యుగయుగాల చీనా కవిత-9

రెండు దశలుగా సుమారు నాలుగు శతాబ్దాల పాటు చైనాని పాలించిన హాన్ సామ్రాజ్యం కూలిపోయినప్పుడు ప్రజల ఇంద్రియాలు పనిచేయడం మానేసాయని రాసాడొక కవి. రంగు, రుచి, వాసన, చూపు, వినికిడులతో పాటు అనుభూతి, నొప్పి, నిరాశలే కాదు, అసలు ఒక సత్యదృష్టి, న్యాయదృష్టి కూడా పోయాయని ఒక కవి రాసాడు. కన్ ఫ్యూషియన్ ఆదర్శాల మీద నిర్మించి, కేంద్రీకృత పాలనావిధానాన్ని అవలంబించి, పెద్ద ఎత్తున విద్యనీ, సాహిత్యాన్నీ ప్రోత్సహించిన హాన్ పరిపాలన పైన రెండు సార్లు డావోయిస్టులు తిరుగుబాటు చేసారు. చివరికి ఆ సామ్రాజ్యం మూడు ముక్కలై వెయి, షూ, వూ అనే మూడు రాజ్యాలు ఏర్పడ్డాయి. చీనా చరిత్రలో మూడు రాజ్యాల కాలం (సా.శ.220-280) అత్యంత నాటకీయమైన కాలం.
 
వెయి రాజ్యాన్ని చావో-చావో అనే వాడు స్థాపించినప్పటికీ, నిజానికి అతడి పెద్దకొడుకు చావో-పి మొదటి రాజుగా పాలన చేసాడు. చరిత్ర అతణ్ణి క్రూరుడైన పాలకుడిగా చిత్రిస్తున్నప్పటికీ చావో-చావో స్వయంగా కవి. అతడు తన కుమారులు చావో-పి ని, చావో-జిని తనలానే కవులుగా తీర్చిదిద్దాడు. వాళ్ళకి చిన్నప్పుడే సాహిత్యం, కళలు, సంస్కృతి నూరిపోసాడు. మొదట్లో అతడికి తన చిన్నకొడుకు చావో-జి మీద అభిమానం బాగా ఉండేది. అతణ్ణే రాజుని చేస్తాడు అనుకున్నారు.
 
కాని చావో-జి వ్యక్తిత్వం తాననుకున్నంత బలమైంది కాదనీ, అతడు రాజ్యపాలనకు తగడనీ ఆ తండ్రికి అనుమానం వచ్చింది. అందుకని అతడు తన పెద్దకొడుకునే రాజుగా ప్రకటించాడు. అతడు మరణించాక ఆ పెద్దకొడుకు తన తమ్ముడి పట్ల మరింత క్రూరంగా ప్రవర్తించాడు. అంతేకాదు, చావో-జి ప్రేమించిన అమ్మాయిని అతడి అన్న, అంటే రాజుగా పాలనసాగిస్తున్న చావో-పి పెళ్ళి చేసుకున్నాడు. ఈ సంఘటనలన్నీ- అంటే చిన్నప్పుడే గొప్ప సాహిత్యవిద్యకి నోచుకోవడం, మొదట్లో తండ్రి అభిమానం, ఆ తర్వాత ఆయన అనుమానం, చివరికి, తనకి దక్కవలసిన రాజ్యం, యువతి కూడా తన అన్నకి దక్కడం, తాను స్వేచ్ఛగా మసలడానికీ, తిరగడానికీ కూడా వీల్లేకుండా నిర్బంధం మధ్య గడపవలసి రావడం చావో-జి ని తీవ్రంగా కలచివేసాయి. స్వయంగా సున్నితమనస్కుడైన ఆ రాజకుమారుడికి తన దుఃఖాన్ని ప్రకటించుకోవడానికి కవిత్వం తప్ప మరొక దిక్కులేకుండా పోయింది.
 
చావో-జి మూడు రకాల కవిత్వ ప్రక్రియలూ- పురాతన ‘షి’ పద్ధతిలో పద్యం, ‘ఫూ’ పద్ధతిలో పద్యగంధి వచనం, ‘యెఫూ’ పద్ధతిలో గీతం, రాసాడు. అతడి కవితలు సంపూర్ణాలూ, అసంపూర్ణాలూ అన్ని కలిపి ఎనభై తొంభై ఖండికలు మించవు. కాని ఆ కవిత్వం చదువుతూ ఉంటే ఆ కాలం మన కళ్ళ ముందు విస్పష్టంగా ప్రత్యక్షమవుతుంది. యుద్ధాలతో, అంతర్యుద్ధాలతో కమిలిపోయిన కాలంలో కూలిపోయిన నగరాలతో పాటు, చిన్ని చిన్ని సంతోషాలు, కిటికీ గుండా వీచి పరదాల్లో దోబూచులాడే గాలి, కొంగలబారులు, పిచుకలు, చిమ్మెటలు, కలయికలు, విడిపోవడాలు- జీవితం తన సమస్త బాధానందావస్థల్లో మన ముందు ప్రత్యక్షమవుతుంది. సుందరులైన స్త్రీలతో పాటు పరిత్యక్తలూ, అభాగినులూ కూడా కనబడతారు. జీవితం అతడికి తన రెండంచులూ చూపించింది.
 
నాకు లానే చావో జి లో కూడా ఒక కన్ ఫ్యూసియన్ తో పాటు ఒక డావోయిస్టు కూడా ఉన్నాడు. బాధ్యతలకి అతీతమైన ఒక లోకం కోసం ఎంత తపిస్తాడో, బాధ్యతలు నెరవేర్చడానికి కూడా అంతగానూ పరితపిస్తాడు. తనకి అపారమైన ప్రతిభాపాటవాలు ఉన్నప్పటికీ, తన ప్రజానీకానికి మేలు చెయ్యగల అవకాశం, అంటే రాజ్యాధికారం లభించలేదనే ఒక జీవితకాల దుఃఖం అతడి కవిత్వంలో అంతర్వాహిని. ‘నీ చేతిలో ఒక ఖడ్గం లేనప్పుడు ఎందరిని స్నేహితుల్ని చేసుకుని ఏమి లాభం’ అని అంటాడు ఒక కవితలో.
 
మలి హాన్ పాలనాకాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన అయిదు మాత్రల పద్యపాదానికి అతడు మరింత వన్నె పెట్టాడు. తన ముందున్న ఝౌ, చూ, హాన్ పాలనా కాలాలకీ, తన తర్వాత కాలంలో సాహిత్య స్వర్ణయుగంగా చెప్పదగ్గ తాంగ్ కాలానికీ మధ్య చావో-జి ఒక వంతెన కట్టాడు. అందుకనే, తర్వాతి రోజుల్లో, ప్రకృతి ఆరాధకుడిగా చెప్పదగ్గ కవి షీ లింగ్-యూన్ ‘ప్రపంచం మొత్తానికి పదితులాల ప్రతిభ ఉంటే అందులో ఎనిమిది తులాలు చావో-జీ వే’ అని అనకుండా ఉండలేకపోయాడు. హాన్, వెయి, జిన్ కాలాల కవిత్వాన్ని క్షుణ్ణంగా మథించిన ఒక విమర్శకుడు షీ లింగ్ యూన్ ప్రశంసని పేర్కొంటూ ‘ఆ మాటలు అతిశయోక్తినే గాని, ఆ అతిశయోక్తితో మనం అంగీకరించకుండా ఉండలేం’ అని కూడా రాసాడు.
 
వెయి కాలంతో మొదలైన ఈ సాహిత్య యుగాన్ని జియానాన్ యుగం అని కూడా అంటారు. ఆ యుగంలో ప్రతిభావంతులైన మరొక ఏడుగురు కవులు కూడా ఉండేవారు. వారిలో కొందరు వెయి పాలకులతో చేతులు కలిపారు, కొందరు యుద్ధం చేసారు. వారిలో ఒక కవిని చావో-చావో చంపేసాడు కూడా. కాని కవిత్వంలో మాత్రం అందరూ ఒక్కటయ్యారు.
 
ఆ కాలానికి ప్రతినిధి కవితలుగా ఇక్కడ అయిదు కవితలు పొందుపరుస్తున్నాను. మొదటిది, హాన్ సామ్రాజ్య అస్తమయ కాలంలో మనుషుల ఇంద్రియాలు పనిచేయడం మానేసాయని చెప్పే కవిత. ఈ కవిత రాసిన వాంగ్-చాన్ (177-217) ఆ కాలం నాటి ఏడుగురు కవుల్లో ఒకడు. అతణ్ణి చీనా చరిత్రకారులు అత్యంత ప్రతిభావంతుడిగానూ, అసాధారణమైన ధారణ కల పండితుడిగానూ ప్రస్తుతిస్తున్నారు. హాన్ పాలన చివరిదినాల్లో సంభవించిన అంతర్యుద్ధంలో అతడు చాంగాన్ నుండి దక్షిణానికి పారిపోతూ రాసిన ఏడు విలాప గీతాల్లో ఇది మొదటిది.
 
తర్వాతి మూడు కవితలూ- చావో-జి (192-232) ఫూ, షి, యెఫూ ప్రక్రియల్ల్లోరాసిన కవితల్లోంచి ఒక్కొక్క ప్రక్రియకూ ఒక్కొక్క ఉదాహరణ.
 
చివరి కవిత, ఫూ-జువాన్ (217-78) తన కాలం నాటి స్త్రీ పరిస్థితి ఎలా ఉండేదో వర్ణిస్తూ రాసిన కవిత. మన కాలం నాటి కమ్యూనిస్టు చైనా లో కూడా ఈ పరిస్థితి ఏమీ మారలేదని చెప్పే ఒక వార్తా కథనాన్ని టోనీ బార్న్ స్టన్ తన సంకలనంలో ప్రస్తావించాడు.
 
~
 
1
 

ఏడు దుఃఖాలు

 
భయానకమైన అంతర్యుద్ధంలో పడమటి రాజధాని:
విరుచుకుపడుతున్నవి పులులూ, తోడేళ్ళూ.
 
మధ్య రాజ్యానికి పారిపోవడం మినహా దిక్కులేదు
ఎక్కడో అడవుల్లోకి పోయి తలదాచుకోక తప్పదు.
 
చుట్ట పక్కాలు కన్నీళ్ళతో నిలబడ్డారు.
మిత్రులు నా వెనకనే వచ్చి నన్ను ఆపబోయారు.
 
నగరద్వారాలు దాటి చూద్దును కదా, ఎటు చూడు
విస్తారమైన మైదానాలమీద ఎముకల కుప్పలు.
 
నేను పయనిస్తున్నదారిలో ఒక స్త్రీ కనబడింది
తిండిలేని మనిషి, తన బిడ్డని గడ్డిలో వదిలిపెట్టేసింది.
 
ఆ పసిబిడ్డ రోదన విని ఒక క్షణం వెనక్కి చూసింది
కన్నీళ్ళు తుడుచుకుని, ఇక వెనుతిరిగి చూడలేదు.
 
‘నా చావే ఎక్కడ రాసిపెట్టి ఉందో తెలియదు నాకు
ఆ బిడ్డని ఎక్కడ వదిలిపెట్టేస్తే ఏమిటి?’
 
ఆ మాటలు వినడానికి నాకు శక్తి చాలలేదు.
గుర్రాన్ని అదిలించి ఆమెకి దూరంగా దౌడు తీసాను.
 
ఇంకొంత దూరం పోయాక పూర్వకాలపు సమాధుల దగ్గర
వెను తిరిగి చాంగాన్ పట్టణాన్ని ఒకసారి పరికించాను.
 
గీతసముచ్చయంలో ఒక గీతం నాకిప్పుడు బోధపడుతున్నది
నాకు మిగిలిన నిట్టూర్పులు చాలు గుండె ముక్కలవ్వటానికి.
 
2
 

మరణించిన బిడ్డ కోసం

 
మామూలు మనుషులు చూడు, అతుక్కుపోయి ఉంటారు
ఏ మాత్రం ఎడమైనా ఒకరికోసం ఒకరు బెంగపెట్టుకుంటారు.
 
మరి చిన్నప్పుడే మరణించిన బిడ్డ గురించి ఏమి చెప్పను?
మరొక వెయ్యేళ్ళు గడిచినా అతడు తిరిగి రాడే.
 
ఆ ఖాళీగదిలో అడుగుపెట్టాక శూన్యమే మిగిలేది.
ఆ ఒంటరి శయ్య, ఆ తెరలు, ఓపికలేని నిట్టూర్పులు.
 
మనిషి వెళ్ళిపోయి వస్తువులు మిగిలిపోవడం దుర్భరం.
ఏమి కానట్టుగా వాటిని మళ్ళా చూడటం సాధ్యమా?
 
సూర్యుడు కిందకి వాలాడు, పొద్దు గుంకుతున్నది
చంద్రుడు ఆ జాగాలో చేరి వెన్నెల పరుస్తున్నాడు.
 
నింగి పొడుగునా చుక్కల్నే చూస్తూ రాత్రంతా గడపగా
మంచుకి తడిసిపోయిన దుస్తులు, గడ్డకట్టిన పొగమంచు.
 
వెళ్ళిపోయిన బిడ్డతో గడిపిన రోజులు దూరంగాపోతుండగా
దుఃఖం ఎదని బద్దలు చేస్తున్నది, పేగులు మెలిపెడుతున్నది.
 
3
 

మిత్రుడు యింగ్ కి వీడ్కోలు చెప్తూ-1

 
అక్కడ ఉత్తర దిక్కు కొండలు ఎక్కి
రాజధానివైపు చూసాను.
 
లొయాంగ్- ఎంత నిశ్శబ్దనిరుద్వేగం!
ఎటుచూడు దగ్ధ హర్మ్యాలు, ప్రాసాదాలు.
 
భగ్న కుడ్యాలు, శిథిల ప్రాకారాలు.
ఆకాశాన్ని అంటిన ముళ్ళపొదలు.
 
పూర్వతరం వాడు ఒక్కడు కూడా కనిపించడం లేదు
కొత్త తరం, అపరిచిత యువజనం.
 
నెమ్మదిగా కొండదిగాను, మూసుకుపోయిన దారులు.
బీడుగా మారిన భూముల్లో మళ్ళా దుక్కి దున్నలేదు.
 
దూరదేశానికి పోయిన ఆ పాంథుడింకా తిరిగిరాలేదు
అతడికి తెలిసిన దారులు ఇప్పుడు చెరిగిపోయాయి.
 
గ్రామసీమలు- సీమలా అవి, నిర్జనాలు.
వెయ్యి యోజనాల మేర ఒక్క మనిషి కనిపించడు.
 
ఈ జీవితంలో ఒకప్పటి నా సన్నిహితులు తలపుకొస్తే
గుండె డగ్గుత్తిక పడుతున్నది, మాటలు రావడం లేదు.
 
4
 

పరిత్యక్త

 
ఇంటిముంగిట దానిమ్మ పూల చెట్టు
ఆకులనిండా లేతాకుపచ్చ మిలమిల.
 
ఎర్రగా విరబూసిన దాల్చినచెట్ల పూలు
కెంపుల్లాంటి ఆ పూలగుత్తుల నునుతళుకు.
 
ఆ తళుకు చుట్టూ పారదర్శకంగా నీలంవన్నె
అక్కడకు దేవతలు దిగివస్తారన్నట్టుంది.
 
ఆ గూటికి మరలివచ్చిందొక లకుముకిపిట్ట
చాచిన ఆ రెక్కల్లో గూడుకట్టుకున్న దిగులు.
 
దుఃఖకూజితాలు, నిజమే, దేనికోసం?
దాల్చినచెట్లపూలు ఎప్పటికీ పండేవి కావు.
 
నా గుండెచిక్కబట్టుకుని గట్టిగా నిశ్వసిస్తాను
మగపిల్లవాణ్ణి కననందుకు పుట్టింటికి పోక తప్పదు.
 
మగపిల్లవాడు పుట్టకపోతే, నువ్వు రాలిపోయే తారవే.
చంద్రుడు ఆకాశంలో పెరుగుతాడు, తరుగుతాడు.
 
రాలిపోయే తార కాంతిరహితంగా మరణిస్తుంది
కిందకి జారిపోతూ తన స్థానం పోగొట్టుకుంటుంది.
 
చివరికి రాళ్ళల్లో, రాతిశకలాల్లో రాలిపోతుంది.
మనసులో ఆందోళన సుళ్ళు తిరుగుతూనే ఉంది.
 
రాత్రంతా నిట్టూర్పుల్లో గడుస్తుంది.
అటూ ఇటూ దొర్లుతాను, నిద్రపట్టదు.
 
లేచి ఇంటిముంగిట్లో కలయతిరుగుతాను
తచ్చాడి మళ్ళా ఇంట్లో అడుగుపెడతాను.
 
కిటికీ తెరలు, పరదాలు రెపరెపలాడతాయి
వాటిని పైకి మడుస్తాను, చీర సర్దుకుంటాను.
 
తంత్రీవాద్యం ఒకింతసేపు శ్రుతి చేస్తాను
నిర్మోహంగా సంగీతం సుళ్ళు తిరుగుతుంది.
 
ఇంతలోనే మృదువుగా, దీనంగా మూలుగుతుంది.
కన్నీళ్ళు తుడుచుకుంటాను, అట్లానే నిలబడతాను.
 
దేవతలకి విరుద్ధంగా ఎట్లానడుచుకోగలను?
గగనంలో తారలు హేమంతాన్ని సూచిస్తున్నవి.
 
ఎప్పుడూ చైత్రశ్రావణాలే పచ్చదనం నింపుకోవాలా?
ఓపిక పడితే హేమంతం కూడా ఫలవంతం కాదా?
 
5
 

ఆడమనిషి

 
ఆడమనిషిగా బతకడం ఎంత విషాదం
ఈ ప్రపంచంలో అంతకన్నా చౌక మరోటి లేదు.
 
మగపిల్లవాడి సంగతంటావా, నింగినుంచి
స్వర్గం కూడా వాడికోసం దిగివస్తుంది సహజంగా.
 
వాడి మాట నాలుగుసముద్రాలమీద పెత్తనం చేస్తుంది
వెయ్యి యోజనాల గాలీ, ధూళీ కూడా వాడినేమీ చెయ్యలేవు.
 
అదే ఆడపిల్ల పుట్టిందంటే ఎవరికీ సంతోషం ఉండదు
ఆమె కుటుంబానికి అదేమీ చెప్పుకోదగ్గ విషయం కాదు.
 
పెద్దయ్యిందా, ఇంటిలోపల్లోపల దాక్కోవలసిందే
మగవాళ్ళకి ముఖం చూపించాలంటే భయం.
 
పెళ్ళయ్యి ఇల్లు విడిచివెళ్ళేటప్పుడు కన్నీళ్ళు కారుస్తారా
వట్టి జల్లు మాత్రమే, ఇంతలోనే వాన వెలిసిపోతుంది.
 
తలవంచుకుని నిలబడుతుంది, తలపులు అణచుకుంటుంది
ఆ దంతాలు ఆ పెదవుల్ని అదిమిపెట్టే ఉంచుతాయెప్పుడూ.
 
రోజుకి ఎన్ని సార్లు వంగి వంగి దండాలు పెడుతుందని!
చివరికి ఉంపుడుకత్తెలకీ, నౌకర్లకీ కూడా ఆమె దాసినే.
 
వాళ్ళిద్దరూ ఆకాశంలో చుక్కల్లాగా ఉన్నప్పుడు
పొద్దుతిరుగుడుపువ్వూ, సూర్యుడూనూ.
 
నిప్పూ, నీరూలాగా దూరం పెరిగిందా
వెయ్యి దురదృష్టాలు ఆమె నెత్తిని చుట్టుకుంటాయి.
 
కాలం గడిచే కొద్దీ ఆ మేలిమి ముఖం కళ తప్పుతుంది
ఆమె భర్త కొత్త సుఖాలు వెతుక్కుంటూపోతాడు.
 
ఒకప్పుడు వాళ్ళు వెలుగూ, నీడా
ఇప్పుడు హూణులూ, చీనావాళ్లలాగా.
 
హూణులూ, చీనావాళ్ళన్నా కలుస్తారేమోగాని
వీళ్ళు మటుకు రెండు ధ్రువాలుగా మిగిలిపోతారు.
 
26-2-2022

Leave a Reply

%d bloggers like this: