మరికొన్ని కలలు, మెలకువలు-1

దాదాపు ఇరవయి ఏళ్ళ కిందటి మాట. 2004 లో అనుకుంటాను, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా మిత్రుడు, సాహిత్యాభిమాని సింగం లక్ష్మీనారాయణ గుంటూరు రమ్మని పిలిచాడు. ఆ రోజు అక్కడ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ సత్కార సమావేశంలో ఆ హాలంతా ఉపాధ్యాయులతో కిక్కిరిసిపోయింది. వాళ్ళతో నేను విద్యారంగంలో నా అనుభవాలు కొన్ని ముచ్చటించేను. నా ప్రసంగానికి గొప్ప స్పందన లభించింది.

ఆ రోజు ఆ సమావేశానికి నా మిత్రుడు ఎమెస్కో విజయకుమార్‌ కూడా వచ్చాడు. ఆ రాత్రి మేం కారులో హైదరాబాదు తిరిగివస్తుంతసేపూ ఆయన ఆ ప్రసంగం గురించీ, నా అనుభవాల గురించే మాట్లాడుతూ ఉన్నాడు.

‘మీ ప్రసంగం విన్నాక, మీలో విద్య గురించి గొప్ప అంతర్మథనం సాగుతోందనిపించింది. మీలోపల్లోపల కదలాడుతున్న భావాల్ని కాగితం మీద పెట్ట కూడదా’ అన్నాడాయన.

ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే నేనాయనకి మూడు వ్యాసాలు రాసి చూపించాను. ‘మీరు ఇంటినుంచి ఏమి నేర్చుకోవాలి?’, ‘మీరు బడినుంచి ఏమి నేర్చుకోవాలి?’, మీరు సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి?’ అనే రచనలు.

అవి పిల్లల్ని ఉద్దేశించి చెప్తున్నట్టుగా రాసినవి. ఆయన వాటిని వెంటనే ప్రచురించాలనుకున్నాడు . వాటికి చక్కటి ఇలస్ట్రేషన్లు కూడా వేయిస్తే బాగుంటుదనుకున్నాం. కాని ఎవరితో వేయించాలి?

అప్పుడు నాకు, ప్రసిద్ధ చిత్రకారుడు, గొప్ప ఉపాధ్యాయుడూ బి.ఎ.రెడ్డిగారు అత్తాపూర్‌ లో, యంగ్‌ ఎన్వాయిస్‌ ఇంటర్నేషనల్‌ పేరిట ఒక ఆర్ట్‌ స్కూల్‌ నడుపుతున్న విషయం గుర్తొచ్చింది. 1982 లో స్థాపించిన ఆ పాఠశాల ద్వారా ఆయన ఎందరో పిల్లల్లోని చిత్రకళ ప్రతిభని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కొందరు మామూలుగా బడికి వెళ్ళి చదువుకునే పిల్లలు, కొందరు రకరకాల పనులుచేసుకుంటూ జీవికనడుపునేవాళ్ళూ. వాళ్ళందరినీ ఆయన రంగుల ప్రపంచంలోకి ప్రవేశపెట్టి గొప్ప చిత్రకారులుగా తీర్చి దిద్దుతూ ఉన్నారు. వాళ్ళు వేసిన బొమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా జరిగే చిత్రలేఖనం పోటీలకు పంపుతుంటారు. సాధారణంగా అట్లా పోటీలకు పంపిన ఏ ఒక్క చిత్రలేఖనం కూడా బహుమతి గెల్చుకోకుండా ఉండటం అరుదు. మేం మా పుస్తకాలకి ఆ పిల్లలతోటే ఇలస్ట్రేషన్లు వేయిస్తే బాగుంటుందనుకున్నాం. యంగ్‌ ఎన్వాయిస్‌ ఇంటర్నేషనల్‌ వారి సంస్కృతి గ్రామీణ బాలల కళాకేంద్రం లో చిత్రకళ నేర్చుకుంటున్న ఇద్దరు పిల్లలు, వి.భాస్కర్‌, ఎ.కిరణ్‌ కుమార్‌ లు ఆ పుస్తకాలకి చక్కటి బొమ్మలు గీసారు. నా మిత్రుడు వాటిని వెంటనే ప్రచురించేసాడు.

కాని, అతడి దాహం తీరలేదు. ఆ పుస్తకాలు చిన్నపిల్లలకోసం రాసినవనీ, విద్య గురించి పెద్దవాళ్ళకీ ముఖ్యంగా ఉపాధ్యాయులకీ ఉపయోగపడేలా ఒక పుస్తకం రాయమని అడిగాడు విజయకుమార్‌. నేను విద్య గురించిన నా భావాలు, ఎన్నేళ్ళుగానో అభివ్యక్తికోసం అర్రులు చాస్తున్న ఆలోచనల్నీ,అభిప్రాయాల్నీ రాసి కొన్ని పేజీలు పంపించాను. వాటిని చదివి ఆయన ఆ రోజు గుంటూరులో భావోద్వేగానికి గురయినట్టే గొప్పగా చలిస్తాడనుకున్నాను. కాని ఆయన ఆ కాగితాలు నాకు వెనక్కి పంపేసాడు. వాటిని ఆయనా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో సభ్యులుగా ఉన్న ప్రసిద్ధ విద్యావేత్త విటపు బాలసుబ్రహ్మణ్యం, మరికొందరు జనవిజ్ఞానవేదిక మిత్రులూ కలిసి చదివారు. వాళ్ళందరూ భావించేదంటే, నేను విద్య గురించిన తాత్త్వికభావాలు రాయడం కన్నా, నా జీవితంలో నేను చేసిన ప్రయోగాలూ, లోనైన అనుభవాలూ రాయడం అవసరమని. అవి కూడా సరళమైన శైలిలో,ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల్ని దృష్టిలో పెట్టుకు రాస్తే బావుంటుందనీ.

ఆ మిత్రుల సూచనలమేరకు నా అనుభవాలు నేను గ్రంథస్థం చేసాను. వాటిని నేను రాసేననడం కన్నా, ఆ మిత్రులతో కలిసిరాసేననడం సముచితంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను రాస్తూ వచ్చిన కథనాన్ని వాళ్ళు ఓపిగ్గా చదివి చర్చించి తమ అభిప్రాయాలూ, సూచనలూ చెప్తూ వచ్చారు. నేను ఆ విధంగానే నా అనుభవాలు రాస్తూ వచ్చాను.

అందులో మొదటి భాగంలో నేను నా దృష్టిలో ఆదర్శపాఠశాల అంటే ఎలా ఉండాలో ఒక రేఖా చిత్రం గియ్యడానికి ప్రయత్నించేను. మేం చదువుకున్నప్పటి తాడికొండ గురుకుల పాఠశాలలో అట్లాంటి ఆదర్శాలు ఎంతవరకూ సాకారమయ్యేయో వివరించడానికి ప్రయత్నించేను. ఆ తర్వాత అధ్యాయాల్లో, నేను జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా పార్వతీపురం, ఉత్నూరు, పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల్లో పనిచేసినప్పటి అనుభవాలూ, ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో విద్యాప్రణాళికలు రూపొందించడం దాకా రాసేను. ఆ పదేళ్ళ కాలంలో గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికోసం చేపట్టిన ప్రయత్నాలూ, చేసిన ప్రయోగాలూ, ఎదురైన వైఫల్యాల కథనం అది. ఆ రచనని తాడికొండ గురుకులపాఠశాలకి అంకితం చేసాను.

ఆ పుస్తకం ఆవిష్కరణ సమావేశం ఒక సెమినార్‌ లాగా జరిగింది. తన జీవితమంతా దళితుల, గిరిజనుల సంక్షేమానికే అంకితం చేసిన సి.వి.కృష్ణారావుగారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించేరు. ప్రాథమిక విద్యలోనూ, గిరిజన విద్యారంగంలోనూ జీవితకాల కృషి చేసిన విద్యావేత్తలూ, పరిపాలనా దక్షులూ ఆ సమావేశంలో పాల్గొన్నారు.

ఆ పుస్తకం నేను తాడికొండ గురుకుల పాఠశాలకి అంకితం చేసినప్పటికీ, నేను స్వయంగా ఆ రచనని ఆ పాఠశాలకు అందించలేకపోయాను. నేను ఆశించకుండానే రావెల సోమయ్యగారు ఆ బాధ్యత తన భుజాల మీద వేసుకున్నారు. ఆయన ఆ ఊరికి అల్లుడు కూడా. సోమయ్యగారి సతీమణి, పండితురాలు, వక్త రావెల అరుణ గారు తాడికొండ బిడ్డ. సోమయ్యగారు నా పుస్తకాన్ని తాడికొండ తీసుకువెళ్ళి ఆ గురుకుల పాఠశాల ప్రిన్సిపాలుగారి చేతుల్లో పెట్టారు.

రాష్ట్రమంతా ఆ పుస్తకం మీద చర్చాగోష్టులు నిర్వహించాలని నిర్వహించాలని విజయకుమార్‌ సంకల్పించేడు. ఒక సమావేశం విజయవాడలో వికాసవిద్యావనం ప్రాంగణంలో జరిగింది. కాని రకరకాల కారణాల వల్ల ఆ గోష్టులు ముందుకు సాగలేదు. కాని సర్వ శిక్షా అభియాన్‌ పథకం కింద పెద్ద ఎత్తున పాఠశాలల్లో గ్రంథాలయాలు తెరిచినప్పుడు ఈ పుస్తకం కూడా పాఠశాలకు చేరగలింది. 2005 లో వెలువడినప్పటినుంచీ, ఇప్పటిదాకా ఎందరో ఉపాధ్యాయులు ఆ పుస్తకం చదివారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోనూ, ఇప్పుడు రెండు రాష్ట్రాలనుంచీ ఇప్పటికీ ఎవరో ఒక ఉపాధ్యాయుడో, ఉపాధ్యాయినినో తానా పుస్తకం చదివి ఎంతో కొంత స్ఫూర్తి పొందినట్టుగా చెప్తూనే ఉన్నారు.

2

‘కొన్ని కలలు-కొన్ని మెలకువలు’ పుస్తకాన్ని అభిమానించి ఆదరించినవాళ్ళల్లో నా మిత్రుడు, ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.రామకృష్ణారావు ఉన్నారు. ఆ పుస్తకం విడుదలయినప్పుడు ఆయన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ గా ఉన్నారు. ఆయన ఆ పుస్తకం చదివాక, ‘నాకు మీ అనుభవాల గురించి ఇంకా వినాలని ఉంది. మీ శ్రీశైలం అనుభవాలు కూడా గ్రంథస్థం చేస్తే చదవాలని ఉంది’ అన్నారు.

నేను గిరిజన సంక్షేమ శాఖలో 1987 లో చేరాను. ఎనిమిదేళ్ళపాటు జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా పనిచేసాను. ఆ తర్వాత రెండేళ్ళ పాటు గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో రెండేళ్ళు పనిచేసాను. చెంచు గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా పనిచేయడానికి 1997 లో శ్రీశైలం వెళ్ళడంతో ఆ పుస్తకం ముగుస్తుంది.

1997 నుంచి 2000 దాకా మూడేళ్ళు శ్రీశైలంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా పనిచేసాక, మళ్ళా ప్రధానకార్యాలయంలో వచ్చిచేరేను. ఆ తర్వాత 2008 దాకా ఎనిమిదేళ్ళపాటు గిరిజనసంక్షేమశాఖలో సంయుక్తసంచాలకుడిగా పనిచేసాను. 2008 లో అదనపు సంచాలకుడిగా పదోన్నతి పొందిన తర్వాత, 2016 దాకా గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసాను. 2016 చివరలో హైదరాబాదులో ఉన్న సెంటర్‌ ఫర్‌ ఇన్నొవేషన్స్‌ ఇన్‌ పబ్లిక్‌ సిస్టమ్స్‌ లో సలహాదారుగా చేరాను. రెండేళ్ళు ఆ సంస్థలో పనిచేసిన తరువాత తిరిగి మళ్ళా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో అదనపు సంచాలకుడిగా చేరాను. ఇంతలో ఊహించని రీతిలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులోకి నాకు పదోన్నతి లభించింది.

ఐ ఏ ఎస్ లో చేరగానే 2019 లో ప్రభుత్వం నన్ను సర్వ శిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరక్టరుగా నియమించింది. దాంతోపాటు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించాను. 2020 లో నన్ను పాఠశాల విద్యాశాఖ డైరక్టరుగా నియమించడంతో మరొక ఏడాది పాటు పూర్తిస్థాయి సంచాలకుడిగా పనిచేసాను. 2022 మార్చి నెలాఖరున నా పదవీవిరమణకి ముందు నాలుగు నెలల పాటు గిరిజన సంక్షేమశాఖ సంచాలకుడిగా ప్రభుత్వంనియమించింది. దాంతో 1987 లో జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా మొదలైన నా ఉద్యోగ ప్రస్థానం ముప్పై అయిదేళ్ళ తరువాత ఆ శాఖకు సంచాలకుడిగా పనిచేయడంతో ముగిసింది.

1987 నుంచి 1997 దాకా నా మొదటిపదేళ్ళ సర్వీసులో నేను క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా విద్యాకార్యక్రమాలమీదనే దృష్టి పెట్టి పనిచేసాను. 1997 నుంచి 2017 దాకా ఇరవయ్యేళ్ళ కాలంలో విద్యతో పాటు గిరిజనసంక్షేమానికి చెందిన అన్ని రంగాలకూ సంబంధించిన ప్రణాళికల రూపకల్పన, అమలు గురించిన సమీక్ష, పర్యవేక్షణల్లో ప్రభుత్వానికి సహాయపడుతూ వచ్చాను. సిప్స్ లో పని చేసిన రెండేళ్ళూ కూడా గిరిజన విద్యారంగానికి సంబంధించిన ఇన్నొవేషన్స్, ఉత్తమపథకాల గురించిన అధ్యయనం, ఆలోచనలు, చర్చలతోటే గడిచింది.

ఇక నా ఉద్యోగ జీవితం చివరి మూడేళ్ళు పాఠశాల విద్యాశాఖలోనూ, గిరిజన సంక్షేమశాఖలోనూ శాఖాధిపతిగా పనిచేయడంతో నా కెరీర్ పొడుగునా విద్య గురించి నేను చేస్తూ వచ్చిన ఎన్నో ఆలోచనల్ని, కంటూ వచ్చిన ఎన్నో కలల్నీ కార్యాచరణగా మార్చుకోగలిగే అవకాశం లభించింది.

భారతప్రభుత్వం 1986 లో నూతన విద్యావిధానం ప్రకటించిన నేపథ్యంలో నేను 1987 లో ఉద్యోగంలో చేరాను. నా ఉద్యోగజీవితపు చివరి సంవత్సరాల్లో భారతప్రభుత్వం మరొకసారి జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించి అమలు చేయడం మొదలుపెట్టింది. రెండు జాతీయ విద్యావిధానాల మధ్యకాలంలో నా ఉద్యోగజీవితం కొనసాగి ఉండటం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఆ విద్యావిధానాల నేపథ్యంలో ఒక గిరిజనసంక్షేమాధికారిగా, ఒక విద్యాశాఖాధికారిగా నా అనుభవాల్ని, ఆ ప్రస్థానంలో నేనెదుర్కున్న ప్రశ్నల్ని, వాటికి నేను వెతుక్కున్న సమాధానాల్ని గ్రంథస్థం చేయడంవల్ల ఆయా రంగాల్లో కృషి చేస్తున్నవారికి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఈ అనుభవకథనం మొదలుపెడుతున్నాను.

7-5-2022

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%