రోజూ ఒక పండగే

Reading Time: 3 minutes

బిక్కిన భరత కృష్ణమూర్తి ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. ఆయన వేట్లపాలెం గ్రామంలో పనిచేస్తుండేవాడు. వేట్లపాలెం సామర్లకోట నుంచి బిక్కవోలు వెళ్ళే దారిలో ఉన్న పెద్ద గ్రామం. రైతులూ, అన్ని రకాల వృత్తులవాళ్ళూ ఉండే గ్రామం. ఏ విధంగా చూసినా ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆ గ్రామాన్ని ఏ అంశంలోనూ ప్రభావితం చేసే అవకాశం లేదు. అటువంటి ఒక ఉపాధ్యాయుడు ఉన్నడని కూడా ఆ గ్రామంలో ఎక్కువమందికి తెలిసే అవకాశం కూడా లేదు.

1990 లో మాట. ఆయన ఒకరోజు ఊరి మధ్యలో ఉన్న బస్ షెల్టరు మీద అంటించి ఉన్న సినిమా పోస్టర్లు అప్పటికే సగం చిరిగి ఉన్నవాటిని పూర్తిగా చింపేస్తున్నాడు. గోడకి అంటుకున్న కాగితాన్ని గోకి లాగేస్తున్నాడు. ఆయన చేస్తున్న పని ఇద్దరు యువకులకి విచిత్రంగా అనిపించింది. వాళ్ళు కొత్తగా ఉపాధ్యాయులుగా ఉద్యోగంలోకి చేరుకున్నవాళ్ళు. జీవితం రికామీగా, నిష్పూచీగా కనిపించే కాలం. కాని తమకన్నా వయసులో పెద్దవాడైన ఒక ఉపాధ్యాయుడు బడి అయిపోయాక ఆ బస్ షెల్టర్ దగ్గర నిలబడి ఆ సినిమా పోస్టర్లు ఎందుకు చింపుతున్నాడో అర్థం కాలేదు. ఆ మాటే అడిగారు ఆయన్ని.

‘ఆ బొమ్మలు చూడండి. అవి ఆడవాళ్ళూ, పిల్లలూ చూడదగ్గవేనా? బస్సుకోసం ఇక్కడ నిలబడ్డంతసేపూ వాళ్ళు ఆ బొమ్మల్ని చూస్తూ ఎలా నిలబడగలరు? ‘ అన్నాడాయన.

అంతే, ఆ రోజునుంచీ మోరంపూడి వెంకటేశ్వర రావు, వల్లూరి వీరభద్రరావు అనే ఆ ఇద్దరు ఉపాధ్యాయులూ భరతకృష్ణమూర్తిగారి శిష్యులుగా మారిపోయారు. కృష్ణమూర్తి మీద ఏ విధంగా పడిందో గాని వివేకానందుల ప్రభావం పడింది. ఆయన ఆ ప్రభావాన్ని తన సహోద్యోగులైన ఆ ఇద్దరు యువకులకీ కూడా పంచాడు. వాళ్ళు ముగ్గురూ మరికొంత మంది మిత్రులతో కలిసి వేట్లపాలెంలో 1990 జనవరి 12 న శ్రీ వివేకానంద యువజన సంఘం ప్రారంభించారు. త్యాగం, సేవ తమ ఆదర్శాలుగా ఒకరికొకరు చెప్పుకున్నారు. అనతికాలంలోనే రాజమండ్రి లోని రామకృష్ణమఠం స్వామీజీ ఆ సంఘాన్ని సందర్శించారు. వారి కేంద్రానికి శ్రీ రామకృష్ణ ధ్యానమందిరం అని పేరుపెట్టారు.

ముప్పై ఏళ్ళు గడిచాయి.

ఈ రోజు వేట్లపాలెం అంటే శ్రీ రామకృష్ణ ధ్యానమందిరం. ఆ రోజు చిన్న సంఘంగా మొదలైన సంస్థ ఈ రోజు పదవ తరగతి విద్యార్థుల కోసం ఉచితంగా ట్యుటోరియల్ కేంద్రాన్ని నడుపుతున్నది. ఒక కంప్యూటర్ శిక్షణా కేంద్రం, ఒక ఉచిత హోమియోపతి డిస్పెన్సరీ, గ్రంథాలయం, జిమ్ కూడా నడుపుతున్నది. వీటితో పాటు మెడికల్ కాంపులు, వ్యక్తిత్వ వికాస తరగతులు, ఉపకారవేతనాలు, వేసవి తరగతులు, విపత్తుల సమయంలో వివిధ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నది. ప్రతి రోజూ పొద్దున్న, సాయంకాలం గంటన్నరపాటు దాదాపు రెండువందల మంది విద్యార్థులకి ఉచితంగా కోచింగు ఇస్తున్నది. ఆ పిల్లల్లో చాలమంది ఉన్నత విద్యకి వెళ్తున్నారు. కొందరు ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ప్రొఫెషనల్ విద్యలోకి కూడా అడుగుపెడుతున్నారు. కాని అన్నిటికన్నా చెప్పదగ్గ విశేషం ఆ కేంద్రం తమ మీద నెరపిన ఆధ్యాత్మిక ప్రభావానికి ముగ్ధులైన నలుగురు యువకులు సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించి రామకృష్ణమఠంలో ప్రవేశించారు. ఒక గ్రామం నుండి నలుగురు పరివ్రాజకులుగా చేరిన గ్రామం బహుశా భారతదేశంలో అదేనేమో!

ముందు ఒకరు, ఆ తర్వాత ఇద్దరు, ఆ తర్వాత నలుగురు.

నిన్న వేట్లపాలెం శ్రీ రామకృష్ణ ధ్యానమందిరంలో ఆ ఉపాధ్యాయులతోనూ, ఆ పిల్లలతోనూ మాట్లాడుతున్నంతసేపూ చెప్పలేని ఎన్నో భావాలు నా మనసులో కదుల్తూ ఉన్నాయి. దాదాపుగా అరవయ్యేళ్ళుగా ఈ సమాజాన్నీ, ఈ ప్రపంచాన్నీ చూస్తున్నాను. ఇక్కడ సమాజాన్ని సంస్కరించడానికీ, అవసరమైతే సమూలంగా మార్చడానికీ ఎన్నో ఆలోచనలు, ఎన్నో తర్కాలు, ఎన్నో సిద్ధాంతాలు. తమ అసమాన పాండిత్యంతో, విశ్లేషణాబలంతో నన్ను తమ భావజాలం వైపు తిప్పుకోవడానికి గత నలభయ్యేళ్ళుగా ఎందరో ప్రయత్నించారు. ఒక క్షణం వారి వాగ్ధాటికీ, వారి అవగాహనకీ ముగ్ధుణ్ణైనప్పటికీ, వారిలో ఏదో ఒక లోటు నన్ను అడ్డగించేది.

ఎందుకంటే, వాళ్ళ దగ్గర లేనిదీ, కాని నాకు అన్నిటికన్నా ముఖ్యంగా తోచేదీ మరేదో ఉంది. అది తర్కం కాదు. పాండిత్యం కాదు, నిష్ఠుర వాస్తవాల నిశిత విశ్లేషణ కాదు. అన్నిటికన్నా ముందు నీ హృదయం దానికదే, సహజంగా నీ తోటిమనిషి కోసం స్పందిస్తున్నదా? నువ్వు ఏదో ఒకటి తెలుసుకుని, చదువుకుని, ‘చైతన్యవంతుడివై ‘ అప్పుడు ప్రజల కోసం ఆలోచించడం కాదు, ఎవరో ఒకరి పట్ల కోపంతోనో, పగతోనో, ప్రతీకారంతోనో పోరాటానికి పూనుకోవడం కాదు, అసలన్నిటికన్నా ముందు, ఏ కారణం లేకుండానే నీలో ఉద్భవించే, నిన్ను నిలవనివ్వకుండా అశాంతికి గురిచేసే ఆదర్శమేదన్నా నీకు ఉందా?

చలంగారు చెప్తాడు చూడు, మూజింగ్సులో, నువ్వు రోడ్డుమీద వెళ్తున్నావు, ఎదురుగా ఒక పసిపాప- ఇది రోడ్డు అనీ, ఇది ఎడమవైపు , ఇది కుడివైపు అనీ తెలియని ఒక పసిపాప నడుస్తూ ఉన్నది, ఇంతలో ఒక వాహనం అటుగా దూసుకొచ్చింది. క్షణంలో ఆ పసిపాప ఆ వాహనం కింద పడిపోయేదే, కాని నువ్వు చూసావు, ఆ దృశ్యం చూడలేకపోయావు, ఒక్క ఉదుటున ఆ వాహనానికి అడ్డుపడి ఆ పసిపాపను పక్కకు తప్పించావు, ఆ క్రమంలో నీకేమవుతుందో అన్న ధ్యాస లేదు నీకు. ఆమెని ఎలా కాపాడితే బాగుణ్ణన్న తర్కమూ లేదు, మీమాంసా లేదు. ఉన్నదల్లా ఆమెని తక్షణమే కాపాడాలన్న ఒకే ఒక్క ఉద్రేకం, ఒకే ఒక్క మహోద్రేకం.

అదిగో అటువంటి స్వీయవిస్మత క్షణాల కోసం నా అన్వేషణ. వివేకానందుడు చెప్పాడే: Take up one idea. Make that one idea your life – think of it, dream of it, and live on that idea. Let the brain, muscles, nerves, and every part of your body be full of that idea, and just leave every other idea alone.

జీవితవాస్తవాల్ని, ఈ నిష్టురత్వాన్ని, ఈ కఠోరత్వాన్ని మరింత మరింతగా చూస్తూ వస్తున్న కొద్దీ, నాకు అటువంటి ఆదర్శాల పట్ల, అటువంటి ఆదర్శాల కోసం తమ కండరాలు, నరాలు, మొత్తం మనోదేహాలు ఒక్కటిగా పిడచగట్టుకుపోయే ఆదర్శ దాహార్తుల కోసం అన్వేషణ మరింతగా ప్రబలమవుతూ ఉంది. వారెంత చేసారని కాదు, ఎంత సంస్కరింంచారని కాదు, ఎన్ని ఉద్యమాలు చేసారని కాదు, ఎన్ని విప్లవాలు తెచ్చారని కాదు- అసలు అన్నిటికన్నా ముందు, వారి హృదయాల్లో ఆ ఆదర్శం దానికదే ప్రభవిస్తున్నదా? అది హృదయం నుంచి పుడుతున్నదా? తెలివితేటలనుంచి పడుతున్నదా? తమని తమగా నిలవనివ్వని ఉద్రేకమా లేక ఏదో ఒక కారణం వల్లనో, ఎవరిమీదనో ఆగ్రహంవల్లనో, ద్వేషం వల్లనో, ప్రతీకారం కోసమో పుడుతున్నదా?

నిన్న నా కోసం ఆ పెద్దలూ, పిల్లలూ పాటలు పాడేరు. నాట్యం చేసారు. వారు నాట్యం చేస్తూండగా ఒక ఉపాధ్యాయిని విజ్జి పక్కన నిలబడి చెప్తున్నది ‘అమ్మా మాకు ఇక్కడ రోజూ ఒక పండగే ‘ అని.

చెట్టు చిగురిస్తుంది, పూలు పూస్తుంది. పుస్తకాలు చదివి కాదు. వాదనలో నెగ్గడానికి కాదు. నిరంతరం మట్టితోటీ, సూర్యకాంతితోటీ సంభాషిస్తూ ఉండటం వల్ల. అలా మట్టికీ, ఆకాశానికీ మధ్య ఒక సజీవసేతువుగా ఉండటంవల్లనే చెట్టు నీడనిస్తుంది, పరిమళాల్నీ, ఫలాల్నీ ప్రసాదిస్తుంది. అటువంటి మనుషులు, అటువంటి తావులు ఎక్కడ కనబడ్డా అక్కడ నాకు మండుటెండనుంచి సేదతీర్చే కొన్ని క్షణాల ఊరట లభిస్తుంది.

22-2-2022

Leave a Reply

%d bloggers like this: