ఎవరన్నా నాకో ప్రేమలేఖరాస్తే బాగుణ్ణనీ, దాన్ని నా గుండెలో కుట్టిపెట్టుకోవాలనీ నా జీవితకాలం పొడుగునా ఎదురుచూసాను. ఎన్నేళ్ళు గానో ఎదురు చూసిన ఆ ఉత్తరం ఇన్నాళ్లకు నిన్న గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయిలో నా చేతికందింది.
~
సహృదయునికి ప్రేమ లేఖ
‘ప్రశ్నభూమి’ మీద నిలబడి ‘నిర్వికల్ప సంగీత’మాలపిస్తున్న శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారికి!నమస్కరిస్తూ..
ఈ వనభూమి రాస్తున్న ఒక ప్రేమలేఖ ఇది.
ఈ కొండలకి మీరే ఋణపడి ఉన్నారో! ఈ కొండలే మీకు ఋణపడి ఉన్నాయో గాని మీ రాక ఈ నేలకి ఒక మెలకువనిచ్చింది.
‘కోకిల ప్రవేశించే కాలం’ లో ‘పాటలు పుట్టిన తావు’ల్నీ అన్వేషిస్తున్న అన్వేషీ! రాముని కోసం ఎదురు చూసిన శబరిలా ఈ అడవులు మీ రాక కోసం ఎన్నాళ్ళు ఎదురు చూసేయో!
ఈ గాలి మిమ్మల్ని శ్వాసించింది.
ఈ నేల మిమ్మల్ని గానం చేసింది.
ఈ అడవి మిమ్మల్ని వేణువుని చేసింది.
ఆ గానం విశ్వవ్యాప్తమై
నిర్వికల్ప సంగీతమై ఇక్కడ వెలుగు దారుల్ని పరిచింది.
‘కోకిల ప్రవేశించే కాలం’లో అడవి ఆ వెలుతురు గానాన్ని ఆస్వాదిస్తోంది.
మా కోసం కొన్ని కలలు కని
ఎన్నో మెలకువలు మాకు నేర్పిన మీకు ఈ నేల ఋణపడి ఉంటుంది.
మీ తలపులతో ఎప్పటికీ తలలూపుతూనే ఉంటాయి ఈ అడవి కొమ్మలు, ఇక్కడ మీ అడుగుపడిన ప్రతి తావూ తావులు విరజిమ్మే అక్షర పుష్పమై మాలో నిత్య చైతన్యమై నిలిచే ఉంటుంది.
కొండ మీద అతిథీ!
‘నీటి రంగుల చిత్ర ‘ కారుడా!
ఇక్కడి మనసుల మీద తైల వర్ణమై నిలిచి ఎన్నటికీ చెరిగిపోని హరిత చిత్రమై నిలిచి ఉంటారు.
మీ ‘పునర్యానం ‘ కోసం ఎదురు చూస్తుందీ అడవి.
మీ
ప్రేమికులు, పిల్లలు
గిరిజనసంక్షేమ ఆశ్రమ పాఠశాల
టిక్కబాయి
తేది 25-3-2022.
26-3-2022