
దాదాపు ఒక శతాబ్ద కాలంపాటు మనమధ్య జీవించిన ఒక యోగీశ్వరుడు మననుంచి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుంది? చెప్పడం కష్టం. పొద్దున్నే నవనవలాడుతున్న తామరపువ్వుని బుద్ధుడి చరణాల దగ్గర సమర్పించినప్పుడు, సాయంకాలానికి, ఆ పువ్వు రేకలు వాడినప్పటికీ ఆ పరిమళం ఆ చరణాలను మౌనంగా అంటిపెట్టుకున్నట్టుగా, ఆ యోగీశ్వరుడి ప్రార్థనలు మననింకా అంటిపెట్టుకుని ఉంటాయనుకుంటాను. జీవించినంతకాలం తన కోసమూ, మనకోసమూ అతడు రాసుకున్న రాతలు, వేసుకున్న ప్రశ్నలు, చెప్పుకున్న సమాధానాలు మనదగ్గరే వదిలిపెట్టి వెళ్ళాడు కాబట్టి, ఆ సాహిత్యమంతా ఒక శేష వస్త్రంగా ఈ ప్రపంచం భుజాలమీద నిండుగా కప్పి సెలవు తీసుకున్నాడనుకోవచ్చు.
థిచ్ నాట్ హన్ కొన్ని కథలు కూడా రాసాడు. చిన్నపిల్లలకోసం కొన్ని అద్భుతకథలు కూడా రాసాడు. 1942-47 మధ్యకాలంలో వియత్నాం అంతర్యుద్ధంలో కూరుకుపోయి ఉన్నప్పుడు ఆయన తన సన్న్యాసదీక్షతీసుకున్నప్పటి తొలి రోజుల గురించి కొన్ని అపురూపమైన కథలు రాసాడు. My Masters Robe: Memories of a Novice Monk (2002) అనే పుస్తకంలో పొందుపరిచిన పది కథలూ ఏదో ఒక అతీత కాలానికి చెందిన కథల్లాగా అనిపిస్తాయి. పూర్వకాలపు ఋష్యాశ్రమాల్లోనో, తపోవనాల్లోనో, గురుకులాల్లోనో మాత్రమే కనవచ్చే గురుశిష్య అనుబంధం, సహవిద్యార్థుల బాంధవ్యం, నిరాడంబరమైన జీవితం, భగవత్సేవ తప్ప మరేదీ ముఖ్యంగా కనిపించని ఒక జిజ్ఞాస-ఆ కథలు చదువుతున్నప్పుడు ఆయన తన తదనంతర జీవితంలో సుదీర్ఘకాలం పాటు స్థిరంగా, దృఢంగా చెయ్యగలిగిన పనులకు పునాది ఆ చిన్నవయసులోనే పడిందని అర్థమవుతుంది.
ఈ రోజు ఆయనకి నివాళిగా, అందులోంచి ఒక కథని మీకు అందిస్తున్నాను. ఒకప్పుడు కలాం రచనలు చదివినప్పుడు కూడా ఇలాగే అనువదించకుండా ఉండలేకపోయాను. గాంధీ, కలాం, తిచ్ నాట్ హన్- ఇటువంటి వాళ్ళల్లో నాకు కనబడే ప్రత్యేకత ఏమిటంటే వీళ్ళు చాలా సాధారణమైన మనుషులు. మీకూ నాకూ అంతకన్నా ఎంతో విలువైన అనుభవాలు జీవితంలో ఎన్నో లభించాయి. కాని వారు తమకి లభించిన ప్రతి ఒక్క అనుభవం పట్లా ఎంతో కృతజ్ఞులుగా ఉన్నారు. జీవితం తమకు ప్రసాదించిన ప్రతి ఒక్క వరదానానికీ తాము తిరిగి ఎంతో కొంత ఇవ్వాలనే జీవితమంతా తపిస్తూ వచ్చారు. ఆ తపననే వాళ్ళని తపస్వులుగా మార్చింది.
చదవండి ఈ కథ. ఇది చదివిన తర్వాత, మీ జీవితాల్లో, బాల్యంలోనో, కౌమారంలోనో, నవయవ్వనంలోనో మీమీద ఇట్లా తమ ఆశీర్వాదాన్ని వర్షించిన మహనీయులు, మీ తల్లిదండ్రులో, అక్కచెల్లెళ్ళో, అన్నదమ్ములో, తొలిఉపాధ్యాయులో ఎవరో ఒకరు ఉండి ఉంటారు. వారిని ఒక్కసారి మనసారా స్మరించండి.
~
శేష వస్త్రం
ఏళ్ళు గడిచినా వాటి వన్నె తగ్గనివి కొన్ని ఉంటాయి. నా దగ్గర పాతబడ్డ వస్త్రమొకటి ఉంది. వెలిసిపోయింది, చిరుగులుపడ్డది కూడా. అయినా నా వస్త్రాలన్నిటిలోనూ దాన్నే ఎక్కువ మన్నన చేస్తాను. నా మిత్రులప్పుడప్పుడు నన్ను ఎగతాళి పట్టిస్తుంటారు ‘అదిగో, నీ ముప్పై ఏడు జన్మల కాషాయవస్త్రం’ అంటూంటారు. కాని అది నాకెప్పుడూ పాతపడ్డట్టుగానీ, పాడైనట్టుగానీ అనిపించదు.
బావో కువోక్ దేవాలయంలో నేను బౌద్ధ ధర్మాన్ని అభ్యసించినన్నాళ్ళూ ఆ వస్త్రాన్ని ఎంతో ఇష్టంతో కప్పుకుంటూ ఉండేవాణ్ణి. నేను బౌద్ధ ధర్మ వ్రతదీక్ష తీసుకునే రోజున నా గురువు నాకా వస్త్రం బహూకరించాడు. ఇప్పుడది బాగా చిరుగులుపట్టిపోయి నేనింకెంతమాత్రం వేసుకునే పరిస్థితిలో లేదుగానీ, నేనొక బౌద్ధ విద్యార్థిగా ఉన్నప్పటి రోజుల జ్ఞాపకంగా అది నాకెప్పటికీ విలువైనదే.
నేను కూడా దేవాలయంలో ఒక బౌద్ధ విద్యార్థిగా ప్రవేశాన్ని కోరుకునేనాటికి అప్పటికే అక్కడ ముప్పై మందిదాకా సంఘసభ్యులున్నారు. వాళ్ళల్లో చాలామంది ఎన్నో ఏళ్ళుగా సాధన చేస్తూవున్నారు. మాలో కొత్తగా చేరినవాళ్ళం ముగ్గురం మాత్రమే. సోదరుడు తామ్ మాన్ నేను చేరిన మరో ఏడాది తర్వాత చేరాడు. అతడితో కలిపి నలుగురం. మేమంతా కలిసి చదువుకునేవాళ్ళం, కలిసి పనిచేసుకునేవాళ్ళం. మేము సాధనలో చేరి మరీ కొద్దికాలమే అయినందువల్ల చెయ్యవలసిన పని కూడా చాలా ఎక్కువగా ఉండేది. మా విద్యాభ్యాసంలో మొదటి ఏడాది మేము దైనందిన ప్రార్థనలూ నియమావళీ పఠించేవాళ్ళం. తర్వాత ఏడాది ప్రసిద్ధ బౌద్ధ ధర్మ సూక్తాలూ, వాటిమీద వ్యాఖ్యానాలూ అధ్యయనం చేయవలసి ఉండేది. మూడో ఏడాది గడిచేటప్పటికి, మా నలుగురిలోనూ, నేనూ సోదరుడు మాన్ మా చదువులో ముందంజ వేసాం. తొందరలోనే మా చదువుల్లో ఉత్తీర్ణులమవుతామని అనుకుంటూ ఉండేవాళ్ళం. అలా ఉత్తీర్ణులయినవారికి బౌద్ధ సన్యాసిగా జీవించే అనుగ్రహం లభిస్తుంది. మేమొక గొప్ప విజయం కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఆ రోజు కోసం ఎదురు చూస్తూండేవాళ్ళం. నా వరకూ అయితే, ఒక విద్యార్థినో లేదా పండితుడో ఏళ్ళ తరబడి చదువుసాగించిన తరువాత పరీక్షాఫలితాల కోసం ఎదురుచూస్తున్నదానికన్నా ఎక్కువగా ఉండింది ఆ ప్రతీక్ష.
ఆ ఘడియ చివరికి రానే వచ్చింది. ఒక సాయంకాలం నేను దేవాలయానికి కట్టెలు మోసుకొస్తూ ఉండగా నా సోదరుడు మాన్ నాకా శుభవార్త చేరవేసాడు. మా సంఘజ్యేష్టుడు, నా ఉపాధ్యాయుడు, నన్ను సన్న్యాస దీక్షకు స్వయంగా ఎంపిక చేసి బావో కువోక్ లో ఉన్న బౌద్ధ అధ్యయన సంస్థకు పంపించబోతున్నాడని చెప్పాడు. అది కూడా నన్నొకణ్ణే. ఎందుకంటే అక్కడున్నవాళ్ళందరిలో యుక్తవయస్కుణ్ణీ, ఆ చదువులు కొనసాగించడానికి తగిన అర్హత ఉన్నవాణ్ణి నేనొక్కణ్ణే. సోదరుడు మాన్ కూడా అర్హుడే గాని, అతడు నా కన్నా ఇంకా రెండేళ్ళు చిన్నవాడు కాబట్టి, సన్న్యాస దీక్షకు ఇంకా సమయం సరిపోయినవాడు కాడు.
నా సంతోషంలో నా యవ్వనోద్రేకమంతా ఉంది. ఒక్కసారిగా నేను పెద్దవాణ్ణయిపోయినట్టుగానూ, ఎంతో ముఖ్యుణ్ణైపోయినట్టుగానూ అనిపించింది. నా సంతోషంలో సోదరుడు మాన్ కూడా పాలుపంచుకున్నాడు. బౌద్ధ ధర్మ అధ్యయన సంస్థలో విద్యాసంవత్సరం మొదలయ్యే రోజు తొందరగా సమీపిస్తున్నది. అందుకు నేనేమి చెయ్యవలసి ఉంటుందో నేనూ, సోదరుడూ ప్రతి ఒక్కటీ వివరంగా మాట్లాడుకున్నాం. ఇక ఆ దీక్షా ఉత్సవానికి సంబంధించి చెయ్యవలసిన పనులుంటే సంఘపెద్దలు చూసుకుంటారు. నేను చెయ్యవలసిందల్లా వినయపిటకంలో నాలుగు అధ్యాయాలు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవడమే. ఆ రోజుకి కావలసిన పువ్వులూ, పళ్ళూ, సాంబ్రాణీ వంటివి కొనుక్కోడానికి కొంత సొమ్ముకోసం ఇంటికి ఉత్తరం రాయాలనుకున్నాను. నేను దీక్ష స్వీకరించేరోజు బుద్ధుడికి పూజ చెయ్యడానికి ఆ సామగ్రి అవసరం. నేను శ్రమణ జీవీతంలో అడుగుపెట్టే ఆ ముఖ్యమైన రోజున సంఘసభ్యులందరికీ పాయసం వండిపెట్టాలని కూడా అనుకున్నారు. కాని మా ఊరు అక్కడికి చాలా దూరంలో ఉండటంతో తీరా ఆ సమయానికి సొమ్ము చేతికి అందుతుందో లేదో అని అనుకున్నాను. కాని సంఘం బాధ్యతలు చూసే సోదరి టూ నా భయాలు విని చిరునవ్వేసింది. ‘తమ్ముళ్ళూ దానికేముంది? ఉత్తరమైతే రాయండి. సొమ్ము సకాలంలో చేతికి అందకపోతే, నాదగ్గరున్న పైకంలోంచి కర్చుచేస్తాను. ఆ డబ్బు వచ్చేక తిరిగి తీర్చెయ్యండి ‘అన్నది.
సోదరి అట్లా అభయమిచ్చాక ఇక మిగిలిన పని నా గుడ్డలు సర్దుకోవటమొక్కటే. నా ట్రంకుపెట్టెలో పెట్టడానికి తమ్ముడు మాన్ బంగారురంగు వెండి రంగు కాగితాలు పట్టుకొచ్చేడు. ఎక్కడో దూరప్రాంతాలనుంచి దేవాలయానికి వచ్చిన యాత్రీకులు తెచ్చిన కాగితాలవి. ఆ కాగితాలని అట్లా పారేయకుండా వాటిని భద్రపరుచుకుంటే వాటిమీద సూత్రాలు రాసుకోవచ్చని నా ఉపాధ్యాయుడు చెప్పాడు. గత కొన్నేళ్ళుగా మేము సూత్రాల్ని రాసుకోడానికి ఆ కాగితాలే వాడుకుంటూ ఉన్నాం. బహుశా నేను వెళ్ళబోయే చోట నాకు తగినన్ని కాగితాలు దొరకవేమో అన్న ఉద్దేశ్యంతో తమ్ముడు ఆ కాగితాల బొత్తి ఒకటి ఆ ట్రంకుపెట్టెలో ఒక మూల కుక్కిపెట్టాడు.
మర్నాడు తెల్లవారు జాము నాలుగింటికి నా దీక్షా స్వీకారానికి ముహూర్తం నిర్ణయించారు. ఆ రాత్రి సంఘసభ్యులు జపతపాలు ముగించేక, నా గురువు తన గదిలో ఒక బొంతమీద కూచుని కనబడ్డాడు. ఆయన పక్క ఒక కొవ్వొత్తి రెపరెపలాడుతున్నది. పక్కన బల్లమీద బౌద్ధ గ్రంథాల తాళపత్రాలు పోగుపడి ఉన్నాయి. ఆయన ఒక పాత కపిల వర్ణపు వస్త్రానికి అతుకులు కుడుతూ వున్నారు. వయసు వాటారినప్పటికీ ఆయన స్థిరంగా కూచోగలుగుతున్నారు. కంటిచూపులో స్థిరత్వం పక్కకు పోలేదు. నేనూ తమ్ముడూ ఆ గది గుమ్మందగ్గరే ఆగి ఆయన్ని చూస్తూ ఉన్నాం. ఆ వస్త్రంలోంచి సూదిని నెమ్మదిగా బయటకు లాగుతున్నప్పుడల్లా నా ఉపాధ్యాయుడు ప్రగాఢధ్యానంలో మునిగిఉన్న బోధిసత్త్వుడిలాగా కనిపిస్తున్నాడు.
కొంతసేపటికి మేమా గదిలో అడుగుపెట్టాం. మా ఉపాధ్యాయుడు మాకేసి తలెత్తి చూసాడు. మమ్మల్ని చూస్తూ ఆదరంగా తలపంకించాడేగాని ఆయన తన కుట్టుపనిలోనే నిమగ్నుడిగా ఉన్నాడు. ఆయన్ని తమ్ముడు మాన్ ‘ ఆచార్యా, బాగా పొద్దుపోయింది, ఇంక మీరు విశ్రాంతి తీసుకోండి’ అన్నాడు.
కాని మా ఉపాధ్యాయుడు తల పైకెత్తలేదు. ‘ ఇది ఇవ్వాళే పూర్తిచేసెయ్యాలి. ఎందుకంటే కువాన్ రేప్పొద్దున్న ఈ వస్త్రాన్ని ధరించాలి కదా ‘అన్నాడు.
ఆ మధ్యాహ్నమంతా నా గురువు తన పాతగుడ్డల్నీ ముందేసుకుని ఎందుకు కూచున్నాడో అప్పుడు నాకు అర్థమయింది. తన దగ్గరున్న వస్త్రాలన్నిటిలో మరీ చిరుగులుపట్టని ఒక వస్త్రంకోసం ఆయన వెతుకుతూ ఉన్నాడన్నమాట. దాన్ని నాకు బహూకరించాలని అనుకున్నాడన్నమాట. రేపు పొద్దున్న జీవితంలో మొదటిసారి నేనొక కపిల వస్త్రాన్ని ధరించబోతున్నాను. గడచిన మూడేళ్ళుగా మమ్మల్ని బూడిదరంగు వస్త్రాలు మాత్రమే ధరించనిచ్చారు. ఇక రేపణ్ణుంచి నేను ఆ కపిల వస్త్రాన్ని ధరించగలుగుతాను. శాస్త్రాలు ఆ వస్త్రాన్నే కదా పరిత్యాగ వస్త్రమనీ, ముముక్షువస్త్రమనీ, స్వేచ్ఛా వస్త్రమనీ పిలిచాయి!
కంపించిపోతున్న గొంతుతో నేను సాహసం చేసి అన్నాను కదా ‘ఆచార్యా, కుట్టడం ఇంకేదైనా మిగిలిపోతే, సోదరి ని అడుగుతాము, ఆమె కుట్టిపెడుతుంది ‘అని.
‘లేదు. లేదు, ఈ వస్త్రాన్ని నా చేతుల్తో నేనే నీ కోసం సిద్ధం చేయాలి ‘అన్నాడు ఆయన మృదువుగా, స్థిరంగా.
కొన్ని క్షణాల నిశ్శబ్దం.
వినయపూర్వకంగా చేతులు కట్టుకుని మేమో పక్కన ఒద్దిగ్గా నిల్చొన్నాం. మరొక మాట మాట్లాడటానికి కూడా ధైర్యం లేకుండా. కొంతసేపు తర్వాత మా ఉపాధ్యాయుడు తన చేతుల్లో ఉన్న సూదిమీంచి చూపులు పక్కకు తిప్పకుండానే,
‘బుద్ధుడి కాలంలో కేవలం గుడ్డలు కుట్టుకుంటూ జ్ఞానోదయం పొందిన శిష్యుడి కథ విన్నారా మీరు?’ అనడిగాడు.
‘ఆ కథ చెప్తాను వినండి’ అంటో కొనసాగించాడు. ‘ఆ శిష్యుడికి పాతగుడ్డలు కుట్టిపెట్టడంలోనూ, అతుకులు వెయ్యడంలోనూ గొప్ప సంతోషం ఉండేది. అతడు తన గుడ్డలు మాత్రమే కాదు, తక్కిన సంఘ సభ్యుల గుడ్డలు కూడా అట్లానే కుట్టిపెట్టేవాడు. వస్త్రంలోంచి సూది పైకి లాగిన ప్రతిసారీ అతడు మనుషుల్ని విముక్తి పరచగల గొప్ప సంతోషాన్ని దేన్నో పైకి లేవనెత్తుతున్నట్టుండేవాడు. ఒకనాడు అట్లా వస్త్రంగుండా సూది పోతూ ఉండగానే అతడేదో గొప్ప బోధన ఒకదాన్ని లోతుగా, అద్భుతంగా అర్థం చేసుకున్నాడు. అంతే, ఆ తరువాత, ఆరుకుట్లు వేసేటప్పటికి ఆరు సిద్ధులు అతడికి వశమైపోయాయి.’
నేను నా ఉపాధ్యాయుణ్ణి చూసాను. గొప్ప ఆరాధనతోనూ, అభిమానంతోనూ చూసానాయన్ని. ఆయనకి ఆ ఆరుసిద్ధులూ వశమైఉండకపోవచ్చుగాని, మేము వాటిని సాధించాలంటే ఎంతకాలం పడుతుందో తెలిసినవాడిలానే అనిపించేడు.
చివరికి ఆ వస్త్రం కుట్టడం పూర్తయింది. నా గురువు నన్ను తన దగ్గరికి రమ్మని సైగ చేసాడు. ఆ వస్త్రాన్ని ధరించి చూడమన్నాడు. ఆ వస్త్రం నాకుకొద్దిగా వదులైనప్పటికీ, దాన్ని ధరించినప్పుడు సంతోషంతో నా కళ్ళమ్మట నీళ్ళు కారడం ఆగలేదు. నేను విచలితుణ్ణైనాను. సాధన మార్గంలో నాకు అత్యంత పవిత్రమైన ప్రేమ కానుక లభించింది. ఆ ప్రేమ ఎంతో నిర్మలమైందీ, ఉదారమైందీను. ఆ తర్వాత బహుసంవత్సరాల పాటు నా శిక్షణనీ, సాధననీ ఆ ప్రేమ తన పరిమళంతో పెంచిపోషిస్తూనే ఉంది.
నా గురువు ఆ వస్త్రాన్ని నా చేతుల్లో పెట్టాడు. సున్నితమైన హృదయంతోనూ, అపారమైన వివేకంతోనూ ఆయన నాకు అందిస్తున్న ప్రోత్సాహంగా అర్థమయింది అది నాకు. అప్పుడు నా గురు కంఠస్వరం లాంటి అత్యంత మృదువైన, అత్యంత మధురమైన కంఠస్వరం నా జీవితంలో మరెప్పుడూ నేను వినలేదు.
‘ఇది నువ్వు రేపు వేసుకోవాలని బిడ్డా, ఈ రోజు నేను నా చేతుల్తో సిద్ధం చేసాను.’
చాలా మామూలు వాక్యం. కాని ఆ మాటలు వినగానే నేను నిలువెల్లా చలించిపోయాను. నిజానికి అప్పుడు నా శరీరం బుద్ధ భగవానుడిముందు సాష్టాంగం చేస్తూ ఉండకపోయినప్పటికీ, లోకంలోని జీవులన్నిటికీ తోడుగా నిలబడతాననే మంత్రమేదీ నేను జపించకపోతున్నప్పటికీ, నా హృదయం మాత్రం ఆ క్షణాన్నే ఒక జీవితకాలపు సేవాధర్మానికి సంబంధించిన పూర్తి దీక్షాస్వీకారం పూర్తిచేసుకుంది. నా తమ్ముడు మాన్ నన్ను హృదయపూర్వకమైన ఆదరాభిమానాలతో పరికిస్తూ ఉన్నాడు. ఆ క్షణాన ఈ సమస్త విశ్వం మాకు నిండుగా పూసిన పరిమళ భరిత పుష్పాల ప్రపంచంగా గోచరించింది.
ఆ తర్వాత మరెన్నో వస్త్రాలు నాకు జీవితంలో లభించాయి. అట్లా కొత్త వస్త్రాలు వచ్చినప్పుడల్లా కొన్నాళ్లపాటు వాటి మీద దృష్టి ఉండేది కానీ మరి కొన్నాళ్ళకు అవి మరుగున పడిపోయేవి. కానీ ఒకప్పటి నా జీవితానికి చెందిన చిరుగులు పడి పాతబడ్డ ఈ వస్త్రం మాత్రం నాకు ఎప్పటికీ అత్యంత పవిత్రమైన వస్త్రంగానే మిగిలిపోయింది. గతంలో నేను ఎప్పుడు ఈ వస్త్రాన్ని ధరించినా నా గురువు గుర్తొస్తూనే ఉండేవాడు. ఇప్పుడు కూడా ఈరోజు ఈ వస్త్రం ధరించడానికి వీలు కాకపోయినా దీని చేతుల్లోకి తీసుకుంటే చాలు గడిచిపోయిన రోజుల పరిమళం నన్నొక్కసారిగా ముంచెత్తుతుంది.
24-1-2022
పరిమళం వ్యాప్తి చెందించారు. ధన్యవాదాలు.