
జిన్ చక్రవర్తులు కూడా పూర్వకాలపు హాన్ చక్రవర్తుల్లాగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకోడానికి వాళ్ళ పాటలు సేకరించే పని కొనసాగించారు. హాన్ చక్రవర్తులు ఏర్పాటు చేసినట్టే వారు కూడా ఒక సంగీత కార్యాలయం నెలకొల్పారు. ఆ మూజిక్ బ్యూరో 3-6 శతాబ్దాల మధ్యకాలంలో కొన్ని జానపద గీతాలు సేకరించింది. జిన్ సామ్రాజ్యం పడమటి జిన్ గా, తూర్పు జిన్ గా, ఆ తరువాత ఆరు రాజవంశాల కాలంలో ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయిన కాలంలో కూడా ఆ పాటల సేకరణ కొనసాగుతూనే వచ్చింది. అలా సేకరించిన గీతాల్లో ఉత్తరాది జానపద గీతాలూ, దక్షిణాది జానపద గీతాలూ అని రెండు విభాగాల కింద పాటలు సంకలనం చేసారు.
నాలుగవ శతాబ్ది ఉత్తరార్థంలో దక్షిణ ప్రాంతం నుంచి సేకరించిన గీతాల్లో 117 గీతాలు ప్రత్యేకంగా నిలబడతాయి, చీనా కవిత్వంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలో కూడా. ఎందుకంటే అందులో 115 గీతాలు జూ-యే లేదా జి-యే అనే ఆమె పేరు మీద చరిత్రకు దక్కాయి. జూ-యే అంటే అర్థరాత్రి అని అర్థం. లేదా మనకి పరిచితమైన మాటల్లో చెప్పాలంటే రేరాణి అనవచ్చు. రేరాణి ఒక పానశాల నడిపే యువతి. ఆ రోజుల్లో అటువంటి పానశాల నడిపే యువతుల్ని వట్టి వేశ్యలుగా అర్థం చేసుకోలేం. జపాన్ లో గెయిషాల్లా, మన దేశంలో నర్తకీమణుల్లా ఆ పానశాలయువతులు స్వయంగా కవులు, గాయికలు, వారు తమ అతిథుల్ని పాటల్తో, మధువుతో, సంభాషణల్తో అలరింపచేస్తూ ఉండేవారు. జూ-యే అటువంటి రసవితరణశీలి. ఆమె పేరు మీద మనకి లభ్యమవుతున్న గీతాలు ఒకరు రాసినవి కాదనీ, అటువంటి యువతులు చాలామంది రాసినవనీ మొదట్లో భావించేరు. కాని ఇప్పుడు అవన్నీ ఒకే యువతి రాసి ఉండవచ్చనే నిశ్చయానికి వచ్చారు.
జూ-యే గీతాల్లో అయిదు విభాగాలున్నాయి. మొదటి విభాగం జూ-యే గీతాలు. అందులో 43 కవితలున్నాయి. రెండవ విభాగం వసంతం, వేసవి, శరత్తు, శిశిరం అని నాలుగు ఋతువుల్నీ వర్ణించే కవితలు. అవి 72 పద్యాలు. ఆ పద్యాలు హాన్ కాలంలో ప్రభవించి తర్వాతి కవుల్లో చేతుల్లో వికసించిన అయిదు పదాల షి పద్యం ప్రక్రియ లో రాసినవి. జూ-యే ఆ పద్యాన్ని నాలుగు పాదాల కవిత్వంగా మలిచింది. మన ఆటవెలదిలాగా, తేటగీతిలాగా, పారశీక రుబాయి లాగా ఆమె తీర్చిదిద్దిన ఆ చతుష్పది తదనంతరకవులకి ఒక వరంలాగా దక్కింది. చీనా కవిత్వానికి స్వర్ణయుగం అని చెప్పదగ్గ తాంగ్ వంశ కాలంలో ప్రసిద్ధ కవులంతా ఆ నాలుగు పదాల పద్యప్రక్రియను మరింత ఎత్తులకి తీసుకుపోయారు. మరీ ముఖ్యంగా లి-బాయి. ఆయన జూ-యే కవిత్వాన్ని ఎంత అభిమానించాడంటే ఆ నూటపదిహేనూ పద్యాలూ కంఠస్థం చేసేసాడట.
నాలుగవ శతాబ్దం నాటికి ప్రపంచ సాహిత్యంలో ఒక శాఫో, కొందరు బౌద్ధ సన్యాసినులు, తమిళంలో సంగకాలం నాటి అవ్వైయ్యారు, ఒకరిద్దరు గాథాసప్తశతి కవులు తప్ప కవిత్వం చెప్పిన స్త్రీలు లేరు. కాని వారందరిలోనూ కూడా భావసౌకుమార్యంలో, కాంక్షాప్రకటనలో, పదలాలిత్యంలో జూ-యే వంటి కవి మరొకరు కనిపించరు.
జూ-యే గీతాల్ని ప్రేమగీతాలనీ, విరహగీతాలనీ, శృంగార గీతాలనీ అనడం పడికట్టు పదం అవుతుంది. అవి అత్యున్నతమైన లలితచిత్రాలు. సంగీతకలశాలు. ఆ గీతాలన్నిటిలోనూ ఆమె ఒక ప్రియుణ్ణి అన్వేషిస్తూ ఉంది. తన లాలసలోగాని, తన వైదుష్యంలోగాని, తన హృదయవేదనలో గాని తనకు సాటి రాగల అటువంటి పురుషుడు దొరకడం దుర్లభమని ఆమెకి తెలిసినప్పటికీ. ఆమె అటువంటి ఒక ప్రేమికుణ్ణి అన్వేషిస్తూ ఉన్నదా లేక తనకి తారసపడ్డ అనేకమంది అతిథుల్లో ప్రతి ఒక్కరిలోనూ అటువంటి ఒక అప్రాప్తమనోహరుణ్ణి వెతుక్కుంటూ ఉన్నదా చెప్పలేం. కాని శతాబ్దాల తరువాత కూడా ఒక జాజిపూల తెమ్మెరలాగా, నేలరాలినా పరిమళాన్ని వీడని పారిజాతంలాగా ఆమె పద్యం మనల్ని సమ్ముగ్ధం కావిస్తూనే ఉంది.
ఎందరో అనువాదకులు ఆమె పద్యాల్ని ఇంగ్లిషులోకి అనువదించడానికి మోహపడ్డారు. ప్రతి ఒక్కరూ మూలంలోని ఆ లాలిత్యం, ఆ శ్లేష, ఆ సున్నితత్త్వం అనువాదంలోకి తేలేకపోతున్నామనే చెప్పారు. తెలుగులో నా పరిస్థితి కూడా అదే. అయినప్పటికీ ఆ పరిమళాన్ని మీక్కూడా ఎంతో కొంత చేరవేయాలన్న ప్రలోభంవల్ల కొన్ని పద్యాలు మీ కోసం.
~
1
నీలి పొరమీద లేతాకుపచ్చ పద్మం
నవనవలాడుతున్న నవారుణ కమలాలు.
ఈ పువ్వుల్ని కోసుకోవాలనుకుంటున్నావా
ఇటు చూడు, నా దగ్గర ఒక తామరమొగ్గ.
2
సంజెవేళ ఇంటిముంగిట నిల్చున్నాను
అల్లంత దూరంలో నడిచిపోతున్నావు
మబ్బుల్లాగా పరుచుకున్న నీ ముంగురులు
ఆ వీథివీథంతా ఒకటే పరిమళం.
3
విరహోత్కంఠితగా కిటికీ దగ్గర నిలబడ్డాను
కంచుకం ముడి విడివడి వదులయ్యింది
పయ్యెద పక్కకు జారిందా, ఆ తప్పు నాది కాదు
నునువెచ్చని మాఘమాసపు గాలిది.
4
శీతాకాలపు ఆకాశాలు గడ్డకట్టాయి
కొరికేసే గాలులు, వణికించే చలి.
దుప్పటికింద మనం చేరినప్పుడు మాత్రం
మూడు వేసవి నెలలకి సరిపడా వేడి.
5
దాల్చినచెట్ల వనాల మీద వెన్నెల
విచ్చుకుంటున్న మొగ్గల్లో బంగారు ఛాయ
నిన్ను తలుచుకోకుండా ఎట్లా ఉండేది?
ఒంటరిదాన్ని, నేనూ, నా మగ్గమూ.
6
పరిమళమంటే ఆ తావులన్నీ కలిపిన ఒక మాట
ఆ వదనమా, ఏ బాధ్యతకీ కట్టుబడని సన్నిధి.
నిన్ను నా దగ్గరికి పంపించారే ఆ దేవతలు
ఎవరో ఒకరికి కట్టుబడటం వాళ్ళకి ఇష్టం లేనట్టుంది.
7
వెన్నెలతోనూ, పూలతోనూ గడపాలని
చిరునవ్వు ముఖాన అద్దుకుని వీథికేసి చూస్తాను.
అడుగో వస్తున్నాడే వాడు నన్ను లోబరుచుకోగలడు
ఎంత దురదృష్టం, వాడికా తలపే లేదు.
8
ప్రేమ, జాలి, పిపాస నన్ను నిలవనివ్వట్లేదు.
నా ఇల్లు పల్లెపట్టుకి తరలించాలనుకుంటున్నాను
అక్కడ కంచె చుట్టూ పూలమొక్కలు చిగురిస్తాయి
గుమ్మం దగ్గర నవయువకులు తొక్కిసలాడుకుంటారు.
9
శయ్యమీద కురుస్తున్న వెన్నెల
రాత్రంతా నిద్రలేదు.
ఎవరో పిలుస్తున్నట్టు ఒకటే అలజడి
‘ఆఁ’ అంటో బదులిస్తున్నాను శూన్యానికి.
10
జడ అల్లుకుని ఎన్నాళ్ళయిందో! ఆమె
భుజాలమీంచి జారి అతడి మోకాళ్ళ చుట్టూ
అల్లుకున్న కబరీభరం, అదేమి చోటంటావా?
దానికి జాలికలగని చోటంటూ లేదు.
10-3-2022