మూడేళ్ళ కిందట న్యూ యార్క్ టైమ్స్ లో Why Are We Living in a Golden Age of Historical Fiction? అనే ఒక వ్యాసం రాస్తూ ఒక విమర్శకురాలు 21 వ శతాబ్దంలో మూడో దశకం మొదలయ్యేటప్పటికి మన రచయితలు భవిష్యత్తులోకి చూడటం వదిలిపెట్టి గతంలోకి చూడటం మొదలుపెట్టారని వివరించింది.
ఈ సరికొత్త చారిత్రిక సాహిత్యం 19, 20 శతాబ్దాల్లో వచ్చిన సాహిత్యం లాంటిది కాదు. చరిత్రను సాహిత్యంగా మార్చినప్పుడు దాదాపుగా అన్ని దేశాల్లోనూ, అన్ని జాతుల్లోనూ మొదటి లక్ష్యం ఒకటే: తమ గతం గురించీ, తమ జాతి గురించీ గర్వంగా చెప్పుకోవడమే అప్పట్లో ఆ రచనల ప్రధాన ప్రయోజనం. కాని ఇప్పుడు గతం ఎంత గొప్పదని కాదు, రచయితలు చరిత్ర వైపు చూస్తున్నది. ఇప్పుడు మన చుట్టూ సంభవిస్తున్న తప్పొప్పుల మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోడానికీ, ఈ రోజు మనం చేస్తున్న పొరపాట్లు ఇప్పుడు కొత్తగా తలెత్తినవి కావనీ, వీటి మూలాలు మన గతంలోనూ, ఆ గతం గురించి మనం చెప్పుకుంటూ వస్తున్న కథల్లోనూ ఉన్నాయని గుర్తుపట్టడమే ఈ కొత్త చారిత్రిక సాహిత్యం ప్రయోజనం. ఒకప్పుడు వామపక్ష ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలూ బలంగా ఉన్న కాలంలో రచయితలు భవిష్యత్తు వైపు చూసేవారు. అది ఒక age of utopia. కాని ఇప్పుడు మనం age of dystopia లో జీవిస్తున్నాం. వాస్తవికత అంటే ఒకప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పడం. కాని ఇప్పుడు మన చుట్టూ మీడియా (ప్రింటు, విజువల్, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం) లేనిదాన్ని ఉన్నట్టుగా అత్యంత విశ్వసనీయంగా చెప్పడం మొదలుపెట్టాక, fiction ని fact గా చూపించడం మొదలుపెట్టాక, రచయితలకి మిగిలిన గత్యంతరం fact ని fiction గా తీర్చిదిద్దడమే.
చరిత్రని సాహిత్యంగా మార్చడమంటే రెండు విధాలు: చారిత్రిక కల్పన, కాల్పనిక చరిత్ర. ఇది వట్టి ఊహాగానం మీద సాధ్యమయ్యేది కాదు. అపారమైన పరిశోధన, పరిజ్ఞానం తప్పనిసరి. కాని వాటికన్నా ముందు చెప్పలేనంత ఆవేదన హృదయంలో గూడుకట్టుకుని ఉండాలి. ఒకప్పుడు టాల్ స్టాయి ఒక్కడే ఇట్లాంటి పని చేయగలిగాడు. కాని ఇప్పుడు ఎందరో రచయితలు అద్భుతమైన చారిత్రికకల్పనా సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. ఉదాహరణకి 2018 లో సాహిత్యానికి నోబెల్ బహుమతి లభించిన ఓల్గా తోకార్ చుక్ సంగతే తీసుకోండి. ఆమె 2014 లో రాసిన Books of Jacob కి ఆ పురస్కారాన్నిస్తూ స్వీడిష్ కమిటీ తాము ఆ నవల చదివి ముగ్ధులమైపోయామని చెప్పింది. ఆ నవల ఇంగ్లిషు అనువాదం కోసం అప్పణ్ణుంచీ ప్రపంచమంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూసింది. పోయిన ఏడాది నవంబరులో ఆ ఇంగ్లిషు అనువాదం రాగానే ఆ అనువాదానికే మరొక అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది.
సాధారణంగా తెలుగు సాహిత్యం ప్రపంచ పవనాలకు రెండు మూడు దశాబ్దాల దూరంలో ఉంటుంది. కాని ఆశ్చర్యం, ఈసారి, దాదాపుగా ప్రపంచమూ, తెలుగు సాహిత్యమూ కలిసి నడుస్తున్నాయా అనిపించేట్టుగా తెలుగు కథకులు కూడా చారిత్రిక కల్పన మీద ఆధారపడ్డ కథలతో ‘కాలయంత్రం 2020’ కథల సంకలనం వెలువరించారు. దాని వెనక స్ఫూర్తి సాయి పాపినేని. ఆయనా, ఈమని శివనాగిరెడ్డి గార్లు 2020 లో విజయవాడలో చరిత్ర కథకులతో ఒక వర్క్ షాప్ నిర్వహించారు. అందులో చరిత్రని సాహిత్యంగా మలచవలసిన అవసరం గురించి, అలా మలచడానికి అవసరమైన మెలకువలగురించి రచయితలకు నూరిపోసారు. వారిని ప్రోత్సహించారు. వారు రాసిన కథల్ని చదివి వారు కోరుకున్న నిర్ధిష్టత వచ్చేదాకా మళ్ళీ మళ్ళీ రాయించారు. దాని ఫలితమే 15 కథలతో వెలువడ్డ ‘కాలయంత్రం 2020’. ఆ కథలు తెలుగు కథానికా చరిత్రలో ఒక మైలు రాయి, ఒక మలుపు రాయి అని చెప్పగలను. ఆ కథలు ఒక వైపు, ఆ కథల చారిత్రిక నేపథ్యాన్ని వివరిస్తూ సాయి పాపినేని ప్రతి ఒక్క కథకూ రాసిన చారిత్రిక నేపథ్యం మరొకవైపూ ఆ సంకలనాన్ని విశిష్ట గ్రంథంగా తీర్చిదిద్దాయి.
దానికి కొనసాగింపుగా మరొక కార్యశిబిరాన్ని మొన్న 5, 6 తేదీల్లో సాయి పాపినేని హైదరాబాదులో నిర్వహించారు. తారామతి-బారాదరిలో నడిపిన ఆ శిబిరంలో దాదాపు నలభై మంది రచయితలు పాల్గొన్నారు. ఎన్నో అంశాల మీద మాట్లాడుకున్నారు. కాలయంత్రం మొదటి సంపుటంలోని కథల్ని నిశితపరీక్షకు పెట్టారు. చరిత్రని కథలుగా ఎలా చెప్పాలో, ఎందుకు చెప్పాలో మరింత లోతుగా, మరింత తీవ్రంగా చర్చించుకున్నారు.
ఆ సందర్భంగా చరిత్ర కథా రూపాలు ఎన్ని రకాలుగా ఉండవచ్చో చెప్పమని సాయి పాపినేని గారు నన్నడిగారు. ఉదాహరణలు కూడా చెప్పమన్నారు. నేను నా ప్రసంగంలో ఇప్పుడు చరిత్ర రచన మరొకసారి సాహిత్యవేదిక పైన అగ్రస్థానంలో నిలబడిందని చెప్తూ అలా ఎందుకు నిలబడుతున్నదో కూడా వివరించాను. చరిత్రను కథగా చెప్తున్నప్పుడు సాంప్రదాయికమైన కథాశిల్పంతో పాటు ఎన్నో ప్రత్యామ్నాయ ప్రయోగాల్ని కూడా రచయితలు చేపట్టవచ్చునని చెప్పాను.
ఉదాహరణకి సెర్బియన్ రచయిత Milorad Pavic రాసిన The Dictionary of Khazhars (1984). ఆ నవలలో ఖజర్లు అనే ఒక కల్పిత తెగ కథని రచయిత ఒక నిఘంటువు రూపంలో చెప్పుకొస్తాడు. ఆ శిల్పం నన్ను నిశ్చేష్టుణ్ణి చేసింది. అలాగే 2019 కి గాను నోబెల్ పురస్కారం పొందిన Peter Handke సుప్రసిద్ధ రచన A Sorrow Beyond Dreams (1972) ని ఆత్మకథనాత్మక జ్ఞాపకాల రూపంలో రాస్తాడు. రచయితలు fact ని fiction గా మార్చాలనుకున్నప్పుడు, ఎన్నో కథారూపాలు స్ఫురిస్తున్నాయి. సగం సగం అక్షరాలు చెరిగిపోయిన ఒక శాసనం, ఇద్దరు రాసుకున్న ఉత్తరప్రత్యుత్తరాల్లో ఒక వైపు మాత్రమే దొరికిన ఉత్తరాలు, పుస్తకం మొత్తం పోయి మిగిలిన పీఠిక, ఒక నావికుడి డైరీ లేదా ఒక నావలో ప్రయాణించిన బొటానికల్ చిత్రకారుడు గీసుకున్న బొమ్మల పుస్తకం, మచిలీపట్నం దగ్గర దొరికిన రోమన్ నాణేల బిందె- ఇటువంటి అవశేషాల ఆధారంగా ప్రయోగాత్మకంగా కథలు రాయవచ్చునని సూచించాను. పారబుల్, ప్రహేళిక, చిక్కుప్రశ్న లాంటి కథా రూపాల్ని కూడా వాడుకోవచ్చని చెప్పాను. చరిత్రను కథగా రాయడానికి చారిత్రిక పరిజ్ఞానం ఉండాలికాని అదొక్కటే సాహిత్యంగా మారదని కూడా చెప్పాను. ఎందుకంటే చరిత్రని మనం ఏదో ఒకటి ‘తెలుసుకోడానికి’ చదువుతాం. కాని చారిత్రిక సాహిత్యాన్ని ఏదో ఒకటి ‘ఫీల్’ చెందటానికి చదువుతాం. కాలయంత్రం మొదటి కథాసంపుటంలో ప్రతి ఒక్క కథా అటువంటి ‘ఫీల్’ని ఇవ్వడంలో కృతకృత్యమయిందనే చెప్పాలి.
ఇప్పుడు ఈ రెండు రోజుల కార్యశిబిరం తెలుగు కథాచరిత్రను మరొక మలుపు తిప్పగలదని నమ్ముతున్నాను.
8-3-2022