యాంటిగని

నిన్న గచ్చిబౌలి దగ్గర ‘రంగభూమి’ అనే థియేటర్ స్పేస్ లో యాంటిగని నాటకం ప్రదర్శిస్తున్నారంటే వెళ్ళాను. ఒక నాటకం చూడ్డానికి టికెట్టుకొనుక్కుని వెళ్ళడంలో ఏదో ఒక హుందాతనం ఫీలవుతూ ప్రదర్శన కోసం ఎదురుచూస్తూండగా అనంతు చింతలపల్లి కనిపించాడు. క్రీ.పూ.అయిదవశతాబ్దంలో గ్రీకు నాటక కర్త సొఫొక్లిజ్ రాసిన యాంటిగని నాటకాన్ని తెలుగు చేసాడతను. నన్ను చూస్తూనే తన అనువాదాన్ని నా చేతుల్లో పెట్టాడు. ఆ నాటకాన్నే నిన్న ప్రదర్శించారు.

ప్రతి నాటకానికీ ప్రతి పఠనమూ ఒక వ్యాఖ్యానమే. ప్రతి అనువాదమూ ఒక వ్యాఖ్యానమే. అన్నిటికన్నా మించి ప్రతి ప్రదర్శనా కూడా ఒక సరికొత్త వ్యాఖ్యానమే. ఎప్పుడో నలభయ్యేళ్ళ కిందట సాహిత్య అకాదెమీ కోసం ఎం.ఆర్.అప్పారావు గారు చేసిన అనువాదం, దాంతో పాటు గ్రీకు నాటకం పైన ఆయన రాసిన సుదీర్ఘ పరిచయ వ్యాసం చదివినప్పణ్ణుంచీ యాంటిగని ని నా జీవితపు ప్రతి మలుపులోనూ తారసపడుతూనే ఉన్నది.

యాంటిగని విషాదాంత నాటకం. ఒకప్పుడు దాన్ని యాంటిగని తాలూకు విషాదాంతంగా భావించారు. మరీ ఇటీవలి కాలంలో దాన్ని క్రియాన్ తాలూకు విషాదాంతంగా చూడటం మొదలుపెట్టారు. అదంతా నేనింతకుముందు రాసిన వ్యాసంలో విపులంగా చర్చించాను.

ఆ నాటకంలో విశేషమేమిటంటే మనం పూర్తిగా యాంటిగని పక్షం వహించలేం. అలాగని పూర్తిగా క్రియాన్ వైపూ నిలబడలేం. ఆ ఇద్దరి వాదనలతోనూ ఏకీభవిస్తూ, విభేదిస్తూ మనం కూడా ఒక torture కి లోనవుతాం.

నేనింతకుముందు ఆ నాటకం గురించి రాసినప్పుడు, అందులో యాంటిగని, క్రియాన్ ఇద్దరూ కూడా hubris కీ, వెనువెంటనే nemesis కీ లోనవుతారని రాసాను. ఒక మనిషి తానేదైనా స్థానానికి చేరుకున్నప్పుడో, ఏదైనా సాధించినప్పుడో లేదా తక్కినవారు అమలు చేయలేనిది తాను అమలు చేసిచూపించినప్పుడో చిన్నదో పెద్దదో ఆత్మాధిక్యతకు లోనవుతాడు. గ్రీకులు దాన్ని hubris అన్నారు. వారి నైతికత ప్రకారం అది కూడని పని. ఎందుకంటే, ఆ తాత్కాలిక స్వాతిశయాన్ని వెన్నంటి తక్షణమే వారికి ఏదో ఒక భంగపాటు సంభవిస్తుంది. దాన్ని వాళ్ళు nemesis అన్నారు. క్రియాన్ ఒక రాజధర్మాన్ని పాటించడంతో సమస్యలేదు. కాని తన కర్తవ్యాన్ని నిర్వహించినందుకు అతడు ఒక ఆత్మాధిక్యతకు లోనవుతాడు. ఆ స్వాతిశయం అతణ్ణి నెమ్మదిగా తనవారినుంచి, తన ప్రజలనుంచి, తన ప్రవక్తల నుంచి, చివరకు తననుంచి తనకే దూరం చేస్తుంది. భ్రాతృధర్మం కోసం యాంటిగని మరణాన్ని తృణప్రాయంగా పరిగణిస్తూ రాజుని ధిక్కరించడం నిజంగా వీరోచిత కార్యం. కాని ఆ పనిలో ఆమె ఒక ఆత్మాధిక్యతను, కించిత స్వోత్కర్షను అనుభవిస్తుంది. అందుకనే అంత సాహసోపేతంగా ప్రవర్తించి కూడా ఆమె విషాదం వైపు నడవక తప్పలేదు. మనుషులు తమ స్వధర్మాచరణలో పొంగిపోయినప్పుడు కుంగిపోక తప్పదని సొఫొక్లిజ్ చెప్తున్నాడని నేనింతకుముందు రాసాను.

కాని నిన్నటి ప్రదర్శన మళ్ళా ఆ నాటకాన్ని కొత్త వెలుగులో చూపించింది. ఇంటికి వచ్చాక మళ్ళా యాంటిగని ఇంగ్లిషు అనువాదంతో అనంతు తెలుగు అనువాదాన్ని పోల్చి చూసాను. అనంతు తన అనువాదాన్ని కూడా స్వేచ్ఛానువాదం చేసాడు. దానికి ఒక సమకాలిక ప్రాసంగికత తీసుకురావడం అతడి ఉద్దేశ్యమై ఉండవచ్చునని ఆ పుస్తకానికి ముందుమాట రాసిన జి.భార్గవ అన్నాడు. నిన్న నాటక ప్రదర్శన ముగిసిన తర్వాత భార్గవ మాట్లాడుతూ, యాంటిగని, రాజుకీ, పౌరుడికీ మధ్య సంబంధం గురించిన కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నదనీ, మరీ ముఖ్యంగా, ఇప్పుడు ప్రజాస్వామ్యాలు autocratic గా మారుతున్న తరుణంలో, యాంటిగని నాటకం పాలకులకు ఒక హెచ్చరిక గా వినబడుతున్నదనీ అన్నాడు.

నిన్న నాటకంలో చివరికి నాలుగు మరణాలు, కళ్ళ ఎదుట మూడు మరణాలు, రంగస్థలం మీద రెండు శవాల్ని చూసేక, నేనొక కొత్త నీతికథను చూస్తున్నానా అనిపించింది. ఎంత సదుద్దేశంతోనైనా సరే ఒక పాలకుడు నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాక, తన నిర్ణయాలు తప్పయ్యే అవకాశం లేదని నమ్మడం మొదలుపెడతాడు. తన నిర్ణయాల్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ ముందు దేశద్రోహిగా, ఆ తర్వాత రాజద్రోహిగా చిత్రించడం మొదలుపెడతాడు. ఒక పాలకుడు hubris కి లోనయ్యే ఈ క్షణమే అత్యంత విధ్వంసకర క్షణం. అతడికీ, అతడి రాజ్యానికీ కూడా. ఈ సంభాషణ చూడండి:

యాంటిగని:….నీ పౌరులు కూడా ఇలానే అనుకుంటున్నారు. కానీ ఎవ్వరూ పైకి చెప్పలేరు. భయం వాళ్ళ పెదాలని కుట్టేసిన దారం. మనసులోని మాట పెదవులు దాటించడమే రాజలక్షణం.

క్రియాన్: చాలా పొరబడుతున్నావ్! నా ప్రజలు ఎవ్వరూ నీలా ముమ్మాటికీ ఆలోచించరు.

యాంటిగని: ముమ్మాటికీ ఇలాగే ఆలోచిస్తున్నారు. చెప్పేందుకే ధైర్యం లేదు వాళ్ళకి. అంతే.

దీని ఇంగ్లిషు అనువాదం తెరిచి చూసాను. అక్కడ ఇలా ఉంది:

Antigone: .. All here would that they thought it well if their lips were not sealed by fear. Royalty, blessed in so much besides, has the power to do and say what it will.

Creon: In that view, you differ from all these Thebans.

Antigone: They also share it, but they curb their tongues for you.

పై వాక్యాలకు అనంతు చేసిన అనువాదం కూడా ఒక వ్యాఖ్యానమే. ‘మనసులోని మాట పెదవులు దాటించడమే రాజధర్మం’ అనడానికి బదులు ‘రాజత్వంలో అన్ని రకాల ధన్యతలతో పాటు, తాను తలుచుకున్నది చేయడానికీ, చేస్తానని చెప్పడానికీ కూడా అవకాశం ఉంటుంది’ అని ఉండాలి. కాని ‘మనసులోని పెదవులు దాటించడమే రాజధర్మం’ అనే వాక్యం నాటకం మీద కొత్త వెలుగు ప్రసరింపచేసింది. నాటకంలో క్రియాన్ చేసిందేమిటి? యాంటిగని మనసులో మాట, హేమోన్ మనసులో మాట, చివరికి టైరీషియస్ మనసులో మాట కూడా వాళ్ళ పెదవుల్ని దాటించాడు. చివరికి తన భటుడు కూడా అతడి భయాల్ని, అనుమానాల్ని, మనసులో కలిగే కలవరాన్ని నిస్సంకోచంగా క్రియాన్ ముందు చెప్పగలుగుతాడు. అయినా క్రియాన్ విషాదం వైపు నడవకుండా ఎందుకు తప్పించుకోలేక పోయాడు? ఎందుకంటే, అతడు తన పౌరుల మనసులో మాటని వాళ్ళ పెదాలు దాటించలేకపోయాడు కాబట్టి.

నిన్న రంగభూమి వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు మొదట్లో మేము పొరపాటున కొండాపూర్ ఫ్లై ఓవర్ ఎక్కాం. నాలుగేళ్ళ కిందట అక్కడలేని ఆకాశహర్మ్యాలు, విద్యుద్దీపాల వెలుగుల్లో తళతళలాడుతూ, చూపరుల్ని భీతావహుల్ని చేసేవిగా ప్రత్యక్షమయ్యాయి. ‘దనుజ హస్తపు దీర్ఘరేఖల వలె పరిచిన రాచబాటలకు’ అటూ ఇటూ ఇటూ సరికొత్త హైదరాబాదు మిరుమిట్లు కొలుపుతున్నది. హైదరాబాదులో నిర్మాణమవుతున్న ఆ అమెరికా మధ్యనుంచి 2500 ఏళ్ళ కిందటి ఈ నాటకాన్ని చూడటానికి వెళ్ళడంలో ఏదో incongruity ఉందనిపించింది. కానీ, నాటకం ఆద్యంతం చూసేటప్పటికి, ఇది ఈ కాలంలో ప్రతి పాలకుడూ, ప్రతి పాలితుడూ తప్పనిసరిగా చూడవలసిన కథ, వినవలసిన కథ, మాట్లాడుకోవలసిన కథ అనిపించింది. ఎందుకంటే పాలకుడు దేశ క్షేమం పేరిట తీసుకుంటున్న నిర్ణయాలు సమంజసం కాదని అనిపిస్తున్నప్పుడు ప్రతి పౌరుడూ తన మనసులో మాటని పెదవులు దాటించక తప్పదు. లేకపోతే అది దేశానికే అరిష్టం.

ప్రదర్శన పూర్తయ్యాక నటవర్గాన్నీ, సాంకేతిక నిపుణుల్నీ పరిచయం చేసాక, ప్రేక్షకుల స్పందన వినాలని కోరుకుంటూ నన్ను కూడా రెండు మాటలు మాట్లాడమన్నారు. నిన్న తెలుగు నాటక దినోత్సవం నాడు ఒక నాటకాన్ని చూసి, ఆ బృందాన్ని మనసారా అభినందించే అవకాశం లభించడం నా అదృష్టం. ఈ ప్రదర్శన ఈ రోజు కూడా ఉంటుందని చెప్పారు. మీలో అదృష్టవంతులెవరన్నా ఉంటే, ఈ రోజు ఆ నాటకం మీరు కూడా స్వయంగా తిలకించవచ్చు.

17-4-2022

Leave a Reply

%d bloggers like this: