మోహన చంద్ర రాత్రి

పున్నములన్నింటిలోనూ ఏ పున్నమి అందమైంది అని ఈ మధ్య ఎవరో నాకు మెసెంజరులో ఓ ప్రశ్న పంపించారు. ఏదని చెప్పను? ఏడాది పొడుగునా పన్నెండు పున్నములూ నాకు ప్రీతిపాత్రమైనవే. ఆకాశమంతా మబ్బులు కమ్మి చంద్రుడి జాడ కూడా కనిపించని శ్రావణ పౌర్ణమిరాత్రి కూడా నాకొక తీపివెలుతురు గోచరిస్తూనే ఉంటుంది. ఇక నిర్మలమైన గగనసీమలో చంద్రుడొక హంసలాగా తేలియాడే పున్నములంటే, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, శరత్ పూర్ణిమ, కార్తికపూర్ణిమ ల గురించే చెప్పాలి. అందులోనూ వైశాఖ పూర్ణిమ ఒక నడివేసవి రాత్రి కలలాంటిది. పండినపొలాల్లో కనకవర్ణశోభతో కదలాడే వరికంకులమీంచి మంచు మధ్య తడిసిపోయే మార్గశిర పౌర్ణమి నాటి harvest moon అందం చూసినవారికే అనుభవం. కాని పున్నములన్నిటిలోనూ ఏ పున్నమి నిన్ను వివశుణ్ణి చేస్తుందని అడిగితే మాత్రం ఫాల్గుణ పూర్ణిమ అనే చెప్తాను.

ప్రతి ఫాల్గుణ పున్నమికీ నాకు ప్రకృతి నుంచి ఒక ఆహ్వానం వస్తూనే ఉంటుంది. విజయవాడ వచ్చిన తొలిరోజుల్లో ఒక ఫాల్గుణ పౌర్ణమి తాళాయపాలెం కృష్ణానదిలో ఒక తెప్పమీద తేలియాడేను. ఈసారి ఆ ఆహ్వానం ‘చేతన’ ఆశ్రమం నుంచి వచ్చింది.

స్వర్గమంటూ ఉంటే అది ఈ భూమ్మీద ఇక్కడే ఉంది అని అమీర్ ఖుస్రో భారతదేశంలో ఏ తావుని చూసి అన్నాడో గాని, నాకు డా.మంగాదేవిగారు నడుపుతున్న చేతన ఆశ్రమం చూసినప్పుడల్లా ఆ తావు ఇక్కడే అనిపిస్తుంది. ఆమె పరిచయమైన ఈ పదిహేను ఇరవై ఏళ్ళ కాలంలోనూ ఈ ప్రాంగణానికి ఎన్నో సార్లు వచ్చాను. ఇక్కడ ఈ నందన నికుంజంలో పూల సువాసనలు ఆఘ్రాణిస్తో ఈ పిల్లలతో ఎన్నోసార్లు ముచ్చటించేను. కాని ప్రతి సారీ ఈ ముంగిలి ఒక బంగారు వాకిలి గానే తోస్తుంది. మనం మరీ ఇంత నిష్టురంగా ఉందేమిటీ అనుకునే ఈ ప్రపంచం మధ్యనే ఆమె ఒక కొత్త బంగారు లోకాన్ని సృష్టించడమే కాదు, దాన్ని పడిపోకుండా నిలబెట్టారు కూడా.

నిన్న సాయంకాలం త్వరత్వరగా చేతన ప్రాంగణానికి చేరుకున్నాను. మీ ప్రాంగణంలో చెట్ల మధ్యనుంచి చంద్రోదయం చూడాలి కదా అన్నాను ఆమెతో. నేనూ, విజ్జీ ఆ ఆవరణలో అడుగుపెట్టేటప్పటికి సున్నితంగా గాల్లోంచి వేపపూల పరిమళం చేతులు చాపింది. పిల్లలు ఒక పక్క చెట్ల కింద కోలాటం ప్రాక్టీసు చేస్తున్నారు. మరొక పక్క, ప్రభావతిగారి స్మారక మందిరం దగ్గర బాలబాలికలు సంగీత సమారోహానికి సిద్ధమవుతున్నారు.

పాఠశాల ప్రాంగణంలో ఒకపక్క మంకెనలు, బూరుగలు చివరి పూలతో, రాలిన ఆకుల మధ్య శిశిరానికి సెలవు పలుకుతున్నాయి. మరొకపక్క నిండారా విరబూసిన వేపచెట్లు, మామిడి చెట్లు, పచ్చ బూరుగలు, రాధా మనోహరాలు ఆగామి వసంతానికి ఎలుగెత్తి బూరాలు ఊదుతున్నాయి. మేము ఆ ప్రాంగణమంతా ఒక చుట్టు చుట్టి వచ్చి తాటి చెట్టు కుటీరం దగ్గర నిలబడేటప్పటికి దూరంగా చెట్లమీంచి తేనెలోమునిగి తేలిన పూర్ణచంద్రుడు ఆకాశవేదికమీద అడుగుపెడుతున్నాడు. ఈ చంద్రుడు శరశ్చంద్రుడు కాడు. ఇతణ్ణి మోహనచంద్రుడు అనాలి, ఇంకా చెప్పాలంటే మోహచంద్రుడనాలి. లేకపోతే నిలువెల్లా ఆ జీర ఏమిటి?

నెమ్మదిగా పిల్లలంతా వచ్చి కూచున్నారు. ఆ ప్రాంగణంలో అంతా కూచున్నాక, కొందరు బాలబాలికలు పాటలు పాడటం మొదలుపెట్టారు. వాళ్ళ సంగీతం మాష్టారు కోటి. ఆయన అప్పటికే కోటి గొంతులు శ్రుతి చేసి ఉన్నాడేమో, పిల్లలు మహామధురంగా వసంతాన్ని ఆహ్వానిస్తో గీతాలాపన మొదలుపెట్టారు:

‘ఓహో ఓహో వసంతమా, నవ జీవన మోహన వికాసమా

భావుక పులకిత హృదంతమా, సుమబాల పరీమళ విలాసమా..’

ఒకప్పుడు శాంతినికేతనంలో టాగోర్ ఇట్లానే చేసేవాడని విన్నాను. ఋతువులు మారుతున్న ప్రతివేళా ఒక కొత్త గీతం రాసి తానే స్వరకల్పన చేసి పిల్లలకు నేర్పేవాడట. కొన్నిసార్లు ఒక్క పాట కాదు, ఒక నృత్యనాటికనే రాసేవాడట. ‘చిత్రాంగద’, ‘ముక్తధార’, ‘రక్తకరబి’ లాంటి సంగీత రూపకాలన్నీ అలా రూపొందినవే. ఇది మరొక శాంతినికేతనం. బీద పిల్లల శాంతినికేతనం. ఇక్కడ ఒక టాగోర్ లేడు. కాని తల్లిలాంటి మంగాదేవి ఉన్నారు. పిల్లలు ఎక్కణ్ణుంచో ముక్కున కరిచి తెచ్చుకున్న పాటలున్నాయి. స్వరాలున్నాయి, చలిస్తున్న హృదయాలున్నాయి. చుట్టూ నోరు తెరుచుకుని వింటున్న పూలచెట్లున్నాయి.

అలా ఎంత సేపు గడిచిందో తెలీదు. పిల్లలు పాటలు పాడుతూనే ఉన్నారు. కోలాటం ఆడేరు. నాట్యం చేసారు. నెమ్మదిగా చంద్రుడు మా అందరినీ చూసేటంత పైకి వచ్చాడు. అప్పటిదాకా మాకూ చంద్రుడికీ అడ్డంగా ఉన్న వీథి దీపాలు ఆర్పేయడంతో ఆయన అందరినీ, ప్రతి ఒక్క బాలుణ్ణీ, బాలికనీ మృదువుగా తాకేడు. ఎంత మెత్తగా తాకేడంటే, ‘అబ్బ, వెన్నెల ఎంత బావుందీ’ అన్నారు పిల్లలు.

ఎన్నాళ్ళయింది ఇట్లాంటి వెన్నెల రాత్రి ఒకటి గడిపి. అందులోనూ పిల్లల మధ్య. నువ్వు వెన్నెలని ఎక్కడైనా, ఏ ప్రియసన్నిధిలోనైనా, ఏ నది ఒడ్డున, ఏ తోటలోనైనా గడిపి ఉండవచ్చుగాక, కాని ఒక బళ్ళో, చెట్ల మధ్య, పాటలు పాడే పిల్లమధ్య గడపడంలో ఉండే సంతోషమే వేరు. బహుశా అప్పుడు ఆ వెన్నెల్లో భగవంతుడు కూడా స్వయంగా వచ్చి మన మధ్య కూచుంటాడనుకుంటాను.

మంగాదేవి గారి హృదయం సంతోషంతో నిండిపోయిందని తెలుస్తూ ఉంది. ఆమె తన మిత్రురాలు ఒకామెకి ఫోను చేసి ఆమె పాడిన పాట ఒకటి పంపమని అడిగారు. డెబ్బై ఏళ్ళుంటాయట ఆ పాట పాడినామెకు. ఆమె పాడినదొక అపురూపమైన రామ ప్రేమ గీతం.

‘రామ రామ రామ యన్న రామచిలుక ధన్యము

రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము..’

చిలుకలకీ, ఉడతలకీ, పక్షులకీ, కోతిమూకకీ ప్రేమ పంచిన రాముడు కూడా రావడంతో ఆ సంగీత సమారోహం సుసంపన్నమైంది. నెమ్మదిగా పిల్లలూ, పెద్దలూ కూడా సెలవు తీసుకున్నారు. ఆ ప్రాంగణంలో నేనూ, విజ్జీ మిగిలాం. మా చుట్టూ చెట్లూ, పైన నిండు చంద్రుడూ. ఆ వెన్నెల మధ్య పూలబాసలు తీరిగ్గా వినడానికి ఒళ్ళంతా వీనుగా మార్చుకుని మరికొంతసేపు తిరిగాము. కాని వెన్నెల రాత్రుల అందం, చంద్రోదయవేళ, చంద్రుడు నడి ఆకాశానికి వచ్చిన వేళా మాత్రమే కాదు, ఇంకా తెల్లవారని వేళ పడమటి ఆకాశానికి ఆ చంద్రనావ పయనమయ్యే చివరి వేళల్లో కూడా చూడాలి.

అందుకని మళ్ళా నాలుగింటికి లేచాం. మరొకసారి ఆ ప్రాంగణమంతా కలయదిరిగాం. రాత్రి ఎవరో జలాశయానికి గేటు తెరిచినట్టు ప్రాంగణమంతా వేపపూలగాలితో నిండిపోయింది. రాత్రంతా వెన్నెల వాన కురిపించి చంద్రుడు తన పడవని పడమటి వైపు తీసుకుపోతూ ఉన్నాడు. మేమిక్కడ ఉండిపోయామా లేక ఆ పడవలో వెళ్ళిపోయామా? ఉన్నామని చెప్పవచ్చుగాని, ఉండిపోయిన మేమిద్దరం నిన్నటి మనుషులం మాత్రం కాదు.

19-3-2022

Leave a Reply

%d bloggers like this: