మరికొన్ని కలలు, మెలకువలు-3

Reading Time: 4 minutes

‘The best time to plant a tree is twenty years ago. The second best time is now.’

a Chinese proverb

2016 లో సెంటర్ ఫర్ ఇన్నొవేషన్స్ యిన్ పబ్లిక్ సిస్టమ్స్ లో చేరినప్పుడు విద్య గురించి మరింత లోతుగా అధ్యయనం చెయ్యడానికి అవకాశం దొరికింది. అప్పటికి కొన్ని కలలు కొన్ని మెలకువలు పుస్తకం రాసి ఇరవయ్యేళ్ళు దాటింది. ఆ ఇరవయ్యేళ్ళ అనుభవాలు గ్రంథస్థం చేద్దామనిపించింది. విద్యారంగంలో నూతన ఆవిష్కరణల గురించీ, 21 వ శతాబ్దానికి అవసరమైన విద్యావిధానం గురించీ అప్పుడు నాలో ఎన్నో కొత్త ఊహలు, కొత్త స్పందనలు పరవళ్ళు తొక్కుతూ ఉన్నాయి. వాటిని నలుగురితో పంచుకోవాలనీ, రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల్నీ, విద్యావేత్తల్నీ స్పందింపచెయ్యాలని గట్టిగా అనుకున్నాను. 2017 లో కొంత రాయడం మొదలుపెట్టానుగానీ, ముందుకు పోలేదు. కాని అది కూడా ఒకందుకు మంచిదే అని ఇప్పుడనిపిస్తోంది.

ఎందుకంటే, ఆనాడు నేనొకరోజు రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించిన కీలకబాధ్యతలు నిర్వహిస్తానని ఊహించలేదు. గిరిజన సంక్షేమ పాఠశాలలు సంఖ్యరీత్యా చిన్నవేకాక, అవి నడిచే సామాజిక-సాంస్కృతిక పరిస్థితులు చాలా ప్రత్యేకమైనవి. ఆ పాఠశాలల నేపథ్యంలో మొత్తం విద్యారంగం గురించి నేను పూర్తి అవగాహనకు రావడం కష్టం. కాని ఒకసారి పాఠశాల విద్యాశాఖాధిపతిగా పనిచేసిన తరువాత, నేనిన్నేళ్ళుగా ఆలోచిస్తూ వచ్చిన విషయాల్లో, మాట్లాడుతూ వచ్చిన ఆలోచనల్లో, ఏవి నిజంగా ఆచరణాత్మకమో, ఏవి కావో నాకొక్కసారిగా తెలిసివచ్చింది. అంతేకాదు, కరికులం రూపకల్పన, ఉపాధ్యాయ శిక్షణ, పాఠశాలల పాలన, నిర్వహణ మొదలైన అంశాల గురించి పాఠశాల విద్యలో పనిచేస్తే తప్ప చాలా విషయాలు నీకెప్పటికీ బోధపడవు. కాబట్టి, ఈ రచన అయిదేళ్ళ కిందట వెలువడి ఉంటే, ఇది చాలా అసమగ్రంగా ఉండి ఉండేదనడంలో నాకెటువంటి సందేహమూ లేదు.

ఇప్పుడు ఈ అనుభవ కథనాన్ని నేను అయిదు అధ్యాయాలుగా రాయబోతున్నాను. మొదటి అధ్యాయంలో రామకృష్ణారావు గారి కోరికమేరకు శ్రీశైలం లో నా అనుభవాలు రాయనున్నాను. చెంచువారి కోసం నడుస్తున్న సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా శ్రీశైలంలో మూడేళ్ళు గడిపాను. అప్పటివి పూర్తిగా విద్యకు సంబంధించిన అనుభవాలు కాదు. కాని ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా అత్యంత బలహీనంగా ఉన్న ఒక గిరిజన తెగ ఎటువంటి స్థితిగతుల్లో జీవిస్తూ ఉన్నదో నేను కళ్ళారా చూసి ఉండకపోతే, వారితో కలిసి మూడేళ్ళు పనిచేసి ఉండకపోతే, విద్య గురించిన నా ఆలోచనలు నిస్సందేహంగా ఇలా ఉండేవి కావు.

శ్రీశైలం నుండి తిరిగి హైదరాబాదులో రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో 2000లో చేరాను. ఎన్నో విధాలుగా అది ఒక మైలురాయి. కొత్త శతాబ్దం మొదలుకావడమే కాదు, అంతర్జాతీయంగా మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు (2000-2015) ఆ ఏడాది నుంచే అమల్లోకి రావడం మొదలయ్యింది. అందరికీ విద్యని అందించడం కోసం డాకార్ ప్రకటన వెలువడింది కూడా ఆ ఏడాదే. మరోవైపు 21 వ శతాబ్దపు ఆ తొలిదశకంలోనే మనకి గ్లోబలైజేషన్ కొద్ది కొద్దిగా బోధపడుతూ వచ్చింది. ఇప్పుడు మనం విద్య గురించి ఏం మాట్లాడుకోవాలన్నా, గత ముప్పై ఏళ్ళుగా ప్రపంచంలో సంభవిస్తున్న గ్లోబలైజేషన్‌ ని అర్థం చేసుకుని ఆ నేపథ్యంలో పరిశీలించవలసి ఉంటుంది. అందుకని రెండవ అధ్యాయంలో గ్లోబలైజేషన్‌ గురించి కొంత వివరించడానికి ప్రయత్నించేను.

గత రెండు దశాబ్దాలుగా గ్లోబలైజేషన్‌ గురించి చాలా సమాచారం మనకి అందుబాటులోకి వచ్చింది. గ్లోబలైజేషన్‌ ని స్వాగతించేవాళ్ళూ, తీవ్రంగా విమర్శించేవాళ్ళూ కూడా సమానంగానే ఉన్నారు. ఆ రెండు వాదాలకీ సమర్థనగా వచ్చిన వాజ్మయమంతటినీ సాకల్యంగా చదివి, నిష్పాక్షికంగా మనకి పరిచయం చెయ్యగల రచనలు తెలుగులో చెప్పుకోదగ్గవేమీ రాలేదు. ప్రపంచవ్యాప్తంగా విద్యమీద గ్లోబలైజేషన్‌ చూపించగల, చూపిస్తున్న ప్రభావాల మీద ఇంగ్లీషులో చాలా రచనలే వచ్చినప్పటికీ, ఆ ప్రభావాల్ని సమగ్రంగా సమీక్షించే రచనలింకా రావలసే ఉంది. ఈ నేపథ్యంలో, గ్లోబలైజేషన్‌ సందర్భంలో విద్య వర్తమానం,భవిష్యత్తుల్ని కూడా రెండవ అధ్యాయంలో చర్చించాను.

గ్లోబలైజేషన్‌ అన్నిటికన్నా ముందు సాంకేతిక పరిణామాల మీదా, సమాచార విప్లవం మీదా ఆధారపడ్డ ప్రక్రియ. పారిశ్రామికీకరణలానే అది కూడా వెనక్కి తిప్పలేని పరిణామం. మనం చెయ్యగలిగిందీ, చెయ్యవలసిందీ, ఆ సాంకేతిక విప్లవం ఫలాల్నీ, ఫలితాల్నీ నలుగురికీ అందేలా చూడటం, ఎంతో కాలంగా సమాజంలో అప్రధానీకరణకు గురై, వెనకబడి ఉన్న సమూహాలూ, జాతులూ ఈ ప్రయాణంలో మరింత వెనకబడి పోకుండా ఉండేలా చూడటం.

అభివృద్ధి సమతా ప్రధానంగా ఉండటంకోసం గత ముప్పై ఏళ్ళుగా, ముఖ్యంగా 1996 లో యునెస్కో నియమించిన ఎడ్యుకేషన్‌ కమిషన్‌ వారు సమర్పించిన నివేదిక మొదలుగా ఎన్నో ఆలోచనలూ, హెచ్చరికలూ,లక్ష్యాలూ మనముందుకొస్తూనే వున్నాయి. వాటిని కూడా స్థూలంగా రెండో అధ్యాయంలో చర్చించేను. గ్లోబలైజేషన్‌ లోని సాంకేతిక, వాణిజ్య పార్శ్వాల్నీ, ఈ నివేదికలు అందిస్తున్న దిశానిర్దేశంతో కలిపి చదువుకుంటే తప్ప, విద్య గురించిన సమగ్ర చిత్రం మనముందు సాక్షాత్కరించదు.

గ్లోబలైజేషన్‌ వల్ల రూపొందుతున్న నూతన ప్రపంచానికీ, గత ముప్పై ఏళ్ళకిందటిదాకా మనం చూస్తూ వచ్చిన ప్రపంచానికీ చాలా తేడా ఉంది. మనం 21 వ శతాబ్దంలో అడుగుపెట్టి 21 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ, ఈ రెండు దశాబ్దాల కాలంలో, ప్రపంచ వైజ్ఞానిక చిత్రపటం మనం ఊహించలేనంతగా మారిపోయినప్పటికీ మన పాఠశాలలు, మన విద్యాప్రణాలికలూ ఇంకా ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నాయి. ఇంకా మనం 19 వ శతాబ్దపు పారిశ్రామిక నమూనాలోనే మన పాఠశాలలు నడుపుతున్నాం. మన ఉపాధ్యాయుల్ని కూడా ఆ రీతిలోనే తర్ఫీదు చేస్తున్నాం. మారుతున్న పరిస్థితుల్ని ఏ కొద్దిగానో పసిగట్టిన తల్లిదండ్రులు కూడా పూర్తి సమాచారం అందుబాటులో లేక, సమగ్రంగా విశ్లేషించి చెప్పేవాళ్ళు లేక, చాలాసార్లు అరకొర సమాచారం మీదనే తమ పిల్లల భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక, అటువంటి తల్లిదండ్రులు ఎన్నుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూడా విద్య గురించి అటువంటి అసమగ్ర విధానాలే రూపొందించడంలో ఆశ్చర్యమేముంటుంది! వీటన్నిటి ప్రభావాన్నీ అంతిమంగా పిల్లలు తలదాల్చవలసి వస్తున్నది.

2008 లో గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో అదనపు సంచాలకుడి పోస్టు ఒకటి ఏర్పడంతో నేను అదనపు సంచాలకుడిగా పదోన్నతి పొందాను. 2008 నుండి 2016 దాకా అదనపు సంచాలకుడిగా పనిచేసాను. ఆ కాలంలో ఎన్నో ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి. వాటిలో మొదటిది, 2009 లో భారతప్రభుత్వం తీసుకువచ్చిన విద్యాహక్కు చట్టం. అప్పటికి ఇరవయ్యేళ్ళుగా ప్రతి ఒక్కరికీ విద్యని అందుబాటులోకి తీసుకురావాలని చేసిన ప్రయత్నాల ఫలితం అది. రెండవది, గిరిజన బాలబాలికలకు కనీస అక్షరాస్యతా సామర్థ్యాలు కల్పించడం కోసం పునాది అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించేం. 90 ల మొదట్లో తలెత్తిన సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాల తర్వాత రాష్ట్రంలో ఉద్యమ స్థాయిలో చేపట్టిన కార్యక్రమం అదే. అలాగే 1975 నుండీ విధానపత్రాలకు మాత్రమే పరిమితమైన గిరిజన ఉప ప్రణాళికా వ్యూహానికి చట్టబద్ధత లభించింది కూడా ఆ కాలంలోనే. 2014 లో రాష్ట్రవిభజన జరిగింది. ఆ తరువాత 2015 మరొక మైలురాయి. అప్పటిదాకా అమల్లో ఉన్న మిలీనియం అభివృద్ధి లక్ష్యాల స్థానంలో సస్టెయినబుల్ అభివృద్ధి లక్ష్యాలు (2015-2030) మనముందుకొచ్చాయి. ఆ లక్ష్యాలకు అనుగుణంగా నవ్యాంధ్ర ప్రదేశ్ లో గిరిజనాభివృద్ధి కోసం ఒక దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాం. ఇవన్నీ మూడవ అధ్యాయంలో వివరించాను.

2016 లో రాష్ట్ర కార్యాలయం విజయవాడకు తరలించాక, నాకు అనుకోకుండా హైదరాబాదులోని సెంటర్ ఫర్ ఇన్నొవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ లో సలహాదారుగా పనిచేసే అవకాశం లభించింది. 2017 నుండి 18 దాకా రెండేళ్ళు సిప్స్ లో పనిచేసాను. ఆ ఉద్యోగం నా ఆలోచనాపరిథిని ఎంతో విస్తరింపచేసింది. అక్కడ చేరాక, అసలు 21 వ శతాబ్దం ఏమి కోరుకుంటున్నది,అందుకు పిల్లల్ని సంసిద్ధుల్ని చెయ్యాలంటే వారికి ఎటువంటి నైపుణ్యాలు అలవరచవలసి ఉంటుందనేవిషయం మీద లోతుగా పరిశీలించే అవకాశం దొరికింది. 21 వ శతాబ్ది నైపుణ్యాల గురించి గత శతాబ్దపు చివరి దశకంలోనే కొంత ఆలోచన మొదలైనప్పటికీ, వాటి గురించి మరీ ఇటీవలి కాలంలోనే చెప్పుకోదగ్గ స్పష్టత సాధ్యపడుతూ ఉంది. ఆ నైపుణ్యాల గురించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చను పరిచయం చెయ్యడంతో పాటు, నాకై నేను కూడా కొంత స్పష్టత సాధించుకోడానికే నాలుగవ అధ్యాయమంతా కేటాయించాను.

21 వ శతాబ్దానికి అవసరమైన విద్యానైపుణ్యాలకీ, గత నూరూ, నూట యాభై ఏళ్ళుగా మనం అలవాటు పడ్డ విద్యావిధానానికీ మధ్య ఇంకా పొంతన కుదరడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో, కొత్త ప్రపంచానికి తగ్గట్టుగా పిల్లల్ని రూపొందించగల పాఠశాలలు ఎలా ఉండాలి, అటువంటి పాఠశాలలు ఉన్నాయా, ఉంటే ఎక్కడున్నాయి అన్న అన్వేషణ లో నేను కన్నవీ, విన్నవీ కూడా నాలుగవ అధ్యాయంలొ చర్చించేను.

ముఖ్యంగా ఆ పాఠశాలలు చేస్తున్న ప్రయోగాల గురించీ, అనుసరిస్తున్న ఉత్తమపద్ధతుల గురించీ, నెలకొల్పుతున్న ఉదాహరణల గురించీ వివరంగానే చిత్రించేను. దేశంలోనూ,తెలుగు రాష్ట్రాల్లోనూ నేను స్వయంగా చూసిన పాఠశాలల గురించి మాత్రమే కాక, విదేశాల్లో అమలు జరుగుతున్న ప్రయోగాలగురించి నేను తెలుసుకున్నవాటి గురించి కూడా రాసేను. ఆ ప్రయోగాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు వాటి గురించి మరింత తెలుసుకోగలరనే ఉద్దేశం కూడా అందుకు కారణం.

కాని ఈ పాఠశాలు ఎంత ఇన్నొవేటివ్‌ గా నడిచినా, ఎంత ప్రయోగశీలాలుగా ఉన్నా కూడా, వాటిలో కొన్ని రంగాల్లోనో, కొన్ని పార్శ్వాల్లోనో ఇంకా పాత పద్ధతులే కొనసాగడం కూడా చూసాను. చాలాసార్లు ఆ పాఠశాలలు తాము చేపడుతున్న ప్రయోగాలమీదనే తమ శక్తిసామర్థ్యాలన్నీ మోహరించడం చూసాను. కొన్నిసార్లు ఒకే పాఠశాలలో ఒక పార్శ్వానికీ, మరొక పార్శ్వానికీ పొంతన లేకపోవడం కూడా చూసాను. అదీకాక, సాధారణంగా ఏదైనా కొత్త ప్రయోగమో, కొత్త పోకడనో నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఆలోచించేది, ఆర్థికవనరులతో సంబంధం లేకుండా ఆ ప్రయోగాన్ని మనం కొనసాగించగలమా అనేది. ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకుని, ఒక ప్రభుత్వ పాఠశాలని 21 వ శతాబ్దానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలంటే ఏం చెయ్యాలో ఆలోచిస్తూండగానే నాకు ఐ ఏ ఎస్ లో కి పదోన్నతి లభించడం, పాఠశాల విద్యాశాఖలో పనిచేసే అవకాశం లభించడం వెంటవెంటనే జరిగాయి. ఇన్నేళ్ళుగా నేను ఆలోచిస్తున్నదీ, లేదా పరిమిత స్థాయిలో అమలు చెయ్యగలిగిందీ, రాష్ట్రస్థాయిలో అన్ని పాఠశాలల్లోనూ అమలు చెయ్యగలిగే అవకాశం లభించడం నా భాగ్యం. 2019 నుండి 2021 దాకా రెండున్నరేళ్ళు పాఠశాల విద్యాశాఖలోనూ, ఆ తర్వాత పదవీ విరమణ చేసేదాకా గిరిజన సంక్షేమశాఖలోనూ నేను చేపట్టిన ప్రయత్నాల్ని అయిదవ అధ్యాయంలో వివరించేను.

నేను చూసినదాన్ని బట్టి, తెలుసుకున్నదాన్ని బట్టి, అర్థం చేసుకున్నదాన్ని బట్టి మన పాఠశాలలకీ, ఉపాధ్యాయులకీ, తల్లిదండ్రులకీ, విద్యార్థులకీ, ముఖ్యంగా ప్రభుత్వానికీ ఉపయోగపడే ఎన్నో సూచనలు చేసాను. నా సూచనలన్నింటినీ అందరూ అంగీకరిస్తారనీ, ఆచరిస్తారనీ నేను భావించడం లేదు. కాని, ప్రస్తుతం నడుస్తున్న విద్యావిధానానికి కాలం చెల్లిందనీ, కొత్త ప్రపంచానికి తగ్గట్టుగా మన విద్య రూపొందాలనీ, ఆ ప్రక్రియలో సమాజంలో ఇంతదాకా వెనకబడ్డ వర్గాలకూ, సమూహాలకూ కూడా ప్రాధాన్యం లభించాలనీ నలుగురికీ తెలిసినా చాలు, నా పుస్తకం సఫలమయినట్టే.

9-5-2022

Leave a Reply

%d bloggers like this: