యుగయుగాల చీనా కవిత-16

నా ఇరవయ్యేళ్ళప్పుడు హైదరాబాదు వెళ్ళినప్పుడు ఆబిడ్సులో ఒక పేవ్ మెంటు మీద Patterns of Literature (1969) అనే పుస్తకం దొరికింది. అందులో ప్రపంచ సాహిత్యం నుంచి కథలు, కవిత్వం, నాటకాలు, వ్యాసాలు ఉన్నాయి. ఆ పుస్తకంలో మొదటిసారిగా ఒక చీనా కవిత ఇంగ్లిషు అనువాదం కూడా నా కంటపడింది. అది తావోచిన్ రాసిన కవిత. అది చాలా సుప్రసిద్ధమైన కవిత అని తర్వాత కాలంలో తెలిసింది. కాని మొదటిసారి చదవగానే ఆ కవిత నా హృదయానికి అతుక్కుపోవడంతో పాటు, చీనా కవిత్వం పట్ల కిటికీ తెరిచింది. ఆ తర్వాత నలభై ఏళ్ళుగా చీనా కవిత్వానికి నేను ఆరాధకుడిగా కొనసాగడానికి కూడా కారణమయ్యింది. ఆ కవితను ఇలా తెలుగులోకి అనువదించుకోవడమే కాక, నా మొదటి కవితాసంపుటి ‘నిర్వికల్ప సంగీతం’ (1986) లో పొందుపరచకుండా ఉండలేకపోయాను.
 
 
నేను నా కుటీరాన్ని జనావాస ప్రాంతాల్లోనే కట్టుకుంటాను. కాని నా దగ్గరలో గుర్రాల చప్పుడూ బళ్ళ సందడీ ఏమీ ఉండదు. ఇదెలా సాధ్యమో నీకు తెలుసా?
 
ఏకాకి అయిన హృదయం తనచుట్టూ తనకోసం వాతావరణాన్ని నిర్మించుకుంటుంది. నేనేమో తూర్పు పంక్తిలోని చామంతిపువ్వుల్ని కన్నార్పకుండా చూస్తూ ఉంటాను. సాయంకాలపు గాలులు పర్వత సానువుల మీంచి నిండుగా వీస్తుంటాయి. పిట్టలు జంటలు జంటలుగా గూళ్ళకి తిరిగి వస్తూంటాయి.
 
ఏ చిన్ని చిన్న వాటిలోనే ఏదో లోతయిన అర్ధముంది కదూ, అయినా అదేమిటో చెప్పబోతే, సరిగ్గా దొరక్క పదాలు విఫలమయిపోతాయి.
 
 
వెయ్యేళ్ళ తెలుగు కవిత్వం నుండి ‘కావ్యమాల’ (1959) పేరిట ఒక సంకలనాన్ని కూర్చిన కాటూరి వెంకటేశ్వరరావుగారు అందులో తెలుగు కవిత్వ వికాసం గురించి ఒక సమగ్ర పరిచయ వ్యాసం కూడా రాసారు. అందులో క్షీణాంధ్ర యుగంగా చెప్పుకునే కాలంలో వచ్చిన కవిత్వం గురించి రాస్తూ, ‘సకలేంద్రియ సంతర్పణం చేసే కామమహా పురుషార్థ ఫలం కోసం రసికనరనారీలోకం నూటయాబది ఏండ్లు ఇలా సాహిత్యసముద్రమథనం చేయగా చేయగా తుదకు రామనామామృత భాండము చేబూని వాగ్గేయకారసార్వభౌముడైన త్యాగరాజ స్వామి అవతరించెను’ అని రాసారు.
అటువంటి మాటలు తావోచిన్ గురించి కూడా రాయవచ్చు. హాన్ రాజవంశాన్ని తుదముట్టించి వెయి రాజవంశం మొదలై, ఆ తర్వాత వారిని సంహరించి జిన్ సామ్రాజ్యం మొదలై, అది కూడా చీలిపోయి ఆరు రాజవంశాల పాలనగా క్షీణించడం మొదలై రెండువందల ఏళ్ళ పాటు రక్తం, హింస, క్షోభ మాత్రమే పరుచుకున్న ప్రపంచంలోంచి అత్యంత సాధువర్తనుడూ, విరాగి, నిరాడంబరుడు, నిష్కల్మషుడు, ఋషి, రైతు అయిన తావో చిన్ ప్రభవించాడు.
 
తావో చిన్, లేదా తావో కియాన్ లేదా తావో యువాన్ మింగ్ (365-427) దక్షిణ చైనాలో ప్రసిద్ధ లూ పర్వతం దగ్గరలో పుట్టాడు. అతడి తండ్రి తాతలిద్దరూ ప్రభుత్వంలో పనిచేసారు. తల్లి తండ్రి గొప్ప పండితుడు, కవి. తన తండ్రితాతల దారిలోనే అతడు కూడా మొదట్లో ప్రభుత్వోద్యోగం చేసాడు. నలభయ్యేళ్ళ వయసులో చిన్న పట్టణానికి పాలనాధికారిగా పనిచేసాడు. అది అతడి చివరి ఉద్యోగం. అందులో పట్టుమని మూడు నెలలు కూడా పనిచేయలేదు. ఒకరోజు స్థానిక గవర్నరు తన పట్టణానికి వస్తున్న సందర్భంగా ఆయన్ని ప్రభుత్వమర్యాదకు తగ్గట్టుగా దుస్తులు ధరించమని చెప్పారు. దాన్ని ఆయన అవమానంగా భావించాడు. వెంటనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసి, తన స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయనకి చిన్న ఇల్లూ, దాదాపు రెండెకరాల పొలమూ ఉండేవి. అప్పటికే భార్య గతించింది. అయిదుగురు పిల్లలు. ఆ ఊళ్ళోనే ఆ పొలం సాగుచేసుకుంటో, రైతులతో కష్టసుఖాలు పంచుకుంటో, కవిత్వమూ, సంగీతమూ, మద్యమూ అతడికి తోడుగా జీవించాడు. గ్రామజీవితాన్నే తన పూర్తి కావ్యవస్తువుగా చేసుకుని పొలాల్నీ, తోటల్నీ, ప్రకృతినీ వర్ణిస్తో, చామంతిపూలని ప్రేమిస్తో కవిత్వం చెప్పాడు.
 
అలాగని తావో యువాన్ మింగ్ తన రైతు జీవితాన్నీ, పేదరికాన్నీ పూర్తిగా ప్రేమించాడని కూడా చెప్పలేం. ఆ కవితంలో చాలా నిట్టూర్పులే వినబడతాయి. ఎందుకంటే ఆయనలో కన్ ఫ్యూసియన్ చివరిదాకా చాలా బలంగా నిలబడే ఉన్నాడు. తన ప్రతిభాపాటవాలు రాజ్యానికీ, సమాజానికీ పూర్తిగా ఉపయోగపడటం లేదనీ, తోటిమనిషికి సేవ చెయ్యడానికి పూర్తి అవకాశాలు చిక్కలేదనే ఒక బాధ ఆయన్ని జీవితమంతా వెన్నాడుతూనే ఉంది. కానీ మరొకవైపు తన సమకాలిక రాజకీయ జీవితమూ, ప్రభుత్వోద్యోగాలూ ఎంత అవినీతిమయంగానూ, హింసాత్మకంగానూ మారిపోయాయో కూడా అతడు ప్రత్యక్షంగా చూసాడు, అనుభవించాడు. కాబట్టి ఆ కల్మషానికి దూరంగా, నిర్మలమైన తావుల్లో జీవితాన్ని గడపాలన్న డావోయిస్టు కూడా ఆయనలో బలంగా ఉన్నాడు. ఆ యుగంనాటికి బౌద్ధం కూడా చీనా జీవితాన్ని ప్రభావితం చెయ్యడం మొదలుపెట్టింది. అతడి జీవితకాలంలోనే ఫాహి యాన్ భారతదేశాన్ని సందర్శించి బౌద్ధ గ్రంథాల్ని చీనా తీసుకువచ్చాడు. మనిషి తన కుటుంబానికీ, రాజ్యానికీ, సమాజానికీ విధేయుడిగా ఉండాలనీ, సత్ప్రవర్తనతో ధార్మికంగా జీవించాలనే ఒక కన్ ఫ్యూసియన్ తో పాటు, కళ్ళముందు కనిపిస్తున్న పదివేల సంగతుల ప్రలోభానికి లోను కాకుండా వాటి వెనక ఉన్న అంతస్సత్యాన్ని అన్వేషించాలన్న ఒక డావోయిస్టూ, ఒక బౌద్ధుడూ కూడా ఆయనలో పక్కపక్కన జీవిస్తూనే ఉన్నారు.
 
ఆయనలో కన్ఫ్యూషియన్ బలంగా ఉన్నాడా డావోయిస్టు బలంగా ఉన్నాడా ఒక పట్టాన తేలదు. అందుకనే తావో యువాన్ మింగ్ గురించి మాట్లాడుతూ కొందరు ఆయన్ని పలాయనవాది అన్నారు. తన కళ్ళముందు కనిపిస్తున్న నిష్ఠుర వాస్తవంతో పోరాడలేక, గ్రామసీమల్లోకి పలాయనం చేసాడన్నది వారి ఆరోపణ. కాని చాలామంది ఆ ఆరోపణని ఖండించారు. తన అంతరాత్మ చెప్పినట్టుగా నడుచుకోడానికి అవసరమైతే నిరుపేదగా జీవించడానికి కూడా వెనకాడలేదనీ, ఎక్కడా తన ఆత్మ స్వాతంత్య్రాన్ని కుదువబెట్టలేదనీ, ఎక్కడా రాజీపడలేదనీ, అంతకన్నా సాహసోపేతమైన జీవితం మరొకటి ఉండబోదనీ వారు వాదించారు.
 
తావో యువాన్ మింగ్ కవిత్వం చదివినప్పుడు సంస్కృత సాహిత్యవేత్తలకు వాల్మీకి, కాళిదాసులు వర్ణించిన తపోవన సంస్కృతి గుర్తొస్తుంది. తమిళ సాహిత్య విద్యార్థికి అవ్వైయ్యారూ, తిరువళ్ళువరు గుర్తొస్తారు. గ్రీకు సాహిత్య విద్యార్థికి థియోక్రిటస్ గుర్తొస్తాడు. లాటిన్ సాహిత్యవేత్తకు వర్జిల్ రాసిన ఎకొలాగ్స్ గుర్తొస్తాయి. అమెరికన్ సాహిత్యవిద్యార్థికి రాబర్ట్ ఫ్రాస్ట్ గుర్తొస్తాడు. ఇక అన్నిటికన్నా మించి తెలుగు సాహిత్యాభిమానులకు బమ్మెర పోతన గుర్తొస్తాడు. ఆయన రాసిన ‘ఇమ్మనుజేశ్వరాధముల’ పద్యం గుర్తొస్తుంది.
 
తావో చిన్ జీవిత కథ చదువుతూ ఉంటే చాలాసార్లు టాల్ స్టాయి మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాడు. ఆయన రైతు జీవితం మనకి థోరో వాల్డెన్ జీవితాన్ని గుర్తుకు తెస్తుంది. మహాత్మా గాంధీ తావో చిన్ గురించి విని ఉంటే చైనా వెళ్ళాలని ఉత్సాహపడి ఉండేవాడని అనిపిస్తుంది.
తన పూర్వ కవుల్లాగా తావో యువాన్ మింగ్ ఆడంబరమైన, అలంకారబంధురమైన భాష వాడలేదు. చాలా మామూలు పదాలతో, సూటిగా, నిరలంకారంగా చెప్పడం అతడి శైలి. అందుకని ఆయన జీవించిన కాలంలో ఆయన కవిత్వం పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఆయన తరువాత ఒక శతాబ్దం తర్వాత ఒక అప్పకవి ఆయన్ని రెండవ తరహా కవిగానే లెక్కగట్టాడు. కాని చీనా కవిత్వంలో స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందిన తాంగ్ యుగం మొదలుకాగానే మంచుపొరనుంచి బయటపడ్డ హిమాలయ శిఖరంలాగా యువాన్ మింగ్ సర్వశ్రేష్ట కవిగా సాక్షాత్కరించడం మొదలుపెట్టాడు. తాంగ్ యుగపు ప్రతి ఒక్క కవీ ఆయన మీద కవిత రాసాడు. ఇక సోంగ్ యుగానికి చెందిన సు-డాంగ్-పో అయితే, తావో యువాన్ మింగ్ కి ఎంత ఆరాధకుడిగా మారాడంటే, ఆయన రాసిన ప్రతి ఒక్క కవితకీ మరొక ప్రతికృతి రాయకుండా ఉండలేకపోయాడు. చివరికి కమ్యూనిస్టు చైనాలో కూడా తావో యువాన్ మింగ్ స్థానం చెక్కుచెదరలేదు. రైతులతో కలిసి జీవించినవందువల్లా, వారి కష్టసుఖాల్ని కవితల్లో పంచుకున్నందువల్లా ఆయన్ని కమ్యూనిస్టులు ప్రజాకవిగా పైకెత్తారు.
 
తావో యువాన్ మింగ్ ని ప్రశంసిస్తున్నప్పుడు కూడా ఏ ఇద్దరూ ఆయన్ని ఒక్కలాగా ప్రశంసించలేదు. ఉదాహరణకి, ఝూ గువంగ్ కియాన్ అనే ఒక ఇరవయ్యవ శతాబ్ది విమర్శకుడు ఏమంటున్నాడో చూడండి:
 
‘ కళలో అత్యున్నత భూమిక భావోద్వేగ ప్రకటన కాదు. శాంతరసమే కవిత్వ పరాకాష్ట. తక్కిన మనుషుల్తో పోలిస్తే సుఖదుఃఖాల్ని ఒక కవి మరింత ఉద్వేగ భరితంగా అనుభూతి చెందుతూ ఉండవచ్చు. కాని, ఆ ఉద్వేగాన్ని వ్యక్తీకరించవలసి వచ్చినప్పుడు, చాలా ఏళ్ళ పాటు మగ్గబెట్టిన మధువులాగా, అది తన తీవ్రతను పోగొట్టుకుని మృదువైన పూలగుత్తిలాగా మారుతుంది. దాన్నే శాంతరసం అనేది. అది అత్యున్నత ఆదర్శం. మామూలు కవిత్వంలో మనకెక్కడా దొరకదు. దయాన్వితమైన బుద్ధ ప్రతిమలాగా అది అత్యున్నత స్థాయి జ్ఞానోదయంవల్లా, ఆంతరంగిక ప్రశాంతి వల్లా మాత్రమే సాధ్యపడుతుంది. నిజం చెప్పాలంటే ఆ స్థితికి వచ్చేటప్పటికి, ఆ శాంతంలో సంతోష విషాదాలూ రెండూ కూడా కొట్టుకుపోతాయి. ఇటువంటి మనఃస్థితి చీనా కవితంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. చు-యువాన్, రువాన్- జి, లి-బాయి, దు-ఫు వంటి వారు తమ కవిత్వంలో చాలా సార్లు తీవ్రభావోద్వేగంలోకీ, ధర్మాగ్రహంలోకీ జారిపోతుంటారు. కాని తావో యువాన్ మింగ్ అలా కాదు. ఆయన మూర్తీభవించిన శాంతరసం. అదే ఆయన మహత్వం. ‘
 
మరొకవైపు, ఆధునిక చీనా సాహిత్య వైతాళికుడు, కమ్యూనిస్టు లూసున్ ఏం రాస్తున్నాడో చూడండి:
‘కవిత్వ సంకలనాల్లో కనవచ్చే కవితలూ, ఎవరేనా ఎత్తి చూపే ఉల్లేఖనాలూ తరచూ అపార్థానికే దారితీస్తాయి. ఉదాహరణకి తావో యువాన్ మింగ్ వాక్యాలు ‘ నేనేమో తూర్పు పంక్తిలోని చామంతిపువ్వుల్ని కన్నార్పకుండా చూస్తూ ఉంటాను. సాయంకాలపు గాలులు పర్వత సానువుల మీంచి నిండుగా వీస్తుంటాయి ‘ లాంటివి మాత్రమే చదివి ఆయన తక్కిన కవితల్ని విస్మరించారనుకోండి, ఆయన కవిత్వంలోంచి సందర్భ శుద్ధి లేకుండా కవితా వాక్యాలు ఉల్లేఖిస్తూపోయారనుకోండి, మీరు ఆయన్ని ఒక ఈ లోకానికి చెందని కవిగా మార్చేసే ప్రమాదానికి పాల్పడతారు… అందుకనే శ్రద్ధాళువులైన పాఠకులు సంకలనాల మీదా, ఉల్లేఖనాల మీదా ఆధారపడకూడదు. ఆయా కవుల సాహిత్యాన్ని వారు తమకై తాము మరింత చదువుకోవాలి. అప్పుడు పూర్వమహాకవులెవరూ కూడా ‘మూర్తీభవించిన శాంత రసాలు’ కారని వారు తెలుసుకుంటారు. తావో యువాన్ మింగ్ కవిత్వంలోని మహత్వానికి కారణం అది ‘మూర్తీభవించిన శాంతరసం’ కాకపోవడమే.’
 
తనపట్ల తాను శాంతిగా ఉండకపోవడంలోనే తావో యువాన్ మింగ్ మహత్వం ఆధారపడి ఉంది అని లూసున్ అన్నమాటల్ని మనం ఒప్పుకోవచ్చు. కాని వెంటనే మరొక మాట కూడా చెప్పుకోవచ్చు. అదేమంటే, తన అశాంతి చల్లారేది కాదని యువాన్ మింగ్ తనతో తాను అంగీకరించాడనీ, చలంగారి లాగా, అదే అతడికి అపారమైన శాంతిని కలగచేసిందనీ. ఏ విధంగా చూసినా ఈ సంవాదం సద్దుమణిగేది కాదు.
 
2
 
తావో యువాన్ మింగ్ కవితలన్నీ తెలుగు చేయాలని ఉంది. కాని ఆ పని నేను చైనీసు నేర్చుకునేదాకా వాయిదా వేస్తూ, ఇప్పటికి మూడు కవితలు మీకు అందించాలనుకుంటున్నాను.
 
1
 

నిరుపేద కవి రాసుకున్న కవిత

 
సంవత్సరాంతవేళ కఠోరమైన శీతాకాలం
ఎండుగడ్డి మధ్య నన్ను వెచ్చబరుచుకుంటాను.
 
దక్షిణం వైపు తోటలో ఇప్పుడేమీ పెరగడం లేదు
ఉత్తరం వైపు తోటలో ఆకురాలుతున్న కొమ్మలు.
 
పానపాత్రనుండి చివరిబొట్టు కూడా పిండుకున్నాను
వంటింటికేసి చూద్దునుకదా, పొయ్యిరాజెయ్యలేదు.
 
పుస్తకాలు కుర్చీలో ఒక పక్కకి నెట్టేసాను
మధ్యాహ్నమైంది, ఏమీ చదవబుద్ధి కావడం లేదు.
 
ఇలాంటప్పుడు ఆకలికి లొంగిపోవలసిందేనా అని
ఒక శిష్యుడు కన్ ఫ్యూసియస్ ని అడిగాడొకప్పుడు.
 
క్షుద్బాధ సహించమన్నాడాయన. నాకు అంత శక్తి లేదు,
కాని ఆయనలాంటివాళ్ళు లేకపోలేదన్నదే గొప్ప ఓదార్పు.
 
2
 

నా ఇల్లు అగ్నిప్రమాదంలో కాలిపోయినప్పుడు

 
నా గడ్డిపాకకోసం, తాటాకుల పందిరికోసం
రాజరథానికి ఎప్పుడో వీడ్కోలు చెప్పేసాను.
 
కాని ఈ నడివేసవి ఎంతకూ చల్లారని గాడ్పు
నా పేదకుటీరం అగ్నికి ఆహూతైపోయింది.
 
మొత్తం ఇంట్లో ఒక్క దూలం, ఒక్క రాట మిగల్లేదు
ఇప్పుడు ఇంటిముందు పడవలో బతుకుతున్నాను.
 
ఈ తొలిహేమంత దినాంతం కడు సుదీర్ఘం
పైన అందనంత ఎత్తులో పూర్ణచంద్రుడు.
 
నా తోట మళ్ళా పుష్పిస్తున్నది, ఫలిస్తున్నది
కాని ఎగిరిపోయిన కాకులు భయానికి తిరిగిరాలేదు.
 
అర్థరాత్రి, ఆందోళితమనస్కుడనై నిలబడి
ఆకాశం నలుమూలలా లోతుల్లోకీ పరికిస్తున్నాను.
 
పసితనంలో కూడా ఇట్లానే చింతిస్తూ ఉండేవాణ్ణి
ఎలాగో గడిపాను నలభయ్యేళ్ళు, నా దేహం
 
నడుస్తున్నది ఏదో ప్రకృతి గమనానికి తగ్గట్టు,
నా ఆత్మ మాత్రం ఒంటరి, కడు సోమరి.
 
ఏళ్ళమీదట నేనెంత గట్టిపడ్డానంటే
ఇప్పుడు రాళ్ళు కూడా నా ముందు తీసికట్టే.
 
ఆ ప్రాచీన యుగాల గురించే పదే పదే తలచుకుంటాను
మిగిలిన ధాన్యం పట్టుకెళ్ళి పొలాల్లో పారబోసే రోజులు.
 
పొద్దున్నే లేవడం, రాత్రి తొందరగా నిద్రపోవడం,
కడుపునిండా తినడం తప్ప మరే కోరికా లేని వాళ్ళు.
 
సరే, ఆ రోజులిప్పుడెట్లానూ తిరిగి రావు కాబట్టి
ఇక పెరట్లో గొప్పు తవ్వుకోవడం మొదలుపెడతాను.
 
3
 

నేను మరణించినప్పుడు-1

 
ప్రాణమున్న ప్రతీదీ మరణించక తప్పదు
అలాగని తొందరగా మరణించినవాళ్ళని తప్పుబట్టలేం.
 
నిన్న రాత్రి బతికున్నవాళ్ళల్లో ఒకడిగా ఉన్నాను
ఇప్పుడు భూతప్రేతాల్లో నా పేరు కూడా చేరిపోయింది.
 
ఒకసారి విడివడ్డాక ఆ ఆత్మ ఎక్కడికి ఎగిరిపోతుంది?
ఎండిపోయిన కట్టెలో ఆకృతి ఎక్కడ దాగి ఉంటుంది?
 
పాపం పిల్లలు వాళ్ళ నాన్నకోసం ఏడుస్తున్నారు
బంధువులు నా కలేబరం చుట్టూమూగి శోకిస్తున్నారు,
 
ఇప్పుడింక నేను లాభనష్టాల చిట్టా విప్పలేను
మంచి ఏదో, చెడు ఏదో ఇంకెంతమాత్రం ఎంచలేను,
 
ఈరోజు గడిచి, కొన్ని శతాబ్దాలు దొర్లిపోయాక, నేను
మూటగట్టుకున్నది యశమో, అపయశమో ఎవరికెరుక?
 
ఈ లోకాన్ని వదిలిపెడుతున్నందుకు ఒకటే చింత
ఇక్కడున్నాళ్ళూ తాగవలసినంత తాగనేలేదని.
 
 
12-3-2022 &  13-3-2022

Leave a Reply

%d bloggers like this: