యుగయుగాల చీనా కవిత-12

మూడవశతాబ్దం దాటి ముందుకు వెళ్ళబోయేముందు మరొక ఇద్దరు కవుల్ని తలుచుకోవాలి.
 
ఒకరు పాన్ యూయె (247-300). ప్రాచీన చైనాలో అంత అందగాడు మరొకడు లేడని పేరు తెచ్చుకున్నవాడు. చాలాకాలం ప్రభుత్వంలో ఉన్నతోద్యోగాలు చేసాడు. పదవీ విరమణ చేసాక లొ-యాంగ్ శివార్లలో ఉన్న తన సుక్షేత్రానికి పోయి తోటల మధ్యా, పొలాల మధ్యా గడపాలనుకున్నాడు. కాని అతడికి ఆ అదృష్టం దక్కలేదు. ఒక అభియోగంలో అతణ్ణి ఇరికించి వథ్యశిలకు నడిపించారు. ఆనాటి క్రూరశాసనాల వల్ల అతడితో పాటు అతడి తల్లిని, అన్నదమ్ముల్ని, బంధువుల్ని అందరినీ వధించేసారు.
 
పాన్ యూయె ప్రధానంగా గీతకవి. తన భార్య మరణానికి కుంగిపోయి అతడు రాసిన మూడు పద్యాల్లోంచి ఒక పద్యం ఇక్కడ అందిస్తున్నాను. ఇందులో జువాంగ్ జి ప్రస్తావన గురించి ఒక మాట చెప్పాలి. తన భార్య మరణించినప్పుడు జువాంగ్ జి బాజా మోగిస్తూ కనబడ్డాడట. అదేమిటని ఆశ్చర్యపోయిన ఇరుగు పొరుగు తో అతడు చెప్పాడట: ‘ఇప్పుడామె అనంత సత్యంలో లీనమైపోయింది. ఇంతకన్నా సంతోషం మరేముంటుంది’ అని. తనకీ తన భార్య మరణాన్ని చూసి అటువంటి మనఃస్థితి సాధ్యపడాలని పాన్-యూయె కోరుకుంటున్నాడు.
 
~
 

శిశిర వసంతాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి

 
శిశిర వసంతాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి,
మరొకసారి వేసవి గడిచి హేమంతం.
ఆమె ఏ రహస్యనదీతీరానికో తరలిపోయింది
ఇప్పుడు మా మధ్య ఒక ప్రపంచమంత దూరం.
 
ఇప్పుడు నా రహస్యాలు పంచుకునేదెవరు?
ఇప్పుడెవరి కోసం బతకాలి నేను?
ఏదో ఉద్యోగానికి వెళ్ళి వస్తూనే ఉన్నాను
నా పనులేవో సగం సగం చేస్తూనే ఉన్నాను.
 
సగంలో వదిలిపెట్టిన పనులు మళ్ళా
మొదలుపెడుతున్నాను, ఇంటికి వెళ్ళాలంటే
ఆమెనే గుర్తొస్తుంది. ఇంట్లో అడుగుపెట్టగానే
ఆమె ఎదురొచ్చి పలకరిస్తుందనిపిస్తుంది.
 
తెరలమీదా, గోడలమీదా ఆమె నీడ,
ముత్యాలకోవలాంటి ఆ ఉత్తరాల దస్తూరి.
పడగ్గదిలో ఇంకా ఆమె మేని సుగంధం.
గోడ వంకీకి ఇంకా వేలాడుతున్న చీర.
 
పడుకున్నానా, కలల్లో కనిపిస్తుంది,
ఒక్క ఉదుటున ఉలిక్కిపడి లేస్తాను.
ఆమె అదృశ్యమైపోతుంది. ఒక్కసారిగా
దుఃఖం నన్ను ముంచెత్తిపోతుంది.
 
ఒకప్పుడిక్కడ రెండు పిట్టలు గూడు
కట్టుకున్నాయి, ఇప్పుడు ఒక్కటే మిగిలింది.
చేపల జంట ఒకటి ఇంతలోనే విడివడి
నీటి ఉరవడిలో కొట్టుకుపోయాయి.
 
హేమంతపు చలిగాలి. చుట్టూ పొగమంచు,
చూరునించి జారుతున్న మంచుబొట్లు.
రాత్రంతా కలతపరచిన నిదురలో
ఆమెని క్షణమైనా మరవలేదు.
 
జువాంగ్ జి గుర్తున్నాడా, తన భార్య
పోయినప్పుడు బాజా మోగించాడే-
అట్లా నేనూ నా భార్యను తలచుకునే
రోజు తప్పకుండా వస్తుందనుకుంటాను.
 
6-3-2022

Leave a Reply

%d bloggers like this: