యుగయుగాల చీనా కవిత-14

నాలుగవ శతాబ్దం మొదలవుతూనే జిన్ సామ్రాజ్యం ఆటుపోట్లకి గురికావడం మొదలుపెట్టింది. 317 లో మళ్ళా ఉత్తరాదికి చెందిన తెగలు రాజ్యం మీద దండయాత్ర చేసాయి. దాంతో ఆ పాలకులు చాంగాన్ ని వదిలిపెట్టి దక్షిణాన నాంజింగ్ దాకా పారిపోయి అక్కడ తూర్పు జిన్ సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. వారితో పాటు కవులూ, రచయితలూ, సంపన్నులూ, ప్రభుత్వోద్యోగులూ పెద్ద ఎత్తున కొత్త రాజధానికి తరలి వచ్చారు. వారు దక్షిణాది సంస్కృతిలో ఒక పట్టాన మమేకం కాలేకపోయారు. సాంస్కృతికంగా తాము దక్షిణాదివారికన్నా ఉన్నతులమనే భావన వారిని వదల్లేదు. కాని ఎటుచూసినా మైదానాలూ, పీఠభూములూ, కొండలూ పరుచుకుని ఉండే ఉత్తర చైనా నుండి అడవులూ, ఆకుపచ్చని కొండలూ, నిర్మల నదీ ప్రవాహాలూ ఉండే దక్షిణ చైనా వారిని అబ్బురపరిచింది. ఆ సౌందర్యం వారిని వివశుల్ని చేసింది. దానికితోడు వారిని గాఢంగా ప్రభావితం చేస్తున్న డావో భావజాలం ఎలానూ ఉండనే ఉంది. కళ్ళముందు కనిపిస్తున్న అనంత వైవిధ్యాన్ని ఒకే ఒక్క అంతస్సూత్రంతో ముడివేసుకోవాలన్న తపన మరింత బలపడింది.
 
అట్లాంటి రోజుల్లో చైనా సాహిత్యంలో గొప్ప సంఘటన ఒకటి జరిగింది. సా.శ. 353 లో గుయిజి ప్రాంతానికి చెందిన లంటింగ్ అనే చోట రసజ్ఞులైన కొందరు సంపన్నులు ఒకరోజు విహారయాత్రకు వెళ్ళారు. అది వసంతకాలంలో చివరినెలలో మొదటివారం. పిల్లా పెద్దా అంతా పవిత్ర స్నానాలకోసం గుయిజి దగ్గరుండే షాన్ యిన్ లో పూలమంటపం దగ్గర చేరుకున్నారు. ఆ మంటపం చుట్టూ ఎత్తైన కొండలు, సమున్నత పర్వతశిఖరాలు. దట్టమైన అడవులు. వెదుళ్ళతోపులు. వాటి మధ్య నిర్మలజలాల్తో ఉరకలెత్తుతున్న ప్రవాహం. ఆ నది ఆ కొండల చుట్టూ వడ్డాణం లాగా అమరింది. వారంతా ఆ నది చుట్టూ పానగోష్టికి కూచున్నారు. ఆ ప్రవాహంలో పైనుండి పానపాత్రలు నదిలో వదిలిపెడుతున్నారు. ఆ పాత్ర ఎవరి ముందు వచ్చి ఆగితే వారు ఆ పానీయాన్ని స్వీకరించడంతో పాటు ఒక కవిత కూడా చెప్పాలి.
 
ఆ గోష్టిలో మొత్తం నలభై ఒక్క మంది ఉన్నారు. వాళ్ళల్లో పదకొండు మంది ఒక్కొక్కరూ కనీసం రెండేసి కవితలు చెప్పారు. మరొక పదిహేను మంది ఒక్కొక్క కవిత చొప్పున చెప్పారు. మిగిలిన పదిహేను మందీ ఒక్క కవిత కూడా చెప్పనందుకు ఒక్కొక్కరికీ మూడ పాత్రల మద్యం అదనంగా తాగక తప్పని శిక్ష పడింది. ఆ గోష్టి పూర్తయ్యాక ఆ ప్రాంతానికి పాలనాధికారీ, ఆ గోష్టిలో కీలకపాత్ర వహించిన వాడూ అయిన వాంగ్ జిజి ఆ కవితల్ని ఒక సంకలనంగా వెలువరించాడు. దాంతోపాటు ఒక ముందుమాట కూడా రాసాడు. చక్కని పట్టువస్త్రం మీద అతడు రాసిన ముందుమాట చీనా కాలిగ్రఫీలో కూడా ఒక అద్భుతంగా మిగిలిపోయింది.
 
అంతమంది కవులు ఒక బృందంగా ప్రకృతి ఒడిలో కవితలు చెప్పడం, ఆ కవితలు పుస్తకంగా రావడం అదే మొదటిసారి. అయితే వారికి ముందు షి-చోంగ్ అనే ఒక సంపన్నుడు 296 లో అట్లాంటి ఒక గోష్టి నిర్వహించకపోలేదు. దాన్ని ‘బంగారు లోయ ‘ కూడిక గా చెప్పుకుంటారు. ఆ గోష్టిలో సంగీతం కూడా మద్యంతో పాటుగా ఏరులై ప్రవహించింది. కాని పూలమంటపం కవిత్వంలో కేవలం కవిత్వం మాత్రమే కాదు, ఒక అన్వేషణ, ఒక దర్శనం కూడా ఉన్నాయి. జీవితపరమార్థం గురించిన ఒక వెతుకులాట ఉంది. బహుశా ప్రాచీన ఏథెన్సులో ఒకరాత్రి సోక్రటీసూ ఆయన శిష్యులూ అగాథాన్ అనే మిత్రుడి ఇంట్లో జరిపిన పానగోష్టి (సింపోజియం) మాత్రమే దానికి సరితూగే సాహిత్యసంఘటన.
 
ఆ కవితలకి ముందుమాట రాస్తూ వాంగ్-జిజి ఇలా రాస్తున్నాడు:
 
‘కాని ఆ మద్యంతోనూ, కవిత్వాల కూర్పుతోనూ మేము ఒకరితో ఒకరం మనసు విప్పి ఎట్లాంటి అరమరికల్లేకుండా మాట్లాడుకున్నాం. ఒకరి హృదయాల్లోకి మరొకరం ప్రవేశించగలిగాం. ఆ రోజు దివ్యంగా ఉండింది. గాలి నిర్మలంగా వీస్తూ ఉండింది. ఒక కమ్మతెమ్మెర మమ్మల్ని తాకిపోతూ ఉంది. తలపైకెత్తి చూసామా, అనంత విశ్వం మాకు సాక్షాత్కరిస్తూ ఉంది. ముందుకు వంగి కిందకి చూసామా, అపార వైవిధ్యం తాలూకు సౌందర్యంతో పృథ్వి మా కళ్ళముందు విరాజిల్లుతూ ఉంది. మా నేత్రాలు ఒక దాని మీంచి మరొక దాని మీదకు ప్రయాణిస్తూనే ఉన్నాయి, అలాగే మా హృదయాలు కూడా కనిపిస్తున్నవాటన్నిటితోటీ కలిసి నడుస్తూ ఉన్నాయి. ఆ రోజు మాకు కన్నులపండగ, వీనుల విందు. ఎంత శుభ్రసంతోషం! ఎంత భాగ్యం!’
 
వాంగ్-జిజి ఇంకా ఇలా రాస్తున్నాడు:
 
‘మనుషులు పరస్పరం ఒకరి సాంగత్యంలో ఒకరు జీవితయాత్ర కొనసాగిస్తున్నప్పుడు కొందరు తమ అంతరంగాన్ని తోటిమిత్రుడితో పంచుకోవడంలో సంతోషం పొందుతారు. మరికొందరు తమ ఇచ్చ వచ్చినట్టుగా సంచరించడానికి ఇష్టపడతారు. స్వభావ రీత్యా మనుషులు కొందరు శాంతంగా ఉంటారు, కొందరు ఉద్రేకపూరితంగా ఉంటారు. వాళ్ళ స్వభావాల్లో ఎంత వైవిధ్యం ఉందో జీవితానందాన్ని వెతుక్కోవడంలో కూడా అంత వైవిధ్యం ఉంటుంది. తమకి నచ్చినదాన్ని దేన్నో వెతుక్కుంటున్నప్పుడు వాళ్ళా క్షణానికి గొప్ప సంతృప్తికి లోనవుతారు. ముంచుకొస్తున్న వృద్ధాప్యం వారికి ఆ సమయాన గుర్తుకు రాదు. వాళ్ళని అంతదాకా పట్టి ఉంచిన ఆ వ్యాపకం తీవ్రత సన్నగిల్లాక, పరిస్థితినిబట్టి వాళ్ళ భావోద్వేగాలు పలచబడ్డాక ఒక్కసారిగా వాళ్ళని వ్యాకులత చుట్టుముడుతుంది. ఒకప్పుడు వాళ్ళని పట్టికుదిపేసిందేదో ఇప్పుడు గతంగా మారిపోతుంది. ఆ సంతోషం విలాపంగా మారుతుంది. అంతేకాక, దీర్ఘాయువులుగానీ, అల్పాయువులుకానీ ప్రతి ఒక్కరికీ మరణం తప్పదు. మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పుట్టుకా, మరణమూ రెండూ కూడా క్షణికాలే. ఆ మాటలే ఎంత వేదనాభరితంగా ఉన్నాయి!’
 
‘పూర్వకవుల కవిత్వం చదువుతున్నప్పుడు నేను వారి విషాదానికి కారణాలు ఊహించడానికి ప్రయత్నించాను. చూడబోతే నన్ను బాధిస్తున్నవే వాళ్ళనీ బాధించాయని అర్థమవుతున్నది. ఆ వేదనని ఎట్లా శమింపచేసుకోవాలో తెలియక, ఒక దీర్ఘనిశ్వాసంతో నేను పుస్తకం మూసేసాను. ఒక్కటి మాత్రం నిశ్చయంగా చెప్పగలను. జీవితమూ, మృత్యువూ సమానమని చెప్పడం మాత్రం శుష్కప్రసంగం. ఇంకా యవ్వనం పూర్తికాకుండానే మరణించిన ఒక నవయువకుడు శతాయుష్కుడి జీవితం జీవించాడని చెప్పడం హాస్యాస్పదం. మనం మన పూర్వయుగాల్ని పరికించినట్టే మన తర్వాతి తరాల వారు కూడా మనం జీవించిన కాలాన్ని చూసి నవ్వుకోకుండా ఉండరు. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ చేరిన మిత్రులు రాసిన కవితల్ని నేను ఈ పుస్తకంగా సమకూర్చాను. పరిస్థితులు మారిపోయి, మనుషులు మరొక తరహా ప్రపంచంలో జీవించడం మొదలుపెట్టినా కూడా వారిని కవితా రచనకు ప్రోత్సహించే వ్యాకులతలో ఏమీ మార్పు ఉండదనుకుంటున్నాను. నేను ఈ ముందుమాటలో రాసిన ఈ నాలుగు మాటలూ రానున్న కాలాల్లో బహుశా ఎవరో ఒక పాఠకుణ్ణి చలింపచేయకుండా ఉండవనే నమ్ముతున్నాను.’
 
చీనా కవిత్వ సంకలనాల్లో దాదాపుగా ఆ ముందుమాటనే ఉంటుంది తప్ప ఆ కవితలు కనిపించవు. ఆ ముందుమాట లోని భావోద్వేగం ముందు ఆ కవితలు మరుగన పడిపోయాయి. కాని ఆ పూలతెమ్మెర మధ్య, ఆ తేటనీటి ఎదట ఆ కవులు ఏమి సంభావించారో తెలుసుకోవాలని ఎవరికి అనిపించదు? అందుకని రెండు కవితలు మీకోసం. మొదటిది వాంగ్-జిజి రాసిన కవిత. రెండవది జీ-వాన్ అనే కవిది.
 
ఆ కవితల్లో మనం గమనించవలసింది అప్పటిదాకా చీనా కవిత్వంలో ఒక ఉపాంగంగా మాత్రమే ఉన్న ప్రకృతి ముందుకు రావడం. గీతసముచ్చయంలో కూడా ప్రకృతి వర్ణన ఉందిగాని, అది ఒక పువ్వునో లేదా ఒక మేఘాన్నో ప్రస్తావించడం మాత్రమే. కాని ఈ కవితల్లో ఉన్నది ఒక కొండ, ఒక నది, ఒక పువ్వు, ఒక పూలమంటపం మాత్రమే కాదు. చూపుమొత్తాన్ని తనలోకి లాక్కోగల సమస్త ప్రకృతీను. కిందకి చూసామా, అపార వైవిధ్యంతో అలరారే పదివేల అందాలు. పైకి చూసామా విస్తార నీలగగనం. సరిగ్గా డావో చెప్పినట్టే. వైవిధ్యమూ, ఏకత్వమూ. ఆ రెంటినీ ముడివెయ్యగలది కవిత్వమొక్కటే అని ఆ కవులు గ్రహించారు.
 
1
 
కలయికలకీ, విడిపోడాలకీ కూడా వాటి లెక్కలు వాటికున్నాయి
దీర్ఘాయువూ, అల్పాయువూ ముందే ఏర్పడ్డాయని చెప్పలేము.
 
ఎప్పటికప్పుడు కొత్తది పుట్టుకొస్తూనే ఉంటుంది
ఒకసారి అది గతించిపోయాక, మరి కనిపించదు.
 
ఈరోజు అలౌకికం, అద్భుతం అనిపిస్తున్నది
నాలుగురోజులు గడిచాక దుమ్ముగా మారిపోతున్నది.
 
ఈ విషాదానికి వ్యాకులపడనిదెవ్వరు?
ఆ వేదన తరచి చూసుకోవడంలో ఒక విముక్తి
 
ఒకసారి దాన్ని మాటల్లో పెట్టావా ఇక ఆ మాటలు మరణించవు
కెరటాలు తగ్గేదాకా ఆగడం నాకు సాధ్యం కాదు.
 
2
 
సమున్నత పర్వతశిఖరాలమీద చూపుసారిస్తాను
దట్టమైన ఆ అడవుల్లో నా చూపులు చిక్కుకున్నాయి.
 
సతతహరితారణ్యాలు శిఖరాగ్రాన్ని కప్పేసాయి
నిడుపాటి వెదుళ్ళు కొండకు కిరీటం తొడిగాయి.
 
లోయలోంచి నది నిర్మలస్వరాల్ని వెదజల్లుతోంది
కొమ్మలు తాళాలూ, తప్పెట్లూ మోగిస్తున్నాయి.
 
నల్లటి కొండకొమ్ము తేమని విరజిమ్ముతున్నది
పొగమంచూ, నీటి ఆవిరీ ఒక నీడని సృష్టిస్తున్నాయి.
 
9-3-2022

2 Replies to “యుగయుగాల చీనా కవిత-14”

Leave a Reply

%d bloggers like this: