యుగయుగాల చీనా కవిత-21

ఆరవశతాబ్దాన్ని సంపూర్ణ శతాబ్దం అనవచ్చు. ఆ వందేళ్ళల్లో ప్రాచీన చీనా సమస్తం చూసింది. వైభవం, వినాశనం-రెండూ సమానంగా అనుభవంలోకి వచ్చిన కాలం. చీ రాజవంశానికి చెందిన రాజకుమారుడు అష్టదిగ్గజాల్ని ప్రోత్సహించాడనీ, వాళ్ళల్లో ఒక రాకుమారుడు కూడా ఉన్నాడనీ చెప్పానుకదా. ఆ రాకుమారుడు 502 లో చక్రవర్తి వూ గా లియాంగ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అప్పణ్ణుంచీ 549 లో అతడు మరణించేదాకా, దాదాపు యాభై ఏళ్ళపాటు అతడు ప్రాచీన చీనాలో అత్యుచ్చ శకాన్ని ఆవిష్కరించాడు. తదనంతరకాలంలో చీనాని పరిపాలించిన తాంగ్ రాజుల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటూ ఉంటారు. తాంగ్ యుగానికి పూర్వపు చీనాలో లియాంగ్ చక్రవర్తి వూ పరిపాలనా కాలమే స్వర్ణయుగంగా చెప్పవచ్చు. ఎప్పుడో ఝౌ చక్రవర్తుల కాలంలో చీనా చవిచూసిందని కీర్తించబడ్డ సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని హాన్ చక్రవర్తులు కూడా పూర్తిగా సాధించలేనిదాన్ని లియాంగ్ చక్రవర్తి సాధించగలిగాడు.
 
ఆరవ శతాబ్దపు మొదటి యాభై ఏళ్ళు అత్యున్నతమైన సాంస్కృతిక స్ఫూర్తి చీనా సమాజాన్ని ఆవహించింది. అది మూడు విధాలుగా కనిపిస్తుంది. మొదటిది, తమకాలానికి అందివచ్చిన సాహిత్య, సాంస్కృతిక వారసత్వం పట్ల, సంప్రదాయం పట్ల గొప్ప ఆసక్తి, శ్రద్ధ. ఆ సంప్రదాయం ద్వారా ప్రాచీన చీనాని పునర్దర్శించాలన్న కోరిక, అక్కడితో ఆగకుండా, కొత్త ప్రయోగాల ద్వారా ఆ సంప్రదాయాన్ని భవిష్య తరాలకు నవీన రీతిలో అందించాలన్న తపన. సహజంగానే ఏ కాలంలోనైనా సాంస్కృతిక వైభవ దశలో రాజ్యాలూ, సమాజాలూ చేసేది ఈ పనే కదా.
 
చీనా లో మధ్యయుగాలు సా.శ మూడవ శతాబ్దానికే మొదలయ్యాయి. మధ్యయుగాల చీనా సమాజంలో పౌరులు ఉన్నత వర్గాలు, సామాన్యవర్గాలుగా విడివడి ఉండేవారు. ఉన్నత కులీన వర్గాలకు చెందిన వాళ్ళు పన్ను కట్టనక్కర్లేదు. కాయకష్టం నుండి మినహాయింపు ఉండేది. అది ఒక privileged class. కాని ఆ స్థాయి కేవలం పుట్టుక మీద మాత్రమే ఆధారపడి ఉండేది. హాన్ యుగం తర్వాత, ఉత్తరాది మూకల దాడికి తట్టుకోలేక కులీన వంశాలు యాంగ్జే పరీవాహక ప్రాంతానికి తరలివచ్చి దక్షిణాది రాజ్యాల్ని స్థాపించిన తర్వాత, ఉత్తరాది కులీన కుటుంబాలు దక్షిణాది ప్రజలకన్నా తమ సాంస్కృతిక అధిక్యతను నిలబెట్టుకుంటూనే ఉండేవారు. అంటే జియాన్ కాంగ్ రాజధానిగా ఏర్పడ్డ దక్షిణ రాజ్యాల్లో అందరికన్నా అగ్రశ్రేణిలో ఉత్తరాది నుంచి తరలి వచ్చిన కులీన కుటుంబాలు, ఆ తర్వాత శ్రేణిలో దక్షిణాది కులీన కుటుంబాలు, ఆ తర్వాత సామాన్యప్రజలు ఉండేవారు. కాబట్టి, దక్షిణ ప్రాంతానికి చెందిన సామాన్య పౌరులకి చదువుకోవడానికి గాని, రాజోద్యాగాలకు కాని అవకాశాలు చాలా స్వల్పంగా ఉండేవి.
 
చక్రవర్తి వూ అన్నిటికన్నా ముందు ఈ సామాజిక స్తబ్ధతను ఛేదించడం మీద దృష్టి పెట్టాడు. పుట్టుకను బట్టి కాక, ప్రతిభను బట్టి చదువుకీ, ఉద్యోగాలకీ అవకాశాలు కల్పించాడు. ఈ సంస్కరణలు హాన్ చక్రవర్తులు ప్రవేశపెట్టినవే కాని, మధ్యలో మూడు నాలుగు శతాబ్దాల రక్తచరిత్ర వాటిని కనుమరుగు చేసింది. యుక్తవయస్సులో సాహిత్యాన్ని ఆరాధించేవాడు రాజయితే అతడి పాలన ఎంత సాంస్కృతికంగా ఉంటుందో చక్రవర్తి వూ ఒక ఉదాహరణ. రాజ్యానికీ, పాలనకీ, సామాజిక ధర్మాలకీ సంబంధించినంతవరకూ అతడు కన్ ఫ్యూసియన్. అంటే ఆచరణ వేదాంతి అనవచ్చు. కాని ప్రగాఢమైన జీవన తాత్త్వికతను అర్థం చేసుకునే క్రమంలో అతడు బౌద్ధుడు కూడా. బౌద్ధ గ్రంథాల్ని స్వయంగా అభ్యసించినవాడు. భారతదేశం నుండి సంస్కృత పండితుల్ని రప్పించి ఒక దార్శనిక సదస్సును కూడా ఏర్పాటు చేసాడు. జంతువధని, మరణదండనని నిషేధించాడు. కవుల్ని ప్రోత్సహించడం కోసం ఎప్పటికప్పుడు పోటీలు పెట్టేవాడు. అందులో నెగ్గినవారికి, లేదా చక్కటి పద్యం వినిపించినవారికి కానుకలిచ్చేవాడు. మనకు తెలిసిన రాజుల్తో పోల్చాలంటే అతణ్ణొక హర్షుడు, భోజుడు అనవలసి ఉంటుంది.
 
సాహిత్య ప్రపంచంలో అతడి పాలనాకాలం మొత్తం యోంగ్ మింగ్ ( శాశ్వత ప్రకాశం) యుగమే అని చెప్పవచ్చు. ఒకప్పుడు అష్టదిగ్గజాల్లో ఒకడిగా, అతడి మిత్రుడిగా ప్రధాన పాత్ర పోషించిన షెన్-యూయే చక్రవర్తి వూ ఆస్థానంలో కూడా అగ్రతాంబూలం అందుకున్నాడు. అతడితో పాటు రెన్-ఫాంగ్ అనే మరో కవి కూడా. ఆ కాలంలో ఎన్నో రచనలు సంస్కృతం నుండి, పాళీనుండి చైనీస్ లోకి అనువాదమయ్యాయి. ప్రాచీన చీనా కవిత్వాన్ని ఏరి సంకలనం చెయ్యడం మొదలయ్యింది. చక్రవర్తి కుమారుడు జియావో టోంగ్ సంకలనం చేసిన ‘వెన్-జువాన్ ‘ ప్రాచీన చీనా కవిత్వానికి సంబంధించిన అత్యంత సమగ్ర సంకలనం. అత్యున్నత స్థాయి కవిత్వాన్ని, షి, ఫూ, యెఫూ ప్రక్రియలు మూడింటిలోనూ మకుటాయమానమైన కవిత్వాన్ని అందులో ఏరి కూర్చారు.
 
ఆ కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన మరొక కవిత్వ శాఖ గోంగ్-టి. దాన్ని ఇంగ్లిషులో palace poetry అని వ్యవహరిస్తున్నారు. అలాగని దాన్ని అంతఃపుర కవిత్వంగా భావించడం పొరపాటు అవుతుంది. జూ-లింగ్ అనే భావుకుడు అటువంటి కవిత్వం నుంచి స్మరణీయమైన కొన్ని కవితల్ని ఎంపికచేసి New Songs from a Jade Terrace అనే సంకలనంగా కూర్చాడు. అందులో మూడవ శతాబ్దం నుంచి ఆరు శతాబ్దం దాకా కవితల్ని ఎంపిక చేసాడు. ప్రాచీన చీనా సంస్కృతిలో మనకు తరచు కనవచ్చే jade అనే మాట కి స్పష్టంగా ఇదీ అర్థం అని చెప్పలేం. అనేక సందర్భాల్లో ఆ పదప్రయోగాన్ని బట్టి, దాన్నొక శ్రేష్టతాపూర్వక విశేషణంగా చెప్పుకోవచ్చు. కాని ఇక్కడ jade అంటే లలిత సౌందర్యాభిరుచిని సూచించేదిగా భావించవచ్చు.
 
దృగ్విషయాలు అశాశ్వతం అనే బౌద్ధ స్ఫూర్తిలో వికసించిన కవిత్వం అని కూడా రాజమందిర కవిత్వాన్ని వర్ణించవచ్చు. ఒక దృశ్యాన్ని వర్ణిస్తున్నప్పుడు దానిలోని వివరాల మీద దృష్టి పెట్టడం బావో ఝావో తో మొదలయ్యింది. ఆ తర్వాత యోంగ్ మింగ్ కవులు ఇంద్రియ సంవేదనలు పట్టుకోగలిగిన అన్ని రంగుల్నీ, రాగాల్నీ పట్టుకునే విద్య సాధన చేసారు. ఆ దారిలో ఇంకా దృశ్యప్రపంచంలో ఇంకా ఏదైనా అస్పష్టత మిగిలిఉంటే, ఇంకా ఏదైనా చూడకుండా, వినబడకుండా మిగిలిపోయి ఉంటే, దాన్ని palace poetry పూర్తిగా వెల్లడిచేసేసింది. అందుకనే ఒక సాహిత్యచరిత్రకారుడు a typical palace-style poem is an act of uncovering and unconcealment..’ అన్నాడు.
 
అలా యాభై ఏళ్ళ అత్యున్నత సాహిత్య, సాంస్కృతిక జీవితాన్ని ప్రాచీన చీనా చవిచూడగా 548 లో హౌ-జింగ్ అనేవాడు జియాన్ కాంగ్ కు వచ్చి ఒక తిరుగుబాటు లేవదీసాడు. చక్రవర్తిని గృహనిర్బంధం చేశాడు. దాంతో 549 లో చక్రవర్తి అత్యంత దీనపరిస్థితిలో మరణించగా అతడి కొడుకు జియావో-కాంగ్ 549 నుండి 551 దాకా రెండేళ్ళ పాటు కీలుబొమ్మగా పరిపాలన చేసాడు. 554 లో లియాంగ్ సామ్రాజ్యం పూర్తిగా కూలిపోయి, చెన్ రాజ్యం మొదలయ్యింది. ముప్పై ఏళ్ళ పాటు బలహీనమైన పాలనని అందించిన చెన్ సామ్రాజ్యాన్ని కూలదోస్తూ, ఉత్తర దక్షిణ చైనాల్ని ఏకం చేస్తూ 589 లో సుయి రాజ్యం మొదలుకాగానే ఆరురాజ వంశాల చీనా చరిత్ర ముగిసిపోయింది.
కేవలం యుద్ధంలో చెన్ రాజుల్ని ఓడించడంతో ఆగకుండా సుయి చక్రవర్తి చెన్ రాజధాని జియాన్ కాంగ్ నగరాన్ని పూర్తిగా నేలమట్టం కావించాడు. ఇళ్ళు, భవనాలు, గోడలు అన్నింటినీ కూలగొట్టి నగరం మొత్తాన్ని వ్యవసాయభూమిగా మార్చేసాడు. అంతవరకూ పదిలక్షల పైగా జనాభాతో ఆరవ శతాబ్ది ప్రపంచంలో అతిపెద్ద నగరంగా (రోమ్, కాన్ స్టాంటినోపుల్, లొయాంగ్ లు కూడా దానికన్నా చిన్నవే) నాలుగు శతాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన జియాన్-కాంగ్ నగరం ఒక స్మృతిగా మారిపోయింది. మన హంపీ విజయనగరంలో కనీసం భువన విజయపు ఆనవాళ్ళను వెతకవచ్చు. కాని జియాన్ కాంగ్ లో రోంగ్ -మింగ్ (ఆరని వెలుగు) సాహిత్యంలో మాత్రమే శాశ్వతప్రకాశంగా మిగిలిపోయింది.
 
దాదాపు ఒక శతాబ్ద కాలం పాటు చీనా అనుభవించిన అత్యున్నత సమయాల్నీ, అత్యంత దుర్భర సమయాల్నీ కూడా చీనా కవులు కవితల్లో నిక్షిప్తం చేసారు. వైభవోజ్జ్వల యోంగ్ మిగ్ యుగానికి చెందిన షెన్-యూయే పరిణత కవిత్వం ఆరవ శతాబ్దపు తొలిదశకాల్లో రాసినదే. అతడు పండితుడు, ప్రయోగశీలి, ప్రచారకుడు, చరిత్రకారుడు ప్రతి ఒక్కటీను. అతడి ప్రతిభకి నిరూపణగా ఏవో రెండు మూడు కవితలు చూపించడం కష్టం.
 
ఆరవ శతాబ్ది కవులు ప్రస్తావించవలసిన వారు మరికొందరున్నారు. కాని, ఆ యుగానికి చెందిన కవుల్ని మరొక నలుగుర్ని మాత్రమే పరిచయం చేస్తాను. ఒకరు హో సున్. షెన్ యూయే అతడి కవిత్వాన్ని ఎంతగా అభిమానించేవాడంటే, అతడి కవితల్ని రోజుకి కనీసం మూడు సార్లన్నా చదువుకోకుండా ఉండలేకపోయేవాడట. ఆ కవితలు ఒకసారి చేతుల్లోకి తీసుకుంటే పక్కన పెట్టెయ్యలేకపోయేవాడట.
 
యిన్ కెంగ్ చక్రవర్తి అభిమానానికి పాత్రుడైన కవి. తర్వాత రోజుల్లో దు-ఫూ, లి-బాయి కవిత్వం యిన్ కెంగ్ స్థాయికి దరిదాపుల్లో నిలబడగగలదని అన్నాడంటే యిన్ కెంగ్ ప్రతిభ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు.
 
లియాంగ్ సామ్రాజ్యపు పతనాన్ని కళ్ళారా చూసి, ఆ యుగాంతాన్ని అత్యంత ప్రతిభావంతంగా గానం చేసిన యూ-జిన్ (513-81) ని చదువుతుంటే మనకు ఈనాటి పాలస్తీనా కవులు గుర్తొస్తారు. హౌ జింగ్ జియాంగ్ కాంగ్ ను ముట్టడించినప్పుడు యూ-జిన్ పారిపోయాడు. అక్కణ్ణుంచి ఎట్లానో చాంగాన్ చేరుకున్నాడు. కొన్నాళ్ళకు లియాంగ్ రాజ్యం స్థానంలో చెన్ రాజ్యం వచ్చిన తరువాత కూడా యూ-జిన్ ఉత్తరాది జౌ రాజ్యంలోనే చిక్కుబడిపోయాడు. అక్కడ జౌ చక్రవర్తులు అతణ్ణి ఎంతో ఆదరంగా, గౌరవంగా చూసారు. కాని అది అతడికి తన స్వదేశం మీద ఉన్న బెంగని ఏ మాత్రం తగ్గించలేకపోయింది. తన స్వజనాన్ని, తన పుట్టిన ప్రాంతాన్ని వదిలి దూరదేశంలో మరొక రాజు పంచన ఆదరం, గౌరవం పొందుతున్నందుకు అతడి ఆత్మ క్షోభించడం మొదలుపెట్టింది. ఆ దుఃఖంలో అతడు Lament for the South అనే ఒక దీర్ఘ కవిత రాసాడు. ప్రవాస దుఃఖాన్ని వ్యక్తీకరించడంలో చీనా సాహిత్యంలో అటువంటి కవిత మరొకటి లేదు. అందులో బెంగ, అపరాధ భావం, అవమానం, వినష్టహృదయం మాత్రమే లేవు. నిజానికి అది ఒక ప్రదేశానికి దూరమైన దుఃఖం కాదు. తిరిగి రాని, ఎన్నటికీ తాను తిరిగి చూడలేని ఒక వైభవోజ్జ్వల శకం గురించిన దుఃఖం.
 
ఇక చెన్ రాజ్యపు చివరి పాలకుడు చెన్ షుబావో చాలా రాజవంశాల చివరి పాలకుల్లానే భోగలాలసుడు. మద్యానికీ, మగువలకీ అంకితమయినవాడు. తన రాజ్యం కూలిపోతోందని తెలిసినప్పుడు ఒక బౌద్ధ మఠానికి తనను తాను అమ్మేసుకున్నాడని చెప్తారు. కాని అతడి రాజ్యాన్ని అంతమొందించి ఉత్తర దక్షిణ చీనాలను ఏకం చేసిన సుయి పాలకులు అతణ్ణి గౌరవంగానే చూసారు. అతడి చివరిదినాల దాకా అతడికి మద్యాన్ని, కవిత్వాన్నీ అందిస్తూనే ఉన్నారు. ఆ విధంగా ఆరవశతాబ్ది కవిత్వంలో పుట్టి, కవిత్వంలోనే ముగిసిపోయింది.
 
~
 

షెన్ యూయె

విద్యాశాఖ కార్యాలయంలో దిగులుతో కూచున్నప్పుడు

 
బయట రాచబాటమీద శీతాకాలపుగాలి కీచుమంటోంది
దక్షిణమందిరంలోంచి దాని దుఃఖం వినవస్తున్నది.
 
వేదనాభరితమానవుడొకడు తనగదిలో పడివున్నాడు
పెద్దపెద్ద గవాక్షాలమీద గాలి చప్పుడు చేస్తోంది.
 
శూన్య ఛాయ ఒకటిమందిరంలో కుంటుతున్నది.
దేవతామందిరాల్లో చీకటి పడుతున్నది, ప్రగాఢ నిశ్శబ్దం.
 
తలుపునుంచి వేలాడుతూ సాలీడు గూడు అల్లుకుంటున్నది
సాయంకాలవిహంగాలు చూరుకు చేరుకుంటున్నవి.
 
నా కొలువు దుస్తులు, ఓహ్, వాటిని చూస్తే ఎంత సిగ్గేస్తోంది
ఇప్పుడు నదీతీరానికో, కడలిచెంతకో పోవడం అసాధ్యం.
 
అక్కడ కొండల మీద ఒక దాల్చినచెట్టు పిలుస్తున్నది
ఏడాది ముగుస్తున్నది, పద, ఇంటికి పోయే వేళయ్యింది.
 

హో సున్

 

చంద్రోదయం చూస్తూ, నాలాగా దారిలో ఇరుక్కుపోయిన తోటి ప్రయాణీకులకు వినిపించడానికి రాసిన కవిత

 
దీర్ఘనదీ ప్రవాహం చెంతన మా మజిలీలో మొదటిరాత్రి,
పగిలిన అద్దమొకటి మేఘాల మధ్య మెరుస్తున్నది.
 
శతసహస్ర యోజనాల మేరకు, ఇవాళ
నీళ్ళల్లో మరొక తేమ చంద్రవంక మిలమిల.
 
ప్రశాంత సైకతసీమలాగా స్ఫటికస్వచ్ఛంగా,
మృదుతరంగ ధవళిమలాగా ప్రకాశవంతంగా.
 
ప్రతి ఒక్కరి చూపులూ ఇంటివైపు, కళ్ళల్లో నీళ్ళు.
హృదయం పగిలినవాణ్ణి నేనొక్కణ్ణే కాదన్నమాట.
 

యిన్-కెంగ్

ఒక మిత్రుడికి వీడ్కోలు చెప్పడానికి యాంగ్జే నది ఒడ్డుకి ఆలస్యంగా చేరుకున్నప్పుడు

 
బెంగతో అడుగుపెట్టాను నది ఒడ్డున నావలు ఆగే చోటుకి.
రేవు దగ్గర నిలబడి సుదూరంలోకీ చూసాను కన్నార్పకుండా.
 
పడవవెళ్ళిపోయింది, కలవరం పూర్తిగా సద్దుమణిగింది.
నిన్నెక్కించుకున్న నావ మేఘాల్లోకి తేలిపోయింది.
 
రేవు శూన్యమైపోయింది, మిగిలింది పక్షులొక్కటే.
వీడ్కోళ్ళు చెప్పిన బంధుమిత్రులు ఇళ్ళకు వెళ్ళిపోయారు.
 
హేమంతకాననాలమీంచి శీర్ణపత్రాలు ఎగిరివస్తున్నాయి.
అస్తమయసంధ్యవేళ జాలరులు నదిలో వలలు బిగిస్తున్నారు.
 
ఎందుకిట్లా మనం ఒకరినుంచి ఒకరం సెలవుతీసుకోవాలి?
నువ్వేమో దూరతీరాలకీ? నేనేమో నగరద్వారానికీ?
 

యూ-జిన్

 

మరణించిన తన మిత్రుడికి నివాళి ఘటిస్తూ

 
నువ్విప్పుడు ఏ పర్వతాలమీదనో చీకట్లలో కలిసిపోయావు.
నేనేమో ఇక్కడ సుదూరదేశంలో చిక్కుపడిపోయాను.
 
జీవిస్తున్నవాళ్ళూ, మరణించినవాళ్ళూ వేరువేరంటారుగాని
ఇప్పుడు ఇద్దరం ఒక్కలానే ఉన్నాం, వెనక్కి తిరిగి రాలేకుండా.
 
చాలాకాలం కిందట నేను ఉద్యోగంలో చేరుతున్నప్పుడు
నువ్వు ఈ ప్రపంచపు దుమ్మునుంచి పారిపోజూస్తున్నావు.
 
కనుమదగ్గర కాపలాదారు లావోత్సేని గుర్తుపట్టినట్టు
నేను కూడా నిజమైన పరివ్రాజకుణ్ణి పోల్చుకోగలననుకున్నాను.
 
ఇంతలో హటాత్తుగా ఈ వార్త. గండశిలలాంటి నా మిత్రుడు
పూలకన్నా సున్నితమైనవాడు, దేహాన్ని నిలుపుకోలేకపోయాడని.
 
విలపించండి, విలపించండి, నిజమైన సాధువులకోసం
దుఃఖించండి, దుఃఖించండి, సత్పురుషులకోసం.
 
ఇంకా అమరగిరులమీద కొంగలు ఎగుర్తూనే ఉన్నాయి
వసంతకాలం రాగానే సురతరువులు పుష్పిస్తున్నాయి.
 
చివరికి, నేను చెయ్యగలిగిందల్లా, నా స్నేహితుణ్ణి తలచుకుంటూ,
ఒక పూర్వకాలపు కవిలాగా, ఈ నది ఒడ్డున ఈ పద్యం పలకడమే.
 

చెన్ సుబావో

 

అంతఃపుర ఉద్యానంలో వికసించిన కల్పలత

 
పూలతోటలమధ్య పందిళ్ళకెదురుగా సుందర హర్మ్యాలు,
ఆమె అలంకృతవదనం ఒక నగరాన్ని కూల్చెయ్యగలదు.
 
తలుపు తీసి, ఆ వెలుతుర్లో క్షణం పాటు సందేహిస్తో ఆగింది
అప్పుడు తెరలు పక్కకు తోసి చిరునవ్వుతో స్వాగతించింది.
 
సమ్మోహసుగంధం చిమ్మే ఆమె వదనం మంచునిండిన పువ్వు.
ఆ కల్పలత కాంతి అంతఃపుర ఉద్యానమ్మీద ప్రతిఫలిస్తున్నది.
 
19-4-2022

Leave a Reply

%d bloggers like this: