
యెలిచెర్ల గజేంద్రనాథ రెడ్డి నాకు ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా 2014 లో స్నేహితుడయ్యాడు.నా కొన్ని కలలు, కొన్ని మెలకువలు పుస్తకం తనకి చాలా నచ్చిందనీ, ఒక ఉపాధ్యాయుడిగా ఆ పుస్తకం తనకి ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటున్నదని చెప్తూ మా స్నేహసంభాషణ మొదలుపెట్టాడు. మేమెప్పుడూ ఒకరినొకరం ప్రత్యక్షంగా చూసుకోకపోయినా, కలుసుకోకపోయినా, కనీసం ఫోన్లో మాట్లాడుకోకపోయినా, ఆ సంభాషణ మా మధ్య నడుస్తూనే ఉండేది.
2021 దాకా.
ఇప్పుడు వెనక్కి తిరిగి ఫేస్ బుక్ మెసెంజరులో ఆ సంభాషణ మరొకసారి చదువుకుంటూ ఉంటే చాలా దిగులుగా అనిపిస్తున్నది. అతడు ఈ లోకంలో ఎక్కడెక్కడ ఏ అందాలు చూసాడో, ఉత్తేజకారకులైన ఏ రచయితల్ని కలుసుకున్నాడో, ఏ పుస్తకాల్ని ప్రేమించాడో వాటన్నిటినీ నాకోసం ఒక దివిటీ పట్టుకుని మరీ చూపించాలని ఆత్రుత పడ్డట్టుగా ఆ సంభాషణ సాక్ష్యమిస్తూ ఉన్నది. నన్ను ఎంతో గాఢంగా తన హృదయానికి హత్తుకున్నాడనీ, నేను తిరిగి అంత గాఢంగానూ ప్రతిస్పందిస్తున్నానా లేదా అని చూడనేలేదనీ, అదంతా నా మీద ఇష్టం కొద్దీ, తాను చూస్తున్న సత్యం, సౌందర్యం నేను కూడా చూడాలన్న ఔదార్యం తప్ప మరేమీ కాదనీ ఇప్పుడు అర్థమవుతుంటే, అపారమైన గౌరవంతో నా శిరస్సు అవనతమవుతున్నది.
ఎవరుంటారు? సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘ఒంటరి’నవల నేను చదవాలని కోరుకునేవారు? ఆ రచయిత నాకు పుస్తకం పంపిస్తానన్నాడని చెప్పినా వినకుండా తనే ముందుగా ఆ పుస్తకం నాకు పంపి నేనా రచన ముందు కైమోడ్చితే ఆ రచన తానే రాసినంతగా సంతోషపడిపోయేవాడు!
అతడు మంచి ఉపాధ్యాయుడనీ, సాహిత్యాభిమాని అని మాత్రమే అనుకున్న నాకు, హన్స్ ఇండియా లో అతడు రాసిన వ్యాసాలు పెద్ద కనువిప్పు. అటువంటి ఇంగ్లిషు, అటువంటి వ్యక్తీకరణ, వయసుని మించిన సమదృష్టి, సంయమనం- అటువంటి వ్యాసాలు అతడు దాదాపు వెయ్యి దాకా రాసాడని తెలిసినప్పుడు నా ఆశ్చర్యానికి అవధి లేదు.
2
ఆ వ్యాసాలూ, ఆ సంభాషణలూ అవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ఈ సీమ కథలు మరొక ఎత్తు. ‘నా సీమ యాసే నా శ్వాస’ అనే ఈ సంపుటంలో ఉన్న కథలన్నీ ఆగకుండా ఏకబిగిన చదువుతూ పోతుంటే, ఆయన్ని ఏ బద్వేలు బస్ స్టాండ్ లోనో కలుసుకున్నట్టు లేదా అతడితో కలిసి సన్నపురెడ్డిని కలవడానికి బాలరాజు పల్లె వెళ్ళే బస్సు ఎక్కినట్టో లేదా ఏ పోరుమామిళ్ళ రారిలోనో అతడి వాక్ప్రవాహంలో మునిగితేలుతున్నట్టూ అనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆ మనిషిని ప్రత్యక్షంగా చూసినట్టు, నోరారా పలకరించుకున్నట్టూ అనిపించింది.
చదవండి. ఈ కథల్లో అన్నిటికన్నా ముందు గంగా ప్రవాహంలాంటి ఒక జీవద్భాష వినిపిస్తుంది. అన్నిటికన్నా ముందు ఇటువంటి భాషని చెవులారా వినడమే ఒక అదృష్టం. ఇది ప్రజల భాష. మీరెప్పుడన్నా గోదావరి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తే, అనకాపల్లి లో కూరగాయల గంపలతో స్త్రీలు బిలబిల్లాడుతూ ఎక్కడం చూస్తారు. అక్కణ్ణుంచి రైలు విశాఖపట్టణం చేరేదాకా వాళ్ళు గలగలా మాట్లాడుకునే ఆ మాటలు వినడం ఒక భాగ్యం. ‘నేను మానవకంఠధ్వనుల్లో స్నానం చేసాను’ అన్నాడు ఒక కవి. అదేమిటో మీకు ఆ గంటసేపట్లోనూ సంపూర్ణంగా అనుభవానికొస్తుంది. నేనొకప్పుడు కర్నూలు జిల్లా పత్తికొండలో సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమం గురించి ప్రచారం చేస్తూండగా గొరవయ్యల్ని కలిసాను. ఆ రోజు ఆ గొరవయ్యల నాయకుడు చదువు గురించీ, అక్షరాస్యత గురించీ అనర్గళంగా గంటసేపు మాట్లాడేడు. ఆహ! ఏమి భాష అది! ఏమి నుడికారం! ఏమి గంగాఝురి! మహారచయితల మహోత్తమ గ్రంథాలేవీ ఆ వాక్స్రవంతి దరిదాపులకు కూడా రాలేవనిపించింది. ఆ వాగ్ధాటి ముందు మన పుస్తకాల తెలుగు, మన సమాచార ప్రసార సాధనాల తెలుగు ఎంతో బీదగా, పేలగా, బక్కగా తోచింది. మహోద్ధృతమైన ఆ జనవాగ్వ్యవహారాన్ని ప్రింటులోకి తేవాలని గిడుగు, గురజాడ, రావిశాస్త్రి, శ్రీపాద, నామిని మొదలైన రచయితలు చేసిన గొప్ప ప్రయత్నాలన్నీ కూడా చాలా బలహీనమైన ప్రయత్నాలు మాత్రమేనని అర్థమయింది.
అదిగో, అటువంటి భాషని పట్టుకోవాలనీ, బళ్ళకెత్తాలనీ, బడుల్లోకి తేవాలనీ తపించిన ఒక ఉపాధ్యాయ-కథకుడి అపురూపమైన ప్రయత్నం ఈ కథాసంపుటం. ఈ కథలు చదివిన తరువాత, ప్రతి జిల్లాలోనూ, వీలైతే ప్రతి మండలం నుంచీ ఇటువంటి స్థానిక ధ్వనిసంపుటాలు రావాలని అనిపించింది. ఇందులో ప్రతి ఒక్క ప్రయోగం, ప్రతి ఒక్క సామెత, ప్రతి ఒక్క పలుకుబడి, ఇంగ్లిషుని తెలుగుగా మార్చడంలో ప్రజలు తమకు తెలీకుండానే తాము చూపిస్తున్న అపారమైన ప్రతిభ-ప్రతి ఒక్కటీ మరింత లోతుగా అధ్యయనం చెయ్యదగ్గవి. ఒక భాష కాదు, ఆ భాష తాలూకు యాసనే ఆ ప్రజల శ్వాస అని మనకి ఈ సంపుటంలోని ప్రతి ఒక్క పేజీ మనకి వాజ్ఞ్మూలమిస్తూనే ఉంది.
ఒకప్పుడు, ఆధునిక తెలుగు వచనం రూపొందే తొలిరోజుల్లో గోదావరి జిల్లాల కథకులు ఇటువంటి ప్రయత్నమే చేసారు. ఈ రచన చదువుతున్నంతసేపూ నాకు వీరేశలింగం, చిలకమర్తి ప్రహసనాలు, పానుగంటి వ్యాసాలు గుర్తొస్తూన్నాయి. రాయడం ద్వారా మనం మాట్లాడుతున్న భాష మనకి అర్థమవుతుంది, పట్టుబడుతుంది. ఈ వాక్యం మీకు వింతగా అనిపించవచ్చు. కాని మాట్లాడటం చాలావరకు దానికదే ఒక సృజనాత్మక వ్యవహారం. అందులో బుద్ధి ప్రమేయం చాలా తక్కువగా ఉంటుంది. అలా మనం మాట్లాడే భాషని రాయడానికి పూనుకోవడం ద్వారా మనం మన ఆలోచనమీదా, అంతరంగం మీదా పట్టుసాధించుకోగలుగుతాం. మన జీవితం మీద మనకు సాధికారికత సిద్ధించే మార్గాల్లో వాడుకభాషని రాతభాషగా మార్చుకోవడం కూడా ఒకటి.
ఉదాహరణకి, ఈ వాక్యాలు చూడండి:
“ఏంజేజ్జం రైతు బతుకు అట్టాడ్ది. మంచులు తేనెలేపకపోతాన్యా తేనెపేరీగలు మల్లా తేనెఅట్నే దాచుకుంటయి జూడుఅట్టపైరు ఎన్ని మాట్లు కూలిపోయినా మల్లా దానిమీదికేపోద్దిరైతు బుద్ది. ఒకపక్క యల్లవొచ్చి పైరుపైన మోకాటెత్తుపారిపైరంతా నేలకు ఆనుకుని ఒకపక్క కుల్లిపోతాంటే మల్లా నారుకయ్య తయారు జేచ్చడు. వాని తీరంతా అంతేపడకుండే ఎగజూడ్డం పడిపైరు సెడిపోతే దిగజూడ్డం మామూలైపాయ. అయితే అయిందిలే అనుకుంటే తీర గింజలు రాలుపుకునే టైయానికి వొరుపెత్తి ఎన్ను బోయిన పైరుకు గూడ దించె. పెట్టిన పెట్టుబడెంతా గోడకేసిన సున్నం మాదిరిబోతాంటే ఏంటికీడ అప్పు జేసి పైరు పెట్టడం అంటాండు ర్యాంగాని కొడుకు. బయటపడ్డు గానీ ఈ ర్యాంగానికి బూమెంటే బో మునాస. ఈసారిపోతే ముందుకు రాకపోతాదా అంటా ఎగసాయం సాలీకుండ జేసి పదెకరాలను రెండున్నర ఎకరాజేసుకున్నెడు. ఇప్పుడు వాని కొడుకు ఒక్కరవ్వ తేరుకున్నెడేమో ఈన్నే ఉంటేనా బతుకూ అట్టనేయల్లబారిపోకుండా నేను బద్దేలికిపోతనంటాండు. పిల్లోడేమో పోవాలనీ పెద్దోడేమేఉండాలనీ సావుజంపులైందిర ఈ తిక్కనాయాల్లతో” అని అంగలార్సె సుబ్మామ.’
ఇట్లాంటి ప్రయత్నంలోనే ఒకప్పుడు తెలంగాణా రచయితల పరంపర ఒకటి నిర్విరామంగా తమ భాషని కనుక్కుంటూ వచ్చేరనీ, దాన్ని కాగితం మీద పెట్టడానికి సాధన చేస్తూ వచ్చేరనీ, ఆ తర్వాతనే వారికి రాజకీయ తెలంగాణా సాధ్యమయ్యిందనీ నేను కొత్తగా చెప్పనక్కర్లేదనుకుంటాను.
ఇప్పుడు, కడప జిల్లా లో బద్వేలు, పోరుమామిళ్ళ, కాశినాయన మండలాల ఈ మాడలికాన్ని ఒక రచయిత ఇంత నిర్దుష్టంగా కాగితం మీద పెట్టగలగడంతో ఆ ప్రాంతానికి చెందిన జనసమూహం తమ జీవితం పట్ల ఒక సాధికారికత సాధించుకున్నదనే చెప్పాలి. ఒక రచయిత తన ప్రజలకు విముక్తి కలిగిస్తాడు అంటే, అది అన్నిటికన్నా ముందు, ఈ అర్థంలో.
3
బలంగా ఊపిరి తీసి వదుల్తున్న గుండె లయ ఈ భాషలో కనిపిస్తున్నది సరే. కాని అంతకన్నా మనల్ని నిశ్చేష్టపరిచే మరొక అంశం కూడా ఈ పుటల్లో ఉన్నది. అదేమంటే, ఈ మనిషికి మానవసంబంధాల పట్ల ఎంత ఆదరం! మనుషులంటే ఎంత ప్రేమ! పూర్వకాలపు పల్లెల్లో కనవచ్చే నిర్మలమైన , పరమసాత్త్వికమైన ప్రేమానుబంధాలు ఈ కథల్లో అడుగడుగునా కనవస్తున్నాయి. ఏ కథలోనూ ముగింపు లో అపస్వరం లేదు. అలా ఉండగలదని ఆ రచయిత ఊహించలేడు. కలవరం ఉండవచ్చు, కాని ఆ కథ చివరికి ఒక కలగానో, వరంగానో మారిపోక తప్పదు. విభేదాలు ఉండవచ్చు, కాని అవి విద్వేషంగా మారవు. చివరికి ప్రపంచాన్ని చాపచుట్టలాగా చుట్టేసిన కరోనా కూడా తమ పల్లెల్లోకి ఏదో ఒక గుణాత్మకమైన ప్రభావానికే దారిచూపిందనుకునేంత అమాయికుడు, ప్రేమైక జీవి ఈ రచయిత.
ఇదే, ఇదే నన్ను అమితంగా బాధిస్తున్నది. ఈ కథల్లో రచయిత కరోనాని దగ్గరా చూసాడు. చాలా దగ్గరగా చూసాడు. ఎదురుగా నిలబడ్డాడు. ఎదురొడ్డినిలబడ్డాడు. తన బంధువులకి, మిత్రులకి, కనబడ్డ ప్రతి ఒక్కరికీ ధైర్యం చెప్పాడు. కాని తానట్లా ధైర్యం చెప్తూ ఉండగానే, ఆ మహమ్మారి తననే కబళించి వేస్తుందని ఊహించను కూడా ఊహించలేకపోయాడు.
మనం గొప్ప యుద్ధాల గురించీ, యుద్ధ సమయాల గురించీ రాసిన రచనలు చదివి ఉంటాం. యుద్ధం ముగిసేక, ఎవరు మిగిలారో, ఎవరు అదృశ్యమైపోయారో లెక్కలు తేలాక, ఆ యుద్ధ బీభత్సాన్ని కళ్ళారా చూసి, ఆ కాలంలో తమ వాళ్ళ పక్క నిలబడి వాళ్ళకి ధైర్యం చెప్పిన రచయితల్ని గుర్తుపడతాం. వారిని గౌరవిస్తాం. వారివల్లనే అంత కల్లోలకాలంలోనూ మనం ఒక జాతిగా మన సమగ్రత ను కాపాడుకోగలిగేమని చెప్పుకుంటాం. వారి ముందు మోకరిల్లుతాం.
గజేంద్ర అటువంటి యుద్ధకాలపు కథకుడు. అతడికి మన నివాళి.