పరవశ

ఒకప్పుడు ప్రాచీన చీనాలో, పదకొండో శతాబ్దంలో ఉత్తర సోంగ్‌ యుగంలో, గువో జి అనే చిత్రకారుడుండేవాడు. చిత్రకళ గురించి, ముఖ్యంగా లాండ్‌ స్కేప్‌ దృశ్యాలను చిత్రించడం గురించి అతడు అప్పుడూ, అప్పుడూ చెప్పిన మాటల్ని అతడి కుమారుడు గ్రంథస్థం చేసి వెలువరించాడు. ప్రకృతి దృశ్యాలను చిత్రించాలనుకునే చిత్రకారులకి అది వెయ్యేళ్ళుగా పఠనీయ గ్రంథంగా కొనసాగుతూ వస్తోంది. అందులో గువో జి చెప్పిన ప్రతి ఒక్క మాటా సుప్రసిద్ధమైందే. అయితే మరీ సుప్రసిద్ధమైన ఒక మాట ఉంది. అదేమంటే, కొన్ని ప్రకృతి దృశ్యాలు ప్రయాణించడానికి బాగుంటాయి, కొన్ని చూస్తూ వెళ్ళిపోవడానికి బావుంటాయి. కొన్ని దృశ్యాలు మాత్రం అక్కడ ఆగి తచ్చాడేటట్టు ఉంటాయి. కొన్నయితే, అక్కడే ఉండిపోవాలనిపించేట్టు ఉంటాయి అని.
 
మానస చామర్తి కవితలు కూడా అటువంటి చిత్రలేఖనాలు. మనకి అక్కడే ఉండిపోవాలనిపించేలాంటి దృశ్యాలు. ఆ కవితల్లో-
 
‘మేల్కొన్న రెప్పలనంటి ప్రత్యూష హేమరాశి
గుండెల మీద అయాచితంగా రాలిపడ్డ
పసుపుపూల సౌందర్య రాశి..’
 
‘కారుమొయులు మధ్య దూదిపింజలా మెరిసే ఆకాశపు తునక..’
 
‘కొండకొప్పున తురిమిన
నెలవంకల మాలలా
ఘాట్‌ రోడ్‌
కాసేపు నలుపు, కాసేపు వెలుగు..’
 
ఆమెకి ప్రకృతిలో ఉండే సవ్వడి తెలుసు-
 
‘కడవల్లో నీలాకాశాన్ని మోసుకుంటూ
వడివడిగా నడిచిపోయిన ఆ
కొండయువతి కడియాల చప్పుడు..’
 
కాని ఎవరూ పట్టుకోలేని అపారమైన నిశ్శబ్దమూ తెలుసు. ఈ వాక్యం చూడండి:
 
‘మేఘాలు వెళుతూ జారవిడిచిన విశ్రాంతి..’
 
కొన్ని దృశ్యాల్లో మనం ఉండిపోతామంటే ఇదే. ఈ వాక్యం మామూలు వాక్యం కాదు. ఒకప్పుడు మేం మా మాష్టారి దగ్గర మేఘసందేశ కావ్యం పాఠం చెప్పించుకుందామని వెళ్ళాం. ఆయాన రోజూ తన కాలేజిలో లంచి విరామంలో రోజుకి ఒక్కో శ్లోకం చొప్పున చెప్పాలని ఒప్పందం. మొదటిరోజు, ఆ కావ్యానికి మూలం కిష్కింధాకాండలో ఉందని చెప్తూ, ఈ శ్లోకం వినిపించారు:
 
సముద్వహంతః సలిలాతి భారం
బలాకినో వారిధరా వహన్తః
మహత్సు శృంగేషు మహీధరాణామ్‌
విశ్రమ్య విశ్రమ్య పునః ప్రయాన్తి.
 
కొంగలతోనూ, నిండా నిండిఉన్న జలాలతోనూ ఆ మేఘాలు కొండకొమ్ముల మీంచి ఆగి ఆగి మళ్ళా ప్రయాణిస్తున్నాయి అన్నది ఆ శ్లోకానికి అర్థం. కాని, ఆ రోజు మా మాష్టారు ఆ ‘విశ్రమ్య, విశ్రమ్య పునఃప్రయాన్తి’ అనే ఆ మాటల్నే పదే పదే జపిస్తో, పునః పునః స్మరిస్తో ఉండిపోయారు. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. ఇంక మరొక్క మాట కూడా చెప్పలేక, ఈ రోజుకి పాఠం అయిపోయింది అన్నారు. అదే ఆ పాఠానికి మొదటిరోజూ, చివరిరోజూ కూడా. ఎందుకంటే, ఆయన ఆ కావ్యంలో ఆ ప్రకృతి దృశ్యందగ్గర జీవితకాలం పాటు ఆగిపోయారని ఇప్పుడు నాకు అర్థమవుతున్నది.
 
‘మేఘాలు వెళుతూ జారవిడిచిన ప్రశాంతి..’ అనే ఈ వాక్యం చదివినప్పుడు నేను ముప్పై ఏళ్ళ కిందట మేము ఆగిపోయిన ఆ క్షణానికి క్షణంలో ప్రయాణించాను. ఒక మహాకావ్యాన్ని గుర్తు తేగల శక్తి మానస మాటలకుందని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
 
2
 
ఈ కావ్యంలో ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి అంటే ఇది కేవలం ప్రకృతి చిత్రణ చేసిన కావ్యమని కాదు. ఈ కవితలన్నిటిలోనూ కవయిత్రి మానసిక ప్రకృతి మరింత ప్రస్ఫుటంగా చిత్రీకరణకు నోచుకుందని కూడా అర్థం. ఇందులో తల్లి ఉంది, తనయుడు ఉన్నాడు, సహచరుడు ఉన్నాడు, ఒక స్త్రీ జీవితంలోని సమస్త అవస్థలూ ఉన్నాయి. అందరి జీవితాల్లో ఉన్నదే ఈమె జీవితంలోనూ ఉన్నది. కాని ఆ జీవితానుభవం ఒక అక్షరంగా మారడంలోనే ఈమె జీవితసార్థక్యం. మరీ ముఖ్యంగా ఇట్లాంటి వాక్యాలు:
 
‘ఊపిరాడటానికీ, ఊపిరాగడానికీ మధ్య
పోగేసుకునేదల్లా ఆ కౌగిట్లో దక్కిన పరిమళం.’
 
ఎందుకంటే ఆమె ‘సెర్చ్ ఇంజన్లకి దొరకని ప్రేమ’ కోసం అన్వేషణలో నిమగ్నురాలై ఉంది. బయటి ప్రపంచంలో అందరూ చూసే దృశ్యాలే కవి కూడా చూస్తాడు. కాని రవి కాంచని చోటులు చూసినవాణ్ణే కవి అంటాం.
 
‘శరన్మేఘం తన తెలుపు చీరను
ఆకాశం మీద ఆరేసుకుంటుంది.’
 
నాలాంటి వాడు ఆగిపోయే తావు ఇది. ఇటువంటి తావులు ఈ కవితల్లో అడుగడుగునా ఉన్నాయి. ఎందుకంటే ‘అడుగడుక్కీ పూలు పరిచిన దారి’ ఇది.
 
కొన్ని మాటల ముందు నేను మూర్ఛపోతాను. ఉదాహరణకి ‘పరిణతఫలశ్యామ జంబూ వనాల’ గురించి మేఘసందేశకారుడు ఏ ముహూర్తాన ప్రస్తావించాడో గాని భారతీయ కవిపరంపర ఆ నేరేడుపళ్ళ వాగు ఒడ్డునుంచి ఇప్పటికీ బయటపడలేకుండానే ఉంది, చీనా కవులు Peach Blossom Spring నుంచి తప్పించుకోలేనట్టుగా. ఈ కవయిత్రి కూడా ఆ పరంపర కే చెందింది అనడానికి, ఇదిగో, ఈ ఒక్క మాట చాలు:
 
‘నేరేడు పళ్ళు రాలిన డొంకదారి..’
 
3
 
ఒక కవికి అన్నిటికన్నా ముందు కావలసింది ఎక్కడో ఒకచోట ఆగిపోగలగడం, తనని కుదిపేసే ఏ జీవితానుభూతికో గూడుకట్టుకుని అక్కడే యుగాల పాటు ఉండిపోగలగడం.
 
‘ఒక పసిపాప కేరింత, పేరితెలియని పక్షి కూతా
నీరెండ కిరణాల్లా ఏ వైపు నుండో తేలి వచ్చి
ఉదయన్నే హృదయాన్ని వెలిగించే దారి’
 
ని గుర్తుపట్టగలగడం. ఇంకా చెప్పాలంటే తాను ఎందుకు వివశమవుతున్నదో తనకే తెలియకపోవడం, అప్పుడు ఇదిగో ఇట్లా అనగలగడం:
 
‘ఆగీ ఆగీ ఉబికే ఆనందం ఏ దిక్కునుండి వస్తుందో నాకే అర్థం కాకుండా ఉంది..’
 
నేనొక కవిపరంపరకి జీవితకాలపు ఆరాధకుణ్ణి. ఈ కవయిత్రి కూడా ఆ పరంపరకు చెందిందే అని అర్థమవుతున్నది. లేకపోతే, ‘వాన, దేవతలు విన్న నా ప్రార్థన’ అనడం మరొకరికి సాధ్యమవుతుందా?
ఈ కవితల్లో వెలుగు, చీకటి రెండూ ఉన్నాయి. కాని నేను ఆగిపోయేది అక్కడ కాదు. అందరూ చూసే దృశ్యాన్నే ఎవరూ చెప్పలేనట్టుగా చెప్తుందే ఆ తావులు చూడండి:
 
‘స్టాపర్‌ తోసుకు తోసుకు
మూతపడాలనుకునే తలుపులా
నీ తలపు తోసీ తోసీ
లోకాన్నంతా నెట్టేస్తుంది’
 
లేదా మరో చోట-
 
‘నిద్రకు ముందు నగలన్నీ తీసేసిన యువతిలా
సాయంకాలపు తళుకులు తుడుచుకున్న కొలను’
 
ఈమె మామూలు కవి కాదు. ఈ పుస్తకం కూడా మామూలు పుస్తకం కాదు, ఈమె మాటల్లోనే చెప్పాలంటే
 
‘ఒక హృదయంలా, జీవితంలా
పరాయిగా చూడని స్నేహంలా, పాశంలా
మనల్ని బంధించే’
 
ఈ పుస్తకానికి నేను పూలు జల్లి స్వాగతం పలక్కుండా ఎలా ఉండగలను!
 
9-4-2022

3 Replies to “పరవశ”

  1. చినవీరభద్రుడుగారు మీ పుస్తకంలోని సౌందర్యాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు.
    కవిత్వం నిజంగా ఒక రసానుభూతి. పాఠకుడు ఎంతో ఇష్టపడి అక్కడికి చేరుకుంటాడు. తన అనుభూతిని పాఠకుడికి అందించగలగడంలోనే కవి ప్రతిభ దాగుంది.
    అభినందనలు మానసగారూ.

Leave a Reply

%d bloggers like this: