
మేఘసందేశ కావ్యంలో యక్షుడు మేఘానికి ప్రయాణ మార్గాన్ని వివరిస్తూ, మేఘం అవంతీదేశంలో ప్రవేశించగానే ఉదయన కథాకోవిదులైన గ్రామవృద్ధులు కనిపిస్తారని చెప్తాడు. ఆ ఉదయనపండితుల గురించి మా మాష్టారు తరచు ప్రస్తావిస్తూ ఉండేవారు.
ఉదయినుడు అవంతీదేశపు రాజు. ఉజ్జయిని ఆయన రాజధాని. ఆయన చరిత్ర, ఆయన ప్రేమకథలు, రసజ్ఞత ప్రజల స్మృతిలో నిలిచిపోయాయి. తర్వాతి రోజుల్లో సంస్కృత, ప్రాకృత సాహిత్యాల్లో ఎన్నో కావ్యాలూ, నాటకాలూ ఆయన కథల చుట్టూ అల్లుకున్నాయి. ఆ కథలు అక్కడి గాలిలో, ఆ గ్రామాల్లో ఇంకా వినిపిస్తూనే ఉంటాయనే అర్థంలో కాళిదాసు మేఘసందేశ కావ్యంలో ఆ ఉదయన కథాకోవిదుల గురించి ప్రస్తావించాడు. వాళ్ళ పని ప్రతి కొత్త తరానికీ ఆ ఉదయన చరిత్రను పరిచయం చెయ్యడం. గ్రామమధ్యంలో, రథ్యల దగ్గర, రావిచెట్టునీడన, రచ్చబండమీద కూచుని, అనేక సాయంకాలాలు, మరే వ్యాపకం లేకుండా, ప్రతి ఫలాపేక్ష లేకుండా ఉదయనుడి గురించీ, ఉల్లాసభరితాలూ, ఉత్తేజకారకాలూ అయిన అతడి కథలు చెప్పడమే వాళ్ళ పని. అలా ఆ కథలు చెప్తున్నప్పుడు వాళ్ళు ఆ పౌరులముందు ఒక ఆదర్శాన్ని, ఇప్పటి భాషలో చెప్పాలంటే, ఒక రోల్ మోడల్ ని ప్రతిష్టించేవారు. ఆ కథలు ఆ పౌరస్మృతిలో భాగమైపోయేవి. కాలం గడిచేకొద్దీ ఆ కథల వన్నె పెరిగేదే గాని తగ్గేదికాదు.
నన్నడిగితే ప్రతి భాషకీ, ప్రాంతానికీ, దేశానికీ అటువంటి ఉదయన పండితులు అవసరం. వాళ్ళు అటువంటి కథలు చెప్పడం ద్వారా, ఆ గాథలు తవ్వి తలపోయడం ద్వారా తమ జాతికొక అభిరుచిని నిర్మిస్తారు. ఆ అభిరుచి కాలక్రమంలో ఒక సంస్కృతిగా రూపొందుతుంది. ఒకప్పుడు సామల సదాశివగారి గురించి మాట్లాడుతూ ఆయన్ని అటువంటి సంస్కృతీ నిర్మాత గా అభివర్ణించాను. ఆయన ముందు చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి, దిగవల్లి వేంకట శివరావు, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి వంటి వారు తమ కథలు, గాథల ద్వారా చేసింది ఆ పనే.
ఇదిగో, ఇప్పుడు ఆ పూర్వమహనీయుల కోవలో, మన కాలంలో ఎర్రాప్రగడ రామకృష్ణ అటువంటి ఉదయన పండితుడిగా, ఒక సాహిత్యాభిరుచి ప్రచారకుడిగా మనముందు నిలబడుతున్నాడు. నాకు సంతోషమేమిటంటే కాలం అతణ్ణి ఈ పనికి ఎంచుకుంది. ఎందుకంటే గడిచిపోయిన కాలానికీ, రానున్న లోకానికీ మధ్య పరుచుకున్న రసార్ణవం మీద సేతువు కట్టడానికి, నాకు తెలిసి, ఇంతకన్నా మరొక సమర్థుడు మరొకడు లేడు.
2
రామ కృష్ణ నాకు పరిచయమయ్యి నలభై ఏళ్ళు. నా తొలియవ్వనకాలంలో రాజమండ్రిలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్న రోజుల్లో, ఆర్.ఎస్.సుదర్శనంగారు నాకు సాహితీవేదిక బృందాన్ని పరిచయం చేసారు. ఆ మిత్రులవల్ల రాజమండ్రి నా విశ్వవిద్యాలయంగా మారిపోయింది. గౌతమీ గ్రంథాలయం, సమాచారం పత్రికా కార్యాలయం, గోదావరి గట్టు వంటివి మా అధ్యయన కేంద్రాలు. ఆ స్నేహాలవల్ల రాజమండ్రిని నేను నా ఉజ్జయిని గా లెక్కపెట్టుకుంటాను. ఇప్పటికీ ఆ ఊరు తలపుకి రాగానే ‘మా గోదావరియే, తదీయ తటియే, ఆమ్నాయాంత సంవేద్యుడౌ, మా గౌరీశుడె, మా వేణుగోపాలుడే ‘అంటో మా మాష్టారు రాసుకున్న పద్యం నా మదిలో నర్తిస్తుంది. ఒక్కణ్ణే ఒక రూములో ఉంటో, బయట హోటల్లో భోజనం చేస్తో, చాలీచాలని జీతంతో గడిపిన అటువంటి కాలంలో రామకృష్ణ నాకు అన్నగా నిలబడ్డాడు. ఎన్నిరాత్రులో అతడి ఇంట్లో సోదరి పెట్టిన అన్నం తిన్నానో లెక్కపెట్టలేను. నేను రాజమండ్రి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఒక కవిత రాసాను. అందులో ‘సెలవు నువ్వు కలిపి పెట్టిన అన్నం ముద్దలకు, సెలవు నీవు రుచి చూపిన ఆకలి రాత్రులకు ‘ అని ఒక వాక్యం రాసాను. రాజమండ్రి నాకు కలిపి పెట్టిన అన్నం ముద్దల్లో అధికాంశం అతడి భార్య, అంటే మా సోదరి కలిపి పెట్టిన అన్నం ముద్దలే.
ఆ రోజుల్లో మాకు మరొక జీవితాశయం లేదు. కవి తప్ప మరొకరెవరూ మాకు ఆరాధనీయులుగా కనబడేవారు కారు. సాహిత్యం గురించి మాట్లాడుకోవడమొక్కటే ముఖ్యమైన పనిగానూ, తీరికసమయపు వ్యాపకంగానూ ఉండేది. అట్లాంటి కాలంలో అయిదేళ్ళు అక్కడ గడిపాను. కాని రామకృష్ణ ఇంతకాలం అక్కడే గడిపాడు, గడుపుతూనే ఉన్నాడు. వేదంలా ఘోషించే గోదావర్ని వదిలిపెట్టలేక ఉద్యోగంలో ప్రమోషన్లు వదులుకున్నాడు. ఒక ఋషి దగ్గర ఆయన సేవ చేసుకుంటూ ఉండిపోవడమే తమ జీవిత కర్తవ్యంగా భావించే వాళ్ళుంటారే, అదిగో, రామకృష్ణ అట్లాంటి కోవకి చెందినవాడు. రాజమండ్రి వీథుల్లో తిరుగుతో, పూర్వ, అధునాతన కావ్యాల గురించీ, సాహిత్యకారుల గురించీ మాట్లాడుకుంటూ గడపడం కోసం అతడు తక్కిన జీవితానందాలన్నీ సునాయాసంగా పక్కన పెట్టెయ్యగలిగాడు.
ఇప్పుడు ఈ పుస్తకం లో వ్యాసాలు తిరగేస్తుంటే అన్నిటికన్నా ముందు నా మీద ఆ గోదావరి గాలులు పుష్కలంగా వీచిన అనుభూతి కలిగింది. ఎన్నో సాయంకాలాలు గోదావరి గట్టు మీద కూచుని సాహిత్యచర్చలు చేసుకుంటూ గడిపిన రోజులు గుర్తొచ్చాయి. మల్లంపల్లి శరభయ్యగారూ, సుదర్శనంగారూ, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారూ, మా మహేశ్, సావిత్రిగారూ, సుబ్రహ్మణ్యం, గోపీ చందులు గుర్తొచ్చారు. నా రాజమండ్రి జ్ఞాపకాలు అంతవరకే. కాని రామకృష్ణ ఆ ఏథెన్సు వీథుల్లో సోక్రటీసు తర్వాత కాలపు తాత్త్వికుల్ని కూడా చూసాడు. పద్యకవితాయుగం నుంచి యెండ్లూరి సుధాకర్ దాకా తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేసిన ఎందరో కవుల్ని, ఎన్నో సాహిత్యాల్ని చూసాడు. చూడటమే కాదు, తెలుగు నేల నలుమూలలా తన అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీ ఎలుగెత్తి చాటాడు. మేము చెయ్యలేని ఈ పని చేసినందుకు, మేము రామకృష్ణకి సదా ఋణపడి ఉండక తప్పదు.
3
సాహిత్యం చదువుకోవడం దానికదే గొప్ప పురస్కారం. జీవితం నీకివ్వగల గొప్ప బహుమతి. ఇక చదువుకున్న సాహిత్యాన్ని పదే పదే మననం చేసుకోవడం, చదువుకున్న కవుల్ని ఒకరొకర్ని పోల్చి చూసుకోవడం, వారి సారాంశాన్ని తేనెలాగా పోగుచేసి నలుగురి దోసిళ్ళలోనూ ధారపొయ్యడం మామూలు సుకృతం వల్ల లభించే భాగ్యం కాదు.
ఈ పుస్తకం అటువంటి సుకృతసంపద. ఈ గోదావరి గలగలలు అతడు ఏదో ఒక రోజులోనో, ఒక వేళప్పుడో విన్నవి కాదు. ఇందులో సుప్రభాత సుగంధాలు ఉన్నాయి. మధ్యందిన అధ్యయనాలు ఉన్నాయి, సాయంకాల సంధ్యావందనాలు ఉన్నాయి. పూర్వాహ్ణ, మధ్యాహ్న, అపరాహ్ణాలు ఏ ఒక్క రోజువో కావు, అవి అతడి జీవితకాలం మొత్తానికి చెందినవనే సూక్ష్మాన్ని మళ్ళా నేను వాచ్యం చెయ్యనక్కరలేదు.
హిందుస్తానీ సంగీతం వినేవాళ్ళకి ఆ సంగీతసౌరభంతో పాటు మరో సంతోషం కూడా అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అదేమంటే, ఆ రాగాలకి వేళలూ, ఋతువులూ కూడా ఉంటాయనేది. ఆ రాగాల్లో కొన్ని ప్రాతఃకాలీన రాగాలు, కొన్ని పూర్వాహ్ణ రాగాలు, కొన్ని సాయంకాల రాగాలు, కొన్ని అర్థరాత్రి రాగాలు. అంతేనా, కొన్ని రాగాలు, జామునుంచి జాముకి కాలం మారేటప్పుడు, ఆ పరివర్తనలోని భావోద్వేగాన్ని ప్రకటించే సంధి ప్రకాశ రాగాలు కూడా.
రామకృష్ణ తాను చదువుకున్న సాహిత్యాల్ని, తనను ప్రభావితం చేసిన భావోద్వేగాల్ని వింగడించుకుంటున్నప్పుడు ఏవి ప్రాతఃకాల రాగాలో, ఏవి సాయంకాల రాగాలో గుర్తుపట్టాడు. అది మరొక సుకృతం. మనుషులు తమ ఆస్తిపాస్తుల్లో ఏవి ఎవరికి చెందాలో లెక్కవేసినట్టు, అతడు తన జీవితకాలంలోని సూనృత ఘడియలకి ఎవరికి ఎంత ఋణపడ్డాడో ఈ పుస్తకంతో లెక్కలు తేల్చేసాడు.
తాను పుట్టిన దేశం, సంస్కృతి, ఆదికవి, కావ్యవాక్కు, రామ శబ్దం, తెలుగు తల్లి, తెలుగు నేల, తన గోదావరి జిల్లా ఇవన్నీ ప్రాతఃస్మరణీయాలు. తెల్లవారి లేచేటప్పుడు అరచేతులు జోడించుకుని, వారికి నమస్కరించుకుని, అప్పుడు నేలమీద కాళ్ళు పెడితే ఆ నడక నడత గా మారుతుందని రామకృష్ణ గుర్తుపట్టాడు.
ఇక రోజువారీ జీవితం మొదలయ్యాక, దైనందిన జీవితపు ఆటుపోట్ల నుంచి చేతులడ్డి కాపు కాచే కవిత్వాలు, ప్రభావాలు మధ్యాహ్న మార్తాండుడి వేడినుంచి సేదతీర్చే చెలమలు, చెలుములు. శ్రీనాథుడి నుండి జాషువా దాకా, దేవీ భాగవతం నుండి యోగానంద దాకా, ఖజురహో నుండి కల్పవృక్షందాకా ఎందరు కవులు, ఎన్ని కావ్యాలు, ఎన్ని మననీయ కవిత్వచరణాలు! సాయంకాలానికి వచ్చేటప్పటికి కవిత్వంతో పాటు సంగీతమూ, విమర్శతో పాటు తత్త్వశాస్త్రమూ కూడా తన తలపుల్ని రసభరితం చేస్తున్నాయని మనకి అర్థమవుతుంది. వాల్మీకి తో మొదలైన రోజు దినాంతవేళ గురజాడ స్మరణకు చేరుకోవడంలో ఒక ‘గురుజాడ ‘ఉంది.
ఈ పుస్తకంలోంచి ఎన్నో వాక్యాలకు వాక్యాలు ఇక్కడ ఎత్తి రాయాలని ఉంది. కానీ ఆ ప్రలోభాన్ని కష్టం మీద అణచుకుంటూ, ఒక్క వాక్యం మాత్రం ఇక్కడ ఉల్లేఖించకుండా ఉండలేకపోతున్నాను: ‘నవీన నాగరికత అన్ని రంగాల విలువలను సమూలంగా నాశనం చేస్తూ పోతూ ఉంటే, మరోవైపు నుంచి సంజీవినీ పుల్లను ధరించిన సాధువుల హితవచనాలు వాటిని బతికించుకుంటూ వస్తున్నాయి.’ ఈ మాటలు రామకృష్ణ రాసిన ఈ వ్యాసాలకు కూడా అన్వయించవచ్చు. కాబట్టి ఇవి కొన్ని పరమసాధు హితవచనాల గురించిన సాధుహితవచనాలు అని చెప్పగలను.
29-3-2022