గాసిప్ ఉన్నచోట బుద్ధుడుండడు

Reading Time: 3 minutes
సాధారణంగా డ్రాయింగు రూముల్లో, ఆఫీసు గదుల్లో, చివరికి దుకాణాల్లో, విమానాశ్రయాల్లో కూడా బుద్ధుడి బొమ్మలో, విగ్రహాలో కనిపిస్తూండటం ఈ మధ్య పరిపాటి అయిపోయింది. ఇంటి యజమానులూ, ఆఫీసర్లూ, రాజకీయనాయకులూ తమ సంపదని ప్రదర్శించుకునే క్రమంలో బుద్ధుడు కూడా చక్కటి అలంకరణ సామగ్రిగా మారిపోయేడు. తమ జీవితానికీ మతానికీ సంబంధంలేదనీ, అయినా తామొక ఉన్నత ఆదర్శాన్ని ఆరాధిస్తూ ఉంటామనీ చెప్పుకోడానికి బుద్ధుడికన్నా మించిన ఐకన్ ప్రస్తుత సమాజానికి మరొకటి కనిపించడం లేదు. అదీకాక మతమంటే, మనకు తెలిసిన కర్మకాండ పాటించే, బౌద్ధమతస్థులెవరూ మనకి పెద్దగా కనిపించనందువల్ల కూడా మతంతో సంబంధంలేని ఒక ఆధ్యాత్మికతను లేదా స్వీయపరిశీలనను లేదా శీలనిర్మాణాన్ని తాము ఇష్టపడుతున్నామని చెప్పుకోడానికి చాలామందికి బుద్ధుడు సౌకర్యవంతమైన పేరుగా, ప్రతీకగా, ప్రభావంగా మారిపోయాడు.
 
కాని ఏ కొద్దిగా తరచి చూసినా, బుద్ధుడి సంభాషణలు ఏ మాత్రం చదివినా, బుద్ధుడి మార్గాన్ని అనుసరించడం ఎంత కష్టమో మనకి తెలియవస్తుంది. నీకంటూ ఒక దేవుడెవరూ లేకుండా, నీ తప్పొప్పుల్ని ఎప్పటికప్పుడు క్షమించుకుంటూ, నీ ప్రార్థనల్ని, నైవేద్యాల్ని కోరుకుంటూ, నువ్వు మరెవర్నీ ఆశ్రయించకుండా తననే నమ్మినంతకాలం నీ యోగక్షేమాల్ని చూసుకుంటాననే ఒక పర్సనలీశ్వరుడు లేకుండా కేవలం నీ స్వీయక్రమశిక్షణ వల్ల మాత్రమే నువ్వు దుఃఖం నుంచి విముక్తి పొందుతావని చెప్పే బుద్ధుడి మాటలు అనుసరించడం ఎంత దుస్సాధ్యమో తెలిసి వస్తుంది. నిజానికి ఆ పర్సనలీశ్వరుడు కూడా మనల్ని కఠినాతికఠిమైన నైతిక క్రమశిక్షణ వైపే నడిపిస్తాడనేది ఏ సాధకుడి కైనా అనుభవంలోకి వచ్చే విషయమే.
 
బుద్ధుడు మన మనసుమీద కలిగించే నైతికమైన ఒత్తిడి మామూలు ఒత్తిడి కాదు. దాన్ని తప్పించుకోడానికి చాలామందికి దొరికిన ఏకైక మార్గం ఆయన విగ్రహాన్ని ఆఫీసుటేబులు మీదనో, డ్రాయింగు రూములో టీపాయి మీదనో పెట్టుకోడం. కొద్దిగా వాస్తు కూడా కలిసి వస్తుందనుకుంటే లాఫింగ్ బుద్ధా బొమ్మ కూడా పెట్టుకోవడం.
 
ఈ మధ్య భారతదేశంలో హిందూ మతోన్మాదం పెరుగుతున్నకొద్దీ, చాలామంది మేధావులకి బుద్ధుడి గురించి ప్రస్తావించడం, ఆయన తత్త్వశాస్త్రం గురించీ, ఆయన రచనలగురించీ రాయడం కూడా ఒక అలవాటుగా మారింది. వారిలో ఎంతమంది నిజంగా బుద్ధుడి సంభాషణలు చదివి ఉంటారో నాకు తెలియదు. ఆ చదివినవారిలో కూడా ఎంత మంది ఆ బోధనల్ని తమ దైనందిన జీవితంలో అనుష్టిస్తూ ఉంటారో నాకు తెలియదు. నిజానికి ఏ ఋషి వాక్యమైనా, ప్రవక్త బోధలైనా వాటిని అనుసరించి, అనుష్టించేవాటివల్లనే బతుకుతాయి, వెలుగుతాయి. ఒట్టి మాటల్లో ఏ బలమూ ఉండదు. వాటికవి శుష్కాలు, నిరర్థకాలూ కూడా.
 
ఉదాహరణకి ఈ మధ్యనే నిర్వాణం చెందిన వియత్నమీస్ బౌద్ధ సన్యాసి థిచ్ నాట్ హన్ ని చూడండి. నాకు ఆయన రచనలు చదువుతూ ఉంటే బుద్ధుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నట్టూ, వింటున్నట్టూ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బుద్ధుడు చెప్పిన ప్రతి మాటనీ నమ్మాడు. తన చుట్టూ ఉన్న జీవితం, సమాజం, దేశం, ప్రపంచం యుద్ధాగ్నిలో రగిలిపోతున్నప్పుడు కూడా ఆయన బుద్ధుడి మాటల్ని సందేహించలేదు. అందుకని ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎంతో కొంత ప్రశాంతిని ఆవరింపచెయ్యగలిగాడు. ఆయన ప్రసంగాల వీడియోలు కొన్ని చూసాను. అక్కడ, అంటే ఆయన మాట్లాడుతున్న గదుల్లోగాని, లేదా తోటల్లోగాని ఎక్కడా ఒక్క బుద్ధ ప్రతిమ కూడా నాకు కనబడలేదు. కాని అక్కడ బుద్ధుడు కనిపించాడని చెప్పగలను.
 
బుద్ధుడి పేరు చెప్పడం, బుద్ధుడి కొటేషన్లు షేర్ చెయ్యడం ఒక ఫాషన్ గా మారిపోయిన కాలంలో ఆయన మాటల్ని నిజంగా అర్థం చేసుకున్నవాళ్ళూ, నమ్మినవాళ్ళూ ఎవరైనా ఉన్నారా అని వెతుక్కుంటూనే ఉన్నాను. బౌద్ధ సాహిత్యం మీద రాయగలిగినవాళ్ళూ, మాట్లాడగలిగినవాళ్ళూ, ఆ వంకన బ్రాహ్మణ ధర్మాన్ని ఎద్దేవా చేసేవాళ్ళూ కాదు నాకు కావలసింది. బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గంలో కనీసం ఒక్క సమ్యక్ శీలాన్ని అనుష్టించినా చాలు, నేను వారి పాదాల దగ్గర కూచోడానికి సిద్ధంగా ఉన్నాను.
 
బుద్ధుడు తన జీవితకాలమంతా గాసిప్ ని నిరసిస్తూనే ఉన్నాడు. అన్నిటికన్నా ముందు పొలిటికల్ గాసిప్ ని పూర్తిగా దూరంపెట్టాడు. ఉదాహరణకి, కుద్దక నికాయంలోని, ఉదాన పాలి (2.2) లోని ఈ సన్నివేశం చూడండి:
 
నేనిలా విన్నాను. ఒకప్పుడు భగవానుడు శ్రావస్తిలో అనాథపిండకుడి జేతవనంలో విహరిస్తూ ఉన్నాడు. అప్పుడు భిక్షకు వెళ్ళి తాము గ్రహించిన భిక్షను ఆరగించి వనంలో సేదతీరుతున్న భిక్కుల మధ్య ఒక సంభాషణ తలెత్తింది. ‘మిత్రులారా, ఆ ఇద్దరు రాజుల్లో, అంటే మగధ రాజు బింబిసారుడు, కోసల రాజు ప్రసేనజిత్తు, ఆ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ధనవంతుడు? ఎవరు గొప్ప సుఖాల్ని అనుభవిస్తూ ఉన్నారు? ఎవరికి గొప్ప కోశాగారం ఉంది. ఎవరికి గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటుచెయ్యగలిగారు? ఎవరికి ఎక్కువ రథాలున్నాయి? ఎవరికి ఎక్కువ శక్తి సామర్థ్యాలున్నాయి- ఇలా నడుస్తున్నది సంభాషణ.
 
ఆ సాయంకాలం, భగవానుడు తన ఏకాంతం వీడి ఆ సమావేశప్రాంగణానికి వచ్చి, అక్కడ తనకోసం సిద్ధపరిచిన ఆసనం మీద కూచున్నాడు. అప్పుడు ఆయన ఆ భిక్కుల్ని చేరబిలిచి, ‘భిక్కులారా, నేను వచ్చేటప్పటికి మీరంతా ఏదో సంభాషణలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. దేని గురించి మాట్లాడుకుంటున్నారు మీరు? అనడిగాడు.
 
అప్పుడు వారు, ‘భగవన్, మేము భిక్షాయాత్రనుండి తిరిగివచ్చి వనంలో కూచున్నప్పుడు మా మధ్య ఒక సంభాషణ తలెత్తింది. ‘మిత్రులారా, ఆ ఇద్దరు రాజుల్లో, అంటే మగధ రాజు బింబిసారుడు, కోసల రాజు ప్రసేనజిత్తు, ఆ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ధనవంతుడు? ఎవరు గొప్ప సుఖాల్ని అనుభవిస్తూ ఉన్నారు? ఎవరికి గొప్ప కోశాగారం ఉంది. ఎవరికి గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటుచెయ్యగలిగారు? ఎవరికి ఎక్కువ రథాలున్నాయి, ఎవరికి ఎక్కువ శక్తి సామర్థ్యాలున్నాయి- ఇలా నడుస్తున్నది మా సంభాషణ’ అన్నారు.
 
అప్పుడు భగవానుడు ఇలా అన్నాడు: ‘భిక్కులారా, ఇటువంటి సంభాషణ మీకు సముచితం కాదు. మీరంతా గౌరవప్రదమైన కుటుంబాల్ని వదిలిపెట్టి, ఇళ్ళు వదిలిపెట్టి, ఈ నిరాశ్రయ జీవితాన్ని ఎంతో నమ్మకంతో స్వీకరించినవాళ్ళు. మీరు ఇట్లాంటి సంభాషణలు సాగిస్తుండటం సముచితం కాదు. భిక్కులారా, ఒకసారి ఇక్కడకు చేరుకున్నాక, మీకు ఉండవలసింది రెండే కర్తవ్యాలు. అయితే, ధర్మాన్ని అనుష్టించడం ఎలా అన్నదాని గురించి మాట్లాడుకోండి లేదా మౌనంగానైనా ఉండండి.’
ఆ పైన ఆయన ఈ పద్యం చెప్పాడు:
 
అక్కడ ప్రపంచంలో ఏ ఇంద్రియసుఖం ఉందో
ఇక్కడ ఏ దైవిక సంతోషం ఉందో,
తృష్ణాక్షయమిచ్చే సుఖంతో పోలిస్తే
ఆ రెండూ కాసుకి కొరగావు.
 
నేను బుద్ధుడి మాటలు నమ్ముతాను కాబట్టి, నేనిది కూడా నమ్ముతున్నాను, అదేమంటే గాసిప్ ఉన్నచోట బుద్ధుడుండడు.
 
16-5-2022

Leave a Reply

%d bloggers like this: