
అయిదవ శతాబ్ది చీనా ప్రధానంగా దక్షిణాది రాజ్యాల చీనా. అది కూడా మూడు రాజవంశాల పాలన చూసింది. తూర్పు జిన్ రాజవంశం (317-420) తర్వాత లియు-సోంగ్ రాజవంశం (420-479) పాలన కొనసాగాక, 479 లో చీ-లియాంగ్ రాజవంశం పాలన మొదలయ్యింది. చీ రాజవంశ పాలన (479-502) కాలంలో, అంటే అయిదవ శతాబ్ది చివరి రెండు దశాబ్దాల్లోనూ, మరీ ముఖ్యంగా 483-493 మధ్యకాలం చీనా కవిత్వం గొప్ప మార్పుకి లోనయ్యింది. ఈ దశాబ్దకాలాన్ని చీనా సాహిత్య చరిత్రలో యోంగ్ మింగ్ యుగంగా పేర్కొంటారు.
యోంగ్ మింగ్ అంటే ఆరని వెలుగు అని అర్థం. చీ వంశ రాకుమారుడు జియావో జిలియాంగ్ గొప్ప పిపాసి. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నట్టే ఆయన దగ్గర కూడా ఎనిమిది మంది కవులు ఉండేవారు. ఆ ఎనిమిది మందీ కలిసి భువన విజయంలాగా ఒక శాశ్వత ప్రకాశాన్ని సాహిత్యంలో ఆవిష్కరించేరు. మూడువేల చీనా సాహిత్య చరిత్రలో పదేళ్ళు ఏ పాటిది? కాని కొన్ని సాహిత్య విప్లవాలంతే. అవి తమ తర్వాత సాహిత్యం రూపురేఖల్ని గణనీయంగా మార్చేస్తాయి. ఎందుకంటే ఆ ఎనిమిది మందిలోనూ ఒకడైన జియావో యాన్ 502 లో లియాంగ్ రాజ్యాన్ని స్థాపించి దాదాపు యాభై ఏళ్ళ పాటు యోంగ్ మింగ్ స్ఫూర్తితో చీనాను పరిపాలించాడు.
యోంగ్ మింగ్ యుగం సాహిత్యంలో తీసుకువచ్చిన మార్పులు ప్రధానంగా రెండు. ఒకటి, సాహిత్యానికి మునుపెన్నడూ లేనంత రాజాదరణ లభించడం. అయితే ఈ పరిణామం దానికదే సంభవించింది కాదు. దీని వెనక ఒక శతాబ్దకాలం పాటు సాగిన అన్వేషణ ఉంది. ప్రాచీన చీనా కవులు వ్యక్తికీ, రాజ్యానికీ మధ్య ఒక సమతౌల్యాన్నీ, సమగ్రతనీ సాధించారని చెప్పుకున్నాం. కాని సున్నితమనస్కుడైన వ్యక్తికీ, అతడి సమకాలిక రాజకీయ వ్యవస్థకీ మధ్య సయోధ్య చెదిరినప్పుడు కవి ఏమి చెయ్యాలి?
ఇందుకు నాలుగవ-అయిదవ శతాబ్ది మహాకవులు రెండు మార్గాలు వెతుక్కున్నారని కూడా చెప్పుకున్నాం. తావో యువాన్ మింగ్ తన కాలం నాటి ప్రభువుల్ని వదిలిపెట్టి గ్రామాలకు తరలివెళ్ళిపోయాడనీ, అక్కడ రైతులతో కలిసి జీవించడం ద్వారా ఒక వైపు తన సామాజిక బాధ్యత ను నెరవేర్చుకుంటూ, మరొకవైపు కవిత్వం చెప్పుకున్నాడని మనకు తెలుసు. కాని అతడి ప్రకృతి ఆరాధన పొలాలూ, తోటలూ దాటి వెళ్ళలేదు. మరొకవైపు ఝీ లింగ్ యూన్ ప్రకృతిలోని గంభీరపార్శ్వాన్ని చూసాడుగాని దానికే పూర్తిగా అంకితం కాలేకపోయాడు. ఆయన బాటలోనే నడిచిన బావో ఝావో ప్రకృతి స్థానంలో సమాజాన్ని, అది కూడా అట్టడుగు వర్గాల ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నించాడు.
యోంగ్ మింగ్ కవులు ఈ సమస్యనే మరింత లోతుగా పరిశీలించారు. వారు కూడా భావుకుడైన వ్యక్తికీ, లోకానికీ మధ్య సమాధానం కోసమే తపించారు. కాని లోకం అంటే వారి దృష్టిలో రాజకీయ బాధ్యతనో లేదా ఏదో ఒక గ్రామసమాజంతో కలిసి జీవించడమో లేదా అట్టడుగు జీవితమో కాదు. ఎందుకంటే ఆ మూడు చోట్లా కూడా నీ హృదయస్పందనని అర్థం చేసుకోగల శ్రోతలు దొరకడం కష్టం. అందుకని వారు తమలాగే సాహిత్యాభినివేశం, సహృదయత, సంస్కృతి కలిగిన ఒక చిన్న బృందాన్ని వెతుక్కున్నారు. అటువంటి బృందం స్వయంగా రాకుమారుడే ఏర్పాటు చేస్తే అంతకన్నా కావలసింది ఏముంటుంది?
యోంగ్ మింగ్ (శాశ్వత ప్రకాశం) అటువంటి బృందం. అంతదాకా చీనా చరిత్రలో రాజులూ, రాజవంశీకులూ కవిత్వం చెప్పకపోలేదుగాని, ఒక రాజకుటుంబం కవుల్ని తన భృత్యులుగా కాకుండా మిత్రులుగా చూడటం అదే మొదలు. అటువంటి ఒక సాహిత్యబృందం సంస్కృతినీ, అభిరుచినీ నిర్మించే బాధ్యత స్వీకరించడం తదనంతర చీనా సాహిత్యాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. అంతే కాదు, సాహిత్యనిర్మాణంలో రాజు లేదా రాజ్యం ప్రధాన పాత్ర వహించడం కూడా అప్పుడే మొదలయ్యిందని చెప్పవచ్చు.
ఇక రెండవ పరిణామం సాహిత్య శిల్పానికి సంబంధించింది. ఎప్పుడైతే గొప్ప అభిరుచి కలిగిన కొందరు సాహిత్యవేత్తలు ఒక బృందంగా ఏర్పడ్డారో వారు సాహిత్య శిల్పం గురించీ, ఛందస్సు గురించీ, ప్రయోగాల గురించీ ఆలోచించడం సహజమే కదా. యోంగ్ మింగ్ కవుల దాకా చీనా కవిత్వ ఛందస్సు, ముఖ్యంగా షి పద్యాల ఛందస్సు మాత్రాఛందస్సులాగా దేశి సంగీత ధోరణుల మీద ఆధారపడింది. దాన్ని గు-షి అంటే పాతకవిత్వం అన్నారు. దాని స్థానంలో యోంగ్ మింగ్ కవులు కొత్త ఛందస్సును తీసుకువచ్చారు. దానిలో నాలుగు రకాల స్వారాలు, ఎనిమిది రకాల నిషేధాలు వచ్చి చేరాయి. ఈ కొత్త ఛందస్సుని మనం గణబద్ధ ఛందస్సుగా చెప్పవచ్చు. ఈ కొత్త ఛందస్సుని అనుసరించి తర్వాత కాలంలో తాంగ్ యుగంలో షి పద్యప్రక్రియ పూర్తి నియమనిబంధనలకు లోబడి నడిచింది. అందుకని ఆ పద్యాల్నిలు-షి అంటే కొత్త కవిత్వం అన్నారు.
ఇలా చీనా కవిత్వంలో స్వరాలు వచ్చిచేరడం వెనక బౌద్ధ మత ప్రభావం ఉందని చెప్తారు. బౌద్ధులు తమ మహాయాన సూత్రాల్ని పఠించేటప్పుడు, వేదపఠనంలో ఉపయోగించే ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరాలను ఉపయోగించేవారు. యోంగ్ మింగ్ బృందాన్ని ఏర్పరచిన వూ చక్రవర్తి స్వయంగా బౌద్దుడు కావడంతో బౌద్ధ సూత్రాల పఠన, పాఠన పద్ధతిలో చీనా కవిత్వాన్ని కూడా రాయించడానికి కారకుడయ్యాడు. ప్రాచీన చీనా కవిత్వం తీసుకున్న ఈ మలుపు వెనక భారతీయ సాహిత్య ప్రభావం ఉండటం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. కానీ కొందరు ఈ కథనాన్ని అంగీకరించరు. వ్యావహారిక చీనా భాషలోనే నాలుగు స్వరాలూ అంతర్లీనంగా ఉన్నాయనీ, యోంగ్ మింగ్ కవులు వాటిమీద మన దృష్టి మరల్చారనీ వారు వాదిస్తారు. ఆ మాట నిజమే అనుకున్నా కూడా, అసలు వాగ్వ్యవహారంలో అంతర్గతంగా ఉన్న స్వరాల మీద కవుల దృష్టి పడటానికి బౌద్ధ సూత్రపఠనం కారణమనే చెప్పవలసి ఉంటుంది.
ఆ కాలం నాటి విమర్శకులు కొందరు ఈ సంస్కరణని స్వాగతించారు. మరికొందరు వ్యతిరేకించారు. కాని యోంగ్ మింగ్ కవుల్లో ఒకడూ, కొత్త ఛందో నియమాల ప్రవర్తకుడూ అయిన షెన్ యూయే మంచి కవిత్వానికి మూడు లక్షణాలుండాలని చెప్పాడు. ఒకటి, అందులో కవులు ప్రస్తావించే పూర్వకవిత్వ వాక్యాలు కాని, స్థలకాలనామ విశేషాలుగాని, పౌరాణిక ప్రతీకలు గాని అందరికీ సులభంగా అర్థమయ్యేవిగా ఉండాలి. రెండవది, పదాలు గుర్తుపట్టడానికి వీలుగా ఉండాలి, మూడవది, ఆ కవిత మొత్తం బిగ్గరగా చదువుకోడానికి అనువుగా ఉండాలి. అంటే యోంగ్ మింగ్ కవులు కొత్త ఛందస్సుని ప్రవేశపెట్టినప్పటికీ, కవిత్వంలో అస్పష్టతనీ, పదాడంబరాన్నీ, నారికేళ పాకాన్నీ నిరసించారనే చెప్పాలి. కవిత్వం గురించిన వారి మొత్తం దర్శనాన్ని షీ-తియావో ఒక్క వాక్యంలో చెప్పాడు: ‘మంచి కవిత గుండ్రంగా, కుదురుగా, బంతిలాగా దొర్లిపోగలగాలి’ అని.
యోంగ్ మింగ్ యుగం కవిత్వానికొక కొత్త స్వరాన్ని సమకూర్చింది. అంతే కాదు, జీ లింగ్ యూన్ తో మొదలైన ఇంద్రియ నైశిత్యం బావో ఝావో ద్వారా యోంగ్ మింగ్ కవిత్వంలో మరింత వికసించింది. ఇటువంటి ఇంద్రియ నైశిత్యాన్ని ‘షెంగ్ సే’ అని వ్యవహరిస్తారు. అంటే ‘శబ్దాలూ, దృశ్యాలూ ‘ అన్నమాట. ప్రాచీన చీనా తాత్త్వికత ప్రకారం షెంగ్ సే, అంటే ఇంద్రియ నైశిత్యం, ఏమంత ఆదర్శప్రాయమైన పదం కాదు. దానికి విరుద్ధమైన పదం ‘జింగ్ కింగ్’. అంటే సహజసిద్ధమైన అనుభూతి అని అర్థం.
ఉదాహరణకి తావో యువాన్ మింగ్ కవిత్వం సహజంగా, ప్రకృతికి చేరువగా, నిసర్గానుభూతిని ప్రకటిస్తుంది. కాని జీ లింగ్ యూన్ కవిత్వంలో చాలావరకు కవి స్వయంగా నిర్మించుకున్న ప్రపంచం కనిపిస్తుంది. లియు-సోంగ్ యుగం ముగిసేటప్పటికి, జింగ్-కింగ్ దాదాపుగా అదృశ్యమై షెంగ్-సే కనిపించడం మొదలయ్యిందని సాహిత్య చరిత్రకారులు రాసుకొచ్చారు. అదొక క్షీణ యుగలక్షణంగా వాళ్ళు భావించారు. కాని ప్రాచీన చీనా కవుల్ని మన కవిత్రయంతోనూ, యోంగ్ మింగ్ కవుల్ని ప్రబంధ కవులతోనూ పోల్చి చూసుకుంటే, వారు సాహిత్యంలో పెద్ద పీట వేసిన ఇంద్రియనైశిత్యం గర్హనీయం కాకపోగా, స్వాగతించదగ్గదే అనిపిస్తుంది.
ఎందుకంటే తావో యువాన్ మింగ్ కాని, జీ లింగ్ యూన్ కానీ సాధారణ సమాజానికి దూరంగా జరిగి కవిత్వం చెప్పారు. యోంగ్ మింగ్ కవులు తామున్నచోటే సౌందర్యాన్ని అన్వేషించే ప్రయత్నం చేసారు. మహారణ్యాల్లో దారి వెతుక్కుంటూ మహాపర్వతాలు అధిరోహిస్తూ జీ లింగ్ యూన్ ఏ మహాసౌందర్యాన్ని అనుభూతి చెందాడో అటువంటి అనుభూతిని యోంగ్ మింగ్ కవులు రాజోద్యానాల్లో వెతుక్కున్నారు. మామూలు రోజువారీ వస్తువులు, రోజువారీ సంఘటనలమీద, చివరికి ఒక చెప్పుల జత మీద కూడా వాళ్ళు కవిత్వం చెప్పారు.
యోంగ్ మింగ్ అష్టదిగ్గజాల్లో షీ-తియావో, షెన్ యూయే సుప్రసిద్ధులు. షీ తియావో (464-99) రాసిన కవిత్వం లాంటిది గత రెండువందల ఏళ్ళలో తాను కనుగొనలేదని షెన్ యూయే ప్రశంసించాడు.
తదనంతర కాలంలో తాంగ్ యుగపు మహాకవు లి-బాయి తాను షి-తియావో లాగా శ్రోతల్ని నివ్వెరపరచగల కవిత్వం చెప్పలేకపోతున్నానని వాపోయాడు. కాని షి తియావో అల్పాయుష్కుడు. ఒక కుట్రలో భాగం పంచుకోనందుకు అతడి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది.
అతడి కవితలు మచ్చుకు మూడు:
~
1
అంతఃపుర విరహగీతిక
సాయంసంధ్య, మందిరంలో ముత్యాల తెరలు తెరచుకున్నవి
చుట్టూ చెలరేగిన మిణుగురులు ఇంతలో మాటుమణిగినవి.
రాత్రంతా నేను పల్చని చీనాంబరాలు కుడుతూనే ఉన్నాను
నీ గురించిన ఈ నా తలపులు ఉపశమించేదెప్పుడని?
2
వెళ్ళిపోయిన రాకుమారుణ్ణి తలచుకుంటూ
పట్టువస్త్రంలాగా పరచుకున్నది ఆకుపచ్చని పచ్చిక
నవారుణ పుష్పవికాసంతో పలకరిస్తున్నవి చెట్లు.
నువ్వు తిరిగి రావని ఎందుకు పదే పదే చెప్పుకోవడం?
తీరా నువ్వొచ్చినా, అప్పటికీ పూలతావి మిగిలితే కద!
3
అస్తమయ సంధ్యని ఉదాసీనంగా పరికిస్తూ
ఇంకా తెల్లవారకుండానే నగర సంరంభం మొదలవుతుంది
చీకటి పడ్డాక కూడా ఈ ఇల్లు సద్దుమణగదు.
సూర్యుడు వెళ్ళిపోయినా, నిర్మలమైన నీడ మిగిలే ఉంటుంది
ఇక్కడ తూర్పు వైపు కిటికీ దగ్గర శయ్యమీద ఆనుకుంటాను.
పూలచెట్లు నెమ్మదిగా ఆకులు రాలుస్తున్నాయి
హేమంతపు చామంతులు కోసుకోడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇదే కాలం, ఇదే ఋతువో తెలుసుకోవాలనుకుంటావు
గుర్రాలకి గరికపచ్చ మైదానాల్ని గుర్తుకుతెచ్చే శీతగాలి.
ఇంటికి ఆలస్యంగా తిరిగివస్తున్నవాళ్ళని చూసి మాత్రమే కాదు
ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళక తప్పనివాళ్ళ గురించి కూడా ఏదో బెంగ.
అదృష్టవశాత్తూ నా కోరికలు మరీ ఎక్కువేమీ కాదు
చెయ్యడానికి పెద్దగా పని కూడా లేదు.
నేనేమీ చండశాసనంగా ప్రజల్ని పాలించాలనుకునేవాణ్ణి కాను
ఏదో ఒక కుటీరంలో ఇంత కాళ్ళు చాపుకుంటే చాలనుకుంటాను.
14-4-2022