మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు అక్క దగ్గరకు వెళ్లేటప్పటికి ఆమే, వసుధారాణిగారు, కల్యాణి నీలారంభంగారు ఒక విద్వత్సభ నడుపుతూ ఉన్నారు. వారితోపాటు ధూళిపాళ అన్నపూర్ణగారు, సంధ్యగారు కూడా ఉన్నారు. నేను వెళ్ళేటప్పటికి, సంస్కృత నాటకం మీద అన్నపూర్ణగారూ, గ్రీకు నాటకం మీద కల్యాణి గారూ ప్రసంగించి ఉన్నారు. ఆ రెండు సంప్రదాయాల్నీ పోలుస్తూ నన్ను కూడా రెండు మాటలు చెప్పమని అడిగారు. నేను నాకు గుర్తున్నవీ, తోచినవీ ఏవో నాలుగు మాటలు అప్పటికప్పుడు చెప్పాను.
చాలాకాలం పాటు సంస్కృత నాటకం గ్రీకునాటకం స్ఫూర్తిగా ప్రభవించిందని నమ్మారుగాని, ఇప్పుడు ఆ వాదాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పాను. గ్రీకునాటకమూ, సంస్కృత నాటకమూ రెండూ క్రతు స్వభావం కలిగినవనీ, రెండూ కూడా మతపరమైన క్రతుకాండలో భాగంగా, నిర్ధిష్ట ప్రదేశంలో, నిర్దిష్టకాలంలో ప్రదర్శించడం కోసం ప్రభవించేయనీ చెప్పాను.
గ్రీకు నాటకం మొదట్లో కోరస్ అనబడే బృందగాయకుల సమూహంతో మొదలయ్యిందనీ, క్రీ.పూ ఆరవశతాబ్దంలో థెస్పిస్ అనేవాడు మొదటగా ఆ బృందం నుంచి మొదటి నటుణ్ణి వేరుచేసాడనీ, ఆ తర్వాత, ఎస్కిలస్ రెండవనటుణ్ణీ, సొఫొక్లిస్ మూడవనటుణ్ణీ ప్రవేశపెట్టారనీ, ఇక అప్పణ్ణుంచీ ముగ్గురు నటులూ, ఒక గాయకబృందంతో కలిసి గ్రీకునాటకం కొనసాగిందనీ చెప్పాను. గ్రీకు విషాదాంత నాటకం సుప్రసిద్ధమే అయినప్పటికీ, మోదాంత నాటకాలు కూడా ఏమీ తక్కువకాదనీ, అరిస్టోఫేన్స్ తన సమకాలిక గ్రీకు సమాజాన్ని అధిక్షేపిస్తూ రాసిన ప్రహసనాల్ని కూడా గ్రీకు సమాజం అంగీకరించగలిగిందని చెప్పాను. అయితే, అక్కడ ధీరోదాత్త నాయకుడు ప్రధానంగా నడిచే విషాదాంత నాటకాల్లో హాస్యప్రసక్తి ఉండదనీ, అందుకు బదులు, ఆ నాయకుడికి హితవు చెప్పే ఒక వృద్ధుడిగా టైరీషియస్ అనే పాత్ర కనిపిస్తూ ఉంటాడనీ, మన విదురుడి మాటల్లనే అతడి హితవు కూడా నాయకుడు పెడచెవిన పెడుతుంటాడని గుర్తుచేసాను.
కాగా సంస్కృత నాటకం ఎలా ప్రభవించిందనేదానిమీద 19, 20 శతాబ్దాల్లో విస్తారమైన చర్చ జరిగింది. చివరికి, ఎఫ్.బి.జె.కుయిపెర్ అనే డచ్చి పండితుడు నాట్యశాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందులో పూర్వరంగం తాలూకు క్రతుస్వభావాన్ని విశ్లేషిస్తూ, సంస్కృతనాటకం వైదిక క్రతుస్వభావం కలిగిందని తీర్మానించేడు. ఆ తర్వాత రోజుల్లో నటాలియా లిదోవా అనే ఆమె ఆ క్రతువులో వైదిక యజ్ఞంతో పాటు, అవైదిక పూజావిధానం కూడా కలిసి ఉందని మరింత సమగ్రంగా వివరించింది.
లిదోవా రాసిన Drama and Ritual of Early Hinduism (1994) ఇరవయ్యేళ్ళకిందట చదివాను. అందులో ఆమె కుయిపర్ రాసిన Varuna and Vidhushaka, On the Origin of Sanskrit Drama (1979) గురించి విస్తారంగా పేర్కొంది. దాంతో ఆ పుస్తకం గురించి ఎంతో ప్రయత్నించాను గాని ఎక్కడా దొరకలేదు. మొన్న మళ్ళా ఆ గోష్టిలో ఆ రచన గురించి ప్రస్తావించాక ఆ రచన దొరుకుతుందేమోనని ఇంటర్నెట్ శోధిస్తే, ఆశ్చర్యం, ఆ గ్రంథం పూర్తిగా దొరికింది!
గత రెండు రోజులుగా ఆ రచన మొత్తం చదివాను. అది నిజంగా అద్భుతమైన పరిశోధన. కుయిపర్ (1907-2003) అగ్రశ్రేణి ఇండాలజిస్టు. లైడెన్ విశ్వవిద్యాలయంలో సంస్కృతభాషలో ఆచార్యుడిగా పనిచేసాడు. ఆయన నాట్యశాస్త్రాన్ని అత్యంత నిర్దుష్టంగా పరిశీలించి, సంస్కృత నాటకం కూడా యజ్ఞంలానే ఒక వైదిక క్రతువు అని ప్రతిపాదిస్తూ, తన వాదానికి మద్దతుగా వేదాలనుంచీ, బ్రాహ్మణాలనుంచీ, ఇతిహాసాల నుంచీ ఎంతో సమాచారాన్ని ఎత్తిచూపించాడు. అయితే సంస్కృత నాటకం ఆవిర్భవించిన కాలానికీ, కాళిదాసాది నాటకకర్తలు నాటకాలు రాసిననాటికీ, ఆ నాటకాలపైనా, నాట్యశాస్త్రం పైనా ఆలంకారిక గ్రంథాలు వెలువడిననాటికీ మధ్య ఎంతో కాలవ్యవధి ఉందనీ, అందువల్ల, ఒక్క అశ్వఘోషుడు తప్పించి తక్కిన నాటకకర్తలెవరూ నాట్యశాస్త్రాన్ని పూర్తిగా అనుసరించి నాటకాలు రాయలేదనీ చెప్తాడు. నాటక ఆవిర్భావ కాలానికీ, నాట్యశాస్త్ర రచనకీ మధ్య కూడా ఎంతో కాలం గడిచిపోయిందనీ, కాబట్టి నాటక ప్రదర్శన కు ముందు చేపట్టవలసిన పూర్వరంగం గురించి వివరిస్తున్నప్పుడు నాట్యశాస్త్ర రచయిత కూడా చాలావరకూ జనస్మృతిమీదా, కొన్ని చోట్ల తన ఊహాగానం మీదా ఆధారపడినట్టుగా కనిపిస్తుందని చెప్తాడు.
కుయిపర్ రచనలో రెండు భాగాలున్నాయి. మొదటిది, వేదాల్లో వరుణుడి గురించిన వివరణ. రెండవభాగంలో సంస్కృత నాటక లక్షణాలూ, ఆవిర్భావం, ప్రయోజనాన్ని వివరిస్తూ, విదూషక పాత్ర గురించి మరింత ప్రత్యేకమైన పరిశీలన. వేదాల్లో ఇంద్ర-వరుణుల స్థానం ఎటువంటిదో, సంస్కృత నాటకంలో నాయక-విదూషక ద్వయం అటువంటిదని చెప్తాడు. విదూషకుడంటే హాస్యగాడనీ, ఆ పాత్రం జనప్రియకళారూపాలనుంచి సంస్కృత నాటకంలోకి ప్రవేశించిందనీ చెప్పుకునే అభిప్రాయాల్ని అతడు పరాస్తం చేస్తాడు. విదూషకుడు అంటే one who corrupts అనే అర్థాన్ని ప్రతిపాదించడానికి, మరొక ప్రసిద్ధ ఇండాలజిస్టు జి.కె.భట్ రాసిన The Vidhushaka in Sanskrit Drama గ్రంథానికి తానెంతో ఋణపడ్డానని చెప్తాడు. అంతేకాదు, రంగస్థలం మీద విదూషకుడు సంస్కృతంలో మాట్లాడటమే అతడు లోకవ్యవహారం నుంచి వచ్చిన పాత్ర కాదని చెప్పడానికి నిదర్శనమని భట్ చెప్పాడని కూడా అతడు గుర్తు చేస్తాడు.
స్థూలంగా అతడి ప్రతిపాదనలు ఇవి: ఈ విశ్వం ఆవిర్భావం గురించి ప్రాచీన గ్రీకులు ఏర్పరచుకున్న cosmogony ప్రకారం మొదట్లో ఒక అవ్యవస్థ (chaos) ఉండేది. అది ఒక నిరాకార శూన్య స్థితి. దాన్నుంచి ఒక వ్యవస్థిత విశ్వం (cosmos) ఏర్పడింది. వేదాల ప్రకారం మొదట్లో అసత్ ఉండేది. దాన్నుంచి సత్ ఏర్పడింది. దృశ్యమాన ప్రపంచం ఏర్పడకముందు నిరాకారమైన అనస్తిత్వాన్ని, ఆ అనాది వ్యవస్థని పాలించే దేవుడు వరుణుడు. ఆయన ‘ఋతస్య గోప్తా ‘. అంటే ఈ విశ్వాన్ని నడిపించే ఒక సార్వత్రిక, సార్వకాలిక సత్యసూత్రాన్ని పాలించేవాడు. మొదట్లో ఆయన మహా-అసురుడు. అవెస్తాలో చెప్పిన Ahura-mazda. అయితే, అసత్తునుంచి సత్తు ఏర్పడ్డాక, అసురులూ, సురులూ అనే ద్వంద్వం ఏర్పడ్డాక, సురులు అసురులమీద విజయం సాధించినప్పుడు కొంత మంది అసురులు సురుల్లో చేరిపోయారు. తక్కినవారు పోయి పాతాళంలో దాక్కున్నారు. అలా సురుల్లో చేరిపోయిన దేవతల్లో వరుణుడు కూడా ఉన్నాడు. అందువల్ల ఆయన అసురుడూ-సురుడూ కూడా. ఒకవైపు ఆయన దృశ్యమాన విశ్వంలోని ద్వంద్వానికీ, మరొకవైపు, సత్తు ఏర్పడక పూర్వపుకాలం నాటి అఖండ అసత్తుకీ కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. వరుణుడిలోని ఈ ద్వైదీ లక్షణం ఋగ్వేద ఋషులకు బాగా గుర్తుంది. మహాభారతం అస్పష్టంగా గుర్తుపెట్టుకుంది. పురాణాల కాలం నాటికి అదంతా పక్కకుపోయి వరుణుడు ఒక దిక్పాలకుడిగా మారిపోయేడు.
అనస్తిత్వం నుంచి అస్తిత్వం వేరుపడి, లోకం ప్రభవించిన, సృష్టి యుగోదయ వేళని కీర్తిస్తూ చెప్పిన స్తోత్రాలు ఋగ్వేద సూక్తాలు. అయితే, ఋగ్వేదం ఈ రెండింటినీ ఒక వరసక్రమంలో జరిగిన సంఘటనలుగా గుర్తుపెట్టుకోదు. అనాది, నిరాకార అనస్తిత్వం నుండి భూమ్యాకాశాలు ఒక్కసారిగా వేరయిపోయాయి. నిజమే. కానీ అది భౌతిక స్థాయిలో మాత్రమే. మానసికంగా అసత్తుకీ, సత్తుకీ మధ్య పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఋగ్వేద ఋషుల దృష్టిలో, అసత్తునుంచి సత్తు ఏర్పడే ఒక జగన్నాటకం ప్రతి కాలసంధిలోనూ ఎప్పటికీ సంభవిస్తూనే ఉంటుంది. ఒక రోజు ప్రమాణంలో చూసినప్పుడు ఉభయసంధ్యల్లో, పక్షప్రమాణంలో చూసినప్పుడు, అమావాస్య, పున్నముల్లో, సంవత్సర ప్రమాణంలో చూసినప్పుడు అయనాల్లో అసత్తునుంచి సత్తు విడివడే ప్రపంచోదయ రూపకాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి, వరుణుడు దేవతల్లో చేరిపోయినప్పటికీ, ఆయా కాలసంధివేళల్లో ఆయన తిరిగి తన ఆసురీస్వభావాన్ని సంతరించుకుని, దేవాసురసంగ్రామానికి తెరతీస్తుంటాడు. ఎందుకంటే ఒక అఖండ సత్యానికి సంబంధించిన దేవతగా అతడు పాపపుణ్యాలు రెండింటికీ ప్రతినిధి. మంచిచెడులు రెండింటినీ అతడు మనముందుకు తీసుకొస్తాడు. అసురుల మీద సురుల విజయానికి ఇంద్రుడు నాయకుడు. ఆ విధంగా ఇంద్రుడు పూర్తిగా వెలుగు దేవత. కాని దేవాసుర సంగ్రామ వేళలో వరుణుడు వెలుగునీడలు రెండూ కలగలిసిన దేవత.
తొలి సంస్కృత నాటకం దేవాసుర సంగ్రామాన్ని అభినయించిందని నాట్యశాస్త్రమే చెప్తున్నది. ఆ తర్వాత ఆ నాటకం తన ఇతివృత్తంగా క్షీరసాగరమథనాన్ని తీసుకుంది. సంగ్రామంలో కేవలం యుద్ధం, హింస, బీభత్సం మాత్రమే ఉంటాయి. మథనంలో పోటీతోపాటు సహకారం కూడా ఉంటుంది. కవ్వానికి తాడు కట్టి చిలుకుతున్నప్పుడు ఒకవైపు ప్రవృత్తి, మరొక వైపు నివృత్తి పనిచేస్తూనే ఉంటాయి. క్షీరసాగరమథనం సమవకార రూపకం. అంటే అందులో పన్నెండు మంది నాయకులు ఉంటారు. సురులు ఆరుగురు, అసురులు ఆరుగురు. ఇంద్రుడు సురులవైపూ, వరుణుడు అసురులవైపూ ఉంటారు.
సమవకారం నుంచి ప్రకరణం మీదుగా నాటకం వికసించిన తర్వాత వరుణుడు నాయకుడికి దీటుగా counter-hero రూపాన్ని సంతరించుకున్నాడు. అతడే విదూషకుడు అనేది కుయిపర్ ప్రతిపాదన. counter-hero ప్రతినాయకుడు కాడు. నాయకుణ్ణి ఎప్పటికప్పుడు సరిదిద్దేవాడు. నాయకుడి ప్రణాళికల్ని ఎప్పటికప్పుడు ‘విదూషితం చేస్తూ’ తద్వారా కథాగమనాన్ని ముందుకు నడుపుతూ ఉంటాడు. సంస్కృత నాటకాల్లో విదూషకుడే లేకపోతే నాయకుడు తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేడేమో అనిపిస్తుంది. సరిగ్గా ఇక్కడే సంస్కృత నాటకానికీ, గ్రీకు విషాదాంత నాటకానికీ మధ్య తేడా కనిపిస్తుంది. గ్రీకు ట్రాజెడిలో నాయకుడు ధీరోదాత్తుడు అయినప్పటికీ, అతడిలో ఒక tragic flaw ఉంటుంది. ఆ నాయకుడి వ్యక్తిత్వంలోని పగులు error in judgment గా పరిణమిస్తుంది. అది అతడి పతనానికి దారితీస్తుంది. సంస్కృత నాటకంలో ఆ పాపభారాన్ని విదూషకుడు తన భుజాల మీద వేసుకుంటాడు. యజ్ఞాల్లో విదూషితమైన హవిస్సుల్ని వరుణుడు స్వీకరించినట్టుగా.
ఆసక్తి ఉన్నవాళ్ళ కోసం కుయిపర్ రచన లింకు ఇక్కడ పొందుపరుస్తున్నాను. చదవండి. https://knaw.versie1.online/DL/publications/PU00010232.pdf
ఈ రచనని చదవడానికీ, సంస్కృత-గ్రీకు నాటకాలనే గంభీరమైన విషయాల గురించి మరొకసారి ఆలోచించడానికీ నాకు అవకాశమిచ్చిన ఆ విదుషీమణులకు నా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను.
6-5-2022