెళ్ళినప్పుడు, ఆ లాకుల దగ్గర క్షణకాలం ఆగినప్పుడు నాతో వస్తున్న ఒక ఉపాధ్యాయిని, ‘చివరికి మిగిలేది’లో రాసిన లాకులు ఇవే అంది నాతో. నండూరి సుబ్బారావు ‘ఎంకిపాటలు’, కొనకళ్ళ వెంకటరత్నం ‘బంగారి మామ పాటలు’ చిత్రించిన ఒక మనోజ్ఞ సీమ నేపథ్యంగా పశ్చిమగోదావరి జిల్లా పూర్వకథకులు కథలూ, నవలలూ రాసారు. అదొక అద్భుతమైన స్వాప్నిక ప్రపంచం. ఇప్పుడు కూనపరాజు కుమార్ నిర్దాక్షిణ్యంగానూ, నిర్మొహమాటంగానూ, ఆ romantic veil ని పక్కకు లాగేసాడు. అలా చెయ్యడానికి అతడికి ఏ సంకోచాలూ లేకపోవడం అతడి అదృష్టం, మన అదృష్టమూను.

కుమార్ చెకోవ్ కి వీరాభిమాని. చెకోవ్ జీవితంలో కూడా ఒక కొండగుర్తు ఉంది. చెకోవ్ (1860-1904) కథలు రాయడం 1882 లోనే మొదలుపెట్టినప్పటికీ, అతడి రెండు పర్యటనలు అతడి కథావస్తువునీ, శిల్పాన్నీ, దృక్పథాన్నీ మార్చేసాయి. మొదటిది, 1887 లో ఉక్రెయిన్ పర్యటన. అప్పుడే ఆయనమొదటిసారి స్టెప్పీ చూసాడు. కాని అంతకన్నా గంభీరమైన పర్యటన, 1890 లో అతడు సైబీరియాలోని షాఖాలిన్ ద్వీపాన్ని సందర్శించడం. అక్కడ జీవితకాలపు కైదులో ఉన్న కైదీల ఆరోగ్యం, మానసిక స్థితిగతుల పైన ఆయన ఒక అధ్యయనం చేసాడు. తిరిగివచ్చాక ఆ అధ్యయనాన్ని ప్రచురించాడు కూడా. చెకోవ్ కథల్లో 1882 నుండి 1890 దాక వచ్చిన కథలకీ, 1890 తర్వాత వచ్చిన కథలకీ మధ్య స్పష్టమైన తేడా మనకి కనిపిస్తుంది. ఉదాహరణకి ‘వార్డు నెంబరు 6’ (1892) అనే పెద్ద కథ చెహోవ్ షాఖాలిన్ వెళ్ళకపోయి ఉంటే వచ్చి ఉండేది కాదు. దానికి మపాసా రాసిన ‘బెడ్ నంబరు 29’ అనే కథ స్ఫూర్తి అన్నది అందరికీ తెలిసిందే. కాని మపాసా షాఖాలిన్ వెళ్ళలేదు. అసలు అటువంటి మానవజీవితమంటూ ఒకటి ఉండగలదని కూడా అతడు ఊహించి ఉండడు. ‘బెడ్ నంబరు 29’ నుంచి ‘వార్డు నెంబరు 6’ ని వేరుచేసేది షాఖాలిన్ అని ఇప్పుడు మనం స్పష్టంగా చెప్పగలం, కుమార్ సైబీరియా వెళ్ళకుండానే పశ్చిమగోదావరి జిల్లాలోనే భీమవరం చుట్టుపక్కల్నే ఒక షాఖాలిన్ ని చూసాడనీ, అక్కడ చూసినవాటికి కలతచెందాడనీ ఈ కథలు సాక్ష్యమిస్తున్నాయి.

ఈ కథల్లో నాకు నచ్చిన మరో అంశం. ఆయన mariginalized జీవితాల్ని చూడటమే కాక, ఆ జీవితాల్లో ఏ చిన్నపాటి క్రియాశీలకమైన, ప్రగతిశీలమైన ప్రకంపన కనిపించినా దాన్ని ఎంతో గౌరవంతో పట్టుకున్నాడు, పైకెత్తి చూపించాడు. ఒకవేళ అటువంటి మార్పు ఏదీ ఆ జీవితాల్లో కనిపించకుండా అవి యథాతథంగానే కొనసాగుతుంటే, దాన్ని చూస్తూ ఉండలేక, కనీసం తన కథల్లోనైనా ఏదో ఒక విధంగా tweak చేసి ఏదో ఒకటి జరిగినట్టుగా తనకి తాను చెప్పుకున్నాడు. మనకీ చెప్పుకొచ్చాడు. పీడితజనుల గురించి మాట్లాడుతున్నవాళ్ళూ, వాదిస్తున్నవాళ్ళూ తెలుగు నేల మీద చాలామందినే ఉన్నప్పటికీ, వాళ్ళెవ్వరూ ఇటువంటి జీవితాన్ని ఇంత దగ్గరగా చూడలేదేమో అనిపించేట్టుగా తాను చూసిన జీవితాన్ని కథలుగా మలిచాడు.

కుమార్ తన గ్రంథాన్ని చెకోవ్, ప్రేమ్ చంద్, రావిశాస్త్రిలకు అంకితమిచ్చాడు. వారి వారసత్వాన్ని ఆయన స్వీకరించాడని కథలు చదవగానే అర్థమవుతుంది. ఇక మిగిలింది, ఆ వారసత్వాన్ని ఆయన శాయశక్తులా కొల్లగొట్టుకోవడమే.

27-4-2022

Leave a Reply

%d bloggers like this: