ఒక సాయంకాలం

నేను రాయడం మొదలుపెట్టినప్పణ్ణుంచీ విజయవాడ అంటే ఒక అభిమానం, ఒక ఆరాధన. తెలుగు వాళ్ళ ఇంటలెక్చువల్ రాజధాని అని, పత్రికా రాజధాని అని, ప్రచురణా రాజధాని అని. ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక, పురాణసుబ్రహ్మణ్య శర్మ గారూ, దినపత్రిక, నండూరి రామమోహన రావుగారూ, నా పుస్తకాన్ని తనంత తానుగా అడిగి అచ్చువేసి నాకు రాయల్టీ పంపిన నవోదయ రామ్మోహనరావుగారూ, అన్నిటికన్నా మించి భమిడిపాటి జగన్నాథరావుగారూ విజయవాడను నాకొక సాహిత్య తీర్థస్థలంగా మార్చేసారు. విజయవాడ వెళ్తే అజంతానీ, మోహన ప్రసాద్ నీ చూడొచ్చనే ఒక సంతోషమేదో రాజమండ్రిలో ఉన్నంతకాలం నాలో కదలాడుతూనే ఉండేది. టి.ఎల్.కాంతారావు సాహిత్య ప్రసంగాలు విజయవాడ అంటే ఒక క్రేజ్ ని రేకెత్తించేవి నాలో. అటువంటి విజయవాడలో కొన్నాళ్ళయినా ఉంటాననీ, ఇప్పుడు పదవీ విరమణ చేసినప్పుడు విజయవాడలోని ప్రచురణ కర్తలూ, పుస్తక ప్రదర్శన సొసైటీ మిత్రులూ నాతో ఒక సాయంకాలం స్నేహపూర్వకంగా గడుపుతారనీ నేన్నడూ ఊహించలేదు.

మొదట భమిడిపాటి జగన్నాథ రావుగారు. ఆ తర్వాత ఎమెస్కో విజయకుమార్. విజయకుమార్ 1995 లో పరిచయమయ్యాడు. అది మొదలు పదేళ్ళ పాటు క్రమం తప్పకుండా హాజరయ్యేను విజయవాడ పుస్తక ప్రదర్శనలకి. ప్రతి సారీ ఏదో ఒక పుస్తకం గురించి మాట్లాడేను. నేనడిగేనని వెంకట నారాయణ త్రిపుర కథలు రెండో ప్రచురణ తానే చేపట్టాడు. గత పదేళ్ళుగా మరీ ముఖ్యం గత అయిదారేళ్ళుగా విశాలాంధ్ర మనోహర నాయుడు గారు, ప్రజాశక్తి లక్ష్మయ్యగారూ, పుస్తక ప్రదర్శన సొసైటీ కార్యదర్శి బాబ్జీ గారూ, అక్షరం అశోక్ గారూ, శ్రీ శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వర రావుగారూ మరింత స్నేహితులైపోయారు. నేనేదో జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఆయన దగ్గర బాలసాహిత్యం కొన్నాన్న ఒక్క కారణానికి నవరత్న బుక్ హౌస్ కుటుంబమంతా నాకు మిత్రులైపోయారు. ఇలా ఎందరి పేర్లని చెప్పను? ఇప్పుడు విజయవాడలో ఒక పుస్తకం ప్రచురించినా కూడా ఆ ప్రచురణ కర్త నాకు మిత్రుడనే చెప్పుకోవచ్చు.

మొన్న సాయంకాలం ఐలాపురం హోటల్లో నా పట్ల ఎంతో ఇష్టంతో ప్రచురణ రంగానికి చెందిన మిత్రులు నాకొక అభినందన సభ ఏర్పాటు చేస్తామన్నప్పుడు అది నేనొక అరుదైన గౌరవంగానూ, సత్కారంగానూ భావించాను. ముప్పై నలభయేళ్ళ కింద రాజమండ్రిలో నేనే స్థాయిలో నా రచనా జీవితం ప్రారంభించానో గుర్తు తెచ్చుకుంటే, ఆ సభ నాకొక జీవిత సాఫల్య పురస్కారంగా కూడా భావించాను.

సాధారణంగా ఒక రచయితా, ఒక ప్రచురణ కర్తా రెండు సందర్భాల్లో దగ్గరవుతారు. ఒకటి, వారిద్దరూ ఏదేనా ఒక రాజకీయ భావజాలానికి కట్టుబడి ఉన్నప్పుడు. వారి భావాల్ని ప్రజల్లో వ్యాప్తి చేసి తాము కోరుకున్న విధంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలనుకున్నప్పుడు. మరొకటి, వారిద్దరూ పుస్తకాల ద్వారా ఆర్థికంగా లాభపడాలనుకున్నప్పుడు.

రెండు విధాలుగానూ నేను ప్రచురణకర్తలకి నిరుపయోగకరమనే అనుకుంటాను. మొదటిది, రాజకీయ భావజాలం దృష్ట్యా చెప్పాలంటే నేనొక వ్యక్తి సత్యాగ్రాహిని. సత్యాగ్రహం అంటే దేన్నో ధిక్కరిస్తో నిరాహారదీక్షకి కూర్చోడమనే అర్థంలో కాదు. సత్యాగ్రహం అంటే తాను నమ్మిన సత్యాన్ని రెండు చేతుల్తోనూ దృఢంగా పట్టుకుని ఉండటం. నాకు సామూహికంగా దర్శించే సత్యాల పట్ల నమ్మకం లేదు. మనుషులు ఎవరి జీవితానుభవాల్ని బట్టి వారు తమదంటూ ఒక సత్యాన్ని నిర్మించుకుంటూ ఉంటారనీ, ఉమ్మడి అనుభవాలు కలిగిన కొందరు మనుషులు దగ్గరగా జరిగినప్పుడు, వారి వారి సత్యాల్లోంచి కొంత ఉమ్మడి సత్యాన్ని ఆవిష్కరించుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటారనీ నేననుకుంటాను. కాబట్టి ఒక చిన్న బృందమో, సమూహమో లేదా రాజకీయపక్షమో తన భావజాలాన్ని వ్యాప్తి చెయ్యడానికి నా వైపు చూసి ఉపయోగం లేదు. అలాగని నా భావజాలమో, నా అనుభవాలో నేరుగా ప్రజాహృదయాల తలుపు తట్టి వారిని చైతన్యవంతుల్ని చేస్తాయనే భ్రమ కూడా నాకు లేదు. రాజకీయ-సామాజిక కోణంలో చూసినట్లయితే, నా జీవితం, సాహిత్యం రెండూ కూడా జపనీయ కవి-యోగి బషొ చెప్పినట్టు వేసవిలో చలిమంటలాంటివి, శీతాకాలంలో విసనకర్రలాంటివి.

ఇక ఆర్థికంగా ప్రచురణ కర్తలకి లాభదాయికం కావాలంటే ఆ రచయిత తన కాలం నాటి సమాజానికి ఏవేనా కొన్ని కలలు, కల్పనలు అమ్మగలిగి ఉండాలి. వారిని ఎంతో కొంత రంజింపచేయగలిగి ఉండాలి. నాకు ఈ చాతుర్యం ఎలానూ లేదు. ఇప్పుడు అలవర్చుకుందామనుకున్నా, ఈ కాలం మనుషులు తమ రంజన కోసం పుస్తకాల వైపు చూడటం ఎప్పుడో మానేసారు. ఇది మొబైల్ ఫోన్ల కాలం, ఇయర్ ఫోన్ల కాలం. వాళ్ళని అలరించడానికి కొన్ని వేల సైట్లు ఒక్క బటన్ క్లిక్ తో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తెరుచుకోడానికి సిద్ధంగా ఉన్నాయి. మన రచయితలింకా ఫ్రెంచి రివల్యూషన్, రష్యన్ రివల్యూషన్ ల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది జియో రివల్యూషన్ కాలం. ఇప్పుడు ఎవరికీ ఏ విషయమూ లోతుగా పరిశీలించే సమయము లేదు, ఏ అనుభవాన్నీ గాఢంగా హృదయంలోకీ ఇంకించుకునే ఓపికా లేదు. మనం నిన్నమొన్నటిదాకా ఐడియాలజీ యుగంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు నడుస్తున్నది ట్రోలింగ్ యుగం. ఇన్నాళ్ళూ వీథుల్లోనూ, టీ షాపుల్లోనూ, బజారులోనూ నడిచిన సమస్త వాగ్వ్యవహారం ఇప్పుడు ఫోన్లలో నడుస్తున్నది.

అయినా కూడా ఇందరు ప్రచురణ కర్తలు నన్ను తమ మధ్యకి ఎందుకు ఆహ్వానించేరు? ఎందుకు నా పదవీవిరమణ వాళ్ళలో కొత్త ఆశలు చిగురింపచేస్తున్నది? నేను సాహిత్యానికి పూర్తి కాలం అంకితమయితే తమకీ, సమాజానికీ కూడా ఏదో మంచి జరగబోతున్నదనే ఊహ వాళ్ళకి ఎందుకు కలుగుతున్నది?

చెప్పలేను.

కానీ, ఆ సాయంకాలం చాలమంది మిత్రులు నా గురించి ఎంతో ఆదరపూర్వకంగా మాట్లాడేరు. ఒకరు వీరేశలింగాన్ని గుర్తుకు తెస్తూ, ఆయనలాగా నేను కూడా విస్తారంగా రాయాలని ఆకాంక్షించేరు.

అవును.

రాయడమైతే తప్పనిసరి.

ఎందుకంటే తెలుగు సమాజాన్ని సినిమాలు ఒక మెగలో మానియాక్ సమాజంగా మార్చేసాయి. కళ్ళముందు బ్రహ్మాండమైన విజువల్ ఎక్స్పీరియన్స్ దొరికితే చాలు, మరే తర్కాన్నీ పట్టించుకోని స్థితిలోకి తెలుగు ప్రేక్షకుణ్ణి నెమ్మదిగా లాగేసారు. ఒక జాతిగా పదకొండుకోట్ల మంది తెలుగు వాళ్ళకి ఇంతకన్నా దురవస్థ మరొకటి ఉండబోదు. ఒకప్పుడు గ్రీకు యుగంపోయి, రోమన్ యుగం రాగానే మనుషుల్లో సౌందర్యాభిలాష, తాత్త్విక చింతన, శిల్పప్రజ్ఞ సన్నగిల్లి, చివరికి వారిని ఏ కళలూ, సంగీతమూ, కవిత్వమూ కూడా తృప్తి పరచడం మానేసాక, మనుషులు ఒకళ్ళనొకళ్ళు చంపుకునే గ్లాడియేటింగ్ ని మాత్రమే చూసే స్థితికి వారెట్లా చేరుకున్నారో ఎడిత్ హామిల్టన్ రాసిన విషయాన్ని అబ్దుల్ కలాం తన ఆత్మకథలో గుర్తుచేసుకుంటాడు. తెలుగు వాళ్ళని ఇపుడు రంజింపచేస్తున్న ఏకైక కళ గ్లాడియేటింగ్ మాత్రమే. అది ఇద్దరు రాజకీయనాయకులు కావొచ్చు, లేదా ఇద్దరు సినిమా తారలు కావొచ్చు, లేదా ఇద్దరు పత్రికా సంపాదకులు కావొచ్చు, లేదా ఇద్దరు ప్రసిద్ధ రచయితలు కావొచ్చు. వారు నడిరోడ్డు మీద నిలబడి ఒకరినొకరు మాటల్తో చీల్చుకుంటూ ఉంటే ఆ దృశ్యం తెలుగు వాళ్ళకి ఇస్తున్నంత రసానందం వారికి మరే కళలోగాని, కవిత్వంలోగాని కనిపించడం లేదు.

కాని సరిగ్గా ఈ సందర్భం వల్లనే, సరిగ్గా ఈ పరిస్థితినుంచి బయటపడాలనే నేను రాయాలనుకుంటున్నాను.

విస్తారంగా, నిర్విరామంగా.

ఎందుకంటే సాహిత్యమెప్పుడూ చిన్న చిన్న జీవితానందాల గురించి మాట్లాడుతుంది. చిన్న చిన్న అనుభవాలు, చిన్న చిన్న సుఖదుఃఖాల్ని చిత్రించడానికి ఉత్సాహ పడుతుంది. చిన్న చిన్న దయాపూరితమైన మాటలే సాహిత్యంగా మారతాయి. రెండు వర్గాలు పోరాడుకుంటూ ఉంటే వారికి చెరో పక్కా నిలబడి వారిని ఉత్సాహపరిచే ఛీర్ గర్ల్ కాదు సాహిత్యం. ఎందుకు పోరాడుకుంటున్నారో తెలియకుండా ఒకరినొకరు గాయపరుచుకుంటున్నవాళ్ళని చేరదీసి, వారిమీద ఎట్లాంటి జడ్జిమెంట్లూ ఇవ్వకుండా, వారి గాయాలకు కట్టుకట్టి స్వస్థ పరిచే చిన్న ఓదార్పు సాహిత్యం. అటువంటి ఒక స్వాస్థ్య ఉద్యమంలో నేనొక చిన్న కార్యకర్తని కావాలన్నదే నా కోరిక.

ఒక ప్రభుత్వాధికారి ఎంత విస్తారంగా సమాజంలో తిరుగాడినా, ఎంత రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తన సేవలు అందించినా, అతడి చూపు ఎప్పటికీ దర్శనంగా రూపొందదు. ఒకటీ అరా ఎవరేనా అసాధారణ ప్రతిభావంతుడు తన చూపుని దర్శనంగా మార్చుకోగలిగినా అది tunnel vision గానే మిగిలిపోతుంది. ఆ tunnel vision నుంచి బయటపడాలనీ, మరింత విస్పష్టంగానూ, మరింత సమగ్రంగానూ జీవితాన్ని దర్శించాలనే, ఇప్పుడు నేను పూర్తికాలపు సాహిత్యవిద్యార్థిగా, ప్రాక్టీషనర్ గా మారాలనుకుంటున్నాను. ఆ మాటే చెప్పాను ఆ రోజు అక్కడ కూడుకున్న మిత్రులందరికీ.

8-4-2022

Leave a Reply

%d bloggers like this: