యుగయుగాల చీనా కవిత-19

Reading Time: 4 minutes
మనిషికీ, రాజ్యానికీ, సమాజానికీ లేదా వ్యక్తికీ, కుటుంబానికీ, రాజ్యానికీ మధ్య ఒక సమతూకాన్ని అన్వేషించడం, ఆ సమతౌల్యాన్ని నిలబెట్టడం తన కర్తవ్యంగా చీనాలో కవిత్వ రచన మొదలయ్యింది. కాని నాలుగవ శతాబ్దానికి వచ్చేటప్పటికి ఆ పూర్వకాలపు సమగ్రత విచ్ఛిన్నమైపోయింది. సున్నితమైన మనస్కుడైన ఒక వ్యక్తి తన కుటుంబం పట్ల చూపినంత స్పష్టమైన విధేయతని తన రాజు పట్ల చూపలేని కాలాలు వచ్చిపడ్డాయి. అటువంటి సందర్భంలో కవి కర్తవ్యమేమిటి? కన్ ఫ్యూసియస్ చెప్పిన కొటుంబిక, సామాజిక ధర్మాల్ని తుచ తప్పకుండా అనుసరించడం సాధ్యం కాని పరిస్థితి వచ్చినప్పుడు ఆ కవి ఏమి చెయ్యాలి? ఏమి చెప్పాలి?
 
నాలుగవ శతాబ్దం చివరిలోనూ, అయిదవ శతాబ్దం ప్రారంభంలోనూ ఇద్దరు మహాకవులు ఈ ప్రశ్నకు రెండు రకాలుగా సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. నువ్వు నీ ప్రభువుని సేవించలేని పరిస్థితి తలెత్తినప్పుడు, అడవులకో, గ్రామాలకో తరలిపోక తప్పదనేది తావో యువాన్ మింగ్ (365-427) వెతుక్కున్న పరిష్కారం. ఆయన ఒక ఆదర్శ సమాజాన్ని అభిలషించాడు. సామాజికంగానూ, ఆర్థికంగానూ హెచ్చుతగ్గులు లేని ఒక యుటోపియాని అతడు కలగన్నాడు. గ్రామాలకు పోయి, రైతుల్లో ఒక రైతుగా జీవించడంలో ఒకవైపు తన సమకాలిక సంక్షోభానికి అతీతంగా transcend కాగలననీ, మరొకవైపు తోటి మనుషుల పట్ల తన సాంఘిక బాధ్యతను నెరవేర్చుకోగలననీ అతడు భావించాడు. పరస్పర విరుద్ధాలైన డావోయిస్టు-కన్ ఫ్యూసియన్ జీవితాదర్శాలను ఆ విధంగా సమన్వయం చేసుకోవచ్చునని అతడు నమ్మాడు. కాని ఆ దారి ఏమంత రొమాంటిక్ కాదని కూడా అతడికి తెలుసు. తన పొలాల్లో కలుపు మొక్కలూ, పండ్లతోటల్లో పురుగులూ పొంచి ఉంటాయని మనకన్నా అతడికే ఎక్కువ తెలుసు.
 
మరొక వైపు జీ లింగ్ యూన్ (385-433) ఒకవైపు పౌరసమాజం పట్ల తన బాధ్యతని వదులుకోలేకా, మరొకవైపు అలాగని అందులోనే కూరుకుపోలేకా చాలానే నలుగులాట పడ్డాడు. ఉద్యోగం చెయ్యడానికి పూనుకుని, ఏదో ఒక పర్వత ప్రాంతంలో పనిచేయడానికి వెళ్ళగానే ఆ పర్వత సౌందర్యమోహంలో పడి ఆ ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయడమో లేదా అనారోగ్యం కారణం చెప్పి సెలవు పెట్టెయ్యడమో అతడికి అలవాటుగా మారిపోయింది. కాని తన కాలం నాటి ప్రభువులూ, కవులూ, చిత్రకారులూ చూడని మహాసౌందర్యమేదో చూసాడని అతడి కవిత్వం బిగ్గరగా ఎలుగెత్తి చాటుతూనే ఉంది.
 
మన కాలంలో కూడా ఇటువంటి ఒక ద్వైదీభావం మనకు తెలుసు. భావకవులు ఈ లోకం నుంచి దూరంగా జరగాలని చూసారు. అభ్యుదయ కవులు ఈ లోకానికి దగ్గరగా జరగాలనుకున్నారు. కాని ఈ రెండు ప్రవృత్తుల్నీ కూడా ఏకకాలంలో వ్యక్తం చెయ్యాలని కోరుకున్న కవులు కూడా లేకపోలేదు, తిలక్, శేషేంద్ర, శివసాగర్ లాంటి వాళ్ళు. అయిదవ శతాబ్ది చీనాలో బావో ఝావో అటువంటి కవి.
 
బావో ఝావో ( 414-66) రాజకుటుంబంలో పుట్టలేదు. ఉద్యోగావకాశాలు ప్రతిభని బట్టికాక, పుట్టుకని బట్టి దొరికే మధ్యయుగాల చీనాలో అతడి తెలివితేటలకు తగ్గ గుర్తింపు దొరకనే లేదు. కాని రాజకుటుంబాలకి సన్నిహితుడిగా మెలిగే అవకాశం దొరికింది. తన కాలం నాటి సామాజిక అవ్యవస్థ మీదా, వివక్ష మీదా గొంతెత్తితే ఏమి జరుగుతుందో అతడికి తెలుసు. అలాగని నిశ్శబ్దంగా ఉండిపోవడం కూడా అతడికి సాధ్యం కాలేదు. తన వేదననీ, అసంతృప్తినీ, అకాంక్షల్నీ వ్యక్తం చేయడానికి అతడు కవిత్వాన్ని ఎంచుకున్నాడు. తన కాలం నాటి కవిత్వ ప్రక్రియలు, షి, ఫూ, యె-ఫూ మూడింటిలోనూ అతడు కవిత్వం చెప్పాడు.
 
అందులో షి ప్రక్రియలో చెప్పిన కవితలు దాదాపుగా జీ లింగ్ యున్ తరహాలో చెప్పిన పద్యాలు. కొండలతోనూ, నదులతోనూ కూడుకున్న ప్రాకృతిక సౌందర్యాన్ని వర్ణించిన కవిత్వం. కాని ఆ పద్యాలు జీ లింగ్ యూన్ ని గుర్తుకు తేవడమే కాక, అతడి స్థాయిని అందుకోలేకపోయాయని కూడా విమర్శకులు భావించారు. కాని అతడి అత్యంత మౌలిక ప్రతిభ యె-ఫూ ప్రక్రియలో రాసిన కవితల్లో ఉంది. వాటిని ఆయన తావో యువాన్ మింగ్ రాసిన షి పద్యాల తరహాలో రాసాడు. అతడి కాలం నాటికి తావోచిన్ ఏమంత సుప్రసిద్ధుడు కాడు. పెద్దగా సంకలనాలకి ఎక్కినవాడు కూడా కాడు. అయినా అతడి పద్యాల్ని బావో అనుసరించాడంటే, అతడి కవిత్వ వివేచనా శక్తి ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది.
 
తావో యువాన్ మింగ్ షి పద్యాలు ఆత్మకథనాత్మకాలు. అతడు తనకీ, లోకానికీ మధ్య జరుగుతున్న గొడవనంతా ఆ పద్యాల్లో రాసిపెట్టుకున్నాడు. తన పూర్వకాలాల్లో మనిషికీ, సమాజానికీ మధ్య సాధ్యపడ్డ సమగ్రతని అతడు తనకీ, ప్రకృతికీ మధ్య వెతుక్కోడానికి ప్రయత్నించాడు. అతడి షి పద్యాల తరహాలోనే బావో తన యె-ఫూ గీతాలు రాసినప్పటికీ, అతడిలాగే వాటిని ఆత్మకథనాత్మకాలుగా రాసినప్పటికీ, తావో వెతుక్కున్న ప్రకృతి స్థానంలో బావో తిరిగి సమాజాన్ని ప్రతిష్టించడానికి ప్రయత్నించాడు.
 
ఇది మామూలు మలుపు కాదు. అందులోనూ, సమాజం అంటే సాధారణ, విస్తృతార్థంలో సమాజం కాదు, సామాజికంగా దిగువశ్రేణిలో ఉన్న మనుషుల్తో తను మమేకం కావడానికి ప్రయత్నించాడు. అంటే మన కాలంలో సోషలిస్టు కవులు, అభ్యుదయ కవుల్లాగా అన్నమాట. అందుకనే కమ్యూనిస్టు చైనా అతణ్ణి ప్రజాకవిగా నుతిస్తున్నది.
 
‘అలసిపోయిన దారిలో పాటలు’ అనే పేరిట అతడు రాసిన పద్ధెనిమిది యె-ఫూ పద్యాలు అతడికి బాగా పేరు తెచ్చాయి. ఆ గీతాల్లో యె-ఫూ ప్రక్రియ పతాక స్థాయికి చేరుకుంది. తర్వాత రోజుల్లో తాంగ్ యుగపు మహాకవి దు-ఫూ తన మిత్రుడు లి-బాయి కవిత్వాన్ని ప్రశంసించడానికి దాన్ని బావో ఝావో కవిత్వంతో పోల్చడమే అందుకు ఉదాహరణ.
 
తావో యువాన్ మింగ్ లాగా రాజకీయాలకు దూరంగా దీర్ఘకాలం జీవించాలన్న బావో ఝావో కోరిక నెరవేరనే లేదు. అరవయ్యేళ్ళు కూడా జీవించకుండానే ఏదో కుట్రలో భాగంగా అతణ్ణి ఎవరో చంపేసారు.
 

అలసిపోయిన దారిలో -6

 
భోజనాల బల్లదగ్గర విందారగించలేను
నిట్టూరుస్తో కత్తిని రాతికేసి బాదుతుంటాను.
 
‘ఎన్నాళ్ళిట్లా ఈడ్చాలీ బతుకుబండిని?
రెక్కలు ముడుచుకుని ఒదిగి ఒదిగి
 
ఎన్నాళ్ళిట్లా కుంటుతుండాలి?’
ఉద్యోగం వదిలిపెట్టేసాను.
 
కొలువు చాలించుకుని
మా ఇంటికి వెళ్ళిపోయాను.
 
పొద్దున్నే కదా మా తల్లిదండ్రుల్నుంచి సెలవు తీసుకున్నది
పొద్దు గుంకేలోపలే మళ్ళా ఇంటిబాట పట్టాను.
 
మంచం దగ్గర కేరింతలు కొడుతున్న బిడ్డతో ఆడుకుంటాను
మగ్గం దగ్గర పనిచేసుకుంటున్న నా భార్యని తిలకిస్తుంటాను.
 
నీతిమంతులు నిరుపేదలు కావడం ముందునుంచీ ఉన్నదే
కాని వాళ్ళిప్పుడున్నంత ఒంటరిగా మరెప్పుడూ లేరు.
 

అలసిపోయిన దారిలో- 14

 
యువకులు యుద్దాలకు తరలివెళ్లడం
నువ్వు చూడలేదా?
 
ఎప్పటికీ తిరిగి రారు వాళ్ళు
ఆ ప్రవాసంలోనే ముసలివాళ్ళయిపోతారు.
 
వాళ్ళకీ వాళ్ళ ఇంటికీ మధ్య
ఎడతెగని రాత్రింబగళ్ళు.
 
వాళ్ళ స్వదేశానికీ వాళ్ళకీ మధ్య
నదులు, కొండలు, కనుమలు.
 
హోరుమంటూ ఈళ పెట్టే ఎడారిగాలులు
ఉరకలెత్తే మేఘసమూహాలు.
 
ఆ చేదు సరిహద్దు గాలిలో
సంచారజాతులవాళ్ళ పిల్లంగోవి
 
వారిలో బెంగ పుట్టిస్తుంది
కాని ఏమి చెయ్యగలరు వాళ్ళు?
 
బహుశా ఏదన్నా ఒక కొండ ఎక్కి తేరిపారచూడగలరు
క్షణం పాటు తమ యవ్వనకాలం తలపుకొస్తుంది.
 
ఇంతలోనే వైరిమూకల గుర్రాలు విరుచుకుపడతాయి
అక్కడితో వాళ్ళ జీవితం ముగిసిపోతుంది.
 
వేదనాభరిత జీవితం-
చెప్పడానికేముంది?
 
కళ్ళనీళ్ళు తుడుచుకుని
మళ్ళా యుద్ధానికి సిద్ధపడతారు.
 

పాతపాటలు అనుకరిస్తూ

 
శీతాకాలపు గాలి ఉత్తరదిక్కునుంచి.
గుడ్డపేలికల్లా రాలుతున్న మంచుముద్దలు.
 
ఋతువు భరించలేకుండా ఉంది.
గుండె చేతపట్టుకుని నా వాళ్ళని తలుచుకుంటాను.
 
అనుకోకుండా ఇద్దరు స్త్రీలు తారసపడ్డారు
నాకు లానే వాళ్ళది కూడా లొయాంగ్ నే.
 
అందగత్తెలు, ముచ్చటగొల్పే కళ్ళూ, కనుబొమ్మలూ
లలితంగా విలాసంగా నడక, సన్నని నడుము.
 
మంచులాగా తెల్లటి దేహకాంతి
వెలిగే ముఖవర్చస్సు, దేవతల్లాగా ఉన్నారు.
 
వాళ్ళ కంటికొసలనుంచి మోహపెట్టే చూపులు
ఎర్రని పెదాలమీంచి మత్తెక్కించే మాటలు.
 
రంగుల్తో, అలంకరణతో శోభిల్లే వస్త్రాలు.
విలువైన నగలమధ్య విరాజిల్లే రంగురాళ్ళు.
 
ఉన్నట్టుండి వాళ్ళు నాట్యం మొదలుపెట్టారు
పై కప్పు దద్దరిల్లేట్టు పాటలు పాడారు:
 
‘కోరికలు తీరడం కన్నా ముఖ్యమేముంది
మా చిరకాల స్వప్నాలు నీవల్ల నెరవేరనున్నాయి.
 
అదృష్టం, శీతాకాలపు ఈ సాయంకాలం
రాత్రి కడు దీర్ఘం, ఇప్పట్లో తెల్లవారదు.
 
మా శయ్యమీద రంగుల బొంతలు రెండు పరిచిపెట్టాం
చక్కని లతలు కుట్టిపెట్టిన రెండు తలగడలూ,
 
పెందరాళే విశ్రాంతి తీసుకుందువుగాని పద
మిగిలిన పాటలు వసంతకాలంలో పాడుకుందాం’
 
13-4-2022

Leave a Reply

%d bloggers like this: