దామెర్ల రామారావు

దామెర్ల రామారావు (1897-1925) ఆధునికాంధ్ర చిత్రకళని రూపొందించినవాడు. పందొమ్మిదో శతాబ్ది చివరి కాలంలోనూ, ఇరవయ్యవ శతాబ్ది మొదటి దశాబ్దాల్లోనూ పాశ్చాత్య చిత్రకళ భారతదేశానికి పరిచయమైనప్పుడు వివిధ ప్రాంతాలు వివిధ రీతుల్లో స్పందించాయి. ఆ స్పందనల్లోంచి తొలి భారతీయ ఆధునిక చిత్రకళా రీతులు రూపుదిద్దుకున్నాయి. వాటిలో ప్రపంచ ప్రసిద్ధమైంది బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్. అయితే అదే సమయంలో తెలుగునేల కూడా ఆ నవయుగానికి గొంతువిప్పింది. ఆ వైతాళికుడు దామెర్ల రామారావు అని దాదాపుగా ప్రతి ఒక్కరికీ తెలుసుగాని, బెంగాల్ చిత్రకారుల గురించి మనకి లభ్యమవుతున్నంత సాహిత్యంగాని, చిత్రలేఖనాల పూర్తి కాటలాగు గాని, ఆయన మీద పనిచేసిన ప్రభావాలూ, తదనంతర చిత్రకారులపైన ఆయన నెరిపిన ప్రభావం గురించి గాని మనకు అందుబాటులో ఉన్నది చాలా తక్కువ.
 
నలభయ్యేళ్ళ కిందట నేను ఉద్యోగం కోసం రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆతృతగా వెతుక్కున్నది ఇద్దరి ఆనవాళ్ళ గురించి. ఒకరు దామెర్ల రామారావు, మరొకరు నేదునూరి గంగాధరం. అప్పుడు ఆనం వెంకటేశ్వర కళా కేంద్రం వెనక ఉన్న దామెర్ల ఆర్ట్ గాలరీలో ఆయన చిత్రాలన్నీ ఒక కుప్పలాగా ఒక మూలకి చేర్చి ఉండటం గమనించాను. ఆ బొమ్మల్ని ఒక్కొక్కటే చూడాలని ఎంతగానో అభిలషించానుగానీ, ఆ రోజులనాటికి అది ఎప్పటికీ సాధ్యమయ్యే ఊహ లా కనిపించలేదు. కాని నిన్న మళ్ళా దామెర్ల రామారావు ఆర్ట్ గాలరీలో అడుగుపెట్టినప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఆ ప్రాంగణంలో ఉన్న రెండు మందిరాల్లో ఒకదానిలో రామారావు, సత్యవాణి దంపతులు చిత్రిచించిన నీటిరంగుల చిత్రలేఖనాల గాలరీ, మరొక మందిరంలో రామారావు గారు చిత్రించిన స్కెచ్ లతో పాటు వరదా వెంకటరత్నం, రాజాజీ, భగీరథి, సంజీవ్ దేవ్ వంటి వారి చిత్రలేఖనాల మరొక గాలరీ చూడగలిగాను.
 
రామారావు గారి నీటిరంగుల చిత్రలేఖనాల గాలరీ పాతపడ్డ గోడలమీద, పేద వెలుతుర్లో ప్రదర్శనకు పెట్టి ఉండటం నిరాశకు గురిచేసే అంశమే అయినప్పటికీ, ఇన్నాళ్ళకు, మొదటిసారిగా, ఆయన చిత్రలేఖనాలు మొత్తం ఒకదానివెంట ఒకటి చూడగలిగానన్న సంతోషం ముందు తక్కిన అసంతృప్తి అంతా పక్కకు పోయింది.
 
ఆ బొమ్మల్లో సుప్రసిద్ధమైన ఆయన నీటిరంగుల చిత్రాలు, ఇప్పుడు మనకి నెట్ లొ కూడా దొరికే ‘సిద్ధార్థ రాగోదయము’, ‘బావి దగ్గర’, ‘శ్రీరామ వనవాసము’, ‘తొలిచూలు ‘ వంటి చిత్రాలు ఎలానూ ఉన్నాయి. కాని నన్ను నివ్వెర పరిచింది ఆయన వేసిన లాండ్ స్కేప్స్. దామెర్ల రామారావుగారు ఇంత అద్భుతమైన లాండ్ స్కేప్ చిత్రకారుడని నాకిప్పటిదాకా తెలియదు. ఆ చిత్రాలు కూడా నేనిప్పటిదాకా ఎక్కడా చూడలేదు. అంతకన్నా మరొక ఆశ్చర్యం అవి మీనియేచర్లు కావడం. భారతదేశంలో ఆధునిక మీనియేచర్ చిత్రకారులు బీరేశ్వర్ సేన్ వంటివారి గురించి మనకు పరిచయం చేసిన సంజీవ దేవ్ కూడా రామారావు గారి మీనియేచర్ చిత్రాలగురించీ, లాండ్ స్కేప్ చిత్రలేఖనాల గురించీ ఎక్కడా రాసినట్టు నాకు గుర్తులేదు. బహుశా నలభయ్యేళ్ళ కిందట నేను చూసినట్టుగా ఆ చిత్రలేఖనాలన్నీ గుట్టగా పోసి ఉండటం వల్ల అవి ఎవరి దృష్టికీ వెళ్ళినట్టు లేదు.
 
ఆ చిత్రలేఖనాల మీంచి నా చూపు తిప్పుకోవడం నాకంత సులభమనిపించలేదు. అంత చిన్న చిన్న కాగితాల మీద ఆయన అంత విస్తృతమైన ఆకాశాన్నీ, భూమినీ, గాలినీ, వెలుతుర్నీ ఎట్లా పట్టుకోగలిగేరా ఆశ్చర్యమనిపించింది. మరొకటి, ఆ లాండ్ స్కేప్ ఎక్కడో హిమాలయ దృశ్యాలు కాదు. పాపికొండలు, రాజమండ్రి దగ్గర బొమ్మూరు మెట్ట, తాను రోజూ చూసే నదీ, చెట్లూ, రెండెడ్ల బళ్ళూ,- స్పష్టంగా ఇది తెలుగు లాండ్ స్కేప్. ఈ చిత్రలేఖనాలు ఏ విధంగా చూసినా తొలి తరం భారతీయ చిత్రకారులు, అవనీంద్ర నాథ్ టాగోర్, గగనేంద్ర నాథ టాగోర్, నందలాల్ బోస్ వంటి వారి లాండ్ స్కేప్ లకు ఏ విధంగానూ తీసిపోవు సరికదా, వారందరినీ చూసిన తర్వాత కూడా వీటి ప్రత్యేకత, వీటి వైదుష్యం, వీటి సున్నితత్త్వం ఎంతో విశిష్టంగా గోచరిస్తూనే ఉన్నాయి. బెంగాల్ తరహా చిత్రలేఖనాల్లాగా ఇవి వాష్ టెక్నిక్ చిత్రలేఖనాలు కావు. బ్రిటిష్ ప్యూరిస్టు వాటర్ కలరిస్టు ల్లాగా ఆయన తెలుపు వాడకూడదనే నియమమేమీ పెట్టుకున్నట్టు కనిపించదు. కాని వాటిలో ఒక పరిశుద్ధత, నైర్మల్యం వల్ల ఒనగూడిన పారదర్శకతకి కూడా లోటు లేదు.
 
చూడండి, కొన్ని లాండ్ స్కేప్స్ ఇక్కడ పొందుపరుస్తున్నాను. అవి చూడగానే నాలో అంతదాకా ముడుచుకుని ఉన్న రెక్కలు ఒక్కసారిగా ఏటవాలుగా బయటికి పరుచుకున్నాయి. తక్కినపనులన్నీ పక్కన పెట్టి, ఏ ఏటి ఒడ్డుకో, ఏ లాకుల దగ్గరకో పోయి ఆ చెట్లనీ, ఆ నీళ్ళనీ, ఆ నీడల్నీ చిత్రించుకుంటూ గడపాలని అనిపించకుండా ఎలా ఉంటుంది?
 
రామారావు మూడు పదులు కూడా నిండకుండానే ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పటికీ జరామృత్యువుల్లేని ఒక లోకాన్ని మనకి అందించి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు అమరావతి శిల్పాలమీద, అజంతా గోడల మీద, లేపాక్షి స్తంభాల మీద ఆకృతులు, వర్ణాలు, రేఖావిన్యాసం చిత్రించిన మహాకళాకారుల, చిత్రకారుల రక్తం ఆయనలో ప్రవహిస్తూ ఉండి ఉండాలి. తెలుగు జాతి అంటే అటువంటి వారు దర్శించిన, సృష్టించిన ఒక భావసౌకుమార్యం అని మనం ఎప్పుడు గుర్తుపడతామో అప్పుడే మనకు పునరుజ్జీవనం.
 

14-3-2022

Leave a Reply

%d bloggers like this: