మళ్ళీ హైదరాబాదుకి.

Reading Time: 3 minutes

మళ్ళీ హైదరాబాదుకి.

ఏడాది కింద హైదరాబాదునుంచి విజయవాడ వచ్చేసాననీ, ఇక ఇక్కణ్ణుంచి నేరుగా అడవికే వెళ్ళిపోతాననీ అనుకున్నాను. వెళ్ళిపోవాలనే ఇప్పటికీ అనుకుంటున్నాను. కాని మధ్యలో మళ్ళా కొన్నాళ్ళు నగరవాసం రాసిపెట్టి ఉంది. ప్రాచీన చీనా కవిత్వం చదివి చదివి నా జీవితం కూడా చీనాకవుల జీవితంలాగా మారిపోయినట్టుంది. అప్పట్లో చీనా ఏకంగా ఉండేటప్పుడు వాళ్ళ రాజధాని చాంగాన్ లో ఉండేది. కాని అది పడమటి చీనాగానూ, తూర్పు చీనా గానూ విడిపోయినప్పుడల్లా, రాజధాని లొయాంగ్ కి మారిపొయ్యేది. ఆ కవులు కొందరు చాంగాన్ లోనే జీవితకాలం జీవించినవాళ్ళున్నారు, కొందరు లొయాంగ్ లోనే పుట్టి పెరిగినవాళ్ళున్నారు. కాని కొందరు మాత్రం. దు-ఫూ లాంటి వాళ్ళు చాంగాన్ కీ, లొయాంగ్ కీ మధ్య వస్తూ పోతూనే జీవితమంతా గడిపేసారు. చూడబోతే నా కథ కూడా అలానే ఉంది.

విజయవాడ మొదటిసారి 1972 లో చూసాను. నా తండ్రి నన్ను తాడికొండ తీసుకువెళ్తూ ఉన్నప్పుడు. ఆ తర్వాత స్కూలుకీ, కాలేజీకి సెలవులిచ్చినప్పుడల్లా ఇంటికి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ విజయవాడని చూస్తూనే ఉన్నాను. కాని ఇక్కడ ఎప్పుడూ ఉంటాననుకోలేదు.

2016 దాకా.

అప్పుడు మొదటిసారి ఆర్నెల్ల పాటు ఈ ఊళ్ళో ఉన్నాను. ఇంకా చెప్పాలంటే ఊరవతల, కృష్ణానదికి దగ్గరలో. కాని మళ్ళా వెళ్ళిపోయాను. తిరిగి మళ్ళా 2019 లో అడుగుపెట్టాను. ఈ మూడేళ్ళూ ఈ ఊరిని పూర్తిగా చూసాను. కొన్నాళ్ళు గవర్నరుపేటలో, మరికొన్నాళ్ళు ఇబ్రహీం పట్నంలో, ఇప్పటిదాకా గొల్లపూడిలో. అన్ని వేళల్లోనూ, అన్ని అవస్థల్లోనూ ఈ ఊరిని చూసాను. వరద పోటెత్తినప్పుడు, ప్రోషిత భర్తృకలాగా కృశించినప్పుడూ కూడా కృష్ణమ్మని చూసాను. మండే ఎండలు చూసాను. ఎండల్లో కూడా నేనెక్కడుంటే అక్కడికి వెంటబడే కోయిలని విన్నాను. వానలు ముగిసాక తెల్లనెమళ్ళు వాలినట్టుగా నదీ తీరం పొడుగునా వికసించిన రెల్లుపొదల్ని చూసాను. భయంకరమైన లాక్ డౌన్ కూడా చూసాను. ఊరంతా కరోనాకి భయపడి లోపల్లోపలే దాక్కుని గడిపిన దుర్భర కాలాన్ని కూడా చూసాను.

కాని ఈ ఊరు నిజంగా విజయపురి. నాకు సంతోషాన్నిచ్చింది. ధైర్యాన్నిచ్చింది. ఒకప్పుడు ఒక రాజు ఇక్కడ ధర్మానికీ, న్యాయానికీ కట్టుబడి జీవించినప్పుడు కనకవర్షం కురిపించిందట. నామీద బంగారాన్నిమించిన ఆశీస్సుల్ని కురిపించింది. దాచుకుంటాను, ఇక్కడ గడిపిన రోజుల్ని, నది ఒడ్డున తెల్లవారిన ప్రభాతాల్ని, నిశ్చింతగా నిద్రపోయిన రాత్రుల్ని.

ఒకప్పుడు రాజమండ్రికి సెలవు చెప్తూ జీవనవైరుధ్యాలు రెండింటినీ ఆమె నాకు రుచిచూపిందని చెప్పుకున్నాను. ఈ ఊళ్ళో కూడా మంచి చెడులు రెండూ నాకు అనుభవానికొచ్చి ఉండవచ్చు. కాని విజయవాడ నాకు మంచిని మాత్రమే గుర్తుండిపోయేలా చేసింది. ఆ పరిణతిని నాకు నేర్పినందుకు ఆ తల్లికి నా సాష్టాంగ ప్రణామాలు.

1982 లో మొదటిసారి ఉద్యోగంలో చేరాను. రాజమండ్రిలో టెలిఫోన్ రెవెన్యూ ఆఫీసులో. నలభయ్యేళ్ళ ఉద్యోగ జీవితం గడిచింది. పని ఎక్కడ ఉందంటే అక్కడికి పెట్టే బేడా సర్దుకుపోయాను. ఇప్పుడు ఉద్యోగం నుంచి పక్కకు తప్పుకున్నాక ఎక్కడికి వెళ్ళడం?

నేను కమ్యూనిస్టుని కాను. కాని నాకంటూ సొంత ఆస్తి సరికదా సొంత ఇల్లు కూడా లేదు. కాండక్టు నియమావళి ప్రకారం ప్రతి ప్రభుత్వోద్యోగీ ప్రతి ఏడాదీ తాను కూడబెట్టుకున్న స్థిరాస్తి, చరాస్తి వివరాలు ప్రభుత్వానికి నివేదించాలి. ఆ రూల్స్ ప్రకారం, యాభై వేలకు పైబడి ఏ వస్తువు కొనుక్కోవాలనుకున్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. దాదాపు ముప్పై అయిదేళ్ళు ప్రభుత్వసేవలో గడిపాను. అందులో ముప్పై నాలుగేళ్ల యాన్యువల్ ప్రోపర్టీ రిటర్న్ లు నిల్ రిపోర్టులే. ఒక్క ఏడాది మాత్రం ప్రభుత్వం అనుమతితో, ప్రభుత్వం ఇచ్చిన అప్పుతో చిన్న కారు కొనుక్కున్నాను. అది తప్ప నాకు మరే స్థిరాస్తి లేదు, చరాస్తి లేదు.

నేను కాపిటలిస్టుని కూడా కాను. నా జీవితంలో ఒక రూపాయి ఏ ఒక్క వ్యక్తికీ వడ్డీ కట్టలేదు, ఒక రూపాయి ఎవరికీ వడ్డీకి ఇవ్వలేదు. ‘నీ జాతకంలో షష్టాధిపతి నీచపడ్డాడు. నీకు శత్రు రోగ ఋణ బాధ ఉండదు’ అన్నాడు టెలిఫోన్స్ ఆఫీసులో నా కొలీగ్ ఒకాయన, నలభయ్యేళ్ళ కిందట. రోగాలు లేకుండానే గడిచింది జీవితం. ఋణరహితం కూడా, ధనరూపేణా చూసుకుంటే. కాని నా మీద అయాచితంగా అభిమానం కురిపించినవారికి ఋణగ్రస్తుణ్ణి కానని ఎట్లా చెప్పుకోగలను? ఇక శత్రువులు. బయటి జీవితంలో నన్ను తిట్టినవాళ్ళూ, తగాదా పడ్డవాళ్ళూ, ఆరోపణలు చేసినవారూ, దుమ్మెత్తిపోసినవాళ్ళూ లేకపోలేదు గానీ, వాళ్ళని శత్రువులని ఎట్లా అనగలను? కబీరు చెప్పినట్టు ‘నన్ను నిందించేవాడెంత త్యాగి! వాడు మునుగుతూ నన్ను తేలుస్తున్నాడు!’ కాని నిజమైన శత్రువులు, అంతశ్శత్రువులు, నా లోపలే ఉన్నారు. వారి బాధ నేనెంత పడ్డానో నా మిత్రుడికేమి తెలుసు? కాని అతడి మాటలే నిజమై, ఆ అంతశ్శత్రు వేధ కూడా లేకపోతే, అది కదా జీవితం!

నిన్న ఒక మిత్రురాలింటికి వెళ్ళాను. తన బిడ్డల్ని చూసి ఆశీర్వదించమని అడిగితే. చిన్నారి బిడ్డలు. కవల పిల్లలు. మూడేళ్ళ వయసు బొమ్మలు. ఉన్నంతసేపూ వాళ్ళ మాటల్తో నా హృదయం నెమలిలాగా పురివిప్పి ఆడుతూనే ఉంది. నాతో వచ్చెయ్యండి, తీసుకువెళ్ళిపోతాను అన్నాను ఆ పిల్లల్తో. ఒక పిల్ల, చిన్నది, రానంది. పెద్ద పిల్ల, నాతో పాటు మా అమ్మ, మా చెల్లి, మా అమ్మమ్మ, మా తాత అందరూ వస్తే వస్తానంది. వాళ్ళందర్నీ తీసుకువెళ్ళలేను,నువ్వొక్కర్తివే రా అన్నాను. రానంది. తీరా నేను వాళ్ళనుంచి సెలవు తీసుకుని ఇంటి బయట అడుగుపెట్టేటప్పటికి, ఆ పసిగుడ్డు, గబగబా చెప్పులు తొడుక్కుని ‘రా అమ్మా వెళ్ళిపోదాం ‘ అని అడగడం మొదలుపెట్టింది. తనని తీసుకువెళ్ళకుండానే నేను వెళ్ళిపోతానని ఆ బిడ్డకు ఎట్లా తట్టిందో, ఆ మెలకువకి, ఆ చిన్నారి నేత్రాల చుట్టూ తడి ఊరడం మొదలుపెట్టింది.

చినవీరభద్రుడూ, చూసావా! ఒక ఆగంతకుడు ఇంటికి వచ్చి నాలుగు మాటలు నవ్వుతూ మాట్లాడితే సర్వం మరిచి అతడి వెంట వెళ్ళడానికి సిద్ధపడ్డ ఆ పసికూన నీకేమి చెప్తున్నదో విన్నావా!

ఇంకా ఆలస్యం ఎందుకు? బయల్దేరు మరి.

11-4-2022

One Reply to “మళ్ళీ హైదరాబాదుకి.”

Leave a Reply

%d bloggers like this: