ఒక తేనెటీగకి ఎంత గూడు కావాలి?

నత్త ఎక్కడికి వెళ్ళినా తన గుల్లని వెంటబెట్టుకు తిరిగినట్టు నేను నా గ్రంథాలయాన్ని మోసుకుంటూ తిరుగుతున్నానని అర్థమయింది. ఒక ఊరినుంచో ఒక ఇంటినుంచో మరో ఊరికో మరో ఇంటికో మారుతున్నప్పుడల్లా ఎన్ని పుస్తకాలో ఏరి ఏ గ్రంథాలయానికో ఇచ్చేస్తూ వచ్చిన తరువాత కూడా ఇంకా వందలాది పుస్తకాలు నాతోనే మిగిలిపోయాయి. తత్త్వశాస్త్రం, అలంకార శాస్త్రాల్లాంటివి ఎప్పుడో వదిలిపెట్టేసాను. కానీ కవిత్వం, కొన్ని నాటకాలు, కొన్ని నవలలు, చిత్రకళకీ, సినిమాకళకీ సంబంధించిన పుస్తకాలు ఎవరికీ ఇవ్వలేనని అర్థమయింది. ఇన్ని పుస్తకాలు నా ఇంటిని ఆక్రమిస్తే ప్రతి ఒక్క పుస్తకం వెనక అది కొన్నప్పటి ఊరు, వేళ, ఎవరితో కలిసి వెళ్ళి ఏ షాపులో కొన్నానో ఆ జ్ఞాపకాలు కూడా నా మనసంతా ఆక్రమించి ఉన్నాయి. నేనూ నా భార్యా పిల్లలూ, నలుగురం జీవించడానికి దొరికిన ఈ చిన్న చోటులో కూడా మమ్మల్ని పక్కకు నెట్టేసి ఎటు చూడు పుస్తకాలూ, వాటిని రాసినవాళ్ళూ.

చిన్నప్పుడు మా ఇంట్లో ఒక పుస్తకాల రాకు ఉండేది. ఆ తర్వాత మొదటిసారి రాజమండ్రిలో మిత్రుడు మహేశ్ ఇంట్లో ఒక పర్సనల్ లైబ్రరీ చూసాను. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చదువుకోవడానికి వీలుగా ఇష్టమైన పుస్తకాలతో ఒక లైబ్రరీ కలిగిఉండటమనేది గొప్ప భాగ్యం అనిపించింది. ఇంట్లో చిన్న గ్రంథాలయం, ఇంటిచుట్టూ తోట- ఒక మనిషి జీవితంలో ఇంతకన్నా కోరుకోవలసింది ఏముంటుంది?

నేను రిటైరయినా కూడా నాకు సొంత ఇల్లు లేదని రాసుకుంటే దానిమీద ఎవరి వాల్ మీదనో పెద్ద చర్చ జరిగిందని ఒక మిత్రురాలు నాకు చెప్పింది. అక్కడితో ఆగకుండా ఆ లింక్ కూడా నాకు పంపించింది. ఆ చర్చ కొంత చదివాను. అందులో ప్రధానమైన ఆర్గుమెంటు ఏమిటంటే, ఈరోజుల్లో ఎంత చిన్న ఉద్యోగికైనా ఇల్లంటూ ఉంటుందనీ, చివరికి ఎస్.ఆర్. శంకరన్ గారికి కూడా ఒక ఇల్లు లేకపోలేదనీ, కాబట్టి ఒకడు తనకి ఇల్లు లేదు కాబట్టి తాను నీతిమంతుణ్ణని గొప్పలు చెప్పుకోనక్కర్లేదనీ.

నాకు అది చదివి నవ్వొచ్చింది. ఇల్లు కట్టుకోవడం ఒక ఛాయిస్. ప్రభుత్వోద్యోగిగా నాకు వచ్చే జీతంతోనే నేను ఇల్లు కట్టుకోగలిగే ఉందును. ఇప్పుడు నాకు రాబోయే పెన్షనరీ బెనెఫిట్స్ తో చిన్న పాటి ఇల్లు కట్టుకోవడం ఏమంత కష్టం కాదు. కాని నా కలలు వేరే ఉండవచ్చు కదా. ఎస్.ఆర్.శంకరన్ గారు ఋషి. ఆయనకి చిన్నపాటి ఇల్లు సరిపోయి ఉండవచ్చు. నేను ఋషిని కాను, కవిని. సౌందర్యారాధకుణ్ణి. నాకు ఇల్లు ముఖ్యంకాదు. ఇంటిచుట్టూ తోట ముఖ్యం. ఆ ఇంటినుంచి బయట అడుగుపెట్టగానే బషోకి ఫూజియామా కనబడినట్టు నాకో కొండ కనిపించాలి. సాయంకాలం నడిచివెళ్ళేంత దూరంలో ఒక అడవినో, నదినో లేదా మహాసముద్రమో ఉండాలి. ఎన్ని గదుల ఇల్లు కట్టుకుందామని నేనెప్పుడూ ఆలోచించలేదు. ఎంత ఇల్లు కట్టుకుంటే నా పుస్తకాలన్నీ జాగ్రత్తగా పెట్టుకోగలననన్నదే నా చింత.

ఆ చర్చలోనే మరొకాయన రాసాడు కదా: ‘ఆయనకి ఇల్లు మాత్రమే లేదు ‘ అని. నాకు సొంత ఇల్లు మాత్రమే లేదని రాసానుగాని, ఇల్లు లేదని ఎక్కడన్నాను? నా పదవీవిరమణ రోజున మా శాఖకు చెందిన మిత్రులు జరిపిన వీడ్కోలు సభలో ప్రకాశం జిల్లా తుమ్మలబయలు చెంచుగూడెం నుంచి వచ్చిన మూగెన్న అందరూ వినేట్టుగా చెప్పాడు: ‘సార్, మా గూడెంలో మీకోసం ఒక ఇల్లు ఉంది. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వచ్చి ఉండండి ‘ అని. దాదాపుగా ఇటువంటి ఆఫర్ ఇవ్వగలిగిన మిత్రులు ప్రతి జిల్లాలోనూ ఒకరేనా ఉంటారని నా నమ్మిక.

మా కుటుంబాన్ని మా బంధుమిత్రులు ఒక చెంచు కుటుంబంతో పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా నలుగురం కలిసే వెళ్తుంటాం. ఎవరింటికి వెళ్ళినా చిన్నగదిలో సర్దుకుపోతాం. మా అవసరాలకు చిన్న గది సరిపోతుంది. కాని పుస్తకాలకి? ఆ పుస్తకాలు చదువుకోడానికి ఇంటిముందు అరుగు ఉండాలి కదా. చుట్టూ కంచె మీద కాశీరత్నం తీగె పూలుపూస్తుండాలి కదా. ఆ ఇంటి ముంగిట పందిరిమీద వేసవిలో రాధామనోహరాలు, వానాకాలం విరజాజులూ, శరత్కాలం పారిజాతాలూ, హేమంతంలో చామంతులూ విరబూస్తూండాలని కదా నా కోరిక.

ఒక తేనెటీగకి ఎంత గూడు కావాలి? కాని ఒక మహారణ్యం కూడా దాన్ని తృప్తి పరచదు. ఎంత విస్తారమైన పూలవనం ఉంటే దానికంత ప్రీతి. తీరా అది ఇల్లు కట్టుకోవడం మొదలుపెడితే దాని ప్రతి గదిలోనూ తేనెతోనే నింపిపెట్టుకుంటుంది కదా. నేను కూడా అంతే. నాకు ఇల్లొక్కటే చాలదు, పుస్తకాలు కావాలి, ప్రతి సాయంకాలం, ఇంటి అరుగుమీద, ఆ పుస్తకాల గురించి మాట్లాడుకోడానికి ఒక మిత్రబృందం కావాలి. మేము మాట్లాడుకుంటూ ఉంటే వినడానికి వచ్చిన నక్షత్రాలతో ఆకాశం కిక్కిరిసిపోవాలి.

ఇల్లు అంటే ఒక కప్పు కాదు. నామటుకూ నాకు అది నా మనసు ఆగే చోటు. ఎన్ని పట్టణాల్లో ఎన్ని ఇళ్ళల్లో నివాసమున్నాను! కాని ఇక్కడే ఆగిపోదాం అని ఇప్పటిదాకా ఎక్కడా అనిపించలేదు. నేను పుట్టిన ఊళ్ళో తప్ప. అది కూడా, మా ఊరుకి దక్షిణం వేపు కాదు. ఉత్తరం వైపు ఏరుదాటి జాగరాలమ్మ గుడి వైపుగాని లేదా ఈశాన్యం వైపు వణకరాయి గ్రామంలోగాని లేదా తూర్పువైపు మా ఊరిని ఆనుకుని ఉన్న కొండకిందలోయలోగాని- అక్కడ మా అమ్మ ముగ్గు పెట్టి చిమ్నీ తుడిచి ప్రతి సాయంకాలం హరికేన్ లాంతరు వెలిగిస్తూ ఉంటుందని నా నమ్మిక. అక్కడి నుంచి చూస్తే నల్లటి గొడుగు వేసుకుని మధ్యాహ్నపుటెండలో మా నాన్నగారు కాకరపాడు సంతకి వెళ్తూ కనబడతారు. ఆ చోటుదగ్గర తప్ప నా మనసు మరెక్కడా ఆగలేదు.

1972 లో వదిలిపెట్టాను మా ఊరిని. యాభై ఏళ్ళయింది. ఇప్పుడేనా అక్కడ ఇల్లు కట్టుకోగలనేమో అనుకున్నాను. కాని వీలయ్యింది కాదు. ఆ ఆలోచన మరికొన్నాళ్ళు వాయిదా వెయ్యక తప్పింది కాదు. బహుశా ఆ కోరిక నెరవేరకనే పోవచ్చు. కనీసం నేను ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడైనా, మా ఊరి ఏటి ఒడ్డున తెల్ల మద్ది చెట్టు నీడలోనైనా నాకు ఆరడుగుల నేల దొరికితే చాలనుకుంటున్నాను. ఆ ఏటి ఒడ్డున ప్రతి వసంతకాలంలోనూ, పూర్వమహాకవులంతా, తమ పద్యాలు నాకు వినిపించడానికి, కోకిలలై తప్పక వస్తారనుకుంటాను.

23-4-2022

Leave a Reply

%d bloggers like this: