యుగయుగాల చీనా కవిత-17

తావో యువాన్ మింగ్ రాజులకు భృత్యుడుగా జీవించడానికి దూరంగా గడిపాడు కాబట్టి ఆయన రాజకీయ కవి కాడు అనలేం. నిజానికి అంతకన్నా రాజకీయ కవి మరొకరు ఉన్నారని చెప్పలేం. పోతన్ననే చూడండి. ‘మనుజేశ్వరాధములు’ అని అనగలిగిన కవి, వెయ్యేళ్ళ తెలుగు కవిత్వంలో, మరొకడున్నాడా? చివరికి ధూర్జటి కూడా ‘రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయంబు’ అని మాత్రమే అనగలిగాడు. ‘సత్కవుల్ హాలికులైననేమి’ అనడం చిన్నపాటి ధిక్కారం కాదు. నిజానికి అది అన్ని రకాల రాజకీయాదర్శాలనీ ధిక్కరించగలిగిన కవితావాక్యం.
 
స్త్రీ వాదులు వచ్చేదాకా, మనకి personal కీ political కీ మధ్య గీతలు గియ్యడం వృథా అని తెలియలేదు. ‘రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు’ అని మహాకవి ఊరికినే అనలేదు. ఒక మామూలు మనిషిగా మామూలు జీవితం జీవించాలనుకోవడం కన్నా దుస్సాధ్యమైన కోరిక మరొకటి ఉండదు. ఇప్పుడు ఉక్రెయిన్ లో తన పొలం తాను దున్నుకుంటే చాలనీ, తన ఇంట్లో ఇంత అన్నం వండుకుని తన పిల్లలకి తినిపిస్తే చాలనీ, ఏదో ఒక పల్లెటూళ్ళో ఏదో ఒక ప్రాథమిక పాఠశాలలో పిల్లలకి ఏ రోజు చెప్పవలసిన పాఠం ఆ రోజు చెప్పుకుంటే చాలని ఎందరు కోరుకుంటూ ఉండరు? కాని ఈ రోజు వాళ్ళ ఆ కోరికలకన్నా దుస్సాధ్యమైన జీవితాశయాలు మరేవో ఉంటాయనుకోలేం.
 
తావో యువాన్ మింగ్ ప్రాసంగికత ఇక్కడే ఉంది. మామూలు మనుషులతో కలిసి మెలిసి మామూలు జీవితం జీవితం జీవించాలని అతడు కోరుకున్న కోరిక మామూలు కోరిక కాదనీ, అది చరిత్ర పూర్వయుగాల్లో ఎప్పుడైనా సాధ్యమై ఉండవచ్చేమోగాని, తన కాలంలోనూ, తర్వాతి కాలాల్లోనూ కూడా సాధ్యమయ్యే అవకాశం కనుచూపుమేరలో కూడా లేదని అతడికి తెలుసు. మిగులు విలువ మీద ఆధారపడ్డ సమాజం మనిషిని మనిషి దోచుకోవడానికే దారితీస్తుందని అతడు గుర్తుపట్టాడు. టాల్ స్టాయి లాగా అతడికి కూడా ఒకప్పుడు గోధుమ గింజలు కోడిగుడ్డంత ఉండేవని, ఎప్పుడు ధాన్యం మిగలడం మొదలయ్యిందో, ఎప్పుడు ఆ మిగిలిన ధాన్యం సారాయిగా మారడం మొదలయ్యిందో అప్పుడు ఆ గోధుమగింజలు కూడా చిన్నవైపోయాయని అతడికి తెలుసు. అందుకనే మిగిలిపోయిన ధాన్యాన్ని పొలాల్లో పారబోసే ఆ ప్రాచీన కృతయుగాల కోసం అతడు బెంగపెట్టుకున్నాడు.
 
అతడు కూడా ఒక ఆదర్శ రాజ్యాన్ని కలగన్నాడు. ఆయన రాసిన Peach Blossom Spring అటువంటి యుటోపియా గురించిన వర్ణననే. కాని ఆ గ్రామం, ఆ దేశం, ఆ రాజ్యం ఎక్కడ లభిస్తాయి? తాను కోరుకున్న రైతు జీవితం తనకి కడుపు నిండా తిండి పెట్టట్లేదని అతడు ఎన్నో కవితల్లో స్పష్టంగా చెప్పుకున్నాడు. తిండి లేక తాను అడుక్కోడానికి కూడా వెనకాడలేదని ఒక కవితలో రాసుకున్నాడు కూడా. కాని అతడు ఆ సాధారణ రైతు జీవితాన్ని వదిలిపెట్టడానికి మాత్రం ఇష్టపడలేదు? ఎందుకని?
 
లూసున్ చెప్పినట్టుగా మనం కూడా అతడు తనతో తాను సమాధాన పడలేదని చెప్పుకోవచ్చు. లేదా మరొక విమర్శకుడు చెప్పినట్టుగా అతడు అంత గడ్డు పరిస్థితుల మధ్య కూడా ధీరుడిగా నిలబడ్డాడనీ, అందుకనే అతడి కవిత్వం మనల్ని ఆకర్షిస్తున్నదనీ కూడా చెప్పుకోవచ్చు. కాని, నా దృష్టి ఈ రెండు రకాల ప్రశంసల మీద కూడా లేదు.
 
నా దృష్టిలో తావో యువాన్ మింగ్ తన రైతు జీవితం గురించి రాసిన కవితల్లో మూడు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆయన నలుగురితో కలిసి జీవించడాన్ని ఇష్టపడ్డాడు. అది కూడా ‘రోజంతా పని, రాత్రికి విశ్రాంతి’. నగరంలోనూ, రాజు కొలువులోనూ కూడా కలిసి జీవించవచ్చు. కాని అది మామూలు జీవితం కాదు. అక్కడ యశోవైభవాల గురించిన వెంపర్లాట ఉంటుంది. అక్కడ యుద్ధం ఉంటుంది నిజమే, కాని కాయకష్టం ఉండదు. అలాగని రైతులతో కలిసి జీవించడం మరీ మామూలు జీవితంగా మారిపొయ్యే ప్రమాదం ఉందని అతడికి తెలుసు. అందుకని ఆ జీవితంలో కవిత్వం, సంగీతం ఉండాలని కోరుకున్నాడు. అది కూడా ఏవో కవితలు చదువుకోవడం కాదు, మరీ అరుదైన కవిత్వం చదువుకుంటూ, అర్థం కాని చోట, కలిసి అనుమానాలు నివృత్తి చేసుకునేటంత సాహిత్యాభిలాష ఉండాలని కోరుకున్నాడు.
 
ఇక మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైంది, ఆ రైతు జీవితంలో మిగులు ఉండకూడదనీ, ఏదైనా మిగులు ఉన్నా అది ఆస్తిపాస్తులుగా మారకూడదనీ కోరుకున్నాడు. చివరికి పిల్లలకి వదిలిపెట్టడానికి కూడా ఆస్తిసంపాదించడాన్ని అతడు నమ్మలేకపోయాడు. ఇటువంటి అలభ్య, ఆదర్శ జీవితాన్ని అతడు ఎంతో కొంత మేరకు జీవించగలిగాడని మనకు ఆ కవిత్వం సాక్ష్యమిస్తుంది. నాకు తెలిసి ప్రపంచ సాహిత్యంలో, తిరిగి ఇటువంటి నిర్మలానుభూతి కనిపించేది కబీర్ పదాల్లోనూ, చెకోవ్ కథల్లోనూ మాత్రమే.
 
~
 

తాగినప్పుడూ, తాగనప్పుడూ

 
నాలో ఒక అతిథి ఉన్నాడు
కాని మా ఇద్దరి ఇష్టాలూ ఒకలాంటివి కావు.
 
మాలో ఒకడు ఎప్పుడూ తాగిపడుంటాడు
మరొకడు ఎప్పుడూ మెలకువగా ఉంటాడు,
 
నిద్రపోతూ, రెప్పవాల్చకుండా-
ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటాం.
 
ఒకరి ప్రపంచం మరొకరికి అర్థం కాదు కూడా.
మర్యాదలు, సంప్రదాయాలు
 
వాటిని పట్టుకు వేలాడటం ఎంత వెర్రితనం.
నిబ్బరంగా ఉండు, నిశ్చింతగా ఉండు.
 
నిజమైన వివేకమంటూ ఉంటే అదే.
ఇదిగో, ఓ ముసలి తాగుబోతూ,
 
ఒక రోజు ముగిసిపోయిందా, పర్వాలేదు,
లాంతరు వెలిగించు.
 

పల్లెటూళ్ళో బతకడం మొదలుపెట్టాక

 
దక్షిణం వైపు కొండవాలులో
చిక్కుళ్ళు పెంచుకుంటాను.
 
కలుపు బాగా పెరిగింది, చిక్కుడు తీగల్లో ప్రాణం లేదు
తెల్లవారకుండానే కలుపు తియ్యడం మొదలుపెడతాను.
 
సాయంకాలం చంద్రకాంతి పరుచుకునేవేళకి
బుజాన గడ్డపారతో ఇంటిబాట పడతాను.
 
సన్నని పొలం గట్లు, నిలువెత్తు పెరిగిన గడ్డి.
నా గుడ్డలు మంచుకి తడిసిపోతాయి.
 
దుస్తులు తడిసిపోయాయని దిగులెందుకు?
ఒక మునిలాగా జీవించాలని కోరుకున్నాక.
 

చామంతులు

 
హేమంతకాలపు చామంతుల రంగులే వేరు
ఆకులమీదా, పూలమీదా మంచు.
 
అన్నిటినీ మరపించే మధువు
నా ఇహలోక దుఃఖాల్ని మరిపించగలదని
 
పానపాత్ర పెదాలకు చేరుస్తాను.
శూన్యపాత్రలో మళ్ళీ మళ్ళీ మధువు కురుస్తుంది.
 
సూర్యాస్తమయవేళ, అన్నిటా నిశ్శబ్దం.
గూళ్ళకు మరలివస్తున్న పక్షుల కూజితాలతో పాటు
 
తూర్పువైపు వాకిలి దగ్గర ఒక ఈల వేసుకుంటాను
ఈ చిన్న జీవితం ఇలా గడిచిపోతే చాలు.
 

కదిలే ఇల్లు

 
ఏదో ఒక దక్షిణ గ్రామంలో నివసించాలని
నేను గట్టిగా కోరుకున్న కాలమొకటి ఉండేది.
 
అలాగని, ఏవో శుభశకునాలు కనిపించి కాదు
నాలాంటి వాళ్ళు, మామూలు మనుషులక్కడ
 
జీవిస్తున్నారని విన్నందువల్ల. వాళ్ళతో
ఉదయాస్తమయాలు పంచుకోవాలనిపించినందువల్ల.
 
చాలా ఏళ్ళ పాటు ఇదే కోరిక నాకు.
ఇంక ఈరోజు దీన్ని నిజం చేసుకుంటాను.
 
అందుకు నాకేమీ పెద్ద కుటీరం అక్కర్లేదు.
ఒక చాప, పరుపు సరిపోతాయి.
 
ఇక నన్ను పలకరించడానికి
ఇరుగుపొరుగు ఎలానూ ఉంటారు.
 
మేము కలిసి కూచుని గడిచిపోయిన కాలాల గురించి
గట్టిగా మాట్లాడుకుంటాం, అరుదైన కవిత్వాలు
 
కలిసి చదువుకుంటాం, మరీ అర్థం కానిచోట
మా అనుమానాలు నివృత్తి చేసుకుంటాం.
 

ఇద్దరు మిత్రులతో పంచుకున్న వ్యథ

 
స్వర్గం ఒకపట్టాన చేతికందదు. గగనానికి, ఇలకు బహుదూరం
దేవతల, రాక్షసుల దారులు అంతతేలిగ్గా అంతుబట్టవు.
 
నా యవ్వనకాలంలో గొప్ప పనులు చెయ్యాలని తపించేను
కాని యాభై ఏళ్ళ పాటు పడ్డదంతా వృథా ప్రయాస.
 
జీవితం మొదలయ్యిందో లేదో కష్టాలూ మొదలయ్యాయి
పెళ్ళయి మాన్నాళ్ళు తిరక్కుండానే భార్యని పోగొట్టుకున్నాను.
 
నా ఇల్లు ఒక్కసారి కాదు, ఎన్నో సార్లు తగలబడింది
పొలాల్లో పంటలకి ఎప్పుడూ పురుగు పడుతూనే ఉంటుంది.
 
మరొకవైపు గాలివానలు ఉన్నదంతా ఊడ్చుకుపోతాయి.
చివరికి చేతికందే పంట ఒక్క పొట్టకి కూడా చాలదు.
 
వేసవిరోజుల్లో చాలాసార్లు పస్తులుండక తప్పదు.
శీతాకాలం దుప్పట్లు లేకుండానే రాత్రుళ్ళు గడపాలి.
 
ఎప్పుడు కోడికూసి తెల్లవారుతుందా అని ఎదురుచూస్తాను
తెల్లవారగానే మళ్ళా ఎప్పుడు రాత్రవుతుందా అని చూస్తాను.
 
ఇది నా విధిలిఖితం, ఆకాశాన్నెందుకు నిందించడం?
ఎడబాటు, కష్టం, దుఃఖం నన్ను రాచిరంపానపెడుతుంటాయి.
 
ఇక నేను పోయిన తర్వాత నాకు దక్కే యశస్సు అంటారా
గాలికి తేలే పొగలాగా అది వస్తేఏమిటి? రాకపోతే ఏమిటి?
 
ఏదో మిత్రులారా, మీతో నా గోడు పంచుకుంటున్నాను
ఏదో కథలో చెప్పినట్టు, ఎట్లాంటి కష్టమైనా మీరు వినగలరని.
 

నా చిన్నప్పుడు

 
నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు మంచిమాటలు చెప్తూండేవారు
అబ్బా వినలేకపోతున్నానంటో చెవులు మూసుకునేవాణ్ణి.
 
ఇదేమిటిది? పట్టుమని యాభైఏళ్ళు తిరక్కుండానే’
ఇప్పుడు నేను కూడా సుద్దులు చెప్పడం మొదలుపెట్టాను?
 
నా యవ్వనకాలపు సంతోషాల్ని తలచుకుందామంటే
అవి గతించిన సంతోషాలు, ఇప్పుడు వాటి జాడ కూడా లేదు.
 
మిగిలిన నాలుగురోజులూ చక్కగా బతకడం మంచిది
ఈ ఉన్న ఒక్క జీవితం మరోసారి రమ్మంటే రాదు.
 
చేతిలో మిగిలిన నాలుగు కాసులూ ఇప్పుడే కర్చుపెట్టు
చూస్తూండగానే కళ్ళముందే రోజులు గడిచిపోతున్నాయి.
 
నాకు పిల్లలున్నారు, కాని పంచడానికి ఆస్తిపాస్తుల్లేవు.
మరణానంతర ధర్మకార్యాల మీదనా, నమ్మకం లేదు.
 

జీవితాశయం

 
మనుషుల జీవితాశయం సముద్రం కన్నా పెద్దది
నా కోరిక మాత్రం చిన్నది, ముసలితనం రాకూడదని.
 
నా కుటుంబమంతా ఒక్కచోట కలిసి జీవించాలి
పుత్రులూ, పౌత్రులూ ఒక్కచోట సంతోషంగా గడపాలి.
 
ప్రతి రోజూ ఒకచేత పానపాత్ర, మరొకచేత తంత్రీవాద్యం
నా మధుకలశాలు ఎన్నటికీ వట్టిపోకుండాలి.
 
నిశ్చింతగా కూచుని, సంతోషంగా తాగగలగాలి.
మరీ పెందరాళే లేవకూడదు, తొందరగా నిద్రపోవాలి.
 
నిన్నటిలాగా నేడు ఎందుకుంటుంది? ఎలా పోల్చగలం?
నా జీవితంలో శీతోష్ణాలు రెంటినీ చూసాను, సహించాను.
 
చివరికి దేహం భస్మాంతం, దుమ్ము దుమ్ములో కలిసిపోతుంది.
యశోవైభవాల కోసం వెంపర్లాడటం వట్టి శుష్కప్రయాస.
 
21-3-2022

Leave a Reply

%d bloggers like this: