యుగయుగాల చీనా కవిత-7

ఆ మధ్య చాలాకాలం వరకూ కూడా ప్రాచీన చీనా కవిత్వానికి చెందిన అనువాదాల్లో క్రీ.పూ ఆరవశతాబ్దానికి చెందిన షీ జింగ్ తర్వాత క్రీ.శ. ఆరవ శతాబ్దానికి చెందిన తాంగ్ యుగానికి చెందిన కవితలే ఉండేవి. మధ్య కాలంలోని వెయ్యేళ్ళ చైనా కవిత్వం గురించిన చరిత్ర గానీ, ప్రసిద్ధ కవుల గురించిగానీ, విశిష్ట కవితా ప్రక్రియలగురించి గానీ ఏమీ ఉండేది కాదు. కాని గత ముప్పై నలభయ్యేళ్ళుగా ఈ పరిస్థితి మారింది. ఝౌ చక్రవర్తుల కాలం నుంచి తాంగ్ చక్రవర్తుల దాకా మధ్య కాలంలో చీనాని పరిపాలించిన చిన్, హాన్, జిన్ రాజవంశాలతో పాటు ఆరురాజవంశాల పాలనాకాలందాకా వికసించిన కవిత్వం గురించీ, కవుల గురించీ ప్రత్యేక అధ్యయనాలు, సంకలనాలు ఇంగ్లిషులో రావడం మొదలుపెట్టాయి. ఇవాళినుంచి ఈ వారమంతా ఆ కాలానికి చెందిన కవుల గురించీ, కవిత్వాల గురించీ పరిచయం చెయ్యబోతున్నాను.
 
ఝౌ సామ్రాజ్యపు చివరి శతాబ్దాల్లో ఏడు సామంత రాజ్యాలు చీనామీద ఏకఛత్రాధిపత్యం కోసం కలహించుకునేవనీ, ఆ కాలాన్ని సమరశీల రాజ్యాల (warring states) కాలంగా చెప్పుకుంటారనీ చెప్పాను. ఆ ఏడు రాజ్యాల్లో చివరికి చిన్ అనే రాజ్యం తక్కిన రాజ్యాలన్నింటినీ ఓడించి క్రీ.పూ. 221 లో చీనాను ఒకతాటిమీదకు తీసుకువచ్చింది. ఆ రాజ్యం పేరుమీదనే చైనా అనే పేరు ఏర్పడింది. ఆ రాజుల్లో ప్రసిద్ధుడు షి హ్వాంగ్ డి. ఉత్తరదిక్కునుంచి పదేపదే విరుచుకుపడే అనాగరిక జాతులనుంచి చీనాని రక్షించడంకోసం అతడు చీనాగోడ నిర్మించాడు. కాని చీనాని ఏకం చెయ్యడంలో అతడు అత్యంత క్రూరత్వానికి పాల్పడ్డాడు. తన ప్రయత్నానికి కన్ ఫ్యూసియన్ మేధావి వర్గం అడ్డుపడుతున్నారని భావించి వారిని తుదముట్టించడమే కాకుండా తనకాలం నాటి సాహిత్యాన్ని, పుస్తకాల్ని దగ్ధం చేసాడు. దాంతో చీనా సమాజం అతణ్ణి క్షమించలేకపోయింది.
 
పదివేల ఏళ్ళు మనవలసిన సామ్రాజ్యం రెండు తరాలు కూడా గడవకుండానే కూలిపోయింది.
చిన్ సామ్రాజ్యాన్ని కూలదోస్తూ లియు-బాంగ్ అనేవాడు క్రీ.పూ. 206 లో హాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ సామ్రాజ్యం రెండు దశల్లో దాదాపు నాలుగు శతాబ్దాల పాటు చీనాని పరిపాలించింది. మొదటి దశలో క్రీ.పూ. 206 నుంచి క్రీ.శ. 09 దాకా చాంగాన్ రాజధానిగా తొలి హాన్ సామ్రాజ్యంగానూ, రెండవ దశలో క్రీ. శ.25 నుండి 220 దాకా లొయాంగ్ రాజధానిగా మలి హాన్ సామ్రాజ్యంగానూ విలసిల్లింది. మనకు తెలిసిన చారిత్రిక చైనా హాన్ సామ్రాజ్య కాలంలోనే రూపొందింది. ఆ ముద్ర చీనా సమాజం మీద , సంస్కృతిమీద ఎంత బలంగా ఉందంటే, చైనా వారు తక్కిన జాతులనుంచి తమ అస్తిత్వాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవడం కోసం తమని తాము ఇప్పటికీ హాన్ చైనీయులుగా పిలుచుకుంటారు.
 
హాన్ సామ్రాజ్య కాలంలో చీనా జనాభా అపారంగా పెరిగింది. ఆ పాలన తూర్పున కొరియా, వియత్నాం ల నుండి పడమట తుర్కిస్తాన్ దాకా విస్తరించింది. యూరోప్ తో వాణిజ్యం కోసం సిల్క్ రహదారి ఏర్పడింది. తమ ముందు చీనాని ఏకం చేసిన చిన్ రాజవంశం లీగలిస్టు భావజాలంతో ఏర్పడటంవల్ల హాన్ వంశీయులు కూడా మొదట్లో లీగలిస్టులుగానే పాలన మొదలుపెట్టినప్పటికీ అనతికాలంలోనే కన్ ఫ్యూసియన్లుగా మారేరు. హాన్ కాలంలోనే కన్ ఫ్యూసియన్ భావజాలం దాదాపుగా రాజమతంగా మారిపోయిందని చెప్పవచ్చు. కన్ ఫ్యూసియస్ సంకలనం చేసిన రచనలు చీనా విద్యకీ, సంస్కృతికీ ఆధారగ్రంథాలయ్యాయి.
 
హాన్ పాలకులు విద్యని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. పాలనను పటిష్టపరచడంకోసం దేశమంతా ఉమ్మడి సివిల్ సర్వీసుని ప్రారంభిస్తూ, అందులో అర్హుల్ని ఎంపిక చెయ్యడంకోసం ప్రవేశపరీక్షలు మొదలుపెట్టారు. ఆ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలంటే అభ్యర్థులు గీతసముచ్చయంతో పాటు ఇతర సాహిత్యగ్రంథాలు తప్పకుండా చదవవలసి ఉండేది. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రభుత్వ సర్వీసులో చేరి తమ స్వగ్రామాలనుంచి దూరప్రాంతానికి పోయి ఉద్యోగం చేయవలసి వచ్చినవాళ్ళు తమ అనుభవాన్నీ, బెంగనీ, మానావమానాల్నీ చెప్పుకోడానికి కవిత్వం రాయడం మొదలుపెట్టారు. మరొకవైపు ఆ పరీక్షుల్లో విఫలమయినవాళ్ళు కూడా తమ నిరాశనీ, నిస్పృహనీ చెప్పుకోడానికి కూడా కవిత్వం రాస్తూండేవారు. ఏ విధంగా చూసినా ఆ ప్రవేశపరీక్షలు తదనంతర చీనా కవిత్వానికి అందించిన ఉపాదానం అమూల్యం.
 
తొలిహాన్ పాలనా కాలంలో ‘చూ’ కవిత్వ ప్రభావంతో ‘ఫూ ‘అనే ప్రక్రియ ఒకటి వర్థిల్లింది. ‘ఫూ’ మనభాషలో చెప్పాలంటే చంపూ ప్రక్రియలాంటిది. పద్యగంధి వచనంలో కవిత్వసందర్భాన్ని వివరిస్తూ ఆ వచనానికి అనుబంధంగా ఒక పద్యాన్ని పొందుపరచడం. చ్యు-యువాన్ దారిలో చాలామంది కవులు తమ ఆశనిరాశల్ని వ్యక్తం చేయడానికి ఆ ప్రక్రియను వాడుకున్నారు. రాజాస్థాన కవులు రాజవైభవాన్ని, క్రీడల్ని, వేటని, యుద్ధాన్ని వర్ణించడానికి ఆ ప్రక్రియని పూర్తిగా వాడుకున్నారు.
 
కాని తొలి హాన్ పాలనా కాలం తదనంతర చీనా కవిత్వానికి ఇచ్చిన అమూల్యమైన కానుక ఆ కవిత్వం కాదు. ఝౌ చక్రవర్తులు ఒకప్పుడు దేశంలో ప్రజలు తమ పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి సంగీతకారుల్ని పంపించి పాటలు సేకరించేరని చెప్పుకున్నాం. తిరిగి హాన్ చక్రవర్తులు కూడా అలా పాటలు సేకరించడం మొదలుపెట్టారు. అందుకోసం వారొక సంగీత కార్యాలయాన్ని ఏర్పాటు చేసారు. వివిధ ప్రాంతాలు పర్యటించి గ్రామీణ గీతాల్ని సేకరించడం, అలా సేకరించినవాటికి సంప్రదాయ పద్ధతిలో బాణీలు కూర్చడం, కొన్ని చోట్ల అవసరమైతే ఆ భాషని సంస్కరించి నాగరికం చెయ్యడం ఆ సంగీతవిభాగం పని. నిజానికి ఆ సంగీత విభాగాన్ని చిన్ చక్రవర్తినే ప్రారంభించాడని అంటారుగాని, దాన్ని అత్యంత క్రియాశీలంగా మార్చింది మాత్రం హాన్ పాలకులే.
 
ఆ సంగీత విభాగం దేశం నలుమూలలనుంచీ సేకరించిన ఆ గీతాల్ని యెఫూ ( youefu) అని పిలుస్తారు. యెఫూ గీతాలు చీనా గీతఛందస్సుని కుదిపేసాయి. అప్పటిదాకా ప్రచలితంగా ఉన్న నాలుగు మాత్రల పద్యపాదంలో అయిదుమాత్రల పద్యపాదం వచ్చిచేరింది. మలి హాన్ పాలనా కాలంలో ఇది మరింత వన్నెదిద్దుకుని కొత్త తరహా గీతరచనకు నాంది పలికింది.
 
యెఫూ గీతాల్లో రెండు రకాలున్నాయి. ఒకటి సాంప్రదాయిక క్రతువులకీ, మతకర్మకాండకీ పనికొచ్చే గీతాలు. మరొకటి నిజంగానే ప్రజల సుఖదుః ఖాల్ని ప్రతిబింబించే గీతాలు. ఈ రెండవ తరహా గీతాల్లాంటివి, ఆ కాలం నాటికి, ప్రపంచ సాహిత్యంలో మరెక్కడా కనిపించవు. గీతసముచ్చయం (షీ-జింగ్) కన్నా కూడా యెఫూ గీతాలే తదనంతర చీనా కవిత్వానికి ఆధారస్తంభాలుగా నిలబడ్డాయి అనడంలో అతిశయోక్తి లేదు.
 
ఇక్కడ ఐదు కవితలు పొందుపరుస్తున్నాను. మొదటిది ఒక అజ్ఞాత కవి, చిన్ పాలనా కాలంలో చెప్పిన పద్యం. హెన్రీ. ఎచ్.హార్ట్ అనే ఒక అనువాదకుడైతే ఈ పద్యాన్ని తొలిచీనా పద్యంగా పేర్కొన్నాడు కూడా! కాని బర్టన్ వాట్సన్ వంటి ఇటీవలి అనువాదకులు దీన్ని చిన్ కాలానికి చెందిన పద్యంగా గుర్తిస్తున్నారు.
 
తక్కిన నాలుగు కవితలూ యెఫూ సంకలనం నుండి తీసుకున్నవి. హాన్ యుగానికి చెందిన చీనా జీవితానికి ఇంతకన్నా అద్దం పట్టే కవితల్ని మనం ఊహించలేం.
 
~
 
1
 

పొద్దు పొడవగానే

 
పొద్దు పొడవగానే పనికి పోతాం
పొందుగుంకగానే ఇంటిదారి పడతాం.
 
దాహంతీర్చుకోడానికి ఓ బావి తవ్వుకుంటాం
ఆకలి తీర్చుకోడానికి నాలుగు గింజలు పండించుకుంటాం.
 
ఇక చక్రవర్తీ అతడి మందీమార్బలం-
వాళ్ళతో మాకేం పని?
 
2
 

దక్షిణదిక్కు గోడదగ్గర పోరాడేం

 
దక్షిణదిక్కున గోడదగ్గర పోరాడేం.
ఉత్తరదిక్కు బురుజులదగ్గర నేలకొరిగాం.
 
దిక్కులేని చావు మాది, అంత్యక్రియలకు నోచుకోనివాళ్ళం
కాకులు మామీద వాలనున్నాయి/
 
చెప్పండి కాకులకి:
ఇంటికి దూరంగా అనాథలుగా మరణించినవాళ్ళం.
 
మా కోసం ఏడవండి.
ఎక్కడో బీడుభూముల్లో మరణించాం.
 
మమ్మల్ని సరిగా పూడ్చిపెట్టేవాడు కూడా ఉండడని మాకు తెలుసు.
కుళ్ళిపోతున్న మా కళేబరాలు ఎక్కడికి పారిపోగలవు?
 
నదులు ప్రవహిస్తున్నాయి లోతుగా, తేటగా
పొదలూ, తుప్పలూ పరుచుకున్నాయి దట్టంగా.
 
సాహసికులు ఆశ్వికులు పడి ఉన్నారు నిర్జీవంగా
వారి గుర్రాలు సకిలిస్తున్నాయి దీనంగా.
 
ఇప్పుడు వంతెనలమీద కూడా సైనిక శిబిరాలు,
దక్షిణానికి వెళ్ళడమెట్లా
 
లేదా ఉత్తరానికి పోవడమెట్లా.
ఇప్పుడు పంటలు కోతకోసేదెవ్వరు
 
ప్రభువుకి పన్నుకట్టేదెవ్వరు
విధేయులుగానే బతకాలనుకున్నాం.
 
మా విధేయతని స్వీకరించడానికి ప్రభువెక్కడ?
ఆ ప్రభువుకోసం పరితపిస్తున్నాం.
 
నా ప్రజలారా, నా ప్రజలారా
మీ గురించే తలుచుకుంటున్నాను.
 
పొద్దున్నే యుద్ధానికి బయల్దేరారు
పొద్దుపోయింది, ఇంకా తిరిగి రారు.
 
3
 

ఎంత చెప్పు, ఒక పాట

 
ఎంత చెప్పు, ఒక పాట
ఏడుపుకి సమానమవుతుందా?
 
ఎంత దూరపు దిక్కుకేనా చూడు
అది ఇంటికిపోడానికి సమానమవుతుందా?
 
దిగులుతో, ఒంటరిగా, ఊహలుడిగి
పల్లెలో నా పాత ఇల్లు కోసం పరితపిస్తున్నాను.
 
ఇంటికిపోవాలనిపిస్తున్నది, కాని ఎవరూ లేరక్కడ.
నది దాటాలనుకుంటాను, నావ లేదు.
 
గుండెలో సుళ్ళు తిరుగుతున్న బాధకి మాటల్లేవు
కడుపులో బళ్ళు తిరుగుతున్నట్టుంది!
 
4
 

పదిహేనేళ్ళకి సైన్యంలో చేరాను

 
పదిహేనేళ్ళకే సైన్యంలో చేరాను
ఇంటికి తిరిగివచ్చేటప్పటికి ఎనభై ఏళ్ళు.
 
దారిలో గ్రామస్థుడొకడు ఎదురుపడ్డాడు
‘మా ఇంట్లో ఎవరన్నా ఉన్నారా’ అనడిగాను.
 
‘అదిగో చూడు, అదే మీ ఇల్లు’ అన్నాడు
పాటిదిబ్బలమీద కానుగ, గన్నేరు.
 
కుక్కలు చేసిన బొక్కల్లో కుందేళ్ళు.
కూలిపోయిన కప్పుమీంచి దూకుతున్న కోళ్ళు.
 
రాలిపడ్డ గింజలు, వాటికవే పెరిగిపొయ్యాయి.
బావిదగ్గర వాటికవే పెరిగిన పూలదుబ్బులు.
 
ఒకింత ధాన్యం దంచుకుని జావ కాచుకున్నాను
గోగుకాడలు తెంచుకుని పులుసుపెట్టుకున్నాను.
 
తీరా జావా, పులుసూ సిద్ధం చేసుకున్నాక
కలిసి తినడానికి ఎవరున్నారు?
 
ఏమి చెయ్యాలో తెలీక గుమ్మందగ్గర నిల్చున్నాను
రాలిపడుతున్న కన్నీళ్ళకు అంగీ తడిసిపోతున్నది.
 
5

అయిదు నిట్టూర్పులు

 
ఉత్తరం వైపు కొండ ఎక్కిచూసాను
నిట్టూర్పుల చప్పుడు.
 
రాజుగారి నగరం వైపు చూసాను
నిట్టూర్పుల చప్పుడు.
 
ఆకాశహర్మ్యాల్లాంటి భవనాలు
నిట్టూర్పుల చప్పుడు.
 
ప్రజల శ్రమతో స్వేదంతో కట్టిన కట్టడాలు
నిట్టూర్పుల చప్పుడు.
 
ఎంతకూ ఎడతెగని
నిట్టూర్పుల చప్పుడు.
 
17-2-2022

Leave a Reply

%d bloggers like this: