కావ్యగానం

హైదరాబాద్ లో సంస్కృత సాహిత్యం కావాలంటే కాచిగూడ దగ్గర గోపాల్ బుక్ డిపో కి వెళ్ళేవాణ్ణి. ఆ షాపులో పనిచేసే కుర్రవాడు గొప్ప సంస్కృత పండితుడిలాగా కనిపించేవాడు. ‘ఇదిగో, ఈ కావ్యానికి కొత్త ఇంగ్లిషు అనువాదం వచ్చింది చూసారా?’, ‘అదిగో, ఆ నాటకానికి తెలుగులో కొత్త వ్యాఖ్య వచ్చింది, చూస్తారా ‘ అని అడిగేవాడు. మొన్న ఢిల్లీలో ఫకీర్ చంద్ అండ్ సన్స్ లో కూడా అటువంటి అనుభవమే ఎదురయ్యింది. నేను ఢిల్లీ ఉర్దూ కవుల గురించి వెతుక్కుంటున్నాను అంటే ఆ షాపు యజమాని Beloved Delhi చూసారా అని అడిగాడు. ఆ పుస్తకం చదివే ఢిల్లీ, లక్నో ఉర్దూ కవుల అడుగు జాడలు పట్టుకోవాలనుకుంటున్నాను అంటే, ‘అయితే మీరు ‘దిల్లీ కీ ఆఖిరీ షమా’ చూసారా?’ అనడిగాడు. లేదన్నాను. వెంటనే ఆ షాపులో ఉన్న పిల్లవాడికి చెప్పి రెండు పుస్తకాలు బయటికి తీయించాడు. ఒకటి, The Last Mushairah of Delhi (2010), రెండోది The Last Gathering (2021).

రెండు పుస్తకాలూ తెచ్చుకున్నాను, వెంట వెంటనే చదివేసాను కూడా. రెండూ విలువైన పుస్తకాలు. మొఘల్ సామ్రాజ్యపు చివరి పాలకుడైన బహదూర్ షా జఫర్ కాలానికి చెందిన సాహిత్యం గురించీ, సంస్కృతి గురించీ వివరించే అద్భుతమైన రచనలు.

The Last Mushairah of Delhi ‘దిల్లీకీ ఆఖిరీ షమా’ కు ఇంగ్లిషు అనువాదం. ఆ పుస్తకాన్ని మిర్జా ఫర్హతుల్లా బేగ్ (1883-1948) అనే ఆయన ఉర్దూలో రాసాడు. దాన్ని అఖ్తర్ ఖాంబర్ అనే ఆయన ఇంగ్లిషులోకి అనువదించాడు. ఢిల్లీలో బహాదుర్ షా జఫర్ కాలంలో, అంటే 1854 కన్నా ముందు, జౌక్ అనే ఉర్దూ కవి బహదూర్ షా ఆస్థాన కవిగా ఉన్న రోజుల్లో, ఒక ముషాయిరా జరిగినట్టుగా ఊహించి దాన్ని అత్యంత నిర్దుష్టమైన చారిత్రిక, సాంస్కృతిక వివరాలతో చిత్రించిన రచన అది. 1845 లో అటువంటి ముషాయిరా ఒకటి నిజంగా జరిగినదాన్ని మౌల్వీ కరీముద్దీన్ అనే ఆయన ఒక పుస్తకంగా రాసాడట. ఆ స్ఫూర్తితో ఫర్హతుల్లా బేగ్ ఒక కాల్పనిక కవిసమ్మేళనాన్ని ఊహించాడు, దాన్ని అత్యంత నాటకీయంగా, మనోహరంగా చిత్రించాడు.

దాన్ని ఇంగ్లిషులో వెలువరిస్తున్నప్పుడు అనువాదకుడు కేవలం ఆ రచనని మాత్రమే ఇవ్వకుండా, ఆ రచన నేపథ్యాన్ని వివరించే సుదీర్ఘమైన పరిచయం కూడా అందించాడు. అందులో ఫర్హతుల్లా బేగ్ గురించీ, మొఘల్ కాలం నాటి షా జహానా బాద్ గురించీ, మొఘల్ సమాజం గురించీ, ఉర్దూ భాష, గజల్ ప్రక్రియలతో పాటు ఒక ముషాయిరా అంటే ఏమిటో కూడా వివరించేడు.

రచనలో నాలుగు భాగాలున్నాయి. మొదటిది, భూమిక. రెండవది కవిసమ్మేళన ప్రణాళిక. మూడవది, కవిసమ్మేళనానికి చేసిన ఏర్పాట్లు. నాలుగవది, అత్యంత ముఖ్యమైన అధ్యాయం, ఆ ముషాయిరా, అందులో కవితలు చదివిన కవులు, వారు వినిపించిన గజళ్ళు, ఆ వినిపించిన పద్ధతి, వాటిని సహృదయ శ్రోతలు స్వీకరించిన వైనం.

ఆ ముషాయిరాలో మొత్తం 59 కవులు పాల్గొన్నారు. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ ఆ సమావేశంలో పాల్గొనకపోయినా ఆయన గజల్ కూడా అక్కడ చదివి వినిపించారు కాబట్టి అరవై మంది కవులని చెప్పవచ్చు. మొఘల్ రాకుమారుడు మిర్జా ఫక్రు ఆ ముషాయిరాకి అధ్యక్షత వహించాడు. ఆయనకు ఎడమచేతి వైపున గాలిబ్, మోమిన్ వంటి కవులు కూర్చోగా, కుడివైపు ఆస్థాన కవి జౌక్ కూర్చున్నాడు. ఆ కవులు కవిత్వం చదివిన క్రమాన్ని బట్టి వాళ్ళు ఏ అమరికలో కూర్చుని ఉంటారో ఊహించి అటువంటి సీటింగ్ ప్లాన్ కూడా ఒకటి పుస్తకంలో పొందుపరిచారు. ముషాయిరా రాత్రంతా సాగింది. నిశాంత వేళకి ఆ దీపపు సెమ్మె గాలిబ్ చెంతకు వచ్చింది. ప్రాతఃకాల ప్రార్థనవేళకు ఆస్థాన కవి జౌక్ సర్వేశ్వరుణ్ణి కీర్తిస్తూ గజల్ చెప్పేవేళకి బయట మసీదునుంచి అల్లాహో అక్బర్ అంటో దైవ సంకీర్తన కూడా వినబడింది.

ఆ రచన చరిత్ర, కల్పనా కూడా. అన్నిటికన్నా ముందు అది ఒక కవిసమ్మేళన చిత్రణ. ఒక రాత్రంతా ఆ కవులు కావ్యగానంలో ఎలా పరవశించారో అతడు వివరిస్తుంటే మనం కూడా ఆ రాత్రి ఆ షాజహానా బాద్ లో ఆ హవేలీలో ఆ మెహఫిల్ లో, అత్తరు పరిమళాల మధ్య, అగరు ధూపాల మధ్య ఒక గులాబితోటలో గడిపినట్టే అనిపిస్తుంది. దీర్ఘచతురస్రాకారంగా కూచున్న ఆ కవుల ఎదట రెండు దీపపుసెమ్మెలు ప్రదక్షిణంగానూ, అప్రదక్షిణంగానూ కదులుతూ ఉండగా, ఆ వెలుతురు పడ్డ ప్రతి కవినీ రచయిత మన కళ్ళముందు ఆవిష్కరిస్తో, ఆ కవి చదివిన కవితనీ, ఆ కవితకి శ్రోతల ప్రతిస్పందననీ వర్ణిస్తో పోతాడు. ఆ వర్ణన ఒక ముషాయిరాలోని మహత్వాన్ని మన కళ్ళముందు ప్రస్ఫుటంగా సాక్షాత్కరింపచేస్తుంది. మనం పందొమ్మిదో శతాబ్ది ద్వారా ఒక కాలాతీత కావ్యానందంలోకి ప్రవేశిస్తాం. తెల్లవారి, ఆ కావ్యగానం ముగిసాక కూడా, పుస్తకం ముగించాక కూడా మనమింకా అక్కడే ఉండిపోతాం.

ఆ వర్ణన ఎలా ఉందో రుచి చూపడానికి, ఒకటి రెండు పేజీలు తెలుగులో:

~

అజూర్దా వంటి ఉస్తాద్ తరువాత నవాబ్ మీర్జా ఖాన్ దాగ్ కవిత చదవడం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అన్నిటికన్నా ముందు అక్కడున్న ప్రతి ఒక్కరూ దాగ్ ని ఇష్టపడేవాళ్ళే. ఆ యువకుణ్ణి ఆదరించి ప్రోత్సహించాలనుకున్నవాళ్ళే. ఈ యువకుడే ఒకనాటికి హిందూస్తాన్ మొత్తానికి వెలుగు కాగలడని వాళ్ళకెందుకో ఒక నమ్మకం. అదీకాక, మీర్జా ఫక్రూ ఆదరణలో ఆ యువకుడి ప్రతిభ వికసిస్తూండటం కూడా మరొక కారణం. ఇక ఈ ముషాయిరాలో అతడెటువంటి గజల్ వినిపించాడంటే పేరు పొదిన ఉస్తాద్ లు కూడా ఆ కావ్యశ్రేష్టతకు తలలూపకుండా ఉండలేకపోయారు. పదిహేడు పద్ధెనిమిదేళ్ళ ఒక బాలుడు అంత నివ్వెరపరిచే గొప్ప కవితను, గొప్ప ఆత్మవిశ్వాసంతోనూ, సమతూకంతోనూ చదవడం నిజంగా అబ్బురపరిచే విషయమే. నా దృష్టిలో దాగ్ లాగా భాష పైన అధికారాన్ని చూపగలిగిన భాగ్యవంతులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అతడి వ్యక్తీకరణలోని ఆ వెలుగుని, అతడు ఎంచుకున్న ఇతివృత్తంలోని ఆ రంగుల్ని, అతడి భావశబలతని, ఆ ఉత్తేజాన్ని చూడండి, అప్పుడు మాత్రమే మీరు ఆ వర్ధమాన తారకు న్యాయం చెయ్యగలుగుతారు…

అల్లా, అల్లా! మృదువైన ఆ ప్రత్యూష వేళ, ఆ నవోన్మేష స్వరం, శ్రోతల్ని సమ్మోహితుల్ని చేయగల ఆ స్వరతంత్రులు, ఆ పదసౌందర్యం, ఆ శైలీ రాజసం, ఇక అన్నిట్నీ మించి నిర్మలం, సరళం అయిన ఆ పిల్లవాడి ముఖవర్ఛస్సు, అక్కడున్న ప్రతి ఒక్కరికీ ఆ కవితను వినడం ఒక అపురూపమైన అనుభవంగా అనిపింపచేసాయి. ఆ కావ్యగానాన్ని విని ఆశ్చర్య చకితులు కాని వారు అక్కడున్నవారిలో ఒక్కరు కూడా లేరు. వారి పెదాల మీంచి ‘ జజక్ అల్లా’, ‘సుభాన్ అల్లా’, ‘సలే అల్లా’ అనే ప్రశంసాసంబోధనలు పొంగిపొర్లుతూనే ఉన్నాయి. ఆయన పోషకుడైన మీర్హా ఫక్రూ తన ఆనందోద్వేగాన్ని అణచుకుంటూ తాను కూర్చున్న చోటునుంచి అటూ ఇటూ సర్దుకుంటూ, చాటుగా సంతోషిస్తూనే ఉన్నాడు. ఆ గజల్ పఠనం ముగిసింది గాని, అది ఎప్పుడు పూర్తయిందో ఎవరికీ తెలియలేదు. అరుదైన ఆ ఆనందంలో వారట్లా తలమునకలైపోయారు. అతడి ముందు నుండి ఆ దీపం సెమ్మె హకీం మోమిన్ ఖాన్ సాహిబ్ ముందుకు జరిగినప్పుడు గాని, ఆ ఉద్వేగ తీవ్రత చల్లారలేదు.

ఉర్దూ సాహిత్యంలో మేరుశిఖరంలాంటి ఆ ఉస్తాద్ ని వినడం కోసం అప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కరూ తమ ఒళ్ళంతా కళ్ళూ, చెవులూ చేసుకున్నారు. ఉస్తాద్ మోమిన్ ఆ షమాను తన దగ్గరగా లాక్కుని, తాను కొంత ముందుకు జరిగి, నిటారుగా కూర్చున్నాడు. తన అలవాటు ప్రకారం తన మునివేళ్ళతో తలదువ్వుకున్నాడు. తన టోపీని ఏటవాలుగా సర్దుకున్నాడు, తాను ధరించిన కుర్తా మడతలు సరిచేసుకున్నాడు. అప్పుడు ఎంతో సుమనోహరమైన ఉచ్చారణతో ఈ గజల్ చదివి వినిపించడం మొదలుపెట్టాడు…

అది కవిత్వమా లేక మాయాజాలామా? ఆ మెహ్ ఫిల్ మొత్తం ఆ కవితముందు మూర్ఛిల్లిపోయింది. మోమిన్ కూడా తన కవిత్వ పంక్తులకు తానే మంత్రముగ్ధుడైపోయినట్టున్నాడు. తనకి బాగా నచ్చినట్టనిపిస్తున్న షేర్ చదివేటప్పుడు అతడి వేళ్ళు అతడి జుత్తులో మరింత వేగంగా గిరికీలు కొట్టాయి. తన కావ్యగానానికి తనే ఉద్వేగభరితుడైనప్పుడు అతడు తన చెంపమీద జారుతున్న వంకీల్ని మరింత చుట్టు తిప్పుతూనే ఉన్నాడు. ఎవరేనా తనని ప్రశంసించినప్పుడు ఆ గుర్తింపుకి మరింత మృదువుగా ప్రతిస్పందిస్తూ ఉన్నాడు. అతడు కవిత చదివే పద్ధతి తక్కినవారికన్నా ఎంతో ప్రత్యేకంగా ఉన్నది. అతడు తన హావభావాలు ప్రకటించడానికి చేతులు ఊపలేదు. ఎలా ఊపగలడు? అసలు ఆ వేళ్ళు ఆ ముంగురులనుంచి పక్కకు తప్పుకున్నదెప్పుడని? నిజానికి అతడి స్వరవిన్యాసంవల్ల, ఆ నేత్రాల్లో కదలాడే భావవ్యక్తీకరణ వల్ల అతడు అక్కడున్న ప్రతి వారిమీద ఒక మంత్రధూపం చల్లాడనే చెప్పాలి. అతడు గజల్ వినిపించడం పూర్తిచేయగానే అక్కడున్న కవులందరూ ఏకగ్రీవంగా అతణ్ణి అభినందనలతో ముంచెత్తారు. అతడు చిరునవ్వి అన్నాడు కదా: ‘మీ దయాన్వితమైన ప్రశంసలోనే నా కష్టానికి పూర్తి ప్రతిఫలం లభించింది. నేనింతకుముందే…

నాకు కావలసింది బంగారం కాదు, సమస్పందన

ఓ మోమిన్, పెద్దలు తలూపినప్పుడే నువ్వు చరితార్థుడివి

అని చెప్పుకున్నాను కూడా’ అన్నాడు.

… ఎహ్సాన్ తర్వాత కవిత చదివే వంతు గాలిబ్ కి వచ్చింది. అక్కడున్న మొత్తం వాతావరణమంతా ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. బయట దాదాపుగా తెల్లవారవస్తున్నది. దీపపు సెమ్మె తన ముందుకు రాగానే గాలిబ్ ‘మిత్రులారా, నా ప్రభాత రాగిణుల్ని ఆలపించేముందు నా స్వరతంత్రుల్ని కొంచెం శ్రుతిచేసుకోనివ్వండి’ అన్నాడు.

ఆ మాటలంటో అతడు తన గజల్ని ఎటువంటి సమ్మోహనీయ స్వరంతో, ఎంత లయాత్మకంగా వినిపించాడంటే ఆ ముషాయిరా మొత్తం నిశ్శబ్దంలో గడ్డకట్టుకుపోయింది. ఆ స్వరం పరిపూర్ణంగా ఉంది. అది శ్రోతల్లో ఏదో అతీతకాలం పట్ల చెప్పలేని బెంగ రేకెత్తించింది. ఆ కవి తన కావ్యవాక్కు పూర్తి స్వారస్యాన్ని అనుభవించి ఆనందించగల ఒక సహృదయుడెవ్వరో ఆ మెహ ఫిల్ లో ఎంత వెతికినా కనరావడం లేదన్నంత తపనతో, తన కవితకొక యథార్థమైన శ్రోత కోసం వెతుక్కుంటున్నట్టుగా ఆ కవిత వినిపించడం మొదలుపెట్టాడు..’

~

గ్రంథాలయాల్లోనే కాదు, పుస్తకాల దుకాణాల్లో కూడా దేవదూతలు ఉంటారని మరోసారి అనుభవానికొచ్చింది. ఢిల్లీలో పాటలు పుట్టిన తావుల్ని అన్వేషించడానికి ఇంతకన్నా మించిన ట్రావెల్ గైడ్ మరొకటి ఉండబోదనిపించింది.

3-4-2022

Leave a Reply

%d bloggers like this: