యుగయుగాల చీనా కవిత-11

సంక్షుభిత సమయాల్లో అందరికన్నా ఎక్కువ మూల్యం చెల్లించేది స్త్రీలూ, పిల్లలూ, కవులూను. స్త్రీలదీ, పిల్లలదీ మూగబాధకాగా, కవులు తమ బాధకి అక్షరరూపం ఇవ్వడం ద్వారా దాన్ని ప్రపంచపు బాధగా మారుస్తారు. అందువల్లనే కల్లోల కాలానికి చెందిన ఏ కవిని చదివినా ఆ యుగం మొత్తం మనకి కళ్ళకి కడుతుంది.

మూడవ శతాబ్ది చీనాలో జిన్ రాజవంశం పాలన మొదలయ్యాక దాదాపు నాలుగువందల ఏళ్ళ పాటు మళ్ళా దేశం అనేక రాజ్యాలుగా చీలిపోయింది. దాన్ని ఆరు రాజవంశాల కాలం అంటారు. బహుశా చీనా చరిత్రలో అంత రక్తసిక్తమైన కాలం మరొకటి లేదేమో. ఆ కాలం గురించి రాస్తూ జె.డి.ఫ్రోడ్ షామ్ అనే సాహిత్యవేత్త ఇలా రాస్తున్నాడు:

‘ఈ కాలానికి చెందిన ప్రభుత్వాధికారుల జీవితచరిత్రలు చూస్తే ‘అతణ్ణి నగరబజారులో వధించారు’, ‘ అతడు తనని తాను గొంతుపిసుక్కోడానికి అనుమతించారు’, ‘అతడు ఉరేసుకున్నాడు’, ‘అతణ్ణి సైనికులతో తొక్కించారు’ లాంటి వాక్యాలు పదే పదే కనిపిస్తాయి. ఒకడి ఉద్యోగజీవితం ఎలా ముగిసిందో చెప్పడానికి తరచూ ఈ వాక్యాలే ఎదురవుతాయి. హింసాత్మకంగానూ, రక్తసిక్తంగానూ జీవితం ముగియడమనేది ఆనాడు సర్వసాధారణం. చివరికి ‘ వధ్యశిలకు పోతూ ఉండగా రాసిన కవితలు’ అనేది ఒక ప్రక్రియగా కూడా స్థిరపడిపోయిందంటే చూడండి. ప్రభుత్వంలో అధికారిగా ఉండటం అంటే ఏదో ఒక ముఠా పక్షాన ఉండవలసి రావడమే. ఆ ముఠా తన అధికారం కోల్పోయిందా దానికి ఆ అధికారులు చెల్లించక తప్పని మూల్యం బహిష్కారం లేదా మరణం…’

కాబట్టి ఆ కాలానికి చెందిన కవిత్వంలో వృద్ధాప్యం, మరణం, రోగం పట్ల చెప్పలేనంత భయం, దీర్ఘాయువు పట్ల అపారమైన ఆకాంక్ష కనబడటంలో ఆశ్చర్యం లేదు. తమ సమకాలిక సమాజం నుంచి, రాజరికబంధాల నుంచి దూరంగా గడపాలనుకున్న డావోయిస్టులు కూడా తమ జీవితాయుర్దాయాన్ని పెంచుకోడానికి రహస్యకషాయాలు సేవిస్తుండేవారు, లేదా ఏదో ఒక హఠయోగం సాధన చేస్తూండేవారు. జీవితాన్ని మరికొద్ది కాలం పొడిగించుకోవడమెట్లా అన్నదే ఆ కవుల సమస్య. ఆ కోరిక దాదాపుగా అమరత్వం గురించిన తపనగా ఆ కాలపు కవిత్వంలో కనిపిస్తుంది. తాము పరిపూర్ణమానవులు కావాలనీ, తమ జీవితాలు దుఃఖరహితంగా కొనసాగాలనీ కోరుకోవడంలోంచి ఆ కవులు చెప్పిన కవిత్వం చీనా కవిత్వానికి అంతకు పూర్వంలేని ఒక అపురూపమైన ఆత్మాశ్రయతనీ, సౌందర్యాభినివేశాన్నీ, విషాదమాధుర్యాన్నీ సంతరించారు. అటువంటి సరికొత్త కవిత్వానికి దారి చూపించినవాళ్ళలో జి-కాంగ్ (223-62) ముఖ్యుడు.

జి-కాంగ్ కవి కన్నా కూడా ఎక్కువగా ఒక ఋషిగానూ, సంగీతకారుడిగానూ ప్రసిద్ధిచెందాడు. వెదుళ్ళతోపులో ఏడుగురు సాధువుల బృందానికి దాదాపుగా అతడు కేంద్రవ్యక్తి. వెయి చక్రవర్తుల డావోయిజం స్థానంలో జిన్ రాజవంశం మళ్ళా కన్ ఫ్యూసియన్ భావజాలానికి పట్టం కడుతున్న రోజుల్లో జి-కాంగ్ తన డావోయిస్టు నమ్మకాలతో వాళ్ళకొక సమస్యగా మారేడు. రువాన్-జి లాగా తన నమ్మకాలు నలుగురికీ అర్థం కాకుండా కవిత్వం రాయడం అతడికి చాతకాదు. ముక్కుసూటి మనిషి. రాజీలేని తన ప్రవర్తనతో ఒక ప్రభుత్వాధికారి ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో ఆ అధికారి ఒక పౌర వ్యాజ్యంలో జి-కాంగ్ ను కూడా ఇరికించాడు. ఆ తప్పుడు అభియోగం వల్ల జికాంగ్ కారాగారం పాలు కావడమే కాకుండా వధ్యశిల మీద తలపెట్టక కూడా తప్పలేదు.

జి-కాంగ్ వ్యక్తిత్వం, అతడి జీవితకథ సోక్రటీస్ ని తలపిస్తాయి. అతడికి తన అయిదుమెట్ల కిన్నెర అంటే ఎంతో ఇష్టం. ఆ కిన్నెర మీటుకుంటూ తనదైన సంగీతలోకంలో తన్మయుడై ఉండేవాడు. చివరికి వధ్యశిల మీద తన శిరసును పెట్టవలసిన సమయంలో కూడా అతడు ఆ కిన్నెర మరొకసారి తృప్తిగా మీటుకుని అప్పుడు తన ప్రాణాలు అర్పించాడు.

జి-కాంగ్ రాసిన కవితల్లో కారాగారంలో ఉండగా రాసిన కవిత ప్రఖ్యాతమైంది. ‘నేను లోకానికి మంచి చేయాలనుకున్నాను, కాని మనుషులతో ఎలా వ్యవహరించాలో నాకు తెలియలేదు’ అని రాసుకున్నాడు అందులో. అది అతడి చివరి కవిత. ‘మంచి చెయ్యాలనుకున్నావా, కీర్తికాంక్షని దూరం పెట్టు. కాలాన్ని శిరసావహించు, దాని తీర్పుని మౌనంగా గౌరవించు’ అన్నది అతడు రాసుకున్న చివరి వాక్యం. తన సోదరుడికోసం రాసిన పద్ధెనిమిది పద్యాలు అతడి అత్యున్నత కృతి. అందులో అతడు చీనాకవిత్వానికొక కొత్త సౌందర్య శాస్త్రాన్ని పరిచయం చేసాడు. తర్వాత రోజుల్లో పూలతోటల కవులు, పొలాలూ-తోటల కవులు, కొండలూ-నదుల కవులు తమ స్ఫూర్తిని జి-కాంగ్ నుంచే గ్రహించారనడంలో అతిశయోక్తి లేదు.

జి-కాంగ్ కవిత్వం నుంచి ఒక ఉదాహరణ:

మా అమ్మా, మా అన్నయ్యా

 
ఏమి చెయ్యాలి ఈ దుఃఖాన్ని? ఎడతెరిపిలేని ఈ దుఃఖాన్ని?
భరించలేని బాధాదంష్ట్రల్లో నా గుండె చిక్కి నలిగిపోతున్నది.
 
ఈ శోకం- ఏమి చెయ్యాలి? విషాద పరంపరకి అంతులేదు.
గడ్డకట్టి చిక్కుముళ్ళు పడ్డ అశాంతమానసాన్ని విప్పుకోలేను.
 
ఇన్న్నాళ్ళుగా ఆధారంగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా గతించారు
నాలోపల్లోపలే కుమిలిపోతున్నాను, ఏడుపు పైకి వినబడదు.
 
వాళ్ళప్రేమకి బదులిద్దామంటే చాలా దూరం వెళ్ళిపోయారు
వాళ్ళ అప్యాయత, వాత్సల్యం- గుండె ముక్కలవుతున్నది.
 
అయ్యో! మా అమ్మ, మా అన్నయ్య, కనిపించరు ఎప్పటికీ.
వాళ్ళ వదనాలు గుర్తొస్తే, నా పేగులు కనలిపోతున్నాయి.
 
ఈ వసంతకాల పూర్వాహ్ణం వాళ్ళనే తలుచుకుంటున్నాను
వాళ్ళని చూడాలని ఉంది, కాని వెళ్ళడానికి దారి లేదు.
 
సంజీవినీ పర్వతం గుర్తొచ్చి దీర్ఘనిశ్వాసం వదుల్తాను.
వాళ్ళు వదిలిపెట్టిన చంకకర్రలు, చేతికర్రలు, ఆగని కన్నీళ్ళు.
 
మా అమ్మా, అన్నయ్యా ఇక్కడే నా దగ్గర ఉండే ఆ రోజులు:
అప్పుడు ఎంత నిశ్చింతగా ఉండేది, రాజులాగా ఉండేవాణ్ణి.
 
అకస్మాత్తుగా వెళ్ళిపోయారు, వెంటపడదామంటే కనిపించరు.
నా గుండె అరిగిపోయింది, మిగిలింది ఏడుపు మటుకే.
 
శూన్యగృహం, నిర్జనం, చేయూతలేని చోటు.
వాళ్ళు వదిలిపెట్టివెళ్ళిన వస్తువులు, భగ్న హృదయశకలాలు.
 
అకస్మాత్తుగా నడిరాత్రి బాధ నా మీద విరుచుకుపడుతుంది
ఎవరికి చెప్పుకోను? ఆ నొప్పి నా చేతులకు తగుల్తుంది.
 
రోజులు గడిచే కొద్దీ, వాళ్ళు దూరమయ్యేకొద్దీ, ఆ తలపులే.
నా కన్నతల్లికోసం బెంగపెట్టుకుంటాను, ఆపుకోలేని దిగులు.
 
మా అమ్మ పోయిందయ్యా! ఇప్పుడు నన్నెవరు ఊరడిస్తారు?
నా మీద నా జాలి చూసి నా గుండె కూడా మూగబోతుంది.
 
నీలాకాశం వైపు చేతులు జోడిస్తాను, నింగి మౌనం వహిస్తుంది.
కన్నీళ్ళ వర్షానికి నిట్టూర్పుల మబ్బులు తోడునిలుస్తాయి.
 
ఈ దుఃఖాన్ని విదిలించుకుంటానా, వెంటనే వెనక్కివచ్చేస్తుంది
ఇది నా గుండెని తెంపుతుందే తప్ప, నేను దీన్ని తెంపలేను.
 
5-3-2022
 
 
 

Leave a Reply

%d bloggers like this: