వలయం పూర్తయింది

పడాల వీరభద్రరావు గారు అల్లూరి సీతారామరాజు జాతీయ యువజనసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన తండ్రి పడాల రామారావు రచయిత, నాటకకర్త. సీతారామరాజు జీవితచరిత్రని నాటకంగా మొదటి మలిచింది ఆయనే. ఇప్పుడు సీతారామరాజు పేరు మీద ప్రచారంలో ఉన్న నెరేటివ్ ఆయన రూపొందించిందే. ఆయన ‘విప్లవ మహాయుగం 1757-1947’ అనే ఒక పుస్తకం కూడా రాసాడు. భారత స్వాతంత్య్రపోరాటంలో అంతగా గుర్తింపుకునోచుకోని ఎందరో విప్లవవీరుల గురించిన కథనం అది. నా హైస్కూల్లో రోజుల్లో అది నాకు పారాయణ గ్రంథం.

తమ సంఘం తరఫున మంప గ్రామం దగ్గర సీతారామరాజు విగ్రహం ప్రతిష్టించబోతున్నామనీ, ఆ సందర్భంగా జరుగుతున్న భూమిపూజలో నన్ను కూడా పాలుపంచుకొమ్మని ఆహ్వానిస్తే పోయిన ఆదివారం మంప వెళ్ళాను.

మంప విశాఖపట్టణం జిల్లా అడవుల్లో ఒక మారుమూల గిరిజన గ్రామం. కొయ్యూరు మండలంలో తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లా సరిహద్దులు కలిసే చోట దట్టమైన అడవుల్లో నెలకొన్న గ్రామం. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి మాఘమాసపు ఎండలో అడవి అంతా మిలమిలమెరుస్తూ ఉంది. గాలంతా మామిడిపూల సుగంధం అల్లుకుపోయి ఉంది. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీతారామరాజు పార్కు దగ్గర అప్పటికే కొయ్యూరు, రాజవొమ్మంగి మండలాలకు చెందిన ఎందతో గిరిజనులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా చేరుకుని ఉన్నారు. ఆ పార్క్ వెనక ఉన్న చెరువు దగ్గర విగ్రహం నెలకొల్పడం కోసం జరుపుతున్న వేడుకలో వారంతా భాగస్వాములు.

ఆ చెరువు నిండా తామరపూలు పూసి ఉన్నాయి. లోపల చాలామేరకు పూడు పడి, తుంగ పెరిగి ఉన్నా కూడా చెరువు నీళ్ళు నిర్మలంగానూ, పూల కాంతితోనూ ప్రకాశిస్తూ ఉన్నాయి. దాదాపు వందేళ్ళ కింద ఒక దురదృష్టకర ఉదయాన విప్లవవీరుడు తన గాయాల్ని కడుక్కోడానికి ఆ చెరువు దగ్గర నిలబడ్డాడు. ఆయన ఆ చెరువు దగ్గరకు రాబోతున్నాడన్న వార్త అప్పటికే ఎవరో బ్రిటిష్ పోలీసు బలగాలకు ఉప్పందించారు. ఆయన్ని వారంతా చుట్టుముట్టారు. బంధించారు. ఊళ్ళోంచి ఒక నులకమంచం తెప్పించి ఆయన్ని ఆ మంచానికి కట్టేసారు. అక్కణ్ణుంచి ఆయన్ను నర్సీపట్నం తరలించి విచారణకు హాజరు పరచాలని అనుకున్నారు. కాని ఆ బలగాలకు నాయకత్వం వహిస్తున్న మేజర్ గుడాల్ కు సీతారామరాజుకి అతీంద్రియ శక్తులున్నాయని అనుమానం. తాము ఆయన్ని తరలించే లోపు ఆయన ఎక్కడ తప్పించుకుపోతాడో అని మంప గ్రామం పొలిమేరలు దాటకుండానే అయన్ను ఒక చింతచెట్టుకు కట్టి అక్కడే కాల్చేసాడు. సీతారామరాజు మరణించిన చోటు కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతాన్ని రాజేంద్రపాలెం అని పిలుస్తున్నారు. ఇప్పుడది పెద్ద ఊరుగా మారింది. ఆ తర్వాత ఆ కళేబరాన్ని తీసుకుపోయి కృష్ణదేవి పేట ఏటి ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు ఆ ఏటి ఒడ్డున ఆయన సమాధితోపాటు గాము గంటం దొర సమాధి కూడా ఉంది. ఆ సమాధులతో పాటు ఒక స్మారకమందిరం, ఉద్యానవనం, రాజు విగ్రహం, వారి తల్లిగారి విగ్రహం కూడా ఉన్నాయి.

1922-24 మధ్యకాలంలో మంప కేంద్రంగా సీతారామరాజు చేపట్టిన తిరుగుబాటులో దాదాపు రెండు వందల మందిదాకా గిరిజనులు పాల్గొన్నారు. సీతారామరాజు మరణించిన తరువాత వారిలో చాలామందిని అరెస్టు చేసి దేశంలోని వివిధ కారాగారాలకు తరలించారు. అత్యధికసంఖ్యలో అండమాన్ కు పంపించారు. అజ్ఞాతులూ, విస్మృతులూ అయిన ఆ స్వాతంత్ర్య వీరుల పేర్లు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. మా అన్నయ్య Vadrevu Sundar Rao వాళ్ళ గురించి గత కొన్నేళ్ళుగా పరిశోధన చేస్తూ ఎందరి వివరాలో సేకరించాడు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు కావొస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అటువంటి స్థానికి కథనాల్నీ, స్థానిక బలిదానాల్నీ వెలుగులోకి తేవాలని ‘గిరిజన స్వాతంత్ర్య యోధుల మూజియం’ ఒకటి భారత ప్రభుత్వం మంజూరు చేసింది. సీతారామ రాజు పోరాటం చేపట్టిన తొలిదశలో లమ్మసింగి ఒక ముఖ్య కార్యస్థానం. అప్పట్లో నర్సీపట్నం నుండి లమ్మసింగికి ఘాట్ రోడ్ నిర్మాణం చేపడుతున్నప్పుడు గిరిజనులకు సరైన కూలీ ఇవ్వకుండా దోచుకోవడం మీద ఆయన గొడవచేసాడు. అందుకని ఆ మూజియంని లమ్మసింగి దగ్గర తాజంగిలో నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

నేను మంప వెళ్ళడానికి ముందురోజు తాజంగి వెళ్ళి ఆ మూజియం ఏర్పాట్లు, ఆ భవనసముదాయ నిర్మాణ ప్రణాళిక వంటివన్నీ పరిశీలించాను. ఆ మర్నాడు అంటే ఆదివారం కృష్ణదేవిపేటలో సీతారామరాజు సమాధి ని సందర్శించి ఆ స్మారకకేంద్రాన్ని మరింత అభివృద్ధి పరచడానికి చేపట్టవలసిన చర్యల గురించి కూడా అక్కడి సిబ్బందితో, స్థానికులతో చర్చించాను.

అక్కణ్ణుంచి మంప వెళ్ళాను. అక్కడ ఆ విగ్రహప్రతిష్టాపనకు సంబంధించిన భూమిపూజలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ పార్కులో పెద్ద సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక మండల పరిషత్తు అధ్యక్షుడు, స్వయానా గిరిజనుడు, అద్భుతమైన ప్రసంగం చేసాడు. అతడు అలా మాట్లాడటం వెనక వందేళ్ళ చరిత్ర ఉందని నేను నా ప్రసంగంలో గుర్తు చేసాను.

సీతారామరాజు అనగానే ఒక సాయుధవీరుడు కళ్ళముందు మెదుల్తాడు. కాని ఆయన చేసిన పోరాటం కేవలం విల్లమ్ములతోనూ, తుపాకులతోనూ మాత్రమే కాదు. ఆయన మీద గాంధీ ప్రభావాన్ని చరిత్రకారులు ఇప్పటికే ఎంతో స్పష్టంగా గుర్తుపట్టారు. ఆయన ప్రధానంగా పోరాడింది మూడు అంశాల మీద: మొదటిది, నీళ్ళు, అడవి, భూమి ( జల్, జంగల్, జమీన్) అనే వనరులమీద స్థానిక గిరిజనులకే అధికారం ఉండాలనేది. రెండవది, గిరిజన ప్రాంతాల్లో పాలనాధికారం, న్యాయపరిష్కారం గిరిజనులకే ఉండాలనేది. మూడవది, ఆర్థిక స్వావలంబన, కనీసవేతనాలు మొదలైనవి. భారతదేశమంతా బ్రిటిష్ వారితో పోరాడిన గిరిజన వీరులు, బిర్సాముండా, రాణి గైడిన్లూ, కొమురం భీం మొదలైనవారిది కూడా దాదాపుగా ఇదే అజెండా. సీతారామరాజు తన అజెండాను దాదాపుగా అమలు చెయ్యగలిగాడు కూడా. 27 ఏళ్ళు నిండకుండానే నేలకొరిగిన ఆ వీరుడు నిరక్షరాస్యులైన ఆ గిరిజనుల్ని ఎట్లా సమీకరించగలిగాడు, ఆ కీకారణ్యాల్లో అటువంటి వ్యూహ రచన ఎలా చేపట్టగలిగాడు, ఈ రోజు దాదాపు మూడు జిల్లాలకు విస్తరించిన ఆ మహారణ్యంలో ఎలా సంచరించగలిగాడు- తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒడలు ఉప్పొంగుతుంది.

నూరేళ్ళ కిందటి ఆ పోరాట లక్ష్యాలు ఇప్పటికే చట్టాలుగా మారాయి. గిరిజనులకు అటవీ హక్కులు కల్పిస్తూ 2006 లో అటవీ హక్కుల చట్టం వచ్చింది. వారికి ఉపాధి కల్పిస్తూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలవుతూ ఉంది. అన్నిటికన్నా ముఖ్యం షెడ్యూలు ప్రాంతాల్లో గిరిజనులకు దాదాపుగా స్వయం నిర్ణయాధికారాన్ని కల్పిస్తూ షెడ్యూలు ప్రాంతాలకి విస్తరించిన పంచాయతీ రాజ్ చట్టం 1996 లో వచ్చింది. కాని, గిరిజన ప్రాంతాల్లో సవాళ్ళు మరింత పెరిగాయే తప్ప తగ్గలేదు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు మరింత మరింతగా చొచ్చుకుపోతూనే ఉన్నారు. వారి భూములు, తోటలు, ఫలసాయం ఏదో ఒక రూపంలో అన్యాక్రాంతం అవుతూనే ఉంది. ఆ రోజు నా ప్రసంగంలో అక్కడి గిరిజనులకు అదే వివరించాను. సీతారామరాజునూ, గిరిజన స్వాతంత్ర్య యోధుల్నీ స్మరించుకోవడమంటే వారి లక్ష్యాల్ని గుర్తుచేసుకోవడం అని. విగ్రహాలు స్ఫూర్తినిస్తాయి నిజమే కాని, విగ్రహారాధన దగ్గరే ఆగిపోకూడదని.

అల్లూరి సీతారామరాజు దాడి చేసిన పోలీసు స్టేషన్లలో రాజవొమ్మంగి కూడా ఒకటి. నేను పుట్టిన ఊరు కృష్ణదేవి పేటకి రాజవొమ్మంగికీ మధ్య ఉంటుంది. సీతారామరాజు తన బృందంతో ఒకరోజు మా ఊళ్ళో కూడా విడిదిచేసాడనీ, మా ఊళ్ళో చింతచెట్టు కింద అన్నం వండుకుని తిన్నారనీ చెప్పుకుంటారు. మా నాన్నగారు మా ఊరితో పాటు మొత్తం తొమ్మది గిరిజన గ్రామాలకి కరణంగా పనిచేసేవారు. గిరిజనుల భూములు గిరిజనేతరులకి అన్యాక్రాంతం అయిన వాటిని విడిపించడం కోసం ఆయన తన జీవితమంతా పోరాడేరు. అందులో భాగంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. గిరిజన ప్రాంతం మొత్తం గిరిజనులదే అని నమ్మినందువల్ల ఆయన బతికున్నంతకాలం తనకై ఒక పెంకుటిల్లు కూడా కట్టుకోలేదు. గ్రామ కరణం అయి ఉండి కూడా ఒక్క సెంటు భూమి కూడా తన సొంతం చేసుకోలేదు. కాని గిరిజనులతో తన బాంధవ్యాన్ని మాత్రం మాకు ఆస్తిగా ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ పోరాటకారుల గురించి రాయవలసిన బాధ్యత మా అన్నయ్యకీ , ఆ గిరిజనుల సంక్షేమ బాధ్యత నా వంతుకీ అప్పగించి వెళ్ళిపోయారనుకుంటాను.

మా అమ్మది కృష్ణదేవి పేట. వాళ్ళ తండ్రి గారి ఇల్లు ఆ ఊళ్ళో ఏటి ఒడ్డునే ఉండేది. నా పసితనంలో ఆమె నన్ను ఊరికి తీసుకువెళ్ళినప్పుడు దూరంగా, ఆ ఏటికి అవతలి ఒడ్డున ఎండలో మిలమిల్లాడుతున్న బోగన్ విల్లై పొదల మధ్య మెరుస్తున్న సమాధుల్ని చూపిస్తూ ఎవరో ‘అవిగో, రాజు గారి గోరీలు ‘ అని అనడం నాకిప్పటికీ గుర్తుంది.

నేను గిరిజన సంక్షేమ శాఖలో చేరడమే కాకుండా నా పదవీ విరమణ ముందు మళ్ళా ఆ శాఖకే రావడం, తిరిగి, లమ్మసింగి, కృష్ణదేవిపేట, రాజేంద్రపాలెం, మంప గ్రామాల్లో సీతారామరాజును స్మరిస్తూ తిరగడం నాకు ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంది.

ఒక వలయం పూర్తయింది.

27-2-2022

Leave a Reply

%d