యుగయుగాల చీనా కవిత-13

Reading Time: 2 minutes

లు-జి (261-303) ది అత్యంత నాటకీయమైన ఒక విషాదాంత కథ. అతడి పూర్వీకులు వూ రాజ్యాన్ని స్థాపించినవాళ్ళు. జిన్ రాజ్యంతో యుద్ధంలో వూ రాజ్యం ఓడిపోయినప్పుడు లు-జి, అతడి తమ్ముడు యూన్ తప్పించుకుని యాంగ్జే నదీతీరంలో తమ గ్రామీణ క్షేత్రంలో దాదాపు పదేళ్ళు తలదాచుకున్నారు. దాదాపు గృహనిర్బంధంలాంటి ఆ జీవితంలో లు-జి పూర్వసాహిత్యాన్ని, అలంకార శాస్త్రాల్ని అమూలాగ్రం అభ్యసించాడు. తర్వాత ఆ అన్నదమ్ములిద్దరూ తమ భవిష్యత్తు వెతుక్కుంటూ జిన్ రాజ్యంలో అడుగుపెట్టారు. అక్కడ చాంగ్ హువా అనే కవి వాళ్ళకి సాయం చేసాడు. జిన్ పాలకులు ఆ అన్నదమ్ముల ప్రతిభని గుర్తించివాళ్ళకి పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగించారు. ఒకసారి రాజధానిమీద విరుచుకుపడుతున్న శత్రుశైన్యాల్ని నిలవరించే బాధ్యత లు-జి కి అప్పగించారు. కాని ఆ యుద్ధంలో లు-జి సేనలు తీవ్రంగా నష్టపోయాయి. అతడంటే కిట్టనివాళ్ళు అతడు రాజద్రోహానికి పాల్పడ్డాడని యువరాజుకు నూరిపోసారు. దాంతో అతడూ, అతడి ఇద్దరు కొడుకులూ, తమ్ముడూ కూడా ఉరికంబం ఎక్కక తప్పలేదు.
 
లు-జి ని అరిస్టాటిల్ తోనూ, భరతముని తోనూ పోల్చవచ్చు. ఆయన రాసిన ‘వెన్-ఫూ’ చీనాలో తొలి సాహిత్య లక్షణ గ్రంథం. దాన్ని ఆయన ఫూ పద్దతిలో అంటే పద్యగంధి వచనంలో రాసాడు. చీనాలో సాహిత్య విమర్శ ఆ గ్రంథంతోటే మొదలైంది అని చెప్పవచ్చు. అంతవరకూ సాహిత్యం గురించిన నిర్దేశ సూత్రాలు కన్ ఫ్యూసియస్ చెప్పిన మాటలు మాత్రమే. సాహిత్య ప్రయోజనాన్ని సామాజిక బాధ్యతనుంచి విడదీయలేమని కన్ ఫ్యూసియస్ భావించాడు. సాహిత్యం చెయ్యవలసిన పని సరైన సంగతుల్ని సరైన పేర్లతో సూచించడమే అన్నాడాయన. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడమే. కాని సత్యాన్ని ఎలా ప్రతిపాదిస్తే అది సాహిత్యమవుతుందో మొదటిసారి చెప్పినవాడు లు-జి మాత్రమే.
 
వెన్ అంటే వాక్కు, కవిత్వం, సాహిత్యం, కళ, కావ్యకళ కూడా. ‘గొప్ప అంధకారం ఆవరించిన ప్రపంచంలోకి కవిత్వం వెలుగు తీసుకొస్తుంది’ అని లు-జి నమ్మాడు. గొడ్డలి పిడిని మరొక గొడ్డలితో చెక్కినట్టుగా కవిత్వాన్ని చూసి కవిత్వమెలా రాయాలో నేర్చుకుంటాం అని చెప్పాడు.
 
అందువల్లనే నాలుగవ శతాబ్దం నుంచీ ప్రతి కవికీ, ప్రతి సాహిత్యవిద్యార్థికీ వెన్-ఫూ కంఠస్థం పట్టడం తప్పనిసరి అయ్యింది. ఇరవయ్యవశతాబ్దంలో పాశ్చాత్య ప్రపంచాన్ని వెన్-ఫూ గాఢంగా ఆకర్షించింది. అమెరికా లో ఆ రచనకు ప్రతి పదేళ్ళకూ ఒక కొత్త అనువాదం వెలువడుతూనే ఉంది.
 
వెన్ ఫూ ఒక ఉపక్రమణిక తో పాటు ఇరవై పద్యాల ఖండ కావ్యం. అందులో ఉపక్రమణికతో పాటు ఒక పద్యం కూడా మీ కోసం:
 
~
 

ఉపక్రమణిక

 
పూర్వసాహిత్యకారుల రచనలు చదివేటప్పుడు
వారి హృదయాలెట్లా స్పందించాయో గమనిస్తాను.
 
నిజమే, వాక్చాతుర్యం, పదాల్లోకి ప్రాణమూదడం
రకరకాల మార్గాల్లో సాధించడం సాధ్యమే.
 
అయినప్పటికీ మామూలు మాటలనుంచి
మహిమాన్వితమైన మాటల్ని వేరు చెయ్యగలం.
 
రాయడం వల్లనే, రాసిందాన్ని మళ్ళా తిరగరాసి
మరొక్కసారి మళ్ళా రాసుకుంటేనే వన్నె చిక్కుతుంది.
 
మన మాటలు మన విషయాన్ని పట్టిస్తున్నవో లేదో
రూపానికీ, సారానికీ సమతూకం కుదిరిందో లేదో.
 
చెప్పడం సులభం
చేసి చూపించడమే కష్టం.
 
ఉత్తమ కృతులకీ అధమకృతులకీ తేడా చూపడానికీ
పూర్వకావ్యాల్ని పరిశీలించడానికే ఈ పద్యాలు.
 
బహుశా కొన్నాళ్ళు పోయాక, చెప్పుకుంటారేమో
నేను పని చేసిన ఈ పని పనికొచ్చేదేనని.
 
ఆ రహస్యమేదో నేను పట్టుకోగలిగాననీ
ప్రయోజనకరమైందొకటి ప్రతిపాదించాననీ.
 
గొడ్డలి పిడిని గొడ్డలితో చెక్కుతున్నప్పుడు
కావలసిన నమూనా మనదగ్గరున్నట్టే కదా.
 
ప్రతి ఒక్క రచయితకీ ఆ రహస్యం అనుభవైకవేద్యం
దాన్ని మాటల్లో వివరించడం కష్టం.
 
అయినప్పటికీ నేను మీతో పంచుకుంటున్న భావాల్లో
ఎంతో కొంత స్పష్టత సమకూరిందనే అనుకుంటాను.
 
2
 
రచయితలకి దొరికే సంతోషం
ఋషులకి తెలిసిన సంతోషం.
 
ఏమీ లేని చోటునుంచి ఒక కృతి ప్రభవిస్తుంది
నిశ్శబ్దంలోంచి కవి ఒక గీతం పైకి లాగుతాడు.
 
గజం పట్టుగుడ్డమీద అనంతమైన ప్రపంచం
భాష అంటే గుండెనుంచి పొంగిపొర్లే వరద.
 
పదచిత్రాలు విస్తారంగా వల వేస్తాయి
భావాలు మరింత లోతుల్లోకీ శోధిస్తాయి.
 
తాజా పూలపరిమళంతోనూ, శతసహస్ర
నవాంకురాలతోనూ మనల్ని చేరవస్తాడు కవి.
 
ప్రతి గాలీ ఒక రూపకాలంకారానికి తెరతీస్తుంది
కుంచెకొసల అడవిమీంచి మేఘసందేశం వినవస్తుంది.
 
7-3-2022

Leave a Reply

%d bloggers like this: