మరికొన్ని కలలు, మెలకువలు-2

‘మనం మన పిల్లలకు ఇవ్వగలిగినవి రెండే: భూమిలోకీ చొచ్చుకున్న వేర్లూ, ఆకాశంలోకీ చాచుకున్న రెక్కలూ.’

-ఒక ఆఫ్రికన్ సామెత

ఇంతకు ముందు విద్య గురించిన నా అనుభవాలు పంచుకున్నప్పుడు నేను నా కలల గురించీ, ఆ కలల్ని నిజం చేసుకోడానికి నాకు లభించిన అవకాశాలు నాకిచ్చిన మెలకువల గురించీ మాట్లాడేను. అది నా ఉద్యోగ జీవితపు తొలిప్రాయం. అప్పుడు ఏదో ఒకటి చెయ్యాలన్న ఉత్సాహం, ఏ చెయ్యడానికేనా ఆకాశమే హద్దు అనేటంత ధీమా ఉంటాయి. అది తొలిసారిగా రెక్కలు విప్పుకున్న కాలం.

కాని ఇప్పుడు నేను పంచుకోబోతున్నది ఆ తర్వాత పాతికేళ్ళుగా నా అనుభవాలు. ఇవి ప్రభుత్వ విధానాల్నీ, ప్రభుత్వ కార్యక్రమాల్నీ, ప్రణాళికల్నీ చాలా దగ్గరగా, లోతుగా చూసిన అనుభవాలు. మొదటి పదేళ్ళ అనుభవాలు క్షేత్రస్థాయి అనుభవాలు. అక్కడ ఏదైనా చేయడానికి, ప్రభుత్వ కార్యక్రమాల్ని అమలు చేయడానికీ చాలా స్వాతంత్య్రం ఉంటుంది. కాని నేను రాయబోతున్న పాతికేళ్ళ అనుభవాల్లో ఎక్కువకాలం నేను ప్రభుత్వ ఉద్దేశాల్ని, ప్రభుత్వాలకుండే పరిమితులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు రూపొందించడానికి సంబంధించినవి. అంటే నేను క్షేత్రస్థాయి కార్యకర్తనుండి దాదాపుగా విషయనిపుణుడిగా, ప్రణాళికారూపకర్తగా మారిన కాలం అన్నమాట. కాబట్టి ఈ కాలమంతటా నా ముందున్నవి కలలు కాదు, ప్రశ్నలు. ఎన్నో ప్రశ్నలు. ఎడతెరిపిలేని ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు నా అనుభవాలమీంచీ, అంతదాకా నాకు కలిగిన మెలకువల్లోంచీ జవాబులు వెతకవలసిన బాధ్యత కూడా చాలాసార్లు నా మీదనే పడింది. ఆ జవాబులు కొన్ని అప్పటికప్పుడు, ఆ సమయానికీ, సందర్భానికీ సరిపోయేవి. కొన్ని ఎప్పటికైనా పనికొచ్చేవి. చాలాసార్లు నేను వెతుక్కున్న సమాధానాలు కాలానికన్నా, నా చుట్టూ ఉన్న సమాజంకన్నా ముందునిలబడి వెతుక్కున్నవి. ఇది నేనున్నచోటనే భూమిలోకి మరింత లోతుగా వేర్లు తన్నిన కాలం.

ఇన్నాళ్ళుగా ఒక యుద్ధాశ్వంలాగా విరామం లేకుండా పరుగులు తీసాక, ఇప్పుడు పాతికేళ్ళ తరువాత, గడిచిన ఈ కాలాన్నంతటినీ ఒకసారి సింహావలోకనం చేసుకోవాలని ఉంది. ఎందుకంటే, ఎవరికీ లభించని ఒక అరుదైన అవకాశం నాకు లభించింది. అది విద్య గురించి పనిచేయడమే కాదు, గిరిజన విద్య గురించి పనిచెయ్యడం. అంతే కాదు, గిరిజన విద్య అనే ప్రయోగశాలలో రాబట్టిన ఫలితాల్ని మొత్తం పాఠశాల విద్యారంగంలో తిరిగి విస్తరింపచేసే అవకాశం కూడా.

కాని ఈ క్రమంలో నేను అపారమైన నిస్పృహకీ, అంతులేని నిరాశకీ లోనైన క్షణాలూ, దినాలే ఎక్కువ. చాలాసార్లు, ప్రభుత్వమూ, సమాజమూ కూడా తమ చుట్టూ సంభవిస్తున్న పరిణామాల్ని అర్థం చేసుకోకుండా, దీర్ఘకాల ప్రయోజనాలకోసం ప్రయత్నించకుండా అప్పటికప్పుడు ఆకర్షణీయంగానో, కంటితుడుపుగానో కనిపించే పనుల్లో తమ శక్తినీ, కాలాన్నీ వ్యయపరచడం చూస్తే నాకు పట్టలేనంత ఆగ్రహం కలిగేది. ఆ వెంటనే తట్టుకోలేనంత నిస్సహాయతా ఆవరించేది.

కాని అట్లాంటి క్షణాల్లోనే మనం అత్యంత నిరుపేదరాలూ, దుర్బలురాలూ అయిన ఒక బాలికను కళ్ళముందు ఊహించుకోవాలనీ, మన ప్రయత్నాలు ఆమెకి ఏ విధంగానైనా మేలు చేస్తాయా అని పరిశీలించుకోవాలనీ, మేలు చేస్తాయనిపిస్తే, మన ప్రయత్నాల్ని ఆపకుండా కొనసాగించాలనీ మహాత్మాగాంధీ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. తన మాటల్ని ఆయన ఒక తాయెత్తుగా అభివర్ణించారు. ఆ తాయెత్తు మహిమవల్లనే ఈ పాతికేళ్ళకాలంలో ఎన్నో కఠినాతికఠినమైన పరీక్షల్లో ఉత్తీర్ణుణ్ణి కాగలిగేను.

1997-2022 మధ్య ఈ పాతికేళ్ళల్లో ప్రపంచంలో చాలా మార్పులు సంభవించేయి. ముఖ్యంగా ఇరవయ్యవ శతాబ్దం ముగిసి 21 వ శతాబ్దంలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు గడిచిపోయేయి. సాంస్కృతికంగానూ, సాంకేతికంగానూ కూడా మన జీవితం ఊహించలేనంతగా మార్పుకి లోనవుతూ ఉంది. ఈ మార్పు అన్నిటికన్నా ముందు మన విద్యారంగాన్నే తీవ్రంగానూ, గాఢంగానూ ప్రభావితం చేస్తోంది.

సమాజం మారాలనీ, పురోగమించాలనీ, ఆ పురోగమనంలో సామాజిక అసమానతలు తొలగిపోవాలనీ ఆశించేవాళ్ళు ఒకప్పుడు ఉత్పత్తి సాధనాల మీద సాంఘిక నియంత్రణ రావాలని కోరుకున్నారు. కాని, ఇప్పుడు విజ్ఞానమే అన్నిటికన్నా ముఖ్యమైన ఆర్థికవనరుగా మారిపోయింది. మారుతున్న ప్రపంచంలో ఈ ఆర్థికవనరు మీద మళ్ళా కొద్దిమందికి మాత్రమే హక్కు లభిస్తూ ఉంది. దీనివల్ల, ప్రపంచంలో అసమానతలని తొలగించగలదనుకున్న విద్య, మనుషుల మధ్య, జాతుల మధ్య, దేశాల మధ్య తీవ్రమైన అసమానతలకు కారణమవుతూ ఉన్నది. ఒకప్పుడు భూసంస్కరణలద్వారానో లేదా శ్రామిక విప్లవాల ద్వారానో అసమానతలను తొలగించగలమనే నమ్మకం ఉండేది. కాని విజ్ఞానపరంగా తలెత్తే అసమానతలని తొలగించగలమని నమ్మలేం. ఇందుకు మనముందున్న ఒకే ఒక్క మార్గం, మన పిల్లలకు మనం అందించే విద్య పట్ల పూర్తి జాగ్రత్త వహించడం. మన విద్యావ్యవస్థను సమూలంగా సంస్కరించుకోవడం. మనం అభివృద్ధి చెందాలి. అదే సమయంలో ఆ అభివృద్ధి నలుగురినీ కలుపుకుపోగల ఇంక్లూసివ్‌ గ్రోత్‌ కావాలి.

ఈ పాతికేళ్ళుగా గిరిజనసంక్షేమ శాఖలోనూ, ఆ తర్వాత విద్యాశాఖలోనూ ప్రణాళికలు రూపొందిస్తూన్నప్పుడు నా ముందున్న సమస్య ఇదే: ఈ అభివృద్ధి క్రమంలో గిరిజనబాలబాలికలు, అలాగే నిరుపేద బాలబాలికలందరూ కూడా భాగస్వాములు కావడం ఎలా. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలవల్లనో, రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణలవల్లనో కాకుండా తమంతట తాము గిరిజన యువత బయట మార్కెట్తో పోటీపడి తమకంటూ ఒక ఉపాధినీ, వ్యక్తిత్వాన్నీ సమకూర్చుకోవడం ఎలా? తాము చదువుకోవడానికి ప్రభుత్వపాఠశాలల వైపు చూస్తున్న లక్షలాది బాలబాలికలకి ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకురావడానికి అవసరమైన సామర్థ్యాలు కల్పించడం ఎలా?

ఈ పాతికేళ్ళల్లో ఎన్నో ప్రణాళికలు రూపొందించేను, ఎన్నో పాఠశాలలు చూసేను, కొత్తగా ఎన్నో పాఠశాలల రూపకల్పనకి కృషిచేసాను. ఎందరో విద్యావేత్తల్ని కలుసుకోగలిగేను. ఎంతో చదివేను, తెలుసుకున్నాను. ముఖ్యంగా, ఈ చివరి మూడేళ్ళల్లో పాఠశాల విద్యాశాఖలో, సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేయడం నాకు గొప్ప అవకాశం. అంతకు ముందు మూడు దశాబ్దాల పైబడి, గిరిజన విద్యారంగం దృక్పథం నుండి పాఠశాల విద్యని చూస్తూ, ఆ శాఖ దృక్పథంలో, పనితీరులో, సంస్కృతిలో ఏ మార్పులు రావాలని కోరుకున్నానో, ఆ మార్పులకి స్వయంగా శ్రీకారం చుట్టడానికి నాకు అవకాశం లభించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్వం ఏ ప్రభుత్వాలూ చూపించనంత ప్రత్యేక శ్రద్ధ పాఠశాల విద్య పట్ల చూపిస్తూ, అనూహ్యమైన పెట్టుబడులు పెట్టడానికీ, సమూలమైన సంస్కరణలు చేపట్టడానికీ సిద్ధపడటం నాకు గొప్ప తోడ్పాటునిచ్చింది.

కాని సరిగ్గా ఇప్పుడే నా పదవీవిరమణ సమయం కూడా దగ్గర కావడంతో నేను రెండున్నర సంవత్సరాలు మాత్రమే పాఠశాల విద్యాశాఖలో పనిచేయగలిగాను. కాని ఒక మనిషి ఒక రంగాన్ని ప్రభావితం చేయడానికి అదే రంగంలో జీవితకాలం పాటు ఉండనవసరం లేదు. ఎన్నాళ్ళు పనిచేసావన్నది కాదు, నువ్వు నమ్మిన దాన్ని నిజం చెయ్యడానికి ఎంత బలమైన ప్రయత్నం చేసావన్నది ముఖ్యం. అంతదాకా ఎవరూ దృష్టి పెట్టని అంశాల మీద నలుగురి దృష్టినీ నువ్వు మళ్ళించగలిగితే, ఎవరూ లేవనెత్తడానికి సాహసించని ప్రశ్నల్ని లేవనెత్తగలిగితే, అదే చాలు.

చాలాసార్లు కాలప్రవాహంలో పడి మనమెన్నో విధాన నిర్ణయాల్లో, ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములం అవుతాం. అప్పటికి అవి కొత్తగానూ, బహుశా ప్రపంచంలో మనమొక్కరమే కనుక్కుని అమలు చేస్తున్నామన్నట్టు ఉంటుంది. కాని పాతికేళ్ళు గడిచాక వెనక్కి చూసుకుంటే, మనం లోనైన అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తూ ఉన్నవే అని అర్థమవుతుంది. మనలానే మరెందరో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ నవీనపవనాల్ని రెండు చేతులా ఆహ్వానించేరనీ, అందులో కొన్నిసార్లు విజయం పొందారనీ, మరికొన్ని సార్లు విఫలం చెందారనీ కూడా అర్థమవుతుంది. అందుకని, ఇలా గడిచిన అనుభవాల్ని పర్యావలోకించుకోవడం కూడా మరో సారి ఆ అనుభవాలకు లోను కావడం లాంటిదే అనుకుంటాను. మొదటిసారి ఆ అనుభవాలకు లోనయినప్పుడు వీలుకాని ఇంట్రాస్పెక్షన్ ఇప్పుడు వీలవుతుంది. ఇది మన అనుభవాల్ని తరువాతి తరాల వారికి ఒక పాఠంగా మారుస్తుంది.

ఆ అనుభవాల స్ఫూర్తితో నువ్వింతదాకా పట్టుకున్న దివిటీ తమ చేతుల్లోకి తీసుకుని నీకన్నా మరింత ముందుకు పోగలిగిన ఉద్యమకారులు తప్పకుండా వస్తారు. రానున్న రోజుల్లో విద్యారంగంలో అటువంటి ఉద్యమకారులు రానున్నారన్న ఆశతో వారికి నా అనుభవాల్నీ, నా అధ్యయనం ఆధారంగా నేను నేర్చుకున్న పాఠాల్నీ, ఆ పాఠాల వెలుగులో నేను సూచించగల కొన్ని వ్యూహాల్నీ అందించడానికే ఈ అనుభవ కథనం మొదలుపెడుతున్నాను.

బాలబాలికల్ని ఉద్దేశించి డా.ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం ఒక పుస్తకం రాసారు. దాన్ని నేను ‘ఈ మొగ్గలు వికసిస్తాయి’ (2009)పేరిట తెలుగులోకి అనువాదం చేసాను. ఆ పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో కలాం ‘నేను ఈ పుస్తకంలో రాసిందంతా నేనేది ప్రత్యక్షంగా చూసానో, అనుభవించానో దానిమీద ఆధారపడిందే ’ అని రాసుకున్నాడు. ఆ మాట ఈ కథనానికి కూడా వర్తిస్తుంది

8-5-2022

Leave a Reply

%d bloggers like this: