అత్యున్నత పౌర పురస్కారం

ఒక మంచి గంధపు చెట్టు లోపల పరిమళం ఊరాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? పదేళ్ళు? చందన తరువు సంపూర్ణపరిమళ భరితం కావాలంటే, దాని heartwood పూర్తిగా వికసించాలంటే పాతికేళ్ళు పడుతుందని విన్నాను. ఒక ఉద్యోగ జీవితం చందన తరువుగా మారిందో లేదా విషముష్టిచెట్టుగానే మిగిలిపోయిందో తెలుసుకోవాలంటే?

ముప్పై అయిదేళ్ళ కిందట, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా శిక్షణ పొందటానికి పార్వతీపురం ఐటిడి ఏ లో రిపోర్టు చేసాను. ఆ శిక్షణలో మొదటగా రెండు వారాల పాటు ఏదైనా ఒక ఆశ్రమపాఠశాలలో హెడ్ మాస్టర్ కమ్ వార్డెన్ గా పనిచేయవలసి ఉంటుంది. ఆ శిక్షణకు నన్ను విజనగరం లో ఉన్న బాయిస్ హాస్టల్ కి పంపిద్దామని అప్పటి జిల్లాగిరిజన సంక్షేమాధికారి సూచిస్తే అప్పటి ప్రాజెక్టు అధికారి ఒప్పుకోలేదు. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న యువకుడికి గిరిజనుల్నీ, గిరిజన జీవితాన్నీ, గిరిజన విద్యావ్యవస్థనీ అర్థం చేసుకోవడానికి విజయనగరంలో కాకుండా గుమ్మలక్ష్మీ పురం మండలంలో ఏదైనా ఒక ఆశ్రమపాఠశాలలో ట్రయినింగు మొదలుపెట్టమని ఆయన ఉత్తర్వులు ఇచ్చాడు.

ఆ ఉత్తర్వులు చూడగానే అప్పటి గిరిజన సంక్షేమాధికారి కంగారు పడి ఉంటాడు. తాను నాకేదో సహాయం చెయ్యడానికి విజయనగరం అని సూచించాడని తన పై అధికారి ఎక్కడ అనుకున్నాడో అని భయపడి ఉంటాడు. ఆయన ఈసారి నన్ను గుమ్మలక్ష్మీపురంలో రోడ్డు పక్కన ఉండే ఏదో ఒక ఆశ్రమపాఠశాలలో కాకుండా ఎక్కడో కొండలమీద, రహదారి సౌకర్యంలేని, సమాచార సాధనాలు అందుబాటులోలేని మారుమూల కోదుకుగ్రామం గొయిపాక కి పంపిస్తూ ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ ఉత్తర్వులు ఇచ్చేసి ఆ అధికారీ, ప్రాజెక్టూ అధికారీ కూడా ఏదో ఎన్నికల బాధ్యత మీద ఎక్కడికో కేంప్ కి వెళ్ళిపోయారు.

ఆ ఉత్తర్వులు అందుకోడానికి నేను ఆఫీసుకు వెళ్ళేటప్పటికి, ఆ ఆఫీసు సిబ్బంది అంతా ఆ ఫైలు ని పైకీ కిందకీ చదువుతూ ఉన్నారు. ఎందుకని అడిగితే, ఆశ్చర్యం, ఆ కార్యాలయంలో ఎవరికీ కూడా ఆ ఊరు ఎక్కడ ఉందో తెలియదు. నాతో పాటు మా అన్నయ్య కూడా ఉన్నాడు. నేను స్క్కూల్లో చేరినప్పుడూ, కాలేజీలో చేరినప్పుడూ తనే పక్కన ఉన్నాడు కాబట్టి నేను ఉద్యోగంలో చేరేటప్పుడు కూడా తను పక్కన ఉండాలని నాతో పాటు అక్కడికి వచ్చాడు. మేము ఆ మధ్యాహ్నం ఆ ఉత్తర్వులు తీసుకుని, ఎక్కడ ఉందో తెలియని ఆ కొండమీద పల్లెను వెతుక్కుంటూ బయల్దేరాం.

ఆ తర్వాత ఏమయిందో, నేను రాసిన ‘కొన్ని కలలు, కొన్ని మెలకువలు’ గ్రంథంలో రెండవభాగంలో వివరంగా రాసేను కాబట్టి ఇప్పుడదంతా మళ్ళా రాయబోవడం లేదు. కాని ముప్పై అయిదేళ్ళు గడిచాక, మరి నాలుగైదురోజుల్లో పదవీ విరమణ చేయబోయే ముందు ఒకసారి మళ్ళా ఆ ఊరు వెళ్ళాలనిపించింది.

.ఒకప్పుడు నేనూ, మా అన్నయ్యా నాగావళి నది దాటి కాలినడకన కొండలు ఎక్కి దిగి వెళ్ళిన ఆ ఊరికి ఇప్పుడు సిమెంటు రోడ్డు పడుతున్నది. మేము కారులో నేరుగా ఆ ఊరికి చేరుకోగలిగాం. దారి పొడుగునా సముద్రకెరటంలాగా జీడిమామిడిపూల గాలి. కారు అద్దాలు దింపేయమన్నాను. ఆ గాలిలో నిలువెల్లా తడిసి ముద్దవుతూ ఆ ఊరికి చేరుకున్నాను. కారు దిగుతూనే ముందు ఆ నేలకి సాష్టాంగ నమస్కారం చేసాను. ఆ మట్టిని ముద్దాడేను, కళ్ళకి అద్దుకున్నాను. ఆ గ్రామస్థులంతా, ఆ బాలగోపాలం హర్షధ్వానాలతో, సంగీత వాద్యాలతో, కోలాహలంగా స్వాగతం పలికేరు. అక్కడి అక్కచెళ్ళెళ్ళు తమ సాంప్రదాయిక మర్యాదల ప్రకారం నా పాదాలు కడిగి, నుదుట తిలకం దిద్ది, పూలమాలల్తో, అక్షతలతో, ఆశీర్వాదాలతో స్వాగతం పలికేరు.

ఆ ఊరిమధ్య ఒక షామియానాలు నిలబెట్టి పెద్ద సభావేదిక ఏర్పాటు చేసారు. నేను ఆ ఊళ్ళో మూడున్నర దశాబ్దాల కిందటి ఆ కుగ్రామాన్ని పోల్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను కాని ఆ పక్క ఇండ్లు, కరెంటు లైన్లు, స్మార్టు ఫోన్లు, డిష్ ఏంటెన్నాలు నా జ్ఞాపకానికి అడ్డుతగుల్తూనే ఉన్నాయి. కాని అదే ఊరు, అవే కొండలు, అదే దండకారణ్యం. ఊళ్ళో అడుగుపెట్టగానే గుప్పున తాకిన ఘాటైన ఇప్పపూల గాలి.

అక్కడ యువజనం నాతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. అసలు అంతమంది గిరిజన యువతీయువకులు చదువుకున్నవాళ్ళు కనిపించడమే నాకొక పండగలాగా ఉంది. నాతో పాటు ఐ టి డి ఏ ప్రాజెక్టు అధికారి కూర్మనాథ్ గారూ, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కిరణ్ గారితో పాటు, ఇతర అధికారులు, ఒకప్పుడు ఆ ప్రాంతం లో పనిచేసిన పూర్వ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. మాతో పాటు ఆ గ్రామ సర్పంచ్ లక్ష్మి, ఎం పిటి సి కవిత కూడా పాల్గొన్నారు. వారిద్దరూ గిరిజన యువతులు. మూడున్నర దశాబ్దాల్లో ఒక ఊరు ముఖచిత్రం ఎంత మారగలదో వారిద్దర్నీ చూస్తే తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది. నేను అక్కడ గడిపినప్పుడు అక్కడి స్త్రీలు ఏదో పురాతన ప్రపంచానికి చెందినవారిలానూ, గోపీనాథ మొహంతి ‘అమృత సంతానం’ లో పాత్రల్లానూ కనిపించే వారు. కాని ఇప్పుడు వారు తక్కిన సమకాలిక ప్రపంచంతో కలిసి విడివిడిగా నడుస్తున్నవారిగా ఉన్నారు.

ఆ రోజు ఆ గ్రామస్థులు చాలామంది మాట్లాడేరు. కొందరు నేనక్కడ గడిపిన జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. విద్య గిరిజన జీవితాల్లో ఎంత మార్పు తేగలదో వారి ప్రసంగాల్లో బోధపడింది. ఆ తర్వాత అందరం కలిసి ఆ పందిరి కింద భోజనం చేసాం. ఆ తర్వాత వాళ్ళ ఇళ్ళకు వెళ్ళాను. కలిసి ఫొటోలు తీసుకున్నాం. మరిన్ని జ్ఞాపకాలు నెమరేసుకున్నాం.

అన్నిటికన్నా ముఖ్యం, ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహించిన గొయిపాక మిత్రుడు దయానంద్ తన ప్రసంగంలో రెండు మూడు సార్లు నన్ను గొయిపాక వాస్తవ్యుడు అంటో పేర్కొన్నాడు. మామూలుగా ఎవరేనా గొప్ప నాయకులకు మరేవైనా దేశాలు సన్మానం చేసినప్పుడు తమ దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏదుంటే దాన్ని ప్రదానం చేస్తారు. కొన్నిసార్లు మరింత ముందుకి వెళ్ళి తమ ప్రేమను చాటుకోవడం కోసం వారికి తమ దేశ పౌరసత్వం కూడా ప్రదానం చేస్తారు. ఆ రోజు ఆ గ్రామం నాకు తన పౌరసత్వాన్ని ప్రదానం చేసిందనిపించింది. ఆ మాటే చెప్పాను వాళ్ళకి, నా చిన్నప్పుడు పదేళ్ళప్పుడు నా ఊరు వదిలిపెట్టాననీ, ఒక్క గిరిజన గ్రామాన్ని పోగొట్టుకున్నందుకు, దేవుడు, నాకు వెయ్యి గిరిజనగ్రామాల్ని నాకు కానుక చేసాడు అనీ.

తిరిగి వచ్చాక ‘కొన్ని కలలు, కొన్ని మెలకువలు’ పుస్తకం తెరిచి చూసాను. ఆ అధ్యాయంలో ఆ ఊరి గురించి రాసుకున్నదంతా మరోమారు చదువుకున్నాను. ముఖ్యంగా ఈ చివరి పేరాలు:

‘… నా మజిలీ ముగింపుకొచ్చింది. నేను కొండ దిగి పార్వతీపురం వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది. ఆ రోజు ఆ మాష్టారు ఆ కోదుపల్లెలో నాకో వీడ్కోలు సభ ఏర్పాటు చేసాడు. ఆ సభకి పంచాయతీ మెంబరు అధ్యక్షత వహించాడు. సగం కుయి, సగం తెలుగు కలగలిసిన అతని ప్రసంగంలో తమ గ్రామంలో ఒకప్పుడు వెంపటాపు సత్యం ఉన్నాడనీ, తిరిగి ఇన్నాళ్ళకు తమను అభిమానించినవాడు మరొకడు తమతో కొన్నాళ్ళు నివసించేడనీ చెప్పాడు. ఆ పిల్లలూ, ఆ హాస్టలు పనివారూ ఎప్పటిలానే పాటలు పాడారు, పీరూడి ఊదారు.

కొండ దిగి కూనేరు రాగానే నాకొక్కసారిగా చెప్పలేనంత దిగులు ఆవరించింది. ఆ కోదుపల్లె, ఆ సీతాకోక చిలుకలూ, ఆ పిల్లంగోవి పాటలూ, పసుపురెక్కల ఆ పిచుకలూ, ఆ పిల్లలూ నా మనసంతా ఆవరించేసారు. నేనేం నేర్చుకున్నానక్కడ? ఇన్నేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే, దండకారణ్యంలో గడిపిన ఆ రెండువారాలే నా భవిష్యకార్యక్రమానికి యథార్థమైన ప్రాతిపదికను సమకూర్చాయనిపించింది.’

ఈ మాటలు 2004 లో రాసాను. ఇప్పుడు నా ఉద్యోగ జీవితం ముగింపుకి వచ్చిన ఈ క్షణాల్లో కూడా ఇదే మాట చెప్పగలను. చెప్పాను కూడా. ఆ రోజు ఆ ప్రాజెక్టు అధికారి నన్ను గొయిపాక పంపకుండా విజయనగరం పంపి ఉంటే, నేను నా ఉద్యోగ జీవితంలో నేను మరేదైనా అయి ఉండేవాణ్ణేమో గాని, పాఠశాల విద్య సంచాలకుణ్ణీ, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుణ్ణీ కాగలిగి ఉండేవాణ్ణి కాను.

దేవుడు నాకు ఊహించని భాగ్యాన్ని అనుగ్రహించాడు. నేను రాష్ట్రప్రభుత్వ సర్వీసులో పనిచేసిన ముప్పై రెండేళ్ళ కాలానికి దాదాపు మరొక మూడేళ్ళ కాలాన్ని అదనంగా కలిపి నా ఉద్యోగ జీవితాన్ని ఆసాంతం పరిమళభరితం చేసాడనే అనిపించింది.

28-3-2022

Leave a Reply

%d bloggers like this: