యుగయుగాల చీనా కవిత-22

Reading Time: 3 minutes
ఆరవ శతాబ్దం ముగిసిపోయి, ఏడవ శతాబ్దంలో చీనా తాంగ్ యుగంలోకి ప్రవేశించబోయే ముందు, కొద్ది కాలమే అయినా సుయి వంశ పాలనలో గడిపింది. చీనా సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ చరిత్రలో స్వర్ణయుగం అని చెప్పదగ్గ తాంగ్ యుగం (618-907) ఎన్నో విధాలుగా సుయి పాలన (581-618) కు ఋణపడి ఉంటుంది. హాన్ చక్రవర్తుల పాలన తర్వాత మూడు శతాబ్దాల పాటు (206-589) అంతర్యుద్ధాలతోనూ, రక్తపాతంతోనూ గడిచిన ఆరు రాజవంశాల పాలనకు ముగింపు పలుకుతూ చీనాను ఏకం చేయడమే కాక సుయి చక్రవర్తులు పాలనకు సంబంధించి పటిష్టమైన ఒక నమూనాని తాంగ్ పాలకులకి అందించి వెళ్ళిపోయారు.
 
సుయి చక్రవర్తుల పాలనా కాలం మొత్తం నాలుగు దశాబ్దాలు మించి లేకపోయినప్పటికీ, ఒక ఏకీకృత చీనాను వారు సాధ్యం చేయడమే కాక, అటువంటి విస్తారమైన భూభాగాన్ని నిర్వహించడానికి అవసరమైన పాలనా చట్రాన్ని కూడా రూపొందించారు. ముఖ్యంగా సుయి వంశంలో రెండవ పాలకుడు చక్రవర్తి యాంగ్ 604 లో సింహాసనాన్ని అధిష్టించి 618 లో ఒక సైనికుడి చేతుల్లో హత్యకు గురయ్యేదాకా, చీనా రాజకీయ-ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసాడు. పట్టుమని పదమూడేళ్ళు కూడా పాలనాకాలం పూర్తి చెయ్యని ఆ చక్రవర్తి సాధించిన విజయాల్ని చరిత్రకారులింకా మదింపు చేస్తూనే ఉన్నారు. అతడి బలాల్నీ, బలహీనతల్నీ కూడా నిష్పక్షపాతంగా బేరీజు వేస్తూనే ఉన్నారు.
 
భౌగోళికంగానూ, రాజకీయంగానూ ఉత్తర దక్షిణ చీనాలను ఏకం చేసిన తరువాత సుయి పాలకులు, ముఖ్యంగా చక్రవర్తి యాంగ్ సాంస్కృతిక ఏకీకరణ మీద దృష్టి పెట్టాడు. ఆరు రాజవంశాల కాలంలో ఉత్తర దక్షిణ చీనాలు రెండింటిమధ్యా కొన్ని భేదాలు స్పష్టంగా రూపుదిద్దుకున్నాయి. మొదటిది, ఉత్తర చీనాను మంగోల్ తెగలు ఆక్రమించుకుంటూ ఉండేవి కాబట్టి, సాంస్కృతికంగా, వారు మాట్లాడే భాష, ఆ కవితాసామగ్రి, ఆ శబ్దాలు, ఆ సంగీతం అవన్నీ కూడా పురుషకంఠంలో, సైనిక స్వభావం కలిగినవిగా ఉండేవి. ఆ భాష చాలావరకు అసంస్కృతంగా, మొరటుగా, సూటిగా ఉండేది. తాత్త్వికంగా వారు తమకి అర్థమయినంతమేరకు కన్ ఫ్యూసియన్ భావజాలాన్నే నమ్ముకుంటూ ఆచరణ వేదాంతానికే అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు.
 
దక్షిణ చీనా ఇందుకు భిన్నంగా స్త్రీసహజమైన లాలిత్యంతోనూ, సంస్కృతితోనూ, సున్నితమైన భావుకతతోనూ కనిపించేది. కన్ ఫ్యూసియన్ భావజాలాన్ని ఒక నైతిక ప్రాతిపదిక స్థాయికి పరిమితం చేసి, జీవితం గురించీ, జీవితపరమార్థం గురించీ డావోయిజం, బౌద్ధాలతో కూడిన లోతైన మార్మిక చర్చను వారు ఇష్టపడేవారు. ‘జువాన్-జుయె’ గా ప్రసిద్ధి చెందిన ఆ మార్మిక చర్చ సత్యం గురించిన ఒక విశుద్ధి మార్గం. అందులో కంటి ఎదట ఉన్న జీవితవాస్తవికతతో సంబంధంలేని, ఒక శాశ్వత సత్యం గురించిన మీమాంస కొనసాగుతూ ఉండేది. కవులు ఆ విశుద్ధ మీమాంసకు కావ్యరూపం ఇవ్వడానికి తపించేవారు.
 
రాజకీయంగా చీనా ఏకమయ్యాక, సుయి చక్రవర్తులు సాంస్కృతికంగా ఉత్తర, దక్షిణ చీనాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసాల్ని పూరించడం మీద దృష్టిపెట్టారు. ఇందుకు గాను, రెండు భాషల్లోనీ పదజాలానికీ ఉమ్మడి నిఘంటువులు తయారు చేయడం, జీవితచరిత్రల్నీ, వంశచరిత్రల్నీ గ్రంథస్థం చేయడం, ధర్మశాస్త్రాల్ని క్రోడీకరించడం మొదలుపెట్టారు. సుయి రాజ్యస్థాపకుడు చక్రవర్తి వెన్ ఉత్తరచీనా సంస్కృతి పట్ల ఎక్కువ అభిమానం చూపించాడుగాని, తన కొడుకుని పదేళ్ళ పాటు దక్షిణ చీనాలో పాలకుడిగా నియమించినందువల్ల, చక్రవర్తి యాంగ్ దక్షిణచీనా సాహిత్యం పట్లా, సంస్కృతి పట్లా ఎక్కువ మక్కువ పెంచుకున్నాడు. తర్వాత రోజుల్లో తాను చక్రవర్తి అయినతర్వాత తన ఆస్థానంలో ఎవరో పండితులు దక్షిణ చీనా భాష గురించి తక్కువచేసి మాట్లాడారని వారిని కొరడాలతో కొట్టించాడట.
 
దక్షిణ చీనా పట్ల చక్రవర్తి మనసులో దాచుకోలేకపోయిన ప్రేమని అతడి ఆస్థాన కవులు కవిత్వంలో దాచుకోలేకపోయారు. దేన్నో పోగొట్టుకున్న దిగులు, బెంగ ఆ కవిత్వంలో కనిపిస్తూనే ఉండేవి. ఆ కవుల్లో సుప్రసిద్ధుడైన జుయే డావోహెంగ్ ( 540-609) రాసిన ఒక కవితని ఇక్కడ పొందుపరుస్తున్నాను. చీనా ఎల్లలు విస్తరింపచెయ్యడానికి సుయి పాలకులు చేస్తూ వచ్చిన యుద్ధాల్లో సామాన్యపౌరుల శోకం ఆ కవితలో మనం చూడవచ్చు.
 
సుయి పాలనాకాలంలో పుట్టి తాంగ్ పాలన తొలికాలందాకా జీవించిన వాంగ్ జి (590-644) సుయి-తాంగ్ పరివర్తన యుగానికి పూర్తి ప్రతినిధి కవి అని చెప్పవచ్చు. తన ముందు కాలాలకు చెందిన పరివ్రాజక కవుల్ని నమూనాగా పెట్టుకుని అతడు కవిత్వం చెప్పాడు. తావో చిన్ లాగా ప్రభుత్వోద్యోగాన్ని వదిలిపెట్టి, పల్లెకి పోయి రైతులాగా బతకాలనుకున్నాడుగాని, జీ లింగ్ యూన్ లాగా మూడు సార్లు ఉద్యోగ పరిత్యాగం చేసి, మళ్ళా మూడు సార్లు ఉద్యోగంలో చేరకుండా ఉండలేకపోయాడు. కాని అతడికీ, అతడి పూర్వపు పరివ్రాజక కవులకీ మధ్య స్పష్టమైన తేడా ఉంది. వారిలానే అతడు కూడా ఒక విశుద్ధ మీమాంసనే ప్రేమించాడు. కానీ దాన్ని ఈ ప్రపంచం నుంచి దూరంగా జరగడానికి కాక, తన కాలం నాటి రాజకీయ-సాంస్కృతిక ఏకీకరణ ప్రయత్నాల పట్ల తన అపనమ్మకాన్ని వ్యక్తం చేయడానికి వాడుకున్నాడు. ఈ అశాశ్వత ప్రపంచంలో మార్పు ఒక్కటే మార్పులేని సత్యం అయినప్పుడు నువ్వు ఏ స్థిర సత్యాల్ని క్రోడీకరించగలుగుతావు అన్నది అతడి ప్రశ్న.
 
 

జుయే డావొ హెంగ్

 

ఏ కబురూ లేదు

 
వేలాడుతున్న లతలు బంగారుగోడల్ని కప్పేస్తున్నాయి
లతలు, మూలికలు మళ్ళా అదే ఎత్తుకి పెరుగుతున్నవి.
 
తామరపూల కొలనులు పొంగిపొర్లుతున్నవి
బాటలకి ఇరుపక్కలా రాలిన పూలు గాల్లో ఎగురుతున్నవి.
 
మల్బరీతోటల్లో కావ్యనాయిక ఆకులు ఏరుతున్నది
మగ్గం దగ్గర మరొక పురాణవనిత వస్త్రం నేస్తున్నది.
 
కొండదగ్గర నా సంచారసహచరుడికి వీడ్కోలు చెప్పి వచ్చాక
నా ఒంటరిగదిలో నేనొక్కత్తినీ, గాలీ, జాబిలీ తోడుగా.
 
ఇంక నా చిరునవ్వు వెయ్యి మొహరీల విలువ చెయ్యదు.
నా కనుకొలకుల్లో పారదర్శకాలు రెండు అశ్రుబిందువులు.
 
చక్కని నగిషీ చెక్కిన ఆ ముంచేతి అద్దం కనిపించడం లేదు
గుమ్మానికి కట్టిన తెరలు మరీకిందకి జారిపోయాయి.
 
నా ఆత్మ ఒక రాత్రిపిట్టలాగా ఎక్కడికో ఎగిరిపోతూంటుంది.
అలసినిద్రపోతానా, కోడికూత నన్ను లేపేస్తుంది.
 
కిటికీ చుట్టూ చీకటిలో సాలెపురుగులు గూళ్ళు కడుతున్నాయి
ఇంటిదూలాలమీంచి పిచుకగూళ్ళు రాలిపడుతున్నాయి.
 
కిందటేడు అతడు ఉత్తరం వైపు కనుమ దాటాడు
ఇప్పుడు తూర్పు దిక్కుగా సాగిపోయాడు.
 
వెళ్ళినప్పణ్ణుంచీ అతణ్ణుంచి ఏ కబురూ లేదు
గుర్రాల డెక్కల చప్పుడు కోసం చెవి రిక్కించనిదెవ్వరు?
 

వాంగ్ జి

 

లూ హే లో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసాక ఇంటిబాట పడుతూ

 
ఆ శ్వేతమేఘసుధాసింధుమధ్యంలో నా ఇల్లు
చెట్లమధ్యకి, నదుల చెంతకి నా పునర్యానం.
 
జీవితం యశోవంతం కావాలని కోరిక లేదు నాకు
ఇక మబ్బులమధ్యా, మంచులోనే నా శేషజీవితం.
 
తావోచిన్ తన పొలంలో జొన్నలు పండించుకున్నాడు
సైనికదళంలో చేరానంటే, జీతం కోసమా చేరింది?
 
తాగిన మత్తులోనే ప్రభాతం వెనక ప్రభాతం మేల్కొంటాను
పానపాత్రల మధ్యనే రాత్రుళ్ళు గడిచిపోవాలనుకుంటాను.
 
21-4-2022

Leave a Reply

%d bloggers like this: