యుగయుగాల చీనా కవిత-8

సాధారణంగా ఏ భాషలోనైనా కవితాశిల్పం మూడింటి వల్ల ప్రభావితమవుతూంటుంది. ఒకటి, ఆ భాషలో పూర్వకవులు రాసిన కవిత్వం. ఆ కవిత్వం కాలం గడిచే కొద్దీ తన సమకాలిక ప్రాసంగికతను దాటి కొత్త స్ఫురణల్ని రేకెత్తించే శక్తిని సముపార్జించుకుంటూ ఉంటుంది. రెండవది, ఆ భాషలోని మౌఖిక ధోరణులు. వాడుకభాషమొదలులుకుని జానపద గీతాల దాకా ప్రతి ఒక్కటీ ఇందులోకి వస్తాయి. పూర్వకవుల కవిత్వంలోంచి అర్థస్ఫురణలూ, సమకాలిక మౌఖిక రీతుల్లోంచి పదప్రయోగ పద్ధతులూ కలిసి కొత్త కవిత్వాన్ని రూపొందిస్తాయి.
 
ఇక మూడవది, ఇతరభాషల్లోంచి ఆయా భాషలోకి ప్రవహించే కవిత్వాలు, అందులోనూ, ఆ భాష మరొక భాషమాట్లాడేవాళ్ళ పాలనలో గడపవలసి వస్తే, ఆ విజేతల భాష ఆ పాలితుల భాషా స్వరూప స్వభావాల్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఆ పాలకులతో ఆ పాలితులు తలపడ్డట్టే, ఆ పాలిత భాషకూడా విజేతల భాషతో తలపడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అది విజేతల భాషలోని పురోగామి అంశాలను స్వీకరిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు తనకే ప్రత్యేకమైన లక్షణాల్ని గుర్తుపడుతూంటుంది. ఈ క్రమంలో దానికి అన్నిటికన్నా మిన్నగా ఒనగూడే ప్రయోజనం తనలో కాలానికి ఎదురొడ్డి నిలవగల శక్తి ఎక్కణ్ణుంచి వస్తున్నదో ఆ ఆధారాల్ని గుర్తుపట్టడం, వాటిని మరింత బలపరుచుకోవడం.
 
భారతదేశ చరిత్ర మొత్తం ఎలా అయితే విదేశీ దండయాత్రల వల్ల ప్రభావితమవుతూ వచ్చిందో, ప్రాచీన చీనా కూడా నిరంతరం ఎడతెరిపిలేని దండయాత్రలకు లోనవుతూనే వచ్చింది. దాదాపుగా ఆధునికయుగందాకా ఆ దండయాత్రలు ఉత్తరసరిహద్దుల్లోని తార్తార్లనుండీ, గోబీ ఎడారులకు చెందిన మంగోలులనుండీ, ఇతర ఆటవిక తెగలనుండీ సంభవించేవి. వాటి నుంచి చైనాని కాపాడడానికి చిన్ వంశ స్థాపకుడు చీనా గోడ కట్టినా లాభం లేకపోయింది. చాలాసార్లు చైనా తన ఉత్తర, ఈశాన్య భూభాగాల్ని కోల్పోవలసి వచ్చేది. చాలాసార్లు రాజధానిని దక్షిణానికి మార్చుకోవలసి వచ్చేది. శతాబ్దాలపాటు జరిగిన ఈ దండయాత్రలవల్ల చివరికి పచ్చనది చుట్టూ ప్రభవించిన చీనా నాగరికత నెమ్మదిగా యాంగ్జే లోయకు తరలిపోవలసి వచ్చింది. కాని, ఈ దండయాత్రల వల్ల చీనా కవిత్వం మాత్రం అనూహ్యంగా సుసంపన్నమైంది.
 
హాన్ పాలన తొలికాలంలో ‘ఫూ’ అనే ప్రక్రియ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందనీ, దాన్ని దక్షిణాధి రాజాస్థాన కవులు ‘చూ’ శబ్దావళి తరహాలో మరింతగా సానబెట్టారనీ చెప్పాను. కాని అదేసమయంలో పడమటి హాన్ సామ్రాజ్యం మీద తార్తారులూ, ఇతర ఆతవికతెగలూ దండయాత్ర చేసి ఆ భూభాగాన్ని చాలావరకూ ఆక్రమించేసారు. అందువల్ల మధ్యలో హాన్ రాజ్యనికి కొంతకాలం గ్రహణం పట్టింది. ఆ అనాగరిక తెగలు తమతోపాటు తమ రాగాల్నీ, పాటల్నీ కూడా చైనాకి పట్టుకొచ్చారు. అప్పటిదాకా షీ-జింగ్ కాలం నుండీ వెయ్యేళ్ళుగా ప్రాచుర్యంలో ఉన్న నాలుగు మాత్రల పద్యపాదం స్థానంలో వారివల్ల అయిదు మాత్రల పద్యపాదం ప్రభవించింది.
 
నాలుగు మాత్రల పద్యపాదంలో యతి స్థానం సరిగ్గా మధ్యకి విరగడంతో, ఆ పాత తరహా గీతం దంపుడు పాటలాగా తయారయ్యింది. కాని దాని స్థానంలో అయిదు మాత్రలు రాగానే రెండక్షరాలకీ, మూడక్షరాలకీ మధ్య యతివిరామం రావడం, అలాగే ఆ మూడక్షరాల్లో మళ్ళా ఒకటవ అక్షరం తర్వాతగానీ (అంటే మొత్తం పద్యపాదంలో నాలుగవ అక్షరం) లేదా రెండవ అక్షరం తర్వాతగానీ (అంటే మొత్తం పాదంలో అయిదవ అక్షరం) తర్వాతగానీ మరొక విరామానికి కూడా అవకాశం ఏర్పడటంతో ప్రాచీన గీతఛందస్సు కొత్త లయనీ, కొత్త తూగునీ, కొత్త అందాన్నీ సంతరించుకుంది. అటువంటి అయిదు మాత్రల ఛందస్సులో కూర్చిన పందొమ్మిది పద్యాలు మనకి మొదటిసారిగా ఆరవశతాబ్దానికి చెందిన ‘వెన్-జువాన్’ అనే సంకలనంలో కనిపిస్తున్నాయి.
 
ఆ పద్యాలు ఎప్పుడు ప్రభవించాయి, ఎవరు రాసారు అనేది ఇప్పటిదాకా ఎవరూ ఇతమిత్థంగా తేల్చలేకపోయినా అవి మలి హాన్ కాలపు రచనలని మాత్రం స్థూలంగా అభిప్రాయపడుతున్నారు. అంటే సామాన్య శకం మొదటి లేదా రెండవ శతాబ్దానికి చెందిన గీతాలు. ఒక విధంగా చెప్పాలంటే మన కాళిదాసుకి అటూ ఇటూగా సమకాలికాలు. షీ-జింగ్ వెలుగులో, హాన్ పాలనలో సంగీత కార్యాలయం వాళ్ళు సేకరించిన యె-ఫూ గ్రామీణ గీతాల స్ఫూర్తితో ఎవరో రాజాస్థాన కవులు వాటిని కూర్చారు. అవి కూడా మలి హాన్ యుగపు రాజధాని అయిన లొయాంగ్ పట్టణంలో, ఏ అతీత కాలాన్నో స్మరిస్తో, చూ శబ్దావళిలోని విషాద మాధుర్యాన్ని ఒక నవీనఛందస్సులోకి సులలితంగా వడగట్టే ప్రయత్నం చేసారు.
 
ఒక ఐతిహ్యం ప్రకారం తొలి హాన్ కాలపు సేనాధిపతులిద్దర్ని అనాగరిక జాతుల వాళ్ళు బంధించారనీ, వారి చెరలో ఏళ్ళతరబడి మగ్గినప్పుడు వాళ్ళ పాటల్లోని సంగీతాన్ని పట్టుకుని ఆ సైనికులు ఈ పందొమ్మిది హాన్ గీతాలకు రూపకల్పన చేసారనీ. ఏమైనా ఒకటి మాత్రం చెప్పవచ్చు. తనమీద రాజకీయంగా దండయాత్ర చేసిన ఆ తెగలకు సాహిత్య చీనా మాత్రం శాశ్వతంగా ఋణపడి పోయింది.
 
షీ-జింగ్ ఆకాశదేవతల్ని ఆరాధిస్తో, మనిషికీ, రాజ్యానికీ ఉండే అనుబంధాన్నీ, బాధ్యతనీ వివరించింది. డావో డె జింగ్ సమస్త ప్రకృతినీ, కంటికి కనిపించే శతసహస్ర దృగ్విషయాల్నీ దాటిన ఒక అంతఃసూత్రాన్ని అన్వేషించింది. రాజ్యానికీ, మనిషికీ మధ్య అనుబంధం గాయపడ్డప్పుడు ఆ విషాదాన్ని గానం చేస్తో, తిరిగి దేవతలతో, రాజులదో అనుగ్రహం కోసం తపించే ఉన్మత్త విలాపంలోంచి చూ శబ్దావళి రూపుదిద్దుకుంది. ఈ మూడింటినీ క్షుణ్ణంగా చదువుకుని, గ్రామీణ గీతాల్లోని నిష్టుర వాస్తవాలనుంచి ఒక మనోజ్ఞ, మార్మిక, మానసిక ప్రపంచంలోకి ప్రయాణించే కవిత్వం పందొమ్మిది హాన్ గీతాల్లో కనిపిస్తుంది.
 
భూమ్యాకాశాల మధ్య దేనికీ చెందకుండా అగమ్యంగా తిరుగాడే మనిషి ఆ గీతాల్లో కనిపిస్తాడు. ఆమె స్త్రీ అయితే, ఒక పరిత్యక్త, ప్రోషిత భర్తృక. పురుషుడైతే ఒక సంచారి, తన స్వగ్రామాన్నీ, తన స్వజనాన్నీ విడిచిపెట్టి ఎటో పయనమై, ఎప్పటికి తిరిగివస్తాడో తెలియని బహుదూరపు బాటసారి. షీ-జింగ్ లో స్త్రీపురుష దుఃఖానికి కారణాలు తెలుస్తాయి. కొన్ని సార్లు అవి దైవికం, కొన్ని సార్లు సామాజికం. యె-ఫూ గీతాల్లోని స్త్రీపురుష దుఃఖం స్పష్టంగా మానవకృతం, సామాజికం. కాని పందొమ్మిది హాన్ గీతాల్లో స్త్రీపురుష దుఃఖానికి కారణం ఏదో మనకి తెలియదు. అది బాహ్యవాస్తవం స్థానంలో ఒక ఆంతరంగిక ప్రపంచం వచ్చి చేరడంలోని అస్పష్ట వ్యాకులత. ‘ఎవ్వరనుకుందురొ ఏమొ ఏననంత శోకభీకర తిమిర లోకైక పతిని’ అని కృష్ణశాస్త్రి అంటున్నప్పుడు ఆ దుఃఖానికి కారణం మనకి ఏ మాత్రం తెలుసో, పందొమ్మిది హాన్ కవితల్లోని విలాపాగ్నులకూ, విషాదాశ్రులకూ కూడా మనకి అంతే కారణం తెలుసు.
 
అలాగని ఆ పద్యాలు డావోయిస్టుల్లాగా గాలిలో తేలిపోవాలనుకోవు. ఏవో ఒక రసాలు సేవించి తమ ఆయుర్దాయాన్ని పెంచుకోవాలనుకోవు. వాటి కాళ్ళు పూర్తిగా నేలమీదనే ఆని ఉన్నాయి. జీవితంలో సంతోషాన్నీ, దుఃఖాన్నీ విడదీసే గంభీర వాస్తవాలనుంచి అవి తప్పుకోవాలనుకోవు. చెరపలేని ఆ హద్దుల పట్ల స్పృహ వల్లనే ఆ గీతాలు మరింత హృదయంగమంగా వినిపిస్తాయి.
 
కాని ఒక్కటి మాత్రం చెప్పవచ్చు. ఆ గీతాలు ప్రాచీన చీనాకి అంతదాకా తెలియని ఒక మానసిక దేశాన్ని పరిచయం చేసాయి. దక్షిణం వైపు చెట్లలో గూడుకట్టుకున్న పక్షులు, తిరిగి వచ్చే ఆలోచన లేని పాంథుడు, పంటల కోతల కాలం నాటి హేమంత చంద్రుడు, భరించడం కష్టంగా మారిన ఏకాంత శయ్య, వెన్నెల్లో ఒకదాన్నొకటి చూసుకునే హర్మ్యాలు, పాటగా ఉబికి వస్తే ఉపశమించని తంత్రీవాద్యాలు, పాటమధ్యలో తొట్రుపడే విరహిణి కంఠస్వరం, హృదయం నిండా కమ్ముకునే తొలిసుగంధాలు, హృదయాన్ని మెలిపెట్టే పూలపరిమళం, చూసుకోడానికే తప్ప పలకరించుకోడానికి అవకాశం దొరకని ప్రేమికులు, కోతకి సిద్ధమైన పైర్లమీద పరుచుకునే సూర్యాస్తమయాలు, పొద్దుటిపూట మంచులాగా కరిగిపోయే సంవత్సరాలు, ఏ కారణం లేకుండానే చేపట్టాలనిపించే తిరుగుప్రయాణం, కన్నీళ్ళకు తడిసిపోయి, కొంగుమడతల్లో దాచుకున్న ఉత్తరం – పందొమ్మిది హాన్ కవితల్ని ఒక్కమాటలో చెప్పాలంటే మనిషిని హతమార్చడానికి చాలినంత విషాదం గూడుకట్టుకున్న పద్యాలు అని చెప్పవచ్చు.
 
తదనంతర కాలపు చీనా రసజ్ఞులు ఆ పద్యాలు మనకి నేత్రాల్నిస్తాయి అన్నారు. అంటే మనం వినడం కాదు, చూడటం మొదలుపెడతాం అన్నమాట. అంతదాకా కవిత్వం సంగీత ప్రధానం. షీ-జింగ్ నుంచి యె-ఫూ దాకా కూడా పాట లేకుండా పద్యం లేదు. కాని పందొమ్మిది హాన్ పద్యాల్లో మొదటిసారి పద్యానికి బాహ్యసంగీతంతో నిమిత్తం లేకుండా పోయింది. ఆ పద్యాలు చదువుకుంటూ ఉండగానే మన అంతర్లోకంలో ఒక అలౌకిక సంగీతం వినిపించడం మొదలవుతుంది.
 
అంతకుముందు పద్యాలకు ఒక దేశం ఉంది, ఒక కాలం ఉంది. కాని పందొమ్మిది పద్యాల్లో దేశం మనిషి అంతరంగమే. నువ్వు ఎంత సంభావించగలిగే అంత. ఎంత దూరం చూడగలిగితే అంత. ఎంత దగ్గరకు తీసుకోగలిగితే అంత. అందుకనే పదహారో శతాబ్దపు రసజ్ఞుడొకాయన పందొమ్మిది హాన్ పద్యాల్ని ‘ఆకాశం నేసిన అసీమిత వస్త్రాలు’ గా అభివర్ణించాడు.
 
ఆ పంతొమ్మిది పద్యాల్లోంచి రెండు మీ కోసం తెలుగులో:
 
1
 
వాయవ్యదిశాస్థితమైన ఎత్తైన హర్మ్యం
అంచులచుట్టూ అల్లుకున్న మేఘాలు.
 
గవాక్షాలకు గిలాబు, చుట్టూ కిందకు
దిగిన చూరు, మూడు దిక్కులా మెట్లు.
 
పైనుండి వినవస్తున్నదొక గీతం
గానంతో పాటు మంజులవీణానాదం.
 
వాటి విషాదభరిత ప్రతిధ్వని.
ఎవరు పాడగలరు అటువంటి పాట?
 
ప్రాచీన కాలపు కథల్లోని పరిత్యక్తకాక?
గాల్లో తేలివస్తున్నవి మంద్రస్వరాలు.
 
ముందుకుపోలేక పాటమధ్యలోనే
తొట్రుపడుతున్న నిర్వేద వ్యాకులత.
 
నేను వింటున్నది ఆ గాయకి వేదనకాదు
ఆ పాట ఎంతమందికి చేరగలదన్న తలపు.
నా హృదయాన్ని తొలిచేస్తున్నది.
 
మేమే గనుక రెండు బంగారు హంసలమై
రెక్కలల్లాడిస్తో మరింత ఎత్తుకి ఎగిరిపోగలిగితే.
 
(పందొమ్మిది హాన్ కవితలు, 5)
 
2
 
సున్నితం, దుర్బలం ఆ ఒంటరి వెదురుపొద
కొండకొమ్ముపైన అల్లుకుంటున్న వేర్లు.
 
ప్రభూ, నీతో పాటు నేను, నీ నవవధువుని
కాశీరత్నం తీగెలాగా నిన్నల్లుకుంటున్నాను.
 
సరైన వయస్సులో పెళ్ళిచేసుకున్న స్త్రీపురుషులు
సరైన ఋతువులో చిగురించిన తీగెల్లాంటివాళ్ళు.
 
పెళ్ళయినా కూడా పదివేల యోజనాల దూరం
మనమధ్య మహాపర్వతశ్రేణి.
 
నీగురించిన ఎదురుచూపుల్లోనే వయసు వాలిపోతున్నది.
ఎందుకని నీ రథం మరింత జాగుచేస్తున్నది?
 
పరిమళాలు చిమ్ముతున్న ఈ పూలపొదలు
ఒక నరకం, తెలుసునా!
 
వాటినిండా వెల్లివిరుస్తున్న అందం,
కురుస్తున్న కాంతి. వేళ గడిచిపోయినా,
 
వాటిని నువ్వు ఏరుకోకుంటే
ముంచుకొస్తున్న శిశిరంలో మట్టిలో కలిసిపోతాయి.
 
నా ప్రభువు అన్నీ తెలిసినవాడు.
ఈ అభాగిని ఇంతకు మించి ఏమి చెప్పగలదు?
 
(పందొమ్మిది హాన్ పద్యాలు)
 
20-2-2022

Leave a Reply

%d