కృతజ్ఞతా సమర్పణ

రాత్రి పన్నెండయింది ఇంటికొచ్చేసరికి. గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులు, గిరిజన సంఘాలు, విద్యార్థి సమాఖ్యలు మెట్రొపోలిటన్ హోటల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయమైన వీడుకోలు నా హృదయాన్ని ద్రవింపచేసింది. ఆరుగంటల పాటు ఒక జలపాతం కింద ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది నా మీద వర్షించిన వారి ప్రేమ ప్రకటన. మూడున్న దశాబ్దాల ఉద్యోగ జీవితం నాకు ఇందరి హృదయాల్లో స్థానం సంపాదించిందని నేను ఊహించలేదు. ఉత్తరాంధ్రనుంచి రాయలసీమదాకా, చెంచు వారినుండి యానాది మిత్రులదాకా, శ్రీశైలం నుండి సింహాచలం దాకా ఇంత మంది నాకోసం అంతంత దూరాలనుంచి వస్తారనీ, నాపట్ల వారి ప్రేమను నలుగురితో పంచుకోడానికి అంత పొద్దు పోయేదాకా కూడా ఓపిగ్గా ఎదురు చూస్తారనీ నేను ఊహించలేదు.

వారికి ప్రేమకు ప్రతిస్పందించమన్నప్పుడు నేను కృతజ్ఞతా సమర్పణ మాత్రమే చేయగలనని చెప్పాను. నన్ను ఒక బాధ్యత కలిగిన అధికారిగా, గిరిజన మిత్రుడిగా, ఒక మనిషిగా మార్చిన వారందరికీ, నా ఉద్యోగ జీవితంలో తారసపడ్డవారందరికీ, నన్ను ఆదరించినవారికీ, దారి చూపినవారికీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పుకున్నాను.

అందరికన్నా ముందు నా తండ్రి. ఆయన ఆ మారుమూల గిరిజన గ్రామంలో గిరిజనుల భూమి హక్కుల కోసం తన సర్వశక్తులూ ఒడ్డి పోరాటం చేసాడు. ఆయన ఈలోకాన్ని వదిలివెళ్ళిపోయేటప్పటికి ఆయనకి సొంత ఇల్లు లేదు, స్థలం లేదు, వేలికి చిన్న ఉంగరం కూడా లేదు. ఆ ఇంట్లో పాతబీరువాలో ఆ నెల ఖర్చులకోసం నేను పంపిన మూడు వేలు తప్ప మరొక నయాపైస లేదు. ఆయనకి తోడు మా అమ్మ. వారు నా ఆదర్శమూర్తులు. వారిలాగా జీవితం గడపాలన్నది నా కల, నా తపస్సు, నా జీవితాశయం. వారిని తలుచుకున్నప్పుడు నాకు కళ్ళనీళ్ళు ఆగలేదు. నేనిన్నేళ్ళు గిరిజన సంక్షేమ శాఖలో పనిచేయడం వారి ఋణాన్ని తీర్చుకోవడమనే అనుకున్నాను.

1987 జూన్ నెలలో నేను గిరిజన సంక్షేమ శాఖలో చేరాను. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు గారి స్ఫూర్తితో ఎస్.ఆర్.శంకరన్ గారు గిరిజన సంక్షేమ శాఖ కి కూడా డైరక్టు రిక్రూట్ అధికారులు ఉండాలని కోరుకున్నారు. అలా ఆ శాఖలో చేరిన మొదటి డైరక్ట్ రిక్రూట్ ని నేను. నా నియామక ఉత్తర్వులు ఎస్.ఆర్.శంకరన్ గారు ఇచ్చినవి కావడం నా భాగ్యం. వారికి నా ధన్యవాదాలు.

నా మొదటి ప్రమోషన్ కు పదమూడేళ్ళు ఆగవలసి వచ్చింది. కాని ఇరవయ్యేళ్ళకల్లా అడిషనల్ డైరక్టర్ ని కాగలిగాను. అందుకు కారణం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిగారు, అప్పటి గిరిజన సంక్షేమ శాఖమంత్రి రెడ్యానాయక్ గారు. వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాను. 2018 లో ఐ ఏ ఎస్ కు ఎంపిక అయినప్పుడు యు.పి.ఎస్.సి ప్రతిపాదనలను అంగీకరించి నాకు ప్రమోషను ఇచ్చిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇక ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, విద్యారంగానికి చెందిన అత్యంత కీలక బాధ్యతలు అప్పగించడమే కాక, నా పట్ల అపారమైన నమ్మకాన్నీ, ఆదరాన్నీ చూపిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి గారికి నేను జీవితమంతా ఋణపడి ఉంటాను. ఎందుకంటే, నేను విద్య గురించి జీవితకాలం పాటు కన్న కలల్ని ఆచరణకు తేగలిగే అపురూపమైన అవకాశాన్ని వారు నాకివ్వడమే కాక, ఆ ప్రయత్నాల్లో ఎన్ని అవరోధాలు, ఆరోపణలు, వ్యతిరేకతలు ఎదురైనా పెట్టని కోటలాగా నిలబడ్డారు.

ఆ మధ్య నా పైన ఒక వార్తా పత్రిక, కొన్ని టెలివిజన్ చానెళ్ళు రాజకీయ దురుద్దేశాల్తో రెండు మూడు రోజుల పాటు అసత్య ప్రచారంతోనూ, అభూత కల్పనల్తోనూ దాడి చేసాయి. అటువంటి సందర్భాల్లో వాస్తవాలేమిటో ప్రజలకు తనంతట తాను నేరుగా చెప్పుకోడానికి ఏ ప్రభుత్వ ఉద్యోగికీ కాండక్ట్ రూల్స్ అనుమతించవు. ఒక జీవితకాలం పాటు సముపార్జించుకున్న ఒక వ్యక్తిత్వం మీద, అతడు నమ్మిన విలువల మీద సమాచార ప్రసార సాధనాలు అత్యంత హేయంగా దాడిచేసే ఆ క్షణాల్లో ఏ ప్రభుత్వోద్యోగి అయినా అనుభవించే నిస్సహాయత మాటల్లో చెప్పలేనిది. అటువంటి దాడిని తట్టుకుని నిలబడటానికి దైవం తప్ప మరొకరెవరూ తోడు నిలవని క్షణాలవి. సరిగ్గా ఆ రోజుల్లోనే జరిగిన ఒక మంత్రిమండలి సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ఎజెండా కూడా ఉండటంతో మా ప్రిన్సిపల్ సెక్రటరీగారితో పాటు నేను కూడా అక్కడున్నాను. అప్పుడు నా ఎదటనే, ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులతో ‘విద్యావ్యవస్థను గాడిలో పెట్టడానికి వీరభద్రుడన్న పోరాటం చేస్తున్నాడు ‘అని చెప్పిన మాటలు నాకెంత భరోసానిచ్చాయో చెప్పలేను. రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది విద్యార్థుల శుభాకాంక్షలు ఆ రోజు ముఖ్యమంత్రిగారి రూపంలో నాకు బాసటగా నిలబడ్డాయనిపించింది.

నా ఉద్యోగ జీవితంలో గిరిజన సంక్షేమ శాఖామాత్యులుగా పనిచేసిన గోడెం రామరావుగారు, కోట్నాక భీమ్ రావు గారు, చందులాల్ గారు, మత్సరస మణికుమారి గారు, గోడెం నగేష్ గారు, డి.ఎస్.రెడ్యానాయక్ గారు, పసుపులేటి బాలరాజు గారు, రావెల కిశోర్ బాబుగారు, నక్కా ఆనందబాబు గారు, కిడారి శ్రావణ కుమార్ గారు, ముఖ్యంగా ప్రస్తుత ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు పాముల శ్రీపుష్పవాణి గారలు నా పట్ల చూపిన ఆదరానికి, గౌరవానికి నేనెప్పటికీ వారికి ఋణపడి ఉంటాను.

నా ఉద్యోగ జీవితంలో నాకు మార్గదర్శకత్వం చేసిన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శులు సమరజిత్ రే గారు, సి.ఆర్.బిశ్వాల్ గారు, ఛాయారతన్ గారు, నాగిరెడ్డి గారు, ఎ.కె.టిగిడి గారు, డా. ఎ.విద్యాసాగర్ గారు, సిసోడియా గారు, రావత్ గారు, కాంతిలాల్ దండే గారలకు ధన్యవాదాలు. నేను కమిషనర్ కార్యాలయంలో పనిచేసినప్పుడు కమిషనర్లుగా, డైరక్టర్లుగా పనిచేసిన ఎం.వి.పి.సి శాస్త్రిగారు, ఛాయారతన్ గారు, కె.రాజు గారు, పి.వి.రమేశ్ గారు, టి.ఎస్. అప్పారావుగారు, వినోద్ కుమార్ అగ్రవాల్ గారు, ప్రేమ్ చంద్రా రెడ్డిగారు, మన్ మోహన్ సింగ్ గారు, ఆర్.రామకృష్ణయ్య గారు, కాడ్మియేలుగారు, సోమేష్ కుమార్ గారు, శాంతి కుమారి గారు, డా.పద్మ గారలు నా పట్ల చూపిన గౌరవానికి, ఆదరానికి నేనెప్పటికీ కృతజ్ఞుణ్ణి. ఒక క్లిష్ట సమయంలో నాకు అండగా నిలబడ్డ కుమారస్వామి రెడ్డి గారికి, టి. విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను జిల్లాల్లో పనిచేసినప్పుడు కలెక్టర్లుగా నన్ను ఆదరించిన టి.ఎస్. అప్పారావుగారు, వి.రాజయ్యగారు, నేను ఐ.టి.డి.ఏల్లో పనిచేసినప్పుడు ప్రాజెక్టు అధికారులుగా పనిచేసిన ఎల్.వి.సుబ్రహ్మణ్యంగారు, అజయ్ మిశ్రా గారు, రెడ్డి సుబ్రహ్మణ్యంగారు, దాసరి శ్రీనివాసులుగారు, సోమేశ్ కుమార్ గారలకు, నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజిలో పనిచేసినప్పుడు నన్ను ఆదరించిన పద్మభూషణ్ పద్మనాభయ్యగారు, ఆర్.ఎచ్.ఖ్వాజాగారు, డా.నివేదితా హరన్ గారు, అచలేంద్ర రెడ్డిగారలకు నా నమస్సులు. పాఠశాల విద్యాశాఖలో పనిచేసినప్పుడు నన్ను తమ బృందంలో ఒకడిగా కలిసిపనిచేసే అవకాశమిచ్చిన బుడితి రాజశేఖర్ గారు, కె.సంధ్యారాణిగారు, వెట్రి సెల్వి గారు, దివాన్ మైదీన్ గారు, ఎ.మురళి గారలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాగే విద్యాశాఖమంత్రి డా.ఆదిమూలపు సురేష్ గారికి, విద్యాశాఖలోని ఉన్నతాధికారులకు, జిల్లా, డివిజనల్, మండల స్థాయి విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, సమగ్ర శిక్ష సిబ్బందికి, నాడు నేడులో పాల్గొన్న అన్ని ఇంజనీరింగ్ శాఖల సిబ్బందికి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సిబ్బందికి, గ్రంథాలయ శాఖ సిబ్బంది కి కూడా నా ధన్యవాదాలు.

ఇక మా గిరిజన సంక్షేమ శాఖలో అన్ని విభాగాల్లోనూ గత ముప్పై అయిదేళ్ళుగా నాతో కలిసి పనిచేసిన నా సీనియర్ ఉద్యోగులకు, సహచరులకు, అన్ని స్థాయిల ఉద్యోగులకు పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నేను జిల్లాల్లోనూ, ఐటిడిఏ ల్లోనూ పనిచేసినప్పుడు నాకు చేదోడువాదోడుగా నిలబడ్డ ప్రతి ఒక్క ఉద్యోగికీ చేతులు జోడించి కృతజ్ఞతా సమర్పణ కావించుకున్నాను. నా మీద నమ్మకం పెట్టుకుని నా క్షేమాన్నీ, నా సంకల్పాలకు సాఫల్యాన్నీ, నా ప్రయత్నాలకు విజయాన్నీ కోరుకున్న గిరిజనులకు, ఉపాధ్యాయులకూ, ఇతర సిబ్బందికీ నమస్సులు చెల్లించుకున్నాను. విద్యార్థిలోకానికి ఆశీస్సులు అందించాను.

నిన్న చాలామంది వక్తలు తమ ప్రసంగాల్లో ప్రభుత్వం నా సర్వీసుని పొడిగిస్తే బాగుణ్ణనీ, లేదా ఏదో ఒక రూపంలో నన్ను ఏదో ఒక పదవిలో కొనసాగించాలనీ తమ ఆకాంక్షను వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఒక సంగతి చెప్పాలి. నా సేవలను ఏదో ఒక రూపంలో కొనసాగించాలనే తన ఆకాంక్షను ప్రభుత్వం నాకు తెలియచేయకపోలేదు. గిరిజన సంక్షేమ శాఖ, పాఠశాల విద్యాశాఖ కూడా రిటైర్మెంటు తర్వాత నన్ను తమ శాఖల్లో సలహాదారుగా కొనసాగవలసిందిగా సూచించాయి. కాని ఒక అధికారి, ఎంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ, ఎంత అనుభవాన్ని మూటగట్టుకున్నప్పటికీ, ఎంత విజ్ఞాన సర్వస్వంగా భావించబడుతున్నప్పటికీ, ఒకసారి రిటైర్ అయినతర్వాత ప్రభుత్వంలో కొనసాగకూడదనేది నా బలమైన అభిప్రాయం.

పదవీ విరమణ తర్వాత కూడా ప్రభుత్వపదవుల్లో కొనసాగేవారు ఆయా శాఖలకి సహాయకారులు కాకపోగా ప్రతిబంధకాలుగానూ, అనతికాలంలోనే గుదిబండలుగానూ మారతారు. ప్రతి శాఖలోనూ కొత్త తరం రావాలి. వారి తొలి అడుగులు తడబడినా, బహుశా తప్పటడుగులు తప్పకపోయినా, ఎవరి నడక వారు నడవవలసిందే. కాబట్టి ప్రభుత్వం ఈసరికే నా ముందు తన ప్రతిపాదనలు పెట్టిందనీ, వాటిని నేను వినయపూర్వకంగానూ, సున్నితంగానూ తిరస్కరించక తప్పలేదనీ సభాముఖంగా విన్నవించాను. అంతేకాదు, ఎటువంటి స్వచ్ఛంద సంస్థల్లోగాని, లేదా ఎటువంటి సంఘాల్లో గాని ఏ పదవిలోనూ కొనసాగే ఆలోచన కూడా నాకు లేదని చెప్పాను. పదవీ బాధ్యతలనుంచి తప్పుకున్నాను అనే కారణం వల్ల ఇప్పుడు కొత్తగా ఏ ఉద్యమాల్లోగాని, ఏ పోరాటాల్లోగాని, ఏ రాజకీయాల్లో గాని పాల్గొనే ఉద్దేశం కూడా నాకు లేదని తేటతెల్లం చేసాను.

నా దృష్టి వీటి మీద లేదు. మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా గిరిజనుల గురించి నాకు తెలియవలసినంతగా తెలియనే లేదన్నదే నా అసంతృప్తి. వారి జీవితం గురించీ, సంస్కృతి గురించీ మరింత లోతుగా తెలుసుకోడానికి ఏదైనా గిరిజన గ్రామంలో ఒక నెల రోజులేనా గడపాలని గత ఇరవయ్యేళ్ళుగా అనుకుంటూనే ఉన్నాను. రెండు నెలలకిందట, ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఒక మారుమూల గిరిజన గ్రామంలో రాత్రి పూట బసచేద్దామనుకుంటే, ఎలా తెలిసిందో ఆ సంగతి పోలీసులకి, వారు నేనక్కణ్ణుంచి ఆ రాత్రికి రాత్రే దగ్గర్లో ఉండే పట్టణానికి వెళ్ళిపోయేదాకా ఊరుకోలేదు. అధికారస్థానాల్లో ఉన్నంతకాలం నాకు గిరిజన గ్రామంలో రాత్రి పూట బసచేసే స్వేచ్ఛ లేదని అర్థమయింది. కాని ఈ రోజు నుంచీ నేను స్వేచ్ఛా జీవిని. ఇప్పుడు నాకు నచ్చినట్టుగా ప్రజలకి మరింత చేరువగా జరగగలను. వారితో కలిసిమెలిసి తిరగగలను. వారి సుఖదుఃఖాల్ని మరింత సన్నిహితంగా చూడగలను. చూసినదాన్ని, అనుభవించినదాన్ని సాహిత్యంగా మలిచి నలుగురితో పంచుకోగలను. ఇప్పుడు నా దృష్టి ప్రజలకు చేరువగా జరగడం మీద ఉంది. ప్రకృతికి మరింత సన్నిహితం కావాలని ఉంది. కథలు, కావ్యాలు, నవలలు, నాటకాలు రాయాలని ఉంది.

ఇది నాకు మరో జన్మ, మరో ప్రయాణం.

1-4-2022

One Reply to “”

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%